Share News

అలలపై గెలుపు సంతకం

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:23 AM

సంసార సాగరాన్ని ఈదుతూనే స్విమ్మింగ్‌పూల్‌లో బంగారు పతకాలు కొల్లగొడుతున్నారు 42 ఏళ్ల అనితాకుమారి. విశాఖ మట్టిలో పుట్టి నేపాల్‌ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ ‘వండర్‌ ఉమన్‌’ ప్రయాణం ప్రతి...

అలలపై గెలుపు సంతకం

సంసార సాగరాన్ని ఈదుతూనే స్విమ్మింగ్‌పూల్‌లో బంగారు పతకాలు కొల్లగొడుతున్నారు 42 ఏళ్ల అనితాకుమారి. విశాఖ మట్టిలో పుట్టి నేపాల్‌ గడ్డపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ఈ ‘వండర్‌ ఉమన్‌’ ప్రయాణం ప్రతి మహిళకు ఒక స్ఫూర్తి పాఠం.

వివాహమై, పిల్లలు పుట్టాక ఇక కెరీర్‌ ముగిసిపోయిందని, వంటగదికే ఇక పరిమితమని చాలామంది మహిళలు భావిస్తుంటారు. కానీ, మనసులో సంకల్పం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని, ఆశయాలకు ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్నారు విశాఖ జిల్లా తగరపువలసకు చెందిన చింతపల్లి అనితాకుమారి. 42 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లిగా గృహిణి బాధ్యతలు నిర్వర్తిస్తూనే, అంతర్జాతీయ ఈత పోటీల్లో పతకాల పంట పండిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.

నేపాల్‌లో స్వర్ణ గర్జన

ఈ ఏడాది జనవరి 29 నుంచి ఫిబ్రవరి 2 వరకు నేపాల్‌లోని పోఖరా నగరంలో ‘సంయుక్త భారతీయ ఖేల్‌ ఫౌండేషన్‌’ (ఎస్‌పీకేఎఫ్‌) నిర్వహించిన అంతర్జాతీయ ఈత పోటీలు అనిత జీవితంలో ఒక మైలురాయిగా నిలిచాయి. ఈ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె తన అద్భుత ప్రదర్శనతో అందరినీ అబ్బురపరిచారు. భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక, మలేసియా వంటి దేశాల నుంచి వచ్చిన 11 మంది అగ్రశ్రేణి స్విమ్మర్లతో పోటీపడి 40-45 ఏళ్ల వయసు విభాగంలో ఏకంగా మూడు బంగారు పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఆమె విజయానికి ముగ్దుడైన ఎస్‌పీకేఎఫ్‌ అధ్యక్షుడు పంకజ్‌ గవాలే, డైరెక్టర్‌ జనరల్‌ శివ తివారీ స్వయంగా ఆమెను అభినందించి ప్రత్యేక ప్రశంసా పత్రం అందజేశారు. 50 మీటర్ల ఫ్రీస్టైల్‌, 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌, 100 మీటర్ల ప్రీస్టైల్‌.. ఇలా మూడు వేర్వేరు విభాగాల్లో ఆమె ప్రదర్శించిన వేగం, నైపుణ్యం అంతర్జాతీయ కోచ్‌లను సైతం ఆశ్చర్యపరిచింది.


00-Sports.jpg

గ్రామీణ నేపథ్యం నుంచి అంతర్జాతీయ స్థాయికి

అనితకుమారి ప్రయాణం విశాఖ జిల్లాలోని మింది అనే చిన్న గ్రామంలో మొదలైంది. చిన్నతనంలో తన అమ్మమ్మ, తాతయ్య శివరామయ్య వద్ద ఉంటూ ఆరో తరగతి వరకు చదువుకున్నారు. గ్రామీణ వాతావరణంలో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచి ఈత అంటే చాలా సరదా. దీనిని గమనించిన తండ్రి ఆమెను ప్రోత్సహించారు. ఆ తర్వాత తండ్రినే గురువుగా భావించి ఈతలో మెళకువలు నేర్చుకున్నారు.

పెళ్లి తర్వాత కూడా..

ఇంటర్‌ వరకు చదువుకున్న అనితకు తగరపువలసకు చెందిన ఆర్మీ హవల్దార్‌ చింతపల్లి అప్పలరాజుతో వివాహమైంది. సాధారణంగా పెళ్లయ్యాక తమ కెరీర్‌ ముగిసిపోతుందని క్రీడాకారులు అనుకుంటారు. కానీ, అనిత విషయంలో అది రివర్స్‌ అయింది. భర్త ఆర్మీలో పనిచేసి పదవీ విరమణ చేసినా, ఆమె ఆశయాలకు అడ్డు చెప్పలేదు సరికదా ఆమెకు కొండంత అండగా నిలిచారు. ఇద్దరు అబ్బాయిలు పుట్టినా స్విమ్మింగ్‌ ప్రాక్టీస్‌ను మాత్రం ఆమె వదిలిపెట్టలేదు. కోచ్‌ శ్రీనివాస్‌ వద్ద శిక్షణ పొందుతూ తన నైపుణ్యాన్ని మరింత మెరుగుపరుచుకున్నారు.

చిన్నతనం నుంచే పతకాల వేట

అనిత పతకాల ప్రస్థానం నిన్నమొన్నటిది కాదు. 1992లో కర్నూలులో జరిగిన రాష్ట్రాస్థాయి గ్రామీణ ఈత పోటీల్లోనే తానేమిటో నిరూపించారు. 50 మీటర్ల బ్యాక్‌స్ర్టోక్‌లో రజతం, 50 మీటర్ల బటర్‌ఫ్లై ఈతలో రజతం, 400 మీటర్ల ఫ్రీ స్టైల్‌లో కాంస్యం సాధించి వ్యక్తిగత చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. అక్కడి నుంచి మొదలైన ఆమె ప్రయాణం అప్రతిహతంగా సాగుతోంది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 100 మీటర్ల విభాగంలో రెండో స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రస్థాయి పోటీల్లో 17 బంగారు పతకాలు, 3 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించారు. జాతీయ స్థాయిలో కేరళ, కర్ణాటక, కోల్‌కతా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో 7 స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని సొంతం చేసుకున్నారు.


శ్రీలంకలో భారత్‌ పేరు నిలబెట్టాలి

నేపాల్‌లో సాధించిన విజయంతో అనితకుమారి మే 17 నుంచి 22 వరకు శ్రీలంకలోని కొలంబోలో జరగనున్న ‘అంతర్జాతీయ స్పోర్ట్స్‌ గేమ్స్‌ మీట్‌’కు ఎంపికయ్యారు. ఈ మెగా ఈవెంట్‌ కోసం కఠోర సాధన చేస్తున్నారు. కోచ్‌ శ్రీనివాస్‌ పర్యవేక్షలో రోజుకు ఆరు గంటలపాటు ప్రాక్టీస్‌ చేస్తూ నీటి అలలతో పోటీపడుతున్నారు. శ్రీలంకలో కూడా భారత్‌ పేరు నిలబెట్టి పతకంతో తిరిగి వస్తానని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.. ‘‘చాలామంది అమ్మాయిలు కేవలం ఫిట్‌నెస్‌ కోసం ఈత నేర్చుకుంటారు. కానీ పోటీతత్వంతో సాధన చేస్తే అద్భుత విజయాలు సాధించవచ్చు. ఇతర క్రీడలకు ఇచ్చే ప్రాధాన్యం ఈతకు ఇవ్వడం లేదు. నా తండ్రి కన్న కలలు నేను నిజం చేస్తున్నాను. భర్త, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏ మహిళకైనా విజయం సాధ్యమే’’ అని అనిత గర్వంగా చెబుతున్నారు.

పొత్తూరు రాజేంద్రప్రసాద్‌వర్మ

భీమునిపట్నం

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Feb 26 , 2026 | 03:23 AM