‘స్వచ్ఛ’మైన పరిష్కారం
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:18 AM
‘వ్యర్థాల సమస్యకు పునర్వినియోగమే పరిష్కారం’ అని నిరూపిస్తున్నారు విక్టోరియా జోస్లిన్ డిసౌజా. వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ కోసం ఆమె ప్రారంభించిన...
‘వ్యర్థాల సమస్యకు పునర్వినియోగమే పరిష్కారం’ అని నిరూపిస్తున్నారు విక్టోరియా జోస్లిన్ డిసౌజా. వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ కోసం ఆమె ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ, స్టార్టప్ వేల మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఇరవయ్యేళ్ళుగా కృషి చేస్తున్న బెంగళూరుకు చెందిన విక్టోరియా ప్రయాణం ఇది.
‘‘మన కళ్ళముందు ఏదైనా సమస్య కనిపిస్తున్నప్పుడు... నాకెందుకులే అనుకోకుండా దాని పరిష్కారం కోసం వీలైనంత తీవ్రంగా పోరాడాలి... ఇది మా నాన్న నాకు నేర్పిన పాఠం. ఆయన స్కూల్ టీచర్. వ్యవసాయం కూడా చేసేవారు. మా గ్రామ సమస్యలు తీర్చడానికి ఆయన కృషి చేసేవారు. సమాజానికి నావంతు మేలు చేయాలనే తపన బహుశా నాన్నను చూస్తూ పెరగడం వల్లే నాలో ఏర్పడిందనుకుంటాను. మాది కర్ణాటకలోని నాగనహళ్ళి అనే చిన్న గ్రామం. నా చిన్నప్పుడు మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. పన్నెండో క్లాసు వరకూ పెట్రోమాక్స్ లైట్ దగ్గరే చదువుకున్నాను. కబిని నదీ తీరంలో ఉన్న మా ఊరు ఎంతో అందంగా ఉంటుంది. ప్రకృతి అన్నా, పర్యావరణం అన్నా నాకున్న ఇష్టానికి ఇది ప్రధాన కారణం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లమా చేశాక... ఉద్యోగం కోసం బెంగళూరు వెళ్ళాను. నాలుగేళ్ళపాటు వివిధ కంపెనీల్లో పని చేశాను. సొంతగా ఏదైనా చేస్తే బాగుంటుందనిపించింది. ఈవెంట్ మేనేజిమెంట్ కంపెనీ ప్రారంభించాను. మొదట్లో ఉత్సాహంగానే ఉన్నా... ఉరుకుల పరుగుల జీవితపు ఒత్తిడి వల్ల ఏదో వెలితిగా అనిపించేది. దానినుంచి ఎలా బయటపడాలో అర్థమయ్యేది కాదు.
వార్డుకో కేంద్రం
ఒక రోజు బెంగళూరు ఫ్రీడమ్ పార్కులో వాకింగ్‌కు వెళ్ళినప్పుడు... ఒక కార్యక్రమం జరుగుతోంది. దాన్ని ‘ఆప్’ ఆధ్వర్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగంగా నిర్వహిస్తున్నారు. జనం భారీ సంఖ్యలో ఉన్నప్పటికీ... నిర్వహణ సరిగ్గా లేకపోవడం గమనించాను. అయితే... వారి లక్ష్యం నాకు నచ్చింది. నిర్వాహకులను కలిసి ‘‘నేనొక ఈవెంట్ మేనేజర్‌ని. మీరు అవకాశం ఇస్తే... స్వచ్ఛందంగా పని చేస్తాను’’ అని చెప్పాను. కొన్నాళ్ళపాటు వారితో ప్రయాణం సాగింది. ఈ క్రమంలో పరిచయమైన డాక్టర్ మీనాక్షి భరత్ లాంటి ఉద్యమకారుల వల్ల వ్యర్థాల నిర్వహణ ఆవశ్యకత గురించి మరింత స్పష్టంగా తెలుసుకున్నాను. పర్యావరణం పరిరక్షణ, వేస్ట్ మేనేజిమెంట్ కోసం పాటుపడుతున్న ఎన్జీవోలతో కలిసి పని చెయ్యడం మొదలుపెట్టాను. 2007లో మరో ఇద్దరు మిత్రులతో కలిసి ‘స్వచ్ఛ’ అనే ఎన్జీవోను, దానిలో భాగంగా ‘స్వచ్ఛ ప్రాజెక్ట్- బెంగళూర్’ను ప్రారంభించాను. తడి చెత్తతో ఎరువులు, కంపోస్ట్, బయోగ్యాస్ లాంటివి తయారు చేయవచ్చు. అలాగే పొడి చెత్తను కూడా పునర్వినియోగించుకోవచ్చు. కానీ సాధారణంగా మన ఇళ్ళలో తడి చెత్తను, పొడి చెత్తను కలిపి పారేస్తూ ఉంటాం. ఈ పద్ధతి మానాలని బెంగళూరు నగరంలో ఇంటింటికీ వెళ్ళి ప్రచారం చెయ్యడం ప్రారంభించాం. అయితే... మామూలు వ్యక్తులు చెబితే జనం వినరని త్వరలోనే అర్థమయింది. ‘బృహత్ బెంగళూరు మహానగర పాలిక’ (బిబిఎంపి) అధికారులను కలిసి మా ఉద్దేశాలను వివరించాం. దానికి సానుకూల స్పందన లభించింది. ఒక ప్రణాళిక రూపుదిద్దుకుంది. దాని ప్రకారం ప్రతి వార్డులో పొడి చెత్త సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. చెత్తను సేకరించే కార్మికులకే వాటి బాధ్యతలు అప్పగించాం. అది మంచి ఫలితాలను ఇచ్చింది. సరే... మరి సేకరించిన చెత్తను ఏం చెయ్యాలి? అధికారుల సూచన మేరకు... కుటుంబం నుంచి, మిత్రుల నుంచి 20 లక్షల రూపాయలు సేకరించి ‘స్వచ్ఛ ఎకో సొల్యూషన్స్’ అనే స్టార్ట్‌పను 2012లో స్థాపించాను.

ఈ ప్రయత్నం అందుకోసమే...
అప్పటికి రీసైక్లింగ్ అనేది కొత్త. ఇక్కడ చెత్తను కొనేవాళ్ళు లేరు. సేకరించిన పొడి చెత్త నుంచి ప్లాస్టిక్‌ను తీసి పుణే పంపించేవాళ్ళం. అక్కడ దాంతో డ్రిప్ ఇరిగేషన్ పైపులు తయారయ్యేవి. ఆ తరువాత మెల్లగా మేమే రకరకాల వస్తువుల తయారీ చేపట్టాం. మా కృషికి గుర్తింపుగా ప్రభుత్వం నుంచి, ప్రైవేటు సంస్థల నుంచి అనేక పురస్కారాలు అందుకున్నాం. ఇప్పుడు మాకు బెంగళూరులో, హోసూరులో రెండు రీసైక్లింగ్ యూనిట్స్ ఉన్నాయి. పలు ప్రదేశాల నుంచి చెత్త సేకరించి, దాన్ని ప్రాసెస్ చేస్తున్నాం. దీనిద్వారా దాదాపు అయిదు లక్షలమందికి పైగా జీవితాలపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మా సంస్థలు ప్రభావం చూపించాయి. లక్షా పాతికవేల టన్నులకు పైగా చెత్తను చెత్త కుప్పల మీద నుంచి తొలగించగలిగాం. దాదాపు 70 వేల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేశాం. వాటితో పలు ఉత్తత్తులు తయారవుతున్నాయి. సుమారు మూడువేల మందికి ఉపాధి కల్పించాం. వీరిలో ఎక్కువమంది మహిళలే. చెత్తను ఎక్కడపడితే అక్కడ పారేస్తే... మన ఆరోగ్యాలు, పర్యావరణం దెబ్బతింటాయి. ఈ సమస్యకు... పునర్వినియోగమే పరిష్కారం. ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఇరవయ్యేళ్ళుగా నేను చేస్తున్న ప్రయత్నమంతా దానికోసమే.’’
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..