కార్బ్స్ కాదు... క్యాలరీలు తగ్గించాలి
ABN , Publish Date - Feb 19 , 2026 | 02:15 AM
నటి తమన్నా భాటియా ఫిట్‌నెస్ వెనుక ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్ధ్ సింగ్ కృషి ఎంతో ఉంది. తాజాగా అతను డైటింగ్ పోకడలతో తలెత్తే నష్టాల గురించి సామాజిక మాధ్యమాల్లో...
నటి తమన్నా భాటియా ఫిట్‌నెస్ వెనుక ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ సిద్ధార్ధ్ సింగ్ కృషి ఎంతో ఉంది. తాజాగా అతను డైటింగ్ పోకడలతో తలెత్తే నష్టాల గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. డైట్ ట్రెండ్స్, వాటితో ఆరోగ్యానికి కలిగే హాని గురించి అతనేమంటున్నాడంటే...
ఫిట్‌నెస్ ట్రెండ్స్ వేగంగా వచ్చి వెళ్లిపోతూ ఉంటాయి. కాబట్టి వాటిలో ఏ ట్రెండ్ ప్రభావాన్ని కనబరుస్తుందో కనిపెట్టడం చాలా కష్టం. పైగా ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో ఏదో ఒక కొత్త డైట్ ఫ్యాడ్ ప్రత్యక్షమవుతూనే ఉంటుంది. కాబట్టి ఆ హైప్‌లో చిక్కుకుపోవడం సహజమే! అయితే ఏ డైట్ మన శరీరానికి నప్పుతుందో కనిపెట్టడం చాలా ముఖ్యం.
లో కార్బ్/ క్యాలరీ డెఫిసిట్
సాధారణంగా త్వరితంగా ఫలితాన్ని కనబరిచే డైట్స్‌కు ఎక్కువగా అట్రాక్ట్ అయిపోతూ ఉంటాం. అలాంటిదే లో కార్బ్ డైట్. వేగంగా బరువు తగ్గడం కోసం పిండిపదార్థాలను పూర్తిగా మానేయడం కొత్త ట్రెండ్‌గా మారిపోయింది. నిజానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవాళ్లు ఈ ట్రెండ్‌కు దూరంగా ఉండడం మంచిది. ఈ డైట్‌తో త్వరగా బరువు తగ్గే మాట నిజమే అయినా, పిండిపదార్థాలను పూర్తిగా తొలగించుకోవడం వల్ల హార్మోన్లలో అవకతవకలు తలెత్తుతాయి. ఆకలి వేధిస్తుంది. కాబట్టి లో కార్బ్ డైట్‌కు బదులుగా క్యాలరీ డెఫిసిట్ డైట్‌ను ఎంచుకోవడం ఉత్తమం. పిండి పదార్థాలను ఆస్వాదిస్తూనే, ఎక్కువ ప్రొటీన్‌ను తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేయగలిగితే, కచ్చితంగా బరువు తగ్గుతారు.
డిటాక్స్ టీ
ఇటీవలి కాలంలో పలు రకాల డిటాక్స్ టీల ట్రెండ్ పెరిగింది. ఇలాంటి క్లీన్సింగ్ ఉత్పత్తులన్నీ మోసపూరితమైనవని గ్రహించాలి. ఏ టీ లేదా సప్లిమెంట్ మనల్ని డిటాక్స్ చేయలేదు. మన శరీరాలు, విషాలను విసర్జించుకునే అంతర్గత డిటాక్స్ వ్యవస్థను కలిగి ఉంటాయి. కాబట్టి పీచు సమృద్ధిగా కలిగి ఉండే ఆహారం, ప్రొటీన్ తినాలి. వ్యాయామం లేదా నడకలను జీవితంలో భాగం చేసుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. ఇలా మనలోని సహజసిద్ధ డిటాక్స్ వ్యవస్థను బలపరిచే జీవనశైలిని అలవరుచుకోవాలి.
సరిపడా నిద్ర
ఉరుకులు పరుగుల జీవితాల్లో నిద్రకు సరిపడా సమయాన్ని కేటాయించలేకపోతున్నాం. నిజానికి ఇదొక పెద్ద ఫిట్‌నెస్ మిస్టేక్. నిద్ర లోపిస్తే, నిస్సత్తువ ఆవరించడమే కాకుండా కొవ్వు కరిగే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఆకలి పెరుగుతుంది, శరీరం కోలుకునే వేగం తగ్గుతుంది. ఇవన్నీ శరీరంలో మరింత కొవ్వు పేరుకుపోడానికి దారి తీస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవాళ్లకు నిద్రకు ప్రాధాన్యం ఇవ్వాలి. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు తప్పనిసరిగా నిద్రపోవాలి.
ఇవి కూడా చదవండి
టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య