Share News

మజ్జిగతో మజాగా..!

ABN , Publish Date - May 23 , 2026 | 06:11 AM

ఎండాకాలం మధ్యాహ్న సమయంలో ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగితే హాయిగా అనిపిస్తుంది. కానీ పిల్లలు మాత్రం వద్దంటూ మారాం చేస్తూ ఉంటారు. అదే మజ్జిగను చక్కగా చిలికి...

మజ్జిగతో మజాగా..!

వంటిల్లు

ఎండాకాలం మధ్యాహ్న సమయంలో ఒక గ్లాసు చల్లటి మజ్జిగ తాగితే హాయిగా అనిపిస్తుంది. కానీ పిల్లలు మాత్రం వద్దంటూ మారాం చేస్తూ ఉంటారు. అదే మజ్జిగను చక్కగా చిలికి వంటింట్లో ఉండే కొన్ని దినుసులు కలిపి రుచికరమైన డ్రింక్‌లా తయారుచేసిస్తే పిల్లలతో సహా కుటుంబ సభ్యులంతా ఇష్టంగా తాగేస్తారు. అలాంటి విభిన్నమైన మజ్జిగ పానీయాలు మీ కోసం...

పైనాపిల్‌ లస్సీ

కావాల్సిన పదార్థాలు

పండిన పైనాపిల్‌ చక్రాలు- నాలుగు, ఉప్పు- పావు చెంచా, నిమ్మరసం- చెంచా, చక్కెర- అయిదు చెంచాలు, చిక్కటి పెరుగు- రెండు కప్పులు, ఐస్‌ క్యూబ్స్‌- అయిదు, పుదీనా ఆకులు- రెండు

తయారీ విధానం

ఒక గిన్నెలో పైనాపిల్‌ చక్రాలు, రెండు చెంచాల చక్కెర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. గిన్నె మీద మూత పెట్టి పావుగంట సేపు పక్కన ఉంచాలి.

స్టవ్‌ మీద గిన్నె పెట్టి అందులో పైనాపిల్‌ మిశ్రమం వేసి ముదురు గోధుమ రంగు పాకం వచ్చే వరకు చిన్న మంట మీద ఉడకనిచ్చి దించాలి. దీన్ని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ గిన్నెలో వేయాలి. అలాగే పెరుగు, మూడు చెంచాల పంచదార, ఐస్‌ క్యూబ్స్‌ వేసి హై స్పీడ్‌ మీద గ్రైండ్‌ చేయాలి.

ఈ పైనాపిల్‌ లస్సీని గాజు గ్లాసులో పోసి పుదీనా ఆకులు, కొన్ని పైనాపిల్‌ ముక్కలు వేసి సర్వ్‌ చేయాలి.


మోర్‌ తాతా

కావాల్సిన పదార్థాలు

చిక్కటి పెరుగు- ఒక కప్పు, పచ్చి మిర్చి- ఒకటి, జీలకర్ర- పావు చెంచా, చిన్న అల్లం ముక్కలు- రెండు, కరివేపాకు- ఒక రెమ్మ, కొత్తిమీర- కొద్దిగా, పచ్చి మామిడికాయ ముక్కలు- పావు కప్పు, నల్ల ఉప్పు- అర చెంచా, చల్లటి నీళ్లు- రెండు పెద్ద గ్లాసులు, ఐస్‌ క్యూబ్స్‌- నాలుగు, కారం బూందీ- పావు కప్పు.

తయారీ విధానం

మిక్సిలో మామిడికాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చి మిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, నల్ల ఉప్పు వేసి

మెత్తగా గ్రైండ్‌ చేయాలి. తరువాత పెరుగు వేసి మంచినీళ్లు పోసి మరోసారి గ్రైండ్‌ చేయాలి. ఇలా తయారుచేసుకున్న మామిడి మజ్జిగను స్టయినర్‌ సహాయంతో గిన్నెలోకి వడబోయాలి. గాజు గ్లాసులను తీసుకుని ఒక్కోదానిలో రెండు

ఐస్‌ క్యూబ్స్‌, కొన్ని మామిడికాయ ముక్కలు వేసి మామిడి మజ్జిగ పోయాలి. పైన గుప్పెడు బూందీ చల్లి సర్వ్‌ చేయాలి.


డ్రై ఫ్రూట్స్‌ లస్సీ

కావాల్సిన పదార్థాలు

బాదం పప్పులు- అయిదు, జీడిపప్పులు- ఆరు, పిస్తా పప్పులు- ఎనిమిది, చిక్కటి పెరుగు- రెండు కప్పులు, ఖర్జూరాలు- అయిదు, కిస్‌మిస్‌లు- అయిదు, ఉప్పు- చిటికెడు, పాలు- ఒక కప్పు, ఐస్‌క్యూబ్స్‌- అయిదు, తేనె- రెండు చెంచాలు, స్వీట్‌ కోవా- చెంచా

తయారీ విధానం

స్టవ్‌ మీద పాన్‌ పెట్టి, బాదం, కాజు, పిస్తా పప్పులు వేసి రెండు నిమిషాలపాటు దోరగా వేయించాలి. ఇవి చల్లారాక మిక్సీలో వేసి

రవ్వలా గ్రైండ్‌ చేయాలి. బ్లెండర్‌లో పెరుగు, డ్రై ఫ్రూట్స్‌ పొడి, ఖర్జూరాలు, కిస్‌మిస్‌లు, ఉప్పు వేసి మెత్తగా బ్లెండ్‌ చేయాలి. తరువాత పాలు పోసి తేనె, కోవా, ఐస్‌ క్యూబ్స్‌ వేసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఇలా తయారుచేసిన లస్సీని గాజు గ్లాసుల్లో పోసి పైన కొన్ని డ్రై ఫ్రూట్స్‌ పలుకులు చల్లి సర్వ్‌ చేయాలి.


మసాలా మజ్జిగ

కావాల్సిన పదార్థాలు

చిన్న అల్లం ముక్క- ఒకటి, పచ్చి మిర్చి- ఒకటి, పుదీనా ఆకులు- నాలుగు, కొత్తిమీర తరుగు- కొద్దిగా, మిరియాల పొడి- పావు చెంచా, వేయించిన జీలకర్ర పొడి- పావు చెంచా, పెరుగు- అర కప్పు, చల్లటి నీళ్లు- ఒక పెద్ద గ్లాసు, ఉప్పు లేదా నల్ల ఉప్పు- చిటికెడు, నిమ్మరసం- చెంచా

తయారీ విధానం

బ్లెండర్‌లో పెరుగు, అల్లం, పచ్చి మిర్చి, పుదీనా, కొత్తిమీర, మిరియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, ఉప్పు లేదా నల్ల ఉప్పు వేసి రెండు నిమిషాలపాటు మెత్తగా బ్లెండ్‌ చేయాలి. తరువాత చల్లటి నీళ్లు పోసి మరోసారి బ్లెండ్‌ చేయాలి. ఆపైన అందులో నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలపాలి. ఇలా తయారుచేసిన మసాలా మజ్జిగని గాజు గ్లాసుల్లో పోసి ఐస్‌ క్యూబ్స్‌ వేసి పైన చిటికెడు జీలకర్ర పొడి చల్లి ఒక పుదీనా ఆకు ఉంచి సర్వ్‌ చేయాలి.

Also Read:

వడదెబ్బ ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 22 మంది మృతి

తండ్రి మరణాన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం? జగన్ తీరుపై మంత్రి గొట్టిపాటి ధ్వజం

Updated Date - May 23 , 2026 | 06:11 AM