Share News

దూసుకుపోతోంది.. రాకెట్‌లా!

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:19 AM

సృష్టి కిరణ్‌... ఇప్పుడు టెన్నిస్‌ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. మూడేళ్ళకే రాకెట్‌ పట్టిన ఈ బెంగళూరు అమ్మాయి ఏడేళ్ళ వయసులోనే వరుస విజయాలతో సంచలనం...

దూసుకుపోతోంది.. రాకెట్‌లా!

స్ఫూర్తి

సృష్టి కిరణ్‌... ఇప్పుడు టెన్నిస్‌ ప్రపంచంలో మారుమోగుతున్న పేరు. మూడేళ్ళకే రాకెట్‌ పట్టిన ఈ బెంగళూరు అమ్మాయి ఏడేళ్ళ వయసులోనే వరుస విజయాలతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు అండర్‌-13లో ప్రపంచంలోనే నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధించి, దేశానికి గర్వకారణంగా నిలిచింది. భారత టెన్నిస్‌ భవిష్యత్తుగా క్రీడా పండితుల ప్రశంసలందుకుంటోంది.

‘‘ప్రత్యర్థి ఎవరనేది పట్టించుకోను. నా దృష్టంతా బంతి మీద, నా ఆట తీరు మీద ఉంటుంది. నాకు బలమైన ప్రత్యర్థిని నేనే’’ అంటుంది సృష్టి కిరణ్‌. ఆమె సాధిస్తున్న విజయాలు ఆమె సత్తా ఏమిటన్నది చాటి చెబుతున్నాయి. వరుసగా అయిదు టైటిల్స్‌ గెలిచిన ఆమె తాజాగా అండర్‌-13లో ప్రపంచ నెంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకుంది. ఈ ఘనతకు చాలా ప్రత్యేకతలున్నాయి. సీనియర్స్‌లో గానీ, జూనియర్స్‌లో కానీ ఇప్పటివరకూ సింగిల్‌ కేటగిరీల్లో... పురుషుల్లో కానీ, మహిళల్లో కానీ భారతీయులెవరూ నెంబర్‌ వన్‌ కాదు కదా టాప్‌-10కు కూడా చేరలేదు. విజయ్‌ అమృతరాజ్‌ 1980లో సాధించిన 18వ ర్యాంకింగే అత్యుత్తమం. మరో విశేషమేమిటంటే... ఐటీఎఫ్‌ జూనియర్‌ ర్యాంకింగ్‌లో... సాధారణంగా గత పది ర్యాంకింగ్‌ టోర్నమెంట్లలో క్రీడాకారుల అత్యుత్తమ ఫలితాలను లెక్కిస్తారు. కానీ సృష్టి కేవలం ఎనిమిది ర్యాంకింగ్‌ ఈవెంట్లలో మాత్రమే పాల్గొంది. కానీ నెంబర్‌ వన్‌ కావడానికి అవసరమైన పాయింట్లను అప్పటికే సంపాదించింది.


తండ్రి కల తీరుస్తోంది...

’’జూనియర్‌ టెన్నిస్‌లో ర్యాంకింగ్‌లు మరీ ముఖ్యమని నేను అనుకోను. అవి మారుతూనే ఉంటాయి. అయితే తన వయసు కేటగిరీలో అగ్రస్థానానికి మా అమ్మాయి చేరుకోవడం చాలా గొప్పగా అనిపిస్తోంది. ఆమెను చూసి గర్వపడుతున్నాం. ఇదే ఆటతీరును కొనసాగిస్తుందని ఆశిస్తున్నాం’’ అంటున్నారు సృష్టి తండ్రి కిరణ్‌ గోపాల్‌రాజన్‌. బెంగళూరుకు చెందిన ఆయన ఒక రిటైల్‌ షోరూమ్‌ నడుపుతున్నారు. గోపాల్‌రాజన్‌ అఽథ్లెట్‌. క్రికెటర్‌గా పేరు తెచ్చుకోవాలనేది ఆయన కల. దానికోసం ఎంతో ప్రయత్నించారు. కానీ కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మీద దృష్టి పెట్టి, ఆటకు దూరమయ్యారు. తన కలను తన కుమార్తె తీరుస్తోందని ఆయన సంబరపడుతున్నారు. సృష్టిని మూడేళ్ళ వయసులో కిండర్‌గార్టెన్‌లో చేర్చినప్పటి నుంచీ ఆటల్లో చురుగ్గా ఉండేది. అప్పుడే టెన్నిస్‌ రాకెట్‌ చేతపట్టింది. వయసుకు మించిన సామర్థ్యం ఆమెలో ఉందని గ్రహించిన తల్లి వినయ కిరణ్‌, తండ్రి గోపాల్‌రాజన్‌ ఆమెను ప్రోత్సహించారు. కేవలం నాలుగున్నర ఏళ్ళ వయసులోనే బెంగళూరులోని కర్ణాటక రాష్ట్ర లాన్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌లో ఆమె శిక్షణ ఆరంభించింది. ఏఐటీఏ అండర్‌ టెన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో వరుసగా రెండుసార్లు గెలిచిన పిన్నవయస్కురాలిగా పతాక శీర్షికలకు ఎక్కింది. అప్పుడు ఆమెకు ఏడేళ్ళు.

6-Navya.jpg


కనీసం ఊహించనైనా లేదు...

వయసుకు మించిన పరిమితి, ఆటలో పరిస్థితుల్ని సరిగ్గా అర్థం చేసుకొనే నేర్పు, నిర్భయంగా, దూకుడుగా ఉండడం... ఇవన్నీ సృష్టి విజయాలకు దోహదం చేస్తున్నాయంటారు ఆమె తండ్రి. ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతున్న ఆమె టెన్నిస్‌ అడ్వాన్స్‌ అకాడమీలో ధ్యాన్‌ ఉతప్ప దగ్గర శిక్షణ పొందుతోంది. తనకన్నా వయసులో పెద్దవారు, అనుభవజ్ఞులు అయిన క్రీడాకారులతో పోటీపడి తన నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. ఇటీవల వరుసగా అయిదు ఐటీఎఫ్‌ జూనియర్‌ టైటిల్స్‌ గెలిచిన ఆమె గత వారం మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో జరిగిన ‘వరల్డ్‌ టెన్నిస్‌ టూర్‌ జూనియర్స్‌- జె100’ ఈవెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. దీని ఫలితంగా... తన కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకింగ్‌ 357కు చేరుకొని... అండర్‌-13 వరల్డ్‌ నెంబర్‌వన్‌ స్థానాన్ని అందుకుంది. ‘‘గత కొన్ని వారాలు నాకు చాలా ప్రత్యేకమైనవి. వరుసగా అయిదు టైటిల్స్‌ గెలిచాను. మరోదానిలో ఫైనల్‌కి చేరుకున్నాను. ఈ విజయాలు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. నా ఏజ్‌ గ్రూప్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌ అయినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ ఏడాది ఆరంభంలో దీన్ని కనీసం ఊహించనైనా లేదు. కానీ నా కఠోర శ్రమతోపాటు నా కోచ్‌లు, కుటుంబ సభ్యులు, సపోర్ట్‌ టీమ్‌ సాయంతో ఇక్కడివరకూ రాగలిగాను. నేను ప్రయాణించాల్సిన దూరం ఇంకా చాలా ఉందనీ, నా ఆటలో మెరుగుపరుచుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉన్నాయని నాకు తెలుసు’’ అంటున్న సృష్టి దృష్టి ఇప్పుడు వింబుల్డన్‌ జూనియర్స్‌ టోర్నీ మీద ఉంది. ‘‘వింబుల్డన్‌ జూనియర్స్‌లో పోటీ పడడం మాలాంటి క్రీడాకారుల కల. ‘జె-300 ఈవెంట్‌’లో ప్రవేశిస్తే... నేర్చుకోవడానికి, ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాళ్ళతో పోటీపడి నన్ను నేను పరీక్షించుకోవడానికి అది గొప్ప అవకాశం అవుతుంది’’ అని ఆమె చెబుతోంది. మన దేశ టెన్నిస్‌ రంగానికి భవిష్యత్తుగా క్రీడా పండితులు ఆమెను పరిగణిస్తున్నారు. ఆ అంచనాలను నిలబెట్టుకొనే సామర్థ్యం సృష్టికి ఉందని ఆమె వరుస విజయాలు రుజువు చేస్తున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 01:19 AM