Share News

పోరాటాల గళమైత్రి

ABN , Publish Date - Oct 22 , 2026 | 05:40 AM

చెన్నై ఆర్‌ఏపురంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయిస్తున్నప్పుడు...

పోరాటాల గళమైత్రి

చెన్నై ఆర్‌ఏపురంలో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా ఖాళీ చేయిస్తున్నప్పుడు... అక్కడ ఒక నిరుపేద ఆత్మహత్య చేసుకున్న దృశ్యం అభీషా గుండెలో ఆగ్రహజ్వాలలు రగిలించింది. కెమెరా వెనక నుంచి చిత్రీకరించడం కంటే.. చేతిలో మైక్‌పట్టి బాధితుల తరఫున ప్రశ్నిస్తేనే దాని తీవ్రత ఎక్కువగా ఉంటుందని భావించిన ఆ యువతి అక్కడికక్కడే ర్యాపర్‌గా మారింది. ఆ ఒక్క సంఘటన తమిళనాడులోనే తొలి మహిళా ర్యాప్‌ బృందం ‘సొల్లిసై సిస్టాస్‌’ పుట్టుకకు నాంది పలికింది.

తిరుచిరాపల్లిలోని ఒక సాధారణ వాతావరణంలో పెరిగిన అభీషాకు చిన్నతనం నుంచి సామాజిక విషయాలపై రాయడం అంటే ఎంతో ఇష్టం. తమిళ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు పా.రంజిత్‌ నేతృత్వంలోని ‘నీలమ్‌ సోషల్‌’ సంస్థలో ఇంటర్న్‌షిప్‌ చేయడం ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. దళిత హక్కులు, అంబేద్కర్‌ భావజాలం, రాజకీయం, ఫెమినిజం, వంటి అంశాలపై ఆమెకు అక్కడ అవగాహన పెరిగింది. స్వయంగా డాక్యుమెంటరీలు తీస్తూ కెమెరా వెనుక నిలబడి సమాజాన్ని గమనించడం అలవాటు చేసుకుంది. ఆ క్రమంలోనే ఓ సంగీత కార్యక్రమం ద్వారా హిప్‌హాప్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

అసభ్యతపై సమరశంఖం

సాధారణంగా ర్యాప్‌ విభాగాన్ని పురుషుల రాజ్యంగా భావిస్తారు. అక్కడ వినిపించే పాటల్లో మహిళలను తక్కువచేసి మాట్లాడటం, అసభ్యకర పదజాలం వాడటం అభీషాను తీవ్రంగా కలచివేసింది. ఒక ప్రదర్శనలో ఒక కుర్రాడు మాజీ ప్రేమికురాలిపై అసభ్యకరంగా పాడుతుండగా.. ప్రేక్షకుల్లో అభీషా ఉండటాన్ని గమనించి క్షమాపణలు చెప్పాడు. ఒక మహిళ అక్కడ ఉండటం వల్లే ఆ కుర్రాడిలో అంత మార్పు వచ్చినప్పుడు.. మరింత మంది మహిళలు ఈ రంగంలోకి వస్తే హిప్‌హాప్‌ ప్రపంచం ఎంత బాధ్యతాయుతంగా మారుతుందో ఆమె గ్రహించింది. ఆ ఆలోచనే ‘సొల్లిసై సిస్టాస్‌’ ఏర్పాటుకు బీజం వేసింది.


కలిసిన ఆశయాలు

అభీషా ఆశయానికి తోడుగా మరో ముగ్గురు కలిశారు. జర్నలిస్టులుగా పని చేస్తూ సంప్రదాయ నాటు కళలపై పరిశోధనలు చేసిన కావ్య (కవి చిక్కి) నీలమ్‌ కమ్యూనిటీ ద్వారా పరిచయమైన నేయా, సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయమైన సువాతి (రాగ కాట్రలై) ఈ బృందంలో చేరారు. వీరంతా కలిసి నీలమ్‌ నిర్వహించిన ‘మార్కిళియల్‌ మక్కలి సై’ వేదికగా ‘సొల్లిసై సిస్టా్‌స’గా అధికారికంగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

జానపదానికి ఆధునిక సొబగులు

కావ్యకు కన్నడ సంప్రదాయ నాటు కళలు, గానా పాటలపై మంచి పట్టుఉంది. ఎలాంటి సంగీత శిక్షణ లేకపోయినా బీట్‌బాక్సింగ్‌ చేస్తూ ర్యాప్‌కు ప్రాణం పోసింది. వీరు కేవలం ఆధునిక, పాశ్చాత్య సంగీతానికే పరిమితం కాకుండా.. తమిళ సంప్రదాయ వాయిద్యమైన ‘పరై’ని వీధి ర్యాప్‌తో మేళవించి సరికొత్త ప్రయోగాలు చేశారు. ఇది శ్రోతలకు వినోదాన్ని అందించడమే కాకుండా, వారి హృదయాలను నేరుగా తాకేలా చేసింది.

వేప చెట్టు నీడలో వాతావరణ ఘోష

సామాజిక అంశాలకే పరిమితం కాకుండా ‘యూత్‌ కీ ఆవాజ్‌’ నిర్మించిన మిక్స్‌టేప్‌ కోసం వీరు రూపొందించిన ‘వెప్ప మరత్తడియిల’ (వేపచెట్టు నీడలో) పాట బెంగళూరు నగరంలో నెలకొన్న తీవ్ర వాతావరణ అత్యవసర పరిస్థితిని కళ్లకట్టింది. రియల్‌ ఎస్టేట్‌ ధాటికి మాయమవుతున్న చెరువులు, నగరంలో పెరుగుతున్న వేడి, నీటి కొరత, పేదలపై పడుతున్న వాతావరణ మార్పుల ప్రభావాన్ని తమిళ-కన్నడ ఫ్యూజన్‌ ర్యాప్‌గా అత్యంత ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

మూఢనమ్మకాలపై...

ఒక మహిళా బృందంగా ప్రయాణించడం వీరికి ఎంతో సవాలుగా మారింది. ఒక తమిళనాడు ఉత్సవంలో పాట పాడుతుండగా ‘బహిష్టు’ అనే పదాన్ని వాడకూడదని నిర్వాహకులు సెన్సార్‌ ఆంక్షలు విధించారు. ‘సమాజంలో మైలురాయి దాటామని అనుకుంటున్నాం, కానీ ఇప్పటికీ అనేక విషయాలను అణచివేసే మనస్తత్వాలు ఉన్నాయని ఈ సంఘటన ద్వారా అర్థమైంది’ అని కావ్య ఆవేదన వ్యక్తం చేసింది.


ఉనికి కోసం చేయాల్సిన పోరాటం

కళను బతికించుకోవడంతో పాటు, వ్యక్తిగత జీవితాలను గడపడం ప్రతి కళాకారుడికీ అవసరమే. ‘వాణిజ్య ప్రపంచంలో మనుగడ సాగించడం కూడా కళాకారుడికి ముఖ్యమే’ అని కావ్య చెబుతోంది. ప్రదర్శనలు ఇచ్చే వేదికల వద్ద దుస్తులు మార్చుకోవడానికి గది, కనీస మరుగుదొడ్లు లేకపోవడం వంటి ప్రాథమిక వసతుల కొరతను కూడా వీరు అనుభవించారు.

వర్ణ వివక్షపై ప్రశ్నలు

సంగీత ప్రపంచంలో నేటికీ అందమైన, తెల్లటి చర్మం ఉన్న మహిళలకే ప్రాధాన్యం ఇస్తున్నారని అభీషా ప్రశ్నిస్తోంది. ముదురు చర్మం ఉన్న మహిళలను ఇంకా తెరపైకి రానివ్వకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని అమ్మాయిలను అమాయకులుగా మాత్రమే చూపిస్తున్నారని, వారికి కనీస స్వేచ్ఛ లేదనే విషయాన్ని గొంతెత్తి చెప్పాల్సిన అవసరం ఉందంది.

గళమెత్తిన సామాజిక శరాలు

ఈ బృందం రాసే ప్రతి పాట వెనుక ఒక సామాజిక ఉద్దేశం ఉంటుంది. కుల వివక్ష, స్త్రీద్వేషం, పరువు హత్యలు వంటి సున్నితమైన అంశాలపై వీరు నిరంతరం పాటలు రాస్తున్నారు. వీరి ‘హయా హయా’ పాట అక్కాచెల్లెళ్ల అనుబంధం, మహిళా సాధికారతను చాటిచెప్పగా, ‘కాదల్‌ పన్నా’ పాట ఆధునిక సమాజంలో ప్రేమ సమగ్రతను వివరించింది.

సవాళ్లను దాటుకుని..

‘మహిళలు కాబట్టే వీరికి అవకాశాలు వస్తున్నాయి’ అని తోటి హిప్‌హాప్‌ వర్గాల నుంచే విమర్శలు ఎదురైనా వీరు భయపడలేదు. తమ పాటల ద్వారా కనీసం కొందరిలోనైనా ఆలోచన రేకెత్తించగలుగుతున్నామనే సంతృప్తి వీరిని ముందుకు నడిపిస్తోంది. తమ సంగీతాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లడంతో పాటు, హిప్‌హాప్‌ రంగంలో మహిళలకు, క్వీర్‌ కళాకారులకు సురక్షితమైన, సమానత్వంతో కూడిన వాతావరణాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘సొల్లిసై సిస్టాస్‌’ ముందుకు సాగుతోంది.

ఈ వార్తలనూ చదవండి:

ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు.. పిల్ల చేష్టలని కొట్టిపడేసిన బీజేపీ..

భారత్‌ను టార్గెట్ చేయాలనే ఉద్దేశం మాకు లేదు: అమెరికా విదేశాంగ మంత్రి

Updated Date - Oct 22 , 2026 | 05:40 AM