సాహసం... సందేశం
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:36 AM
చదువు... ఆపై ఉద్యోగం... కుటుంబ భారం... రొటీన్ లైఫ్‌లో పడి మర మనుషుల్లా మారిపోతున్నామనే భావన ఆమెను కుదురుగా కూర్చోనివ్వలేదు. జీవితంలో ఏ లోటూ లేకపోయినా...
సంకల్పం
చదువు... ఆపై ఉద్యోగం... కుటుంబ భారం... రొటీన్ లైఫ్‌లో పడి మర మనుషుల్లా మారిపోతున్నామనే భావన ఆమెను కుదురుగా కూర్చోనివ్వలేదు. జీవితంలో ఏ లోటూ లేకపోయినా... మనసు మాత్రం మరేదో కోరుకుంది. ప్రకృతితో మమేకమై... ఆ ఆనందాన్ని అనుభూతి చెందాలని తపించింది. అందుకే పర్వతారోహణను అభిరుచిగా మలుచుకుని... సాహస యాత్రలను జీవన గమనంలో చేర్చుకున్నారు... 34 ఏళ్ల చిలువూరి రమ్య. ఇటీవలే హిమాలయాల్లోని ‘ఫ్రెండ్‌షిప్ పీక్’ను అధిరోహించిన ఆమె... తన అనుభవాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
‘‘ఒక్కసారి హిమాలయాల్లోకి తొంగి చూస్తే... పదేపదే అక్కడకు వెళ్లాలని... ఆసాంతం విహరించాలని అనిపిస్తుంది. అది ఒక అలవాటుగా మారిపోతుంది. అంతటి రమణీయంగా... ఆహ్లాదంగా... ఒక అద్భుత దృశ్య కావ్యంగా ఉంటాయి మంచుపర్వత శ్రేణులు. సాఫ్ట్‌వేర్ కొలువులు... లక్షల్లో ప్యాకేజీలు... వీకెండ్ పార్టీలు... ఇవేవీ ఇవ్వని సంతృప్తిని, సంతోషాన్ని నాకు పర్వతారోహణ ఇచ్చింది. దాంతోపాటు దట్టమైన అడవుల్లో ట్రెక్కింగ్‌ను కూడా నా జీవితంలో ఒక భాగం చేసుకున్నాను. ఏటా ఏదో ఒక ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లడం, పర్వతారోహణ చేయడం అలవాటుగా మారిపోయింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామం మాది. నాన్న సత్యనారాయణరాజు.. రైతు. అమ్మ కుమారి.. టైలరింగ్ చేస్తుంది.
ఉద్యోగంలో చేరినా...
స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి... తరువాత భీమవరంలో ఇంటర్ చదివాను. అక్కడి జీవీఐటీలో ఇంజనీరింగ్ పూర్తవ్వగానే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం రావడంతో బెంగళూరు వెళ్లాను. కొన్నేళ్లు ఉద్యోగం చేశాక అనిపించింది... ఉదయం లేవడం, పరుగెత్తడం, ఒత్తిడిలో పని చేయడం, అలసిపోయి ఇంటికి రావడం... జీవితమంటే ఇంతేనా అని! పర్వతారోహణ, ట్రెక్కింగ్‌లపై ఆసక్తి ఎప్పటి నుంచో నాలో అంతర్లీనంగా ఉండిపోయింది. ఆ అభిరుచికి రూపం ఇవ్వాలని భావించాను. దాని కోసం, ప్రత్యేకించి హిమాలయాల్లో సాహస యాత్ర కోసం మౌంటెనీరింగ్ కోర్సు చేయాలని అనుకున్నాను. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ వెళ్లాను. అక్కడి ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్’లో చేరాను. నెల రోజుల శిక్షణలో మంచులో, రాళ్లలో, ఆక్సిజన్ అందని సందర్భాల్లో పర్వతాలు ఎలా అధిరోహించాలో, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎలా సిద్ధంగా ఉండాలో నేర్చుకున్నాను.
హిమాలయాలతో మొదలు...
మౌంటెనీరింగ్‌లో శిక్షణ పూర్తయ్యాక... పర్వతారోహణ ప్రారంభించాను. తొలిసారిగా మూడేళ్ల కిందట హిమాలయాల్లోని తపోవన్ పర్వత యాత్ర చేపట్టాను. దీన్ని ట్రెక్కింగ్ చేసేవారికి, పర్వతారోహకులకు, ఆధ్యాత్మిక అన్వేషకులకు గమ్యస్థానంగా భావిస్తారు. ఈ పర్వతం అద్భుతమైన సహజ సౌందర్యంతో ఎంతలా ఆకట్టుకొంటుందో... అధిరోహించాలనుకొనేవారికి అంతటి సవాళ్లను విసురుతుంది. మొదటి యాత్ర విజయవంతం కావడంతో నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. మరుసటి ఏడాది ఉత్తరాఖండ్‌లోని మరో పర్వతం... బ్లాక్ పీక్‌ను అధిరోహించాను. ఇది సముద్ర మట్టానికి 6,387 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇది పూర్తికావడానికి పదిహేను రోజులు పట్టింది.
ఏటా యాత్ర...
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో ఉద్యోగం చేసుకొంటూ, అమ్మానాన్నలను చూసుకొంటూ పర్వతారోహణ కొనసాగిస్తున్నాను. వృత్తిగత జీవితంలో ఎంత బిజీగా ఉన్నా... ఏడాదిలో కొంత సమయాన్ని నా యాత్రలకు కేటాయిస్తున్నాను. అలా గత నెల ఆరో తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లోని ‘ఫ్రెండ్‌షిప్ పీక్’ను అధిరోహించాను. గుజారాత్‌కు చెందిన ఇన్విసిబుల్ ఎన్జీవో దీనికి స్పాన్సర్‌గా వ్యవహరించింది. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్న సందేశంతో, దానిపై వారిలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టాను. సాహసంతో పాటు నేటి తరాన్ని మేల్కొలిపే ఒక మంచి సందేశం కూడా ఇచ్చే ప్రయత్నం. 17,352 అడుగుల ఎత్తులో ఉన్న ‘ఫ్రెండ్‌షిప్ పీక్’ను అధిరోహించడం అంత సులువు కాదు. దట్టమైన మంచు, ఉన్నట్టుండి మారిపోయే వాతావరణం, ఆక్సిజన్ అందక ఇబ్బందులు... విభిన్న పరిస్థితులు అడుగడుగునా సవాళ్లు విసురుతాయి. మా బృందంలో నాతోపాటు మరో ఇరవై మంది కూడా ఉన్నారు. దీని కోసం మూడు నెలలు సన్నద్ధమయ్యాను. పర్వత శిఖరానికి చేరుకున్నప్పుడు నా ఆనందానికి అవధులు లేవు.

సైనికులతో కలిసి...
నా ఈ ప్రయాణంలో ఇప్పుడు ఓ అరుదైన అవకాశం దక్కింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మౌంటెనీరింగ్ విభాగం... సతోపంత్ పర్వతాన్ని అధిరోహించే 12 మంది బృందంలో నన్ను ఎంపిక చేసింది. ఇందులో 11 మంది సైనికులు ఉంటారు. ఈ బృందంలో నేనొక్కదాన్నే మహిళను. 23,211 అడుగుల ఎత్తులో ఉండే ఈ పర్వతాన్ని సెప్టెంబర్ మాసంలో అధిరోహించేందుకు సన్నద్ధమవుతున్నాను. భారత ఆర్మీ ఏటా సైనికులను ఇలా పర్వతారోహణకు పంపుతుంది. వారితో కలిసి యాత్ర చేయడం నాకు ఎంతో ప్రత్యేకంగా, గర్వంగా అనిపిస్తోంది.
ఆర్.కిశోర్, భీమవరం
మరో ఆలోచన రాదు...
రోజువారీ పనుల్లో పడి మనం క్షణం తీరిక లేకుండా గడిపేస్తున్నాం. ఈ గజిబిజి జీవనశైలితో మానసిక ప్రశాంతత కోల్పోతున్నాం. కానీ ఒక్కసారి హిమాలయాల చెంతకు వెళితే మన మనసులోకి మరో ఆలోచన రాదు. ఎంతో ప్రశాంతంగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. చేసే పని మీద మనస్సు లగ్నమవుతుంది. ఒక్కసారి ఆ పర్వతశ్రేణుల చెంతకకు వెళితే తిరిగి రావాలని అనిపించదు. అదే హిమాలయాల్లో ఉన్న అద్భుతం. అందుకే అంటున్నా... అది ఒక అలవాటుగా మారిపోతుందని
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు
జులై మూడో వారంలో తల్లికి వందనం!
Read Latest Telangana News And Telugu News