Share News

సిలికా జెల్‌తో చెదపురుగులు దూరం

ABN , Publish Date - Mar 30 , 2026 | 03:21 AM

బూట్లు, హ్యాండ్‌ బ్యాగ్స్‌, ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌, దుస్తులు లాంటివి కొన్నప్పుడు ఆ బాక్సుల్లో తెల్లటి సిలికా జెల్‌ ప్యాకెట్లను చూస్తుంటాం. ఇవి...

సిలికా జెల్‌తో చెదపురుగులు దూరం

బూట్లు, హ్యాండ్‌ బ్యాగ్స్‌, ఎలకా్ట్రనిక్‌ గాడ్జెట్స్‌, దుస్తులు లాంటివి కొన్నప్పుడు ఆ బాక్సుల్లో తెల్లటి సిలికా జెల్‌ ప్యాకెట్లను చూస్తుంటాం. ఇవి గాలిలోని అదనపు తేమను పీల్చుకొని డెసికెంట్‌లా పనిచేస్తూ ఆ ఉత్పత్తులకు రక్షణ కల్పిస్తాయి. వీటిని పడేయకుండా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుందాం...

  • మహిళలు మేకప్‌ కోసం రకరకాల క్రీమ్‌లు, లోషన్లు, పౌడర్లు వినియోగిస్తుంటారు. వీటి పక్కన సిలికా జెల్‌ ప్యాకెట్లను ఉంచితే ఎంతకాలమైనా అవి తాజాగా ఉంటాయి. అలాగే డ్రెస్సింగ్‌ మిర్రర్‌ అరల్లో ఈ ప్యాకెట్లను ఉంచితే ఐ షాడో, మస్కారా, లిప్‌స్టిక్‌, నెయిల్‌ పాలిష్‌, మేకప్‌ బ్రష్‌ లాంటివి గట్టిపడకుండా ఉంటాయి.

  • పుస్తకాల షెల్ఫ్‌లో రెండు లేదా మూడు సిలికా జెల్‌ ప్యాకెట్లు ఉంచితే చెద పురుగులు, ఇతర క్రిమి కీటకాలు చేరవు. పుస్తకాలకు దుమ్ము వాసన పట్టదు.

  • కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డ్‌లు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, పాత ఫొటోలు తదితరాలున్న చోట నాలుగైదు సిలికా జెల్‌ ప్యాకెట్లు ఉంచితే.. తేమ తగలకుండా అవన్నీ భద్రంగా ఉంటాయి.

  • వెండి ఆభరణాలు దాచుకునే బాక్సులో ఓ సిలికా జెల్‌ ప్యాకెట్‌ ఉంచితే అవి నల్లబడకుండా తెల్లగా మెరుస్తుంటాయి.

  • టూల్‌ బాక్స్‌లో ఈ ప్యాకెట్లను ఉంచడం వల్ల మేకులు, బోల్టులు, ఇతర పనిముట్లు తుప్పు పట్టవు.

  • వార్డ్‌ రోబ్‌ అరల మూలల్లో సిలికా జెల్‌ ప్యాకెట్లను ఉంచితే ఏ సీజన్‌లోనైనా దుస్తులు తాజా అనుభూతినిస్తాయి.

  • కొంతమంది వాడే బూట్లనుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు రాత్రిపూట సిలికాజెల్‌ ప్యాకెట్లను బూట్లలో ఉంచితే ఉదయానికల్లా అవి ఫ్రెష్‌గా మారిపోతాయి. అలాగే జిమ్‌ బ్యాగ్‌ల్లో కూడా ఈ ప్యాకెట్లను ఉంచడం మంచిది.

  • సిలికా జెల్‌ ప్యాకెట్లు తేమను పీల్చుకుని బరువుగా మారినప్పుడు వాటిని కొద్దిసేపు ఎండలో లేదంటే ప్రీ హీట్‌ చేసిన ఓవెన్‌లో ఉంచితే అవి మళ్లీ కొత్తవాటిలా పనిచేస్తాయి.

ఇవీ చదవండి:

పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!

గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

Updated Date - Mar 30 , 2026 | 03:21 AM