Share News

ఆమె అభిరుచి.. గ్లోబల్‌ బ్రాండ్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:10 AM

ఉరుకుల పరుగులతో కూడిన కార్పొరేట్‌ జీవితం కంటే మనసుకు నచ్చిన రంగులతో స్నేహం మిన్న అనుకున్నారు పుణెకు చెందిన శిబాని ధవళీకర్‌. ఎడ్‌టెక్‌ రంగంలోని...

ఆమె అభిరుచి.. గ్లోబల్‌ బ్రాండ్‌

ఉరుకుల పరుగులతో కూడిన కార్పొరేట్‌ జీవితం కంటే మనసుకు నచ్చిన రంగులతో స్నేహం మిన్న అనుకున్నారు పుణెకు చెందిన శిబాని ధవళీకర్‌. ఎడ్‌టెక్‌ రంగంలోని ఉన్నత కొలువును వదిలేసి రంగులతో సావాసం చేశారు. నేడు ఆమె చేతుల్లో ప్రాణం పోసుకున్న హ్యాండ్‌మేడ్‌ సిరామిక్‌ టైల్స్‌... ఇప్పుడు అంతర్జాతీయ బ్రాండ్‌గా అవతరించాయి.

పుణెలోని ఒక చిన్న స్టూడియో... అక్కడ పొడవైన చెక్క బల్లలపై వరుసగా పేర్చిన సిరామిక్‌ టైల్స్‌ మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. వాటిపై చేతితో గీసిన పూల తీగలు, వికసించిన పువ్వులు ప్రకృతిని తలపిస్తాయి. కోబాల్ట్‌ బ్లూ, ముదురు ఆకుపచ్చ, నారింజ రంగు వంటి రంగుల కలయికతో రూపొందించిన ప్రతి టైల్‌ వెనుక ఒక కళాకారుడి సహనం, శ్రమ కనిపిస్తాయి.

కార్పొరేట్‌ కొలువు వదిలి...

దాదాపు పదేళ్లపాటు విద్యారంగంలో పనిచేసిన శిబాని.. ఆ తర్వాత ఎడ్‌టెక్‌ రంగానికి మారారు. అక్కడామె పని పూర్తిగా ల్యాప్‌టా్‌పల ముందే గడిచిపోయేది. ‘‘నాకు ఆ రంగం నచ్చలేదని కాదు కానీ, నాలోని సృజనాత్మకతకు, పనికి ఎక్కడా సంబంధం లేనట్టు అనిపించేది’’ అని శిబానీ గుర్తుచేసుకున్నారు. ఆమె జీవితంలో కళ చిన్నప్పటి నుంచి ఒక నిశ్శబ్ద ప్రవాహంలా ఉండేది. ఆఫీస్‌ పని ముగిసిన తర్వాత రాత్రి వేళల్లో తనకు నచ్చిన పూల చిత్రాలను గీయడం ప్రారంభించారు. అదే సమయంలో తను చిత్రాలను ఆన్‌లైన్‌లో పోస్టు చేయడం మొదలుపెట్టారు. ఊహించని విధంగా ఈ హ్యాండ్‌మేడ్‌ నైపుణ్యానికి, నాణ్యతకు ప్రజలు ఆకర్షితులయ్యారు.


టర్నింగ్‌ పాయింట్‌

శిబాని మొదట చేతితో పెయింట్‌ చేసిన చెక్క ఫొటో ఫ్రేమ్‌లు, నేమ్‌ప్లేట్లు తయారుచేశారు. ఉద్యోగం చేస్తూనే, బెంగళూరులో జరిగిన ఒక ఫ్లీ మార్కెట్‌ (ఎగ్జిబిషన్‌)లో స్టాల్‌ పెట్టారు. వంద ఫ్రేమ్‌లు తయారుచేసుకుని వెళ్లిన శిబానికి అక్కడ అద్భుత స్పందన లభించింది. తెచ్చిన ఫ్రేమ్‌లన్నీ క్షణాల్లో అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్‌ ద్వారా ఆర్డర్లు పెరగడంతో, శిబాని ధైర్యంగా ఉద్యోగానికి రాజీనామా చేసి పుణెకు తిరిగి వచ్చారు. స్థానిక మార్కెట్‌ నుంచి సిరామిక్‌ ప్లేట్లను కొనుగోలు చేసి పెయింటింగ్‌ వేసినప్పటికీ, కొద్ది రోజులకే ఆ రంగులు వెలిసిపోయాయి. ఆ వైఫల్యం ఆమెను నిద్రపోనివ్వలేదు. సిరామిక్‌ ఉపరితలంపై రంగులు ఎలా నిలబడుతున్నాయో తెలుసుకోవాలనే అన్వేషణ ఆమెను జైపూర్‌కు తీసుకెళ్లింది. అక్కడ శతాబ్దాల నాటి సంప్రదాయ బ్లూ పాటరీ (నీలిరంగు మట్టిపాత్రల కళ) కళాకారులతో కలిసి ఉంటూ ఆ కళను నేర్చుకున్నారు. అటు తర్వాత సిరామిక్‌ ఉపరితలంపై తన పెయింటింగ్స్‌ శాశ్వతంగా నిలిచే మార్గం కోసం అన్వేషించారు. ముంబైలోని సర్‌ జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌ ప్రొఫెసర్‌ ద్వారా ఒక పారిశ్రామిక సిరామిక్‌ మీడియం గురించి తెలుసుకున్నారు. దీనివల్ల రంగులు చెరిగిపోవు, పైగా సులభంగా కడగవచ్చు. అలా టేబుల్‌వేర్‌, నేమ్‌ప్లేట్లతో ప్రారంభించి, మెల్లగా వంటగది టైల్స్‌ తయారీ వైపు అడుగులు వేశారు.

పుణె నుంచి చిలీ దేశం వరకు...

కరోనా లాక్‌డౌన్‌లో హ్యాండ్‌మేడ్‌ వస్తువులకు ఎమోషనల్‌ వాల్యూ పెరిగి ఆర్డర్లు స్థిరంగా సాగాయి. ఆ సమయంలో సూరత్‌కు చెందిన ఒక ఆర్కిటెక్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇచ్చిన మెసేజ్‌ శిబాని బ్రాండ్‌ వాల్యూను మార్చేసింది. వంటగది కోసం ఏకంగా 1000 టైల్స్‌ పెయింటింగ్‌ చేసే ఒక భారీ ఆర్డర్‌ లభించింది. ప్రస్తుతం శిబాని ప్రకృతి, భారతీయ వారసత్వ సంస్కృతుల ఆధారంగా కస్టమ్‌ సిరామిక్‌ టైల్స్‌ను రూపొందిస్తున్నారు. దీని ధర చదరపు అడుగుకు దాదాపు రూ. 2,500 నుంచి ప్రారంభమవుతుంది. శిబాని ప్రయాణంలో బాలీవుడ్‌ నటి సోనమ్‌ కపూర్‌ తన ఇంటీరియర్‌ కోసం 6 వేల టైల్స్‌ ఆర్డర్‌ ఇవ్వడం ఒక మైలురాయి. ప్రతి టైల్‌ను చేతితో పెయింట్‌ చేస్తూ, అవన్నీ కలిపితే ఒక పెద్ద వాల్‌ పెయింటింగ్‌ లాగా కనిపించేలా రూపొందించడం ఒక పెద్ద సవాలు. రవాణా సమయంలో ఒక్క టైల్‌ పగిలినా రీక్రియేట్‌ చేయడం కష్టం. కాబట్టి ప్యాకేజింగ్‌లో ప్రత్యేక నైపుణ్యం సాధించారు. ఇటీవలే, దక్షిణ అమెరికాలోని చిలీ దేశంలోని ఒక కుటుంబం కోసం వీరు కస్టమ్‌ టైల్స్‌ తయారు చేశారు. ఆ ప్రాంతంలో ఇల్లు కట్టేటప్పుడు అక్కడి స్థానిక జీవవైవిధ్యానికి జరిగిన నష్టానికి గుర్తుగా.. స్థానిక పక్షులు, జంతువుల చిత్రాలను టైల్స్‌పై వేయాలని ఆ కుటుంబం కోరింది. శిబాని బృందం వారాల తరబడి ఆ దేశ వాతావరణంపై పరిశోధన చేసి వాటిని సిరామిక్‌ టైల్స్‌పైౖ అద్భుతంగా ఆవిష్కరించారు. పుణె స్టూడియోలో తయారైన ఆ టైల్స్‌ కిలోమీటర్ల దూరం ప్రయాణించి చిలీకి చేరాయి.


ప్రయోగాల డైరీగా ఇన్‌స్టాగ్రామ్‌

ఈ రోజుల్లో యంత్రాలతో తయారుచేసిన వస్తువుల పోటీని తట్టుకుని ఈ హ్యాండ్‌మేడ్‌ ఆర్ట్‌ నిలబడటానికి కారణం శిబాని అనుసరించిన స్టోరీ టెల్లింగ్‌. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ను ప్రమోషన్‌ కోసం కాకుండా, తన ప్రయోగాల డైరీగా వాడుకున్నారు. ఒక ప్రాజెక్ట్‌ ఫెయిల్‌ అయినప్పుడు, రంగులు సరిగా రానప్పుడు, స్టూడియో వెనుక జరిగే కష్టనష్టాలను ఆమె నిజాయతీగా పంచుకున్నారు. ఆమె ఆర్గానిక్‌ కనెక్షన్‌ వల్లే వేలాది మంది కస్టమర్లు ఆమెకు కనెక్ట్‌ అయ్యారు. ప్రస్తుతం శిబాని స్టూడియోలో 8 మంది ఉద్యోగులు ఉన్నారు. గత ఏడాదిలోనే 100కు పైగా వంటశాలలను వీరి టైల్స్‌ అలంకరించాయి. ఒకప్పుడు చిన్న హాబీ అని కొట్టిపారేసిన కళ.. నేడు ఒక స్థిరమైన వ్యాపారంగా మారింది. చేతిలో ప్రతిభ, నిరంతర శ్రమ, సోషల్‌ మీడియాపై సరైన అవగాహన ఉంటే... ఒక మారుమూల స్టూడియో నుంచి కూడా గ్లోబల్‌ బ్రాండ్‌గా ఎదగవచ్చని శిబాని ధవళీకర్‌ నిరూపించారు.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌..!

Updated Date - Jul 09 , 2026 | 05:10 AM