Share News

కణితులను నిర్లక్ష్యం చేయకూడదు

ABN , Publish Date - Jul 14 , 2026 | 04:46 AM

జులై, సార్కోమా అవగాహన మాసం మనం రొమ్ము, ఊపిరితిత్తులు, నోరు, పెద్ద పేగు క్యాన్సర్ల గురించి విని ఉంటాం. కానీ సార్కోమా గురించి మనకున్న అవగాహన శూన్యమనే చెప్పాలి. పిల్లలు, యువతతో...

కణితులను నిర్లక్ష్యం చేయకూడదు

జులై, సార్కోమా అవగాహన మాసం మనం రొమ్ము, ఊపిరితిత్తులు, నోరు, పెద్ద పేగు క్యాన్సర్ల గురించి విని ఉంటాం. కానీ సార్కోమా గురించి మనకున్న అవగాహన శూన్యమనే చెప్పాలి. పిల్లలు, యువతతో పాటు పెద్దలను సైతం ప్రభావితం చేసే సార్కోమా గురించి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎముక, కండరాలు, కొవ్వు, మృదులాస్థి, రక్తనాళాలు, ఇతర కనెక్టివ్‌ కణిజాలాల్లో సార్కోమా క్యాన్సర్లు తలెత్తుతాయి. ఈ కణిజాలాలు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. కాబట్టి సార్కోమా ఎక్కడైనా తలెత్తవచ్చు. వీటిలో సబ్‌టైప్‌ సార్కోమాలు కూడా ఉంటాయి. ఇవన్నీ విభిన్నంగా ప్రవర్తిస్తాయి. కాబట్టే ఈ తరహా సార్కోమాల నిర్థారణ, చికిత్సలను అనుభవజ్ఞులైన వైద్యుల బృందం ప్రణాళికాబద్ధంగా డిజైన్‌ చేయవలసిన అవసరం ఉంటుంది.

కణితి మీద కన్నేసి...

సాధారణంగా సార్కోమాల్లో, ఒక చిన్న కణతి ఏర్పడి, దాని పరిమాణం క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. ప్రారంభంలో నొప్పి కూడా ఉండకపోవచ్చు. దాంతో అలాంటి కణితులు ప్రమాదకరమైనవి కావని పొరపాటు పడే ప్రమాదం ఉంది. అలాంటి వాటిని వాపులుగా పరిగణించి నెలల తరబడి గృహ చిట్కాలను ఉపయోగించడం లేదంటే బయాప్సీ చేయించకుండా కణితులను చిన్న సర్జరీతో తొలగించుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఒక కణితి క్రమేపీ పెరుగుతూ, ఐదు సెంటీమీటర్లు అంతకంటే పెద్దదిగా ఉండి, నొప్పి పెడుతూ, తొలగించినా తిరిగి పెరుగుతున్నప్పుడు దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎముక సార్కోమాలు భిన్నంగా ఉంటాయి. ఎముకలో మొదలయ్యే నొప్పి రాత్రివేళ పెరుగుతూ ఉంటుంది. కీలు దగ్గర వాపు ఉంటుంది. అకారణంగా ఫ్రాక్చర్లు కూడా తలెత్తవచ్చు. పిల్లలు, టీనేజర్లలో ఈ తరహా ఫ్రాక్చర్లను క్రీడల గాయాలుగా పొరబడుతూ ఉంటారు. అన్ని రకాల నొప్పులు, కణితులు క్యాన్సర్లు కాకపోయినా, లక్షణాలు పదే పదే వేధిస్తున్నా, సమస్య మరింత తీవ్రమవుతున్నా వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.


నిపుణులతో కూడిన ఆస్పత్రి ఎంపిక ముఖ్యం

ఇమేజింగ్‌తో పాటు బయాప్సీ చేయించి కణితి స్వభావాన్ని తెలుసుకోవాలి. బయాప్సీ, తదనంతర సర్జరీలు అవయవ పనితీరును నిర్దేశిస్తాయి. కాబట్టి సార్కోమాగా అనుమానించినప్పుడు రేడియాలజిస్ట్‌, పాథాలజిస్ట్‌, సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌ లేదా ఆర్థోపెడిక్‌ ఆంకాలజిస్ట్‌, రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌, మెడికల్‌ లేదా పిడియాట్రిక్‌ ఆంకాలజిస్ట్‌లను కలిగి ఉన్న ఆస్పత్రిని సందర్శించాలి. కణితి గురించి తెలుసుకోవడం కోసం ముందస్తు ప్రణాళిక లేకుండా కణితిని తొలగించకూడదు. సార్కోమాలు అరుదు. పైగా వాటి పేర్లు అయోమయానికి లోను చేసేలా ఉంటాయి కాబట్టి అనుభవమున్న, నైపుణ్యం కలిగిన పాథాలజిస్ట్‌ చేత పరీక్ష చేయించడం ఎంతో అవసరం. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు వ్యాధిని ధ్రువీకరించడానికీ, చికిత్సను ఎంచుకోడానికీ మాలిక్యులర్‌ టెస్టింగ్‌ను ఆశ్రయించాలి.

అప్రమత్తంగా వ్యవహరిస్తూ...

క్యాన్సర్‌ రకం, దశ, ప్రదేశం, పరిమాణాల మీదే చికిత్స ఆధారపడి ఉంటుంది. నిర్దిష్ట ప్రాంతానికి పరిమితమైన సార్కోమాలకు వైద్యులు సర్జరీనే ఎంచుకుంటారు. అవసరాన్ని బట్టి రేడియేషన్‌, కీమోథెరపీతో పాటు, కొన్ని సబ్‌ టైప్స్‌ సార్కోమాల కోసం టార్గెటెడ్‌ మందులను కూడా ఉపయోగించవచ్చు. ఆధునిక చికిత్సలో అవయవాన్ని తొలగించడానికి బదులుగా, చక్కని ప్రణాళితో క్యాన్సర్‌ అదుపునే లక్ష్యంగా ఎంచుకుని, అవయవాన్ని కాపాడే సర్జరీ చేయడం సాధ్యపడుతుంది. సార్కోమాలకు సాధారణ వ్యాధినిర్థారణ పరీక్షలు లేవు. కాబట్టి శరీరంలో తలెత్తే కొత్త గడ్డల మీద దృష్టి పెట్టాలి. వాటి పెరుగుదలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఎముకల్లో నిరంతర నొప్పిని నిర్లక్ష్యం చేయకూడదు. అరుదైన క్యాన్సర్‌ అయినంత మాత్రాన అసాధ్యమైనది కాదు. ప్రారంభంలోనే గుర్తించి, సరైన ప్రణాళితో చికిత్సను ఎంచుకోగలిగితే, సార్కోమాల నుంచి శాశ్వత విముక్తి పొందగలుగుతాం!

డాక్టర్‌ ప్రదీప్‌ వెంట్రపాటి

సీనియర్‌ కన్సల్టెంట్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌,

మెడికవర్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌

ఈ వార్తలనూ చదవండి:

హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..

ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..

Updated Date - Jul 14 , 2026 | 04:46 AM