కుటుంబ తోడ్పాటు కీలకం
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:45 AM
మోకాలి గాయంతో బాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన 35 ఏళ్ల సైనా నెహ్వాల్, తాజాగా తన క్రీడా ప్రయాణం కోసం కుటుంబం...
లైఫ్
మోకాలి గాయంతో బాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన 35 ఏళ్ల సైనా నెహ్వాల్, తాజాగా తన క్రీడా ప్రయాణం కోసం కుటుంబం ఎదర్కొన్న కష్టాలు, అందించిన తోడ్పాటు గురించి ఒక ఇంటర్వ్యూలో అరమరికలు లేకుండా వెల్లడించింది. ఆసక్తికరమైన ఆ వివరాలు...
‘‘నాన్న నా షటిల్స్, షూస్ కోసం తన స్నేహితుల నుంచి, బ్యాంకు నుంచి డబ్బు అప్పు తీసుకున్నారు. ఈ పరిస్థితి కొన్నేళ్ల పాటు కొనసాగింది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, ‘అప్పుడు ఆయనెందుకలా చేశారు? నాన్న తన స్నేహితుల నుంచి అంత డబ్బు అప్పు ఎందుకు తీసుకున్నారు? ఒకవేళ డబ్బు తిరిగి ఇవ్వలేకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది? ఒకవేళ నేనీ క్రీడలో విజయం సాధించకపోయి ఉంటే ఏం జరిగి ఉండేది?’ అనే అనేక ప్రశ్నలు నాకు తరచూ తలెత్తుతూ ఉంటాయి. బాడ్మింటన్ క్రీడ విషయంలో కుటుంబం నా మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకుంది. మరీ ముఖ్యంగా అమ్మ, కోచ్‌లకు నా మీద ప్రగాఢ నమ్మకం. అలాగని వాళ్లెప్పుడూ ఆ ఒత్తిడి నన్ను ప్రభావితం చేసే అవకాశాన్నివ్వలేదు.
తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించే ఒత్తిడిని నేనెప్పుడూ ఎదుర్కోలేదు. తర్వాతి రోజు ఆటకు సన్నద్ధమయ్యేలా కోలుకోవడమెలా అనే ఆలోచనే తప్ప ఇంకే విషయం గురించీ ఆలోచించేదాన్ని కాదు. ఆట సాధన చేయడం, బలమైన ఆహారం తినడం మీదే నేను ఎక్కువగా దృష్టి పెట్టేదాన్ని.
అమ్మ కాళ్లు నొక్కేది
1999-2000 మధ్య కాలంలో శిక్షకులను, ఫిజియోథెరపి్‌స్టనూ కలిగి ఉండాలనే కాన్సెప్ట్ ఉండేది కాదు. దాంతో ఆటతో అలసిపోయేదాన్ని. కాళ్లు లాగేస్తూ ఉండేవి. మరుసటి రోజుకు తగ్గట్టు నన్ను సిద్ధం చేయడం కోసం, అమ్మ రాత్రంతా నా దగ్గరే కూర్చుని కాళ్లు నొక్కుతూ ఉండేది. మేం శాకాహారులం కాబట్టి బలంగా ఉండడం కోసం నా చేత అన్ని రకాల పదార్థాలూ తినిపిస్తూ ఉండేది. సంప్రదాయ భోజనంలో తప్పకుండా నెయ్యి, పాలు ఉండేలా చూసుకునేది. మరుసటి రోజుకు తగ్గట్టు సిద్ధపడడమే లక్ష్యంగా నా భోజన, విశ్రాంతి విధానాలు సాగుతూ ఉండేవి. వర్థమాన అథ్లెట్లు కేవలం శక్తి కోసమే ఆహారం మీద ఆధారపడరు. తర్వాతి రోజు పోటీకి సన్నద్ధమమ్యేలా కండరాల మరమ్మతు, శక్తి పునరుద్ధరణ, న్యూరోమస్క్యులర్ రెడీనెస్ కోసం బలవర్థక ఆహారం తీసుకోవడం అవసరం.
ఆ క్రెడిట్ కుటుంబానిదే
క్రీడాకారుల విజయంలో కుటుంబ తోడ్పాటు కీలక పాత్ర పోషిస్తుంది. మానసికంగా, శారీరకంగా సన్నద్ధమయ్యేలా ప్రోత్సహించే కుటుంబ తోడ్పాటు వల్ల ఒత్తిడి తొలగిపోతుంది. ఈ రోజు ఏం తిన్నాం? ఎలా కోలుకున్నాం? అన్నవే రేపటి విజయాన్ని నిర్థారిస్తాయి. ముందుచూపుతో ఎంచుకునే భోజన పదార్థాలు, రోజంతా కొనసాగే హైడ్రేషన్, నిద్ర మెటబాలిజం పెరుగుదలకు తోడ్పడి, మానసిక, శారీరక చురుకుదనాలను పెంచుతుంది. ఈ విషయంలో కుటుంబానికి రుణపడి ఉంటాను.’’
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News