Share News

అమ్మల కన్నీళ్లు తుడుస్తున్నారు

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:16 AM

‘‘రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎ్‌ఫ)లో ఉద్యోగం అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత మాత్రమే ఆర్పీఎఫ్‌ బాధ్యత. అయితే తప్పిపోయిన చిన్నారుల రక్షణ కోసం, వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం...

అమ్మల కన్నీళ్లు తుడుస్తున్నారు

సంకల్పం

చిన్నప్పుడు టీవీలో చూసిన ‘ఉడాన్‌’ సీరియల్‌... స్ఫూర్తి రగిలించింది. అదే ఒంటి మీద ఖాకీ వేసుకోవాలన్న కలను నిజం చేసింది. ఆర్పీఎ్‌ఫలో ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె... అంతటితోనే ఆగిపోలేదు. తప్పిపోయిన, అక్రమ రవాణాకు బలవుతున్న వందలమంది చిన్నారులను రక్షించి... వారిని ఇంటికి చేరుస్తున్న 41 ఏళ్ల రైల్వే పోలీస్‌ అధికారి చందన సిన్హా కథ ఇది.

‘‘రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్పీఎ్‌ఫ)లో ఉద్యోగం అంటే కొన్ని పరిమితులు ఉంటాయి. రైల్వే ఆస్తులు, ప్రయాణికుల భద్రత మాత్రమే ఆర్పీఎఫ్‌ బాధ్యత. అయితే తప్పిపోయిన చిన్నారుల రక్షణ కోసం, వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం కోసం నేను చేస్తున్న కృషిని కూడా నా బాధ్యతగానే భావిస్తున్నాను. ఛత్తీ్‌సగఢ్‌లోని బిలా్‌సపూర్‌ మా స్వస్థలం. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి. నా చిన్నప్పుడు దూరదర్శన్‌లో ‘ఉడాన్‌’ సీరియల్‌ వచ్చేది. దేశంలో రెండో మహిళా ఐపీఎస్‌ అధికారి, తొలి మహిళా డీజీపీ కాంచన్‌ చౌదరి భట్టాచార్య జీవితం నుంచి స్ఫూర్తి పొంది తీసిన సీరియల్‌ అది. ఆమె సోదరి కవితా చౌదరి ప్రధాన పాత్ర పోషించి, దర్శకత్వం వహించారు. ఆ పాత్ర నన్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాగైనా సరే పోలీస్‌ ఆఫీసర్‌ కావాలనే ఆకాంక్ష బలంగా నాటుకుపోయింది.


కల నిజమైన రోజు...

డిగ్రీ పూర్తవగానే పోలీసు ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. సంబంధిత పోటీ పరీక్షలన్నిటికీ దరఖాస్తు చేసుకొనేదాన్ని. మొదట్లో ఎందులోనూ ఉత్తీర్ణత సాధించలేదు. కానీ నేను పట్టు విడవలేదు. మరో ఉద్యోగానికి వెళ్లాలని అనుకోలేదు. అలా కొన్నేళ్ల ప్రయత్నం తరువాత ఆర్పీఎ్‌ఫలో ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాను. 2010లో బాధ్యతలు చేపట్టాను. ఆ క్షణం నా మనసు ఆనందంతో ఉప్పొంగింది. కొంతకాలం రైల్వే బోర్డులో పని. మరికొన్ని రోజులు డెస్క్‌ వర్క్‌. నాకు ఏ పని అప్పగించినా అంకితభావంతో చేశాను. అదే నన్ను నేడు ఉన్నతంగా నిలబెట్టిందని భావిస్తున్నాను.

మూడేళ్లలో 1500 మంది...

కొన్నాళ్ల తరువాత నన్ను లఖనవూలోని చార్‌భాగ్‌ రైల్వే స్టేషన్‌కు బదిలీ చేశారు. ప్రస్తుతం ఇక్కడే సేవలు అందిస్తున్నాను. ఉత్తరప్రదేశ్‌లోని రైల్‌ నెట్‌వర్క్‌ పరిధిలో, గడచిన మూడేళ్లలో 1,500కు పైగా బాల బాలికలను రక్షించాను. వీరిలో తప్పిపోయినవారే కాదు, అక్రమ రవాణా ముఠా చేతుల్లో చిక్కుకొని నరకం అనుభవిస్తున్న చిన్నారులు కూడా ఉన్నారు. వాళ్లందరినీ తిరిగి ఇళ్లకు చేర్చినప్పుడు ఆ కుటుంబాలు ఎంతో ఆనందానికి, భావోద్వేగానికి లోనవుతాయి. అది చూసినప్పుడు నాకు ఎంతో సంతోషంగా, సంతృప్తిగా ఉంటుంది.

55-Navya.jpg


పటిష్ట వ్యవస్థ...

తప్పిపోయిన పిల్లల కోసం నేను ఒక పటిష్టమైన విధానం రూపొందించాను. కొంతమంది అధికారులు, రైల్వే సిబ్బంది, స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఒక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాను. వారు ఒంటరిగా, లేదా అనుమానాస్పద వ్యక్తులతో కనిపించిన చిన్నారులను గుర్తించి, సమాచారం చేరవేస్తారు. దాని ఆధారంగా త్వరితగతిన స్పందించి, చర్యలు తీసుకొంటాం. దీనికి సంబంధించి టీమ్‌ సభ్యులకు శిక్షణ ఇచ్చాం. అలా ఒక్క 2024లోనే 494మంది పిల్లలను రక్షించాం. వారిలో 41 మంది అక్రమంగా తరలిస్తున్న చిన్నారులు ఉన్నారు. ఇలా తరలించిన పిల్లలను బాల కార్మికులుగా మార్చే ముఠా అది. గత ఏడాది వెయ్యి మందిని కాపాడగలిగాను.

ప్రశంసలు... పురస్కారాలు...

నేను చేస్తున్న కృషికి గానూ గత నెలలో ‘అతి విశిష్ట్‌ రైల్‌ సేవా’ పురస్కార్‌ను అందుకున్నాను. రైల్వేలో అత్యున్నత పురస్కారం ఇది. నాకు దక్కిన గౌరవంగా దీన్ని భావిస్తాను. దీంతోపాటు గతంలో కూడా పలు సంస్థలు, ప్రభుత్వాల నుంచి అవార్డులు, సత్కారాలు, ప్రశంసలు అందుకున్నాను. అయితే తప్పిపోయిన లేక పిల్లల అక్రమ రవాణా మాఫియా చేతుల్లో చిక్కుకున్నవారిని రక్షించి, తిరిగి వాళ్ల ఇళ్లకు చేర్చినప్పుడు పొందే అనుభూతి అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే నేనూ ఒక బిడ్డకు తల్లిని కదా.’’

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Feb 26 , 2026 | 03:16 AM