Share News

ఆమె తెగువ న్యాయాన్ని నిలబెట్టింది

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:17 AM

ఆరేళ్ళ క్రితం తమిళనాడులో జరిగిన లాకప్‌ డెత్‌ కేసులో తొమ్మిదిమంది పోలీసులకు మరణ శిక్ష విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది....

ఆమె తెగువ న్యాయాన్ని నిలబెట్టింది

ఆరేళ్ళ క్రితం తమిళనాడులో జరిగిన లాకప్‌ డెత్‌ కేసులో తొమ్మిదిమంది పోలీసులకు మరణ శిక్ష విధించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. హెడ్‌ కానిస్టేబుల్‌ రేవతి ఇచ్చిన వాగ్మూలం ఈ కేసులో కీలకంగా మారింది. ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం, ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నా... న్యాయంవైపు నిలబడిన రేవతి నిర్భయత్వం సర్వత్రా ప్రశంసాపాత్రమవుతోంది.

లాకప్‌ డెత్‌ కేసుల్లో శిక్షలు పడడం అరుదు. అలాంటిది తొమ్మిదిమందికి రెండేసి మరణ శిక్షలు, కోటి రూపాయలకు పైగా జరిమానా విధిస్తూ మదురై కోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు పెను సంచలనం. కొవిడ్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో... అనుమతించిన సమయం కన్నా ఎక్కువసేపు మొబైల్‌ దుకాణాన్ని తెరిచి ఉంచారని ఆరోపిస్తూ జయరాజ్‌ అనే 59 ఏళ్ళ వ్యక్తిని, అతని కుమారుడైన 31 ఏళ్ళ బెనిక్స్‌ను తమిళనాడులోని సాత్తాన్‌కుళం పోలీసులు 2020 జూన్‌ 19న అరెస్ట్‌ చేశారు. ఆ తరువాత జ్యుడీషియల్‌ కస్టడీలోకి తీసుకున్నారు. ఆ రోజు రాత్రంతా వారిని చిత్రహింసలు పెట్టారు. ఆ తరువాత కోవిల్‌పట్టి ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించారు. ఈ లాకప్‌ డెత్‌పై తమిళనాడు రాష్ట్రమంతటా ఆందోళనలు వెల్లువెత్తాయి.

భర్త, కుమార్తె ప్రోత్సాహంతో...

ఇంతకీ పోలీస్‌ స్టేషన్‌లో ఏం జరిగింది? ‘‘ఆ రోజు రాత్రి ఎనిమిది నుంచి పన్నెండు గంటల మధ్య రేవతి నాకు మూడుసార్లు ఫోన్‌ చేసింది. తను హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న సాత్తాన్‌కుళం పోలీస్‌ స్టేషన్‌లో జయరాజ్‌ను, బెనిక్స్‌ అనే వ్యక్తుల్ని తన తోటి పోలీసులు నిర్విరామంగా హింసిస్తున్నారని, వారి శరీరాలు రక్తసిక్తమయ్యాయని, నీళ్ళు కావాలని వేడుకుంటున్నారని చెప్పింది. ఇంటికి వచ్చిన తరువాత... జరిగినదంతా వివరించింది. ఆమె తప్ప ఆ రోజు స్టేషన్‌లో ఉన్న మిగిలినవారందరూ ఆ హింసలో భాగమయ్యారు. కాబట్టి ఈ సంఘటనకు ఆమె ఒక్కతే సాక్షి. నోరు విప్పితే మొత్తం పోలీసు శాఖ ఆమెకు వ్యతిరేకమవుతుంది. పోలీసు శాఖలో అధికారక్రమం (హైరార్కీ) చాలా ఎక్కువ. పురుషాధిక్యత కూడా అధికమే. ఇలాంటివి ఏమాత్రం సహించరు. అయినా సరే... సత్యం వైపు నిలబడాలని రేవతికి చెప్పాను. ‘‘మనకు ఇద్దరు పిల్లలున్నారు. మనం ధర్మం వైపు నిలబడితే వారికి మంచే జరుగుతుంది’’ అని అన్నాను. అప్పటికి స్కూల్‌లో చదువుతున్న మా పెద్దమ్మాయి కూడా ‘‘అమ్మా! భయపడొద్దు. నిజం చెప్పు’’ అని అంది. మా అమ్మాయి మాటలతో రేవతి సంకల్పం మరింత బలపడింది. మొత్తం పోలీసు శాఖను ఒంటరిగా ఎదుర్కోవడానికి సిద్ధపడింది’’ అని రేవతి భర్త గుర్తు చేసుకున్నారు.


హింసను చూసి తట్టుకోలేక...

ఈ కేసును మదురై కోర్టు సుమోటోగా నమోదు చేసింది. కోవిల్‌పట్టి ఫస్ట్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ భారతిదాసన్‌ను దర్యాప్తు అధికారిగా నియమించింది. ఆయన రేవతిని ప్రశ్నించినప్పుడు... తండ్రీ కొడుకుల మీద పోలీస్‌ సిబ్బంది సాగించిన దారుణమైన హింస గురించి చెబుతూ ‘‘లాఠీలు, బల్లలు, గచ్చు, గోడలు... అంతా రక్తమే. ఆ తరువాత పోలీస్‌ స్టేషన్‌ను కడిగేశారు. తమ దుస్తులతో గోడల్ని, గచ్చును తుడిచేశారు’’ అని ఎలాంటి దాపరికం లేకుండా ఆమె వివరించారు. ఆ తరువాత సాత్తాన్‌కుళం తహసీల్దార్‌కు రేవతి లేఖ రాస్తూ... తనకు, తన కుటుంబ సభ్యులకు బెదిరింపులు వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ‘‘దర్యాప్తు కోసం వచ్చిన మేజిస్ట్రేట్‌కు వాస్తవాలన్నీ చెప్పాను. ప్రశ్నించడం కోసం తీసుకువచ్చి... తండ్రీ కొడుకులను అలా చేయడాన్ని చూసి తట్టుకోలేకపోయాను. నిజాయితీగా ఉండడం, న్యాయాన్ని కాపాడడం నా వృత్తిధర్మం. నేను నోరు విప్పకపోతే ఇది బయటకు తెలిసేది కాదు. నా కర్తవ్యం నేను నిర్వర్తించాను. నా పేరు బయటకు రానివ్వవద్దని కోర్టును కోరాను. కానీ ఇప్పుడు ప్రతి చోటా అది వినిపిస్తోంది. ఉన్నతాధికారులు వేధింపులకు దిగితే తట్టుకోలేను. నాకు రక్షణ కావాలి’’ అంటూ నాడు ఆమె మీడియా ముందుకు వచ్చారు. అనంతరం కొన్నాళ్ళు మెడికల్‌ లీవ్‌ తీసుకున్నారు.

న్యాయాన్ని బతికించారు...

ఆ తరువాత ఈ కేసు సీబీఐకి బదిలీ అయింది. నిందితులైన పోలీసుల్లో ఒకరు కరోనాతో జైల్లో మరణించగా... మిగిలిన తొమ్మిదిమందికీ మదురై కోర్టు శిక్ష విధించింది. ఈ కేసులో వాంగ్మూలం ఇచ్చిన రేవతితో న్యాయమూర్తులు ప్రత్యేకంగా ఫోన్‌లో మాట్లాడారు. ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. కేసు తీర్పు నేపథ్యంలో ఆమె ఇంటికి ప్రత్యేక రక్షణకు కూడా ఆదేశాలిచ్చారు. ఒకప్పుడు తన గురించి బయటకు తెలియకూడదని భావించిన రేవతి పేరు... ఇప్పుడు దేశమంతటా మారుమోగుతోంది. పరిణామాలకు వెరకుండా... న్యాయాన్ని బతికించిన ఆ పేరు చరిత్రలో నిలుస్తుందనడంతో సందేహం లేదు.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 05:17 AM