ఏ నూనె మేలు?
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:30 AM
రిఫైన్డ్ నూనెల కంటే గానుగ నూనెల్లో ఎక్కువ పోషకాలుంటాయనే వార్తలు వింటున్నాం. ఇది ఎంతవరకూ నిజం? పరిపూర్ణమైన పోషకాల కోసం గానుగ నూనెలే వాడుకోవాలా...
వాస్తవం
రిఫైన్డ్ నూనెల కంటే గానుగ నూనెల్లో ఎక్కువ పోషకాలుంటాయనే వార్తలు వింటున్నాం. ఇది ఎంతవరకూ నిజం? పరిపూర్ణమైన పోషకాల కోసం గానుగ నూనెలే వాడుకోవాలా? ఆహార నిపుణులేమంటున్నారు?
నూనెతో క్యాలరీలతో పాటు విటమిన్లు, ఖనిజ లవణాలను కూడా పొందుతూ ఉంటాం. వేరు సెనగలు, నువ్వులు, పొద్దుతిరుగుడు.. ఇలా ఈ విత్తనాల నుంచి అందే నూనెలతో క్యాలరీలు, ఎ, ఇ, డి విటమిన్లతో పాటు, క్యాల్షియం లాంటి ఖనిజాలు కూడా కొంత మేరకు అందుతాయి. అలాంటప్పుడు ఈ నూనెలను నేరుగా తీసుకోకుండా, శుద్ధి చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. విత్తనాల నుంచి నూనెను సేకరించినప్పుడు, ఆ నూనె త్వరగా రాన్సిడ్ అయిపోతుంది. అంటే, ఆ నూనె ఆక్సిజన్‌కు బహిర్గతమైనప్పుడు త్వరగా పాడైపోతుంది. ఈ పరిస్థితిని అడ్డుకోవడం కోసం నూనెలను శుద్ధి చేసే ప్రక్రియ మొదలైంది. అలాగే విత్తనాల నుంచి నూనెను సేకరించేటప్పుడు తయారయ్యే వ్యర్థాలను తొలగించడానికి కూడా ఈ శుద్ధి ప్రక్రియ తోడ్పడుతుంది. అయితే విత్తనాల నుంచి సేకరించిన నూనెలను అందరికీ అందుబాటు ధరల్లోకి తీసుకురావడం కోసం, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా చేయడం కోసం వాడుకలోకొచ్చిన ప్రక్రియే రిఫైనింగ్.
ఫోర్టిఫికేషన్ అందుకే!
నూనెలను శుద్ధి చేయడం వల్ల పోషక నష్టం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి శుద్ధిచేసిన నూనెలకు ఫోర్టిఫికేషన్ ద్వారా ఎ, డి విటమిన్లు లాంటి అదనపు పోషకాలను జోడిస్తూ ఉంటారు. కాబట్టి సాధారణ నూనెల కంటే రిఫైన్డ్ నూనెల ధరలు కొద్దిగా ఎక్కువ ఉండడమే ఇందుకు కారణం. మన దేశంలో ప్రధానంగా మహిళలు, పిల్లల్లో ఎ, డి విటమిన్ల లోపం ఉంటోంది. కాబట్టి ఈ విటమిన్లు జోడించిన రిఫైన్డ్ నూనెలను వాడుకోవడం అత్యవసరం.
తప్పనిసరి కాదు
రిఫైన్డ్ నూనెలతో పోల్చితే, గానుగ నూనెల్లో కచ్చితంగా అదనపు పోషకాలు ఉంటాయి. అయితే రెండు నూనెల్లో క్యాలరీలు సమానంగానే ఉంటాయి. రిఫైన్డ్ నూనె అయినా గానుగ నూనె అయినా ఒక టీస్పూన్ నూనెలో 45 క్యాలరీలుంటాయి. కాబట్టి తక్కువ క్యాలరీలు ఉంటాయనే అపోహతో తప్పనిసరిగా గానుగ నూనెలను అధిక ధరలకు కొని వాడుకోవలసిన అవసరం లేదు.
స్థోమతను బట్టి ఎవరికి తోచిన నూనెలను వాళ్లు వాడుకోవచ్చు. ఏ నూనెను వాడుకున్నా పరిమాణాన్ని తగ్గించుకోవాలి.
కల్తీ వల్లే ఇన్‌ఫ్లమేషన్
రిఫైన్డ్ నూనెలతో ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుందన్నది అపోహ. ఆ నూనెల్లో కల్తీ జరిగినప్పుడే ఇన్‌ఫ్లమేషన్ సమస్య మొదలవుతుంది. ఈ కల్తీల నుంచి తప్పించుకోవాలంటే, ప్రామాణికమైన, విశ్వసనీయమైన బ్రాండ్ వంటనూనెలను ఎంచుకోవాలి. ఈ నూనెల ధరల్లో కూడా కొంత హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. నూనెల తయారీ ప్రక్రియలో అనుసరించే మెరుగైన విధానాల వల్లే నూనెల ధరలు కూడా మారుతూ ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.
ఏ నూనె ఉత్తమం
పరిపూర్ణ ఆరోగ్యానికి మిశ్రమ నూనెలను వాడుకుంటూ ఉండాలి. నూనెల్లో పాలీ అన్‌శాచురేటెడ్, శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. గది ఉష్ణోగ్రత వద్ద గట్టిపడే నూనె శాచురేటెడ్ ఫ్యాట్. వెన్న, నెయ్యి ఈ కోవకు చెందినవే! మిగతావన్నీ పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాట్స్. మూఫా, పూఫాలు (మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్) ఈ కోవకే చెందుతాయి. మూఫా గుండె రక్తనాళాలకు మేలైనదనీ, పూఫా క్యాన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుందనీ పరిశోధన్లో తేలింది కాబట్టి ఈ మిశ్రమాన్ని కలిగి ఉండే నూనెలను వాడుకోవాలి. అందుకోసం నూనెలను తరచూ మారుస్తూ ఉండాలి. ఒక నెల నువ్వుల నూనె వాడుకోవాలి, ఇంకో నెల పొద్దుతిరుగు నూనె వాడుకోవచ్చు.
వేరుసెనగ నూనెలో 50ు మూఫా ఉంటుంది, మిగతా 50 శాతం శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నప్పటికీ, మూడు నెలలకోసారి వేరుసెనగ నూనె కూడా వాడుకోవచ్చు. శాఫ్లవర్, సన్‌ఫ్లవర్, కార్న్ ఆయిల్... ఇవన్నీ పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు. వీటిలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువ. ఈ నూనెలు గుండెకు మంచివే అయినా వీటిని కూడా మూడు నెలలకోసారి వాడుకోవడం ఉత్తమం. అలాగే ఒక నెలలో రెండు రకాల నూనెలు, రెండో నెలలో ఇంకొక రెండు రకాల నూనెలను కూడా కలిపి వాడుకోవచ్చు.
సంపూర్ణ ఆరోగ్యవంతులైతే...
ఆరోగ్యవంతమైన వ్యక్తికి రోజుకు 4 నుంచి 6 టీస్పూన్ల నూనె అవసరమవుతుంది. అంటే 25 నుంచి 30 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. ఈ 30 మిల్లీలీటర్ల నూనెలో 5 మిల్లీలీటర్ల శాచురేటెడ్ ఫ్యాట్ వాడుకోవచ్చు. అందుకోసం ఒకట్రెండు స్పూన్ల నెయ్యి లేదా కొబ్బరినూనెలను వాడుకోవచ్చు. నూనెల్లోని పోషకాలన్నిటినీ పొందడం కోసం ఈ నిష్పత్తిని అనుసరించవచ్చు.
డాక్టర్ లత శశి
చీఫ్ న్యూట్రిషనిస్ట్,
ఫెర్నాండెజ్ హాస్పిటల్,
హైదరాబాద్
ఇవి కూడా చదవండి..
క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఇరాన్..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..