సైకిల్ ఎక్కిన సామాజిక విప్లవం
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:24 AM
సామాజిక ఆంక్షలు.. రవాణా ఇబ్బందుల మధ్య నలిగిపోయిన గ్రామీణ మహిళలు.. చేతిలోకి సైకిల్ హ్యాండిల్ తీసుకుని సామాజిక కట్టుబాట్లను ఎలా బద్దలుగొట్టారో...
సామాజిక ఆంక్షలు.. రవాణా ఇబ్బందుల మధ్య నలిగిపోయిన గ్రామీణ మహిళలు.. చేతిలోకి సైకిల్ హ్యాండిల్ తీసుకుని సామాజిక కట్టుబాట్లను ఎలా బద్దలుగొట్టారో...
కేవలం అక్షరాస్యతతో కాకుండా తమ స్వేచ్ఛా ప్రయాణంతో ఒక గొప్ప మార్పును ఎలా తీసుకొచ్చారో తెలుసుకోవాలంటే తమిళనాడులోని పుదుక్కోట్టై మహిళల ‘సైకిల్ ఉద్యమం’ గురించి తెలుసుకోవాలి.
రవాణా సాధానాల్లో అత్యంత సాదాసీదాగా కనిపించేది సైకిల్. పర్యావరణానికి మేలు చేసే.. అందరికీ అందుబాటులో ఉండే ఈ వాహనం ప్రాధాన్యతను గుర్తుచేస్తూ ప్రతి సంవత్సరం జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుకొంటారు. అయితే, మన దేశంలో.. ముఖ్యంగా తమిళనాడులోని పుదుక్కోట్టై జిల్లాలో ఈ రోజుకు ఒక ప్రత్యేకమైన, చారిత్రాత్మక ప్రాముఖ్యం ఉంది. ఎందుకంటే ఇక్కడ సైకిల్ అనేది ఒక ప్రయాణ సాధనంగా మిగిలిపోలేదు. అది మహిళల స్వేచ్ఛకు, ఆర్థిక స్వావలంబనకు, సామాజిక సమానత్వానికి ఒక తిరుగులేని సంకేతంగా మారింది. 1990ల కాలంలో ఈ ప్రాంతంలో మొదలైన ఒక సాధారణ సైకిల్ ఉద్యమం కాలక్రమేణా వేలాదిమంది గ్రామీణ మహిళల జీవితాలను మార్చివేసి దేశ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది.
అక్షరాల వెలుగులో పుట్టిన ఆలోచన
ఈ అద్భుతమైన సైకిల్ విప్లవానికి పునాది ఒక అక్షరాస్యత ఉద్యమంతో పడింది. 1990ల ప్రారంభంలో పుదుక్కోట్టై జిల్లాలో వెనుకబడిన వర్గాల ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ‘అరివోలి ఇయక్కం’ (జ్ఞానకాంతి ఉద్యమం) అనే మాస్ లిటరసీ క్యాంపెయిన్‌ను ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కలిసి ప్రారంభించాయి. ఈ ఉద్యమంలో భాగంగా మహిళలకు చదవడం, రాయడం నేర్పించేటప్పుడు అక్కడి సామాజిక కార్యకర్తలకు ఒక కీలకమైన విషయం అర్థమైంది. మహిళలకు కేవలం అక్షరాలు వస్తే సరిపోదు.. వారు సమాజంలో ముందడుగు వేయాలంటే ఒక చోటు నుంచి మరో చోటుకు స్వతంత్రంగా వెళ్లగలిగే స్వేచ్ఛ చాలా అవసరమని గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు రోజువారీ పనుల కోసం, కూలిపనుల కోసం లేదా తాగునీటి కోసం మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది. బస్సులు సమయానికి వచ్చేవి కావు, పైగా ప్రయాణ ఖర్చుల భారం. ఈ సమస్యకు పరిష్కారంగా మహిళలకు సైకిల్ తొక్కడం నేర్పించాలనే ఒక సరికొత్త ఆలోచన మొలకెత్తింది. అయితే, అప్పటి వరకు పురుషులకే పరిమితమైన సైకిల్‌ను మహిళల చేతికి ఇవ్వడం అనేది ఆ రోజుల్లో ఒక విప్లవాత్మకమైన మార్పుకు నాంది అవుతుందని అప్పుడు ఎవరూ ఊహించలేదు.

కట్టుబాట్లపై తిరుగుబాటు
ఆ రోజుల్లో గ్రామీణ తమిళనాడులో మహిళలు సైకిల్ తొక్కడం అనేది ఊహకు కూడా అందని విషయం. మహిళలు అలా వీధుల్లో సైకిల్ వేసుకుని తిరగడం సమాజానికి విరుద్ధమని, అది పద్ధతి కాదని గట్టి నమ్మకాలు ఉండేవి. మొదటిసారి కొందరు మహిళలు సైకిల్ హ్యాండిల్ పట్టుకుని రోడ్డుపైకి వచ్చినప్పుడు స్థానిక సమాజం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. పురుషుల నుంచి అవహేళనలు, వెటకారాలు, అసభ్యకరమైన కామెంట్లు వినాల్సి వచ్చింది. కానీ పుదుక్కోట్టై మహిళలు ఆ అవమానాలకు భయపడి వెనకడుగు వేయలేదు. పైగా వారిలో కసి మరింత పెరిగింది. ఒకరిని చూసి ఒకరు.. అలా వందలమంది.. వేలమంది మహిళలు సైకిల్ నేర్చుకోవడానికి ముందుకు వచ్చారు. అది కేవలం సైకిల్ నేర్చుకోవడం కాదు.. తమపై దశాబ్దాలుగా ఉన్న సామాజిక ఆంక్షలపై వారు చేసిన నిశ్శబ్ద తిరుగుబాటు. క్రమంగా మహిళలు గుంపులుగా వీధుల్లో సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్తుంటే విమర్శించిన పురుషుల నోళ్లు మూతపడ్డాయి.
తరాలు మారినా చెరగని స్ఫూర్తి
పుదుక్కోట్టై మహిళల సైకిల్ ఉద్యమం ఒక ప్రాంతీయ ఘనతగా మిగిలిపోలేదు. ఇది భారతదేశంలోనే అత్యంత విజయవంతమైన గ్రామీణ మహిళా సాధికారత ఉద్యమాల్లో ఒకటిగా అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. సైకిల్ లాం టి ఒక సాధారణ సాంకేతిక సాధనం.. సరైన ఆలోచన తోడైతే ఎంతటి లోతైన మార్పును తీసుకురాగలదో చెప్పడానికి ఈ ఘటనే ఒక సజీవ సాక్ష్యం. దశాబ్దాలు గడిచినా నేటికీ పుదుక్కోట్టై కథనం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తినిస్తూనే ఉంది.
ఆర్థిక ప్రగతికి సరికొత్త ఇంధనం
సైకిల్ మహిళల చేతికి రావడంతో వారి దైనందిన జీవితంలో ఊహించని మార్పులు వచ్చాయి. అంతకుముందు వారు మార్కెట్‌కు వెళ్లాలన్నా, పండించిన కూరగాయలు, సరుకులు నగరాల్లో అమ్మాలన్నా ఇంట్లోని పురుషులపై లేదంటే ప్రజా రవాణాపై ఆధారపడాల్సి వచ్చేది. సైకిల్ రాకతో ఈ బాధలు తప్పడమే కాకుండా సమయం బాగా కలిసొచ్చింది. బస్సుల కోసం గంటల తరబడి వేచి చూసే బాధ తప్పింది. తమ ఉత్పత్తులను సైకిళ్లపై వేసుకుని దూరాన ఉన్న సంతలకు తీసుకెళ్లి అమ్మడం వల్ల దళారుల దోపిడీ తగ్గి వారి ఆదాయం పెరిగింది. సొంతంగా డబ్బు సంపాదించడం, ఎవరిపైనా ఆధారపడకుండా బతకడం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. సైకిళ్ల రాకతో మహిళలు కేవలం నడక భారాన్ని తగ్గించుకోలేదు.. తమ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మార్చే శక్తులుగా ఎదిగారు. పిల్లలను పాఠశాలలకు పంపడం, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి తమ హక్కుల కోసం మాట్లాడటం వంటి పనులన్నీ వారే సొంతంగా చేసుకోగలిగారు.
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే