నారింజ... ఔషధ గుణాలు మిన్న
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:41 AM
ఆరెంజ్ పేరున దొరికే నారింజ, కమలా, బత్తాయి, ఈడెపండు, నారదబ్బ, తియ్యనిమ్మ లాంటి సిట్రస్ పండ్లన్నీ ఇంచుమించూ ఒకే గుణాలు కలిగి ఉంటాయి. తీపి లేదా పులుపు ఆధిక్యతను బట్టి కొద్దిపాటి తేడాలు...
భోజన కుతూహలం
నారంగం మధురం చామ్లం గురూష్ణం చైవ రోచనం!
వాతామకృమిశూలఘ్నం బల్యం శ్రమహరం పరమ్!
ఈ పండ్లను జ్యూస్ తీసుకుని లోపల పిప్పిని వడగట్టి పారేసేవాళ్లకి ఉత్తి నీళ్లే దక్కుతాయి. ఉండవలసిన పోషకాలన్ని ఈ పిప్పిలోనే ఉన్నాయి. అందుకని తొనలతో పాటుగా తినాలి. లేదంటే పిప్పి (పల్ప్)తో జ్యూస్ తాగాలి. చిటికెడంత బ్లాక్ సాల్ట్ గానీ, మిరియాల పొడి గానీ చల్లిన తొనలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. ఇవి తేలికగా అరుగుతాయి. గుండెకు మేలు చేస్తాయి. ఉష్ణ గుణాన్ని పెంచుతాయి. తిన్న తరువాత తీపిగా పరిణమించి శరీరంలో తీపిని పెంచుతాయి.
ఆరెంజ్ పేరున దొరికే నారింజ, కమలా, బత్తాయి, ఈడెపండు, నారదబ్బ, తియ్యనిమ్మ లాంటి సిట్రస్ పండ్లన్నీ ఇంచుమించూ ఒకే గుణాలు కలిగి ఉంటాయి. తీపి లేదా పులుపు ఆధిక్యతను బట్టి కొద్దిపాటి తేడాలు కనిపిస్తాయి. షుగరు రోగులు, వేడి శరీర తత్త్వం ఉన్నవాళ్లు, ఎసిడిటీతో బాధపడేవాళ్లు నారింజ జాతి పండ్లని తక్కువగా తీసుకోవాలి. మిగిలినవారందరికీ ఇవి మేలు చేసేవే.
ఎ- విటమిన్, భాస్వరం, క్యాల్షియం, పొటాషియం దండిగా ఉన్న ఈ పండ్లు శరీర పునర్నిర్మాణానికి సహకరిస్తాయి. ఎర్రగా పండిన నారింజ, బత్తాయి, కమలా లాంటి పండ్లు సి- విటమిన్‌కు బ్యాంకు లాంటివి. కాషాయ వర్ణం కలగటానికి కారణమైన బీటాకెరోటిన్ ఈ పండ్లలో ఎక్కువ. శరీరంలో విష దోషాలను హరించే శక్తివంతమైన రసాయనం ఇది. ముఖ్యంగా కమలా, బత్తాయి పండ్లకు ఈ బీటాకెరోటిన్ అదనపు ప్రయోజనాన్ని ఇస్తుంది.
నారింజ జాతి పండ్లలో హెస్పెరిడిన్ అనే బయో ఫ్లావనాయిడ్ ఉండటంవల్ల అది సి-విటమిన్, ఇనుము శరీరానికి వంటబట్టేలా చేస్తుంది. ఎముక పుష్టి కలగటానికి ఇది తోడ్పడుతుంది. రక్త నాళాలను శోధించటం, మొలల్లాంటి రక్తస్రావ సమస్యల్ని తగ్గించటానికి సహకరిస్తుంది. అయితే హెస్పెరిడిన్ తాజా పండ్లలోనే ఉంటుంది. నిల్వ ఉండేకొద్దీ తగ్గిపోతుంది. సహజ పరిమాణం కన్నా పెద్దవిగా కనిపించే బత్తాయి, కమలాల జోలికి వెళ్లకపోవడం మంచిది.
‘భోజన కుతూహలం’ గ్రంథంలో ‘వాతామకృమి శూలఘ్నం బల్యం శ్రమహరం పరమ్’ అంటూ ప్రత్యేకంగా చెప్పిన గుణాలు ముఖ్యమైనవి. నారింజ జాతి పండ్లు వాతాన్ని తగ్గిస్తాయి. అజీర్తిని పోగొట్టి శరీరంలో విష దోషాలను హరిస్తాయి. కడుపులో నులి పురుగులను హరిస్తాయి. కడుపులో నొప్పిని, మంటను కూడా తగ్గిస్తాయి. తక్షణ శక్తిని అందిస్తాయి. శ్రమ, అలసటల్ని తగ్గించి శరీరానికి ఉత్తేజాన్ని కలిగిస్తాయని ‘భోజన కుతూహలం’ పేర్కొంది. ఈ పండ్లలో ఆహార పీచు (డైటరీ ఫైబర్) దండిగా ఉంటుంది. జీర్ణశక్తిని సరిచేయాలన్నా, చెడు పదార్థాలు రక్తంలో చేరకుండా అడ్డుకోవాలన్నా ఆహార పీచు చాలా అవసరం. తొనలను పైన తెల్లని పొరతో సహా తిన్నప్పుడే ఈ ఫైబర్ చాలినంత అందుతుంది. కరోనా లాంటి మహమ్మారులు, కామెర్ల లాంటి అంటువ్యాధులు, అతిసారం లాంటి ప్రాణాపాయ వ్యాధులకు కమలా, బత్తాయి పండ్లు ఔషధంలా పని చేస్తాయి. లివర్, స్ప్లీన్, కిడ్నీ, గుండె వ్యాధుల్లో... ఔషధం త్వరగా పని చేసేలా సహకరిస్తాయి.
గంగరాజు అరుణాదేవి
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..