Share News

వరప్రసాదం... నేరేడు

ABN , Publish Date - Jun 13 , 2026 | 01:16 AM

‘నెర’ అంటే తెలుగులో సంపూర్ణం, ఉన్నతం అని! నేరేడు అలాంటిది. భారత ఉపఖండాన్ని జంబూద్వీపకల్పం అనేవాళ్లు. ఈ ప్రాంతాల్లో పెరిగే మొక్క కాబట్టి జంబూ వృక్షంగా ఇది ప్రసిద్ధి పొందింది...

వరప్రసాదం... నేరేడు

భోజనకుతూహలం

జంబూ కషాయమధురా శ్రమపిత్త దాహ కంఠార్తి దోషశమనీ కృమిదోషహంత్రీ!

శ్వాసాతిసార కఫకాస వినాశనీ చ విష్ఠంభదా త్వపిచ రోచనపాచనీచ!

‘నెర’ అంటే తెలుగులో సంపూర్ణం, ఉన్నతం అని! నేరేడు అలాంటిది. భారత ఉపఖండాన్ని జంబూద్వీపకల్పం అనేవాళ్లు. ఈ ప్రాంతాల్లో పెరిగే మొక్క కాబట్టి జంబూ వృక్షంగా ఇది ప్రసిద్ధి పొందింది. మేరు పర్వతాల నుంచి ప్రవహించే జంబూ అనే స్వర్ణ నదిని బట్టి ఈ దేశాన్ని జంబూ దేశం అన్నారు. ఆంగ్లంలో దీనిని జామూన్‌, జంబూల్‌, ఇండియన్‌ బ్లాక్‌ బెర్రీ, జావా ప్లమ్‌... ఇలా పిలుస్తారు.

ఏడాదికి ఒకసారయినా నేరేడు పండు తినాలని శాస్త్రం. ఇది మత పరమైన విశ్వాసం కాదు, వైద్యపరమైన సలహా. దీని గుజ్జులోనే కాదు, గింజలో కూడా ఔషధ విలువలున్నాయి.

‘భోజన కుతూహలం’ గ్రంథం ప్రకారం నేరేడు పండు గుజ్జు వగరు, తీపి రుచుల్నికలిగి ఉంటుంది. అలసటను, పైత్యాన్ని, వేడినీ తగ్గిస్తుంది. ఎసిడిటీ, పేగులలో వచ్చే సమస్యలకు ఇది మంచి నివారకం. అరికాళ్ల మంటలు, జ్వరం వచ్చినట్టుగా శరీరం వేడెక్కిపోవటం లాంటి లక్షణాలను తగ్గించి, చలవనిస్తుంది. గొంతు నొప్పి, గొంతుకలో మంటలని తగ్గిస్తుంది.

కడుపులో పెరిగే నులిపురుగుల్ని వెళ్లగొడుతుంది. దగ్గు, ఆయాసాల్ని, అతిసారం, ఉడుకు విరేచనాలను తగ్గిస్తుంది. నీటిని పీల్చుకునే గుణం (గ్రాహి) ఉండటం వలన విరేచనాలు అవుతున్నప్పుడు నేరేడు పండ్లు తింటే, నీటి శాతాన్ని తగ్గించటం ద్వారా శోష రాకుండా కాపాడుతుంది. మలాన్ని గట్టిపరచి విరేచనాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా అమీబియాసిస్‌, జిగురు విరేచనాలతో బాధపడేవాళ్లు నేరేడు పండ్లు దొరికినప్పుడు తప్పనిసరిగా తినటం మంచిది. అన్నం తినబుద్ధి కాకపోవటం, నోటికి రుచి తెలియక పోవటం తగ్గుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చిక్కి పోతున్నవారికి, క్షీణింప చేసే వ్యాధులతో బాధపడేవారికీ నేరేడు పళ్ళు మేలు చేస్తాయి. నులిపురుగుల వలన పిల్లల్లో తిన్నది వంటబట్టకపోవటం దగ్గు, ఆయసం, దురదల్లాంటి సమస్యలొస్తాయి. వాటిని నివారించటానికి నేరేడు పండ్లు దొరికినప్పుడు పిల్లలకు తప్పనిసరిగా పెట్టడం మంచిది.

నేరేడు నిజంగా దివ్య వనౌషధం. నేరేడు పండ్లే కాదు, దాని ఆకులు, బెరడు, వేర్లు కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. జీర్ణశక్తిని పెంపొందించడం, శరీరానికి బలం చేకూర్చడం, సూక్ష్మజీవుల ప్రభావాన్ని తగ్గించడం, దోషాలను సమతుల్యం చేయడం వంటి అనేక ప్రయోజనాల కోసం ఆయుర్వేదంలో వీటిని ఉపయోగిస్తారు.

గంగరాజు అరుణాదేవి


పరిమితంగా తినాలి...

నేరేడు గింజలు ఆయుర్వేదంలో అత్యంత విలువైన ఔషధ ద్రవ్యాలుగా ప్రసిద్ధి. ముఖ్యంగా మధుమేహ నియంత్రణలో వీటి పాత్ర గురించి ఆయుర్వేదం విశేషంగా ప్రస్తావిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో ఇవి సహాయపడతాయి. అందువల్ల మధుమేహ చికిత్సా విధానాలలో నేరేడు గింజలను ప్రయోగిస్తారు. నేరేడు గుజ్జుకి ఉన్న గుణాలన్నీ నేరేడు గింజలకూ ఉన్నాయి. అలసటను తగ్గించి శరీరానికి ఉత్సాహాన్ని అందిస్తాయి. షుగరు రోగులకు శక్తిని అందిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరచటం ద్వారా షుగర్‌ను శక్తిగా మార్చే ప్రక్రియకు దోహదపడతాయి. వీటిని పరిమితంగా తినాలి. అతిగా తింటే వాతం చేస్తాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు

రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ

Read Latest TG News And Telugu News

Updated Date - Jun 13 , 2026 | 01:16 AM