నోటి పుండ్లు మాయం
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:44 AM
ఒంటి మీద పుండునే భరించలేం! అలాంటిది నోట్లో తలెత్తే పుండ్లను భరించగలమా? రోజుల తరబడి వేధించే ఈ సమస్యకు కొన్ని సహజసిద్ధ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. ఎలాగంటే...
ఓరల్ కేర్
ఒంటి మీద పుండునే భరించలేం! అలాంటిది నోట్లో తలెత్తే పుండ్లను భరించగలమా? రోజుల తరబడి వేధించే ఈ సమస్యకు కొన్ని సహజసిద్ధ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. ఎలాగంటే...
పెదవులు, బుగ్గల లోపల తెల్లని, గుండ్రని ఆకారంలో మౌత్ సోర్స్ తలెత్తుతాయి. వాపు, నొప్పితో వేధించే ఈ పుండ్ల నుంచి రక్తస్రావం కూడా అవుతుంది. కారం, పులుపు, ఉప్పు తగిలినప్పుడు తట్టుకోలేనంత నొప్పి వేధిస్తూ ఉంటుంది. ఒకసారి తలెత్తితే, ఓ పట్టాన తగ్గకుండా కొన్ని రోజులపాటు ఇబ్బంది పెట్టడం వీటి తత్వం. నోటి పుండ్లకు మందులు బోలెడన్ని ఉన్నాయి. కానీ వాటిని వాడడం వల్ల పేగుల్లోని పైపొర దెబ్బతిని, కడుపులో పుండ్లు తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, నోటి పుండ్లను సహజసిద్ధమైన పద్ధతుల్లో తగ్గించుకోవాలి. ఇందుకోసం సహజసిద్ధ ఔషధాలను ఎంచుకోవచ్చు. అంతకంటే ముందు నోటి పుండ్లు రావడానికి కారణాలు తెలుసుకుని, వాటికి దూరంగా ఉండాలి. ఆ కారణాలు ఏవంటే.....
ధూమపానం: నోటి పుండ్లకు ప్రధాన కారణం ధూమపానం. కాబట్టే తరచుగా నోటి పుండ్లు తలెత్తుతూ ఉంటే ధూమపానం మానేయాలి
కారం, పులుపు: కొందరి శరీర తత్వం కారం, పులుపులను తట్టుకోలేదు. ఎక్కువ కారంగా ఉన్న పదార్థాలు లేదా మరీ పుల్లగా ఉన్న పదార్థాలు తిన్న ప్రతిసారీ నోట్లో పుండ్లు తలెత్తుతూ ఉంటే, వీటిని కాస్త తగ్గించుకోవాలి
దంతాల చికిత్స: ఎత్తు పళ్లు సరిచేయడానికి బిగించే బ్రేసెస్ సరిగా ఇమడకపోయినా, నోట్లో పుండ్లు తలెత్తుతాయి. ఈ బ్రేసెస్ బుగ్గల లోపల చర్మానికి ఒరుసుకుంటూ పుండ్లు మొదలవుతాయి. కాబట్టి అలాంటి ఇబ్బంది ఉంటే, వెంటనే దంత వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి
హార్మోన్లు: కౌమారం, మెనోపాజ్, గర్భం... ఈ దశల్లో శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా కూడా నోట్లో పుండ్లు మొదలవుతాయి. కాబట్టి వైద్యుల చేత పరీక్షలు చేయించుకోవాలి
నొప్పి మందులు: నొప్పి తగ్గించే మందులు తరచూ వాడినా నోట్లో పుండ్లు ఏర్పడతాయి.
చిట్కాలు బోలెడు!
తేనె: తేనెలో ఔషధగుణాలు నోటి పుండ్లనూ తగ్గిస్తాయి. కాబట్టి తేనెను నేరుగా పుండ్ల మీద పూయాలి. నోట్లో తేనెను ఉమ్మితో కలిపి మింగేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి రెండు గంటలకొకసారి తేనెను పూస్తూ ఉండాలి. తేనెలోని ఔషధ గుణాలు పుండును త్వరితంగా మాన్పుతాయి. అలాగే తేనె, పుండు మీద ఒక పొరలాగా ఏర్పడి, ఆహారం తినేటప్పుడు పుండు మరింత బాధ పెట్టకుండా అడ్డు పడుతుంది. ఇలా తేనెను వాడడం వల్ల రెండు రోజుల్లోనే పుండ్లు మానతాయి
సోడా ఉప్పు: ఒక గిన్నెలో సమపాళ్లలో సోడా ఉప్పు, నీళ్లు కలుపుకోవాలి. ఇలా చిక్కటి మిశ్రమం తయారుచేసుకుని, పుండు మీద, దాని చుట్టూ పూసుకోవాలి. తర్వాత ఆరేవరకూ ఆగాలి. ఆరిన తర్వాత నీటితో నోరు పుక్కిలించుకోవాలి. ఇలా రోజు మ్తొతంలో మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. సోడా ఉప్పు క్షార తత్వం కలిగి ఉంటుంది కాబట్టి నోట్లోని ఆమ్లం తీవ్రత తగ్గుతుంది. దాంతో పుండు మానుతుంది
కొబ్బరినూనె: రాత్రి నిద్రకు ముందు కొబ్బరినూనెను పుండు మీద పూసుకోవాలి. కొబ్బరినూనెలోని యాంటీమైక్రోబియల్ గుణాలు పుండును మాన్పుతాయి
ఉప్పు నీళ్లు: గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చెంచా ఉప్పు కలపాలి. ఈ నీటితో నిమిషం పాటు నోరు పుక్కిలించాలి. తర్వాత ఉప్పదనం తగ్గడం కోసం మామూలు నీటితో పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు చొప్పున మూడు రోజుల పాటు చేయాలి. ఉప్పు యాంటీసెప్టిక్‌లా పని చేస్తుంది. కాబట్టి పుండు త్వరగా మానుతుంది
లవంగ నూనె: దూది ఉండను లవంగ నూనెలో ముంచి, పుండు మీద ఉంచాలి. నూనెను పుండు పీల్చుకునే వరకూ ఆగి, దూదిని తీసేయాలి. లవంగ నూనెలో ‘యూజెనాల్’ పుండును త్వరగా మాన్పుతుంది. నొప్పినీ తగ్గిస్తుంది. అయితే లవంగ నూనె తగిలిన వెంటనే మంట పుడుతుంది. అయితే ఆ కొద్దిసేపు ఓర్చుకుంటే నోటి పుండ్లు త్వరగా మానతాయి
కొబ్బరిపాలు: రోజుకు మూడు సార్లు చొప్పున మూడు రోజుల పాటు కొబ్బరిపాలతో నోరు పుక్కిలించాలి. లేదంటే నోటి నిండా కొబ్బరి పాలను తీసుకుని, ఆ బుగ్గ నుంచి ఈ బుగ్గకు మారుస్తూ నిమిషంపాటు ఇలా చేసి, ఉమ్మేయాలి. కొబ్బరిపాలలోని యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పుండ్లను మాన్పుతాయి
కలబంద: కలబంద ఆకును మధ్యకు కోసి, గుజ్జు సేకరించాలి. దీన్ని పుండు మీద నేరుగా పూసుకోవాలి. కలబంద గుజ్జు చల్లగా ఉండి, ఉపశమనం అందిస్తుంది. అలాగే నొప్పిని తగ్గించి, త్వరగా మాన్పుతుంది
టీ బ్యాగ్: బ్లాక్ టీ బ్యాగ్‌ను నీళ్లతో తడిపి పుండు మీద ఉంచి ఒత్తిపెట్టాలి. అలా అరగంట పాటు ఉంచి, నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా రోజుకు రెండు సార్లు చేసినా ఫలితం ఉంటుంది
ఈ వార్తలనూ చదవండి:
హెలికాప్టర్ మెషిన్‌గన్‌ను నేలపై కాల్చే ప్రయత్నం.. చివరికి ఏమైందంటే..
ఇరాన్ హిట్‌లిస్ట్‌లో 13 మంది ప్రపంచ నేతలు.. ట్రంప్, నెతన్యాహు, మెలోనీ..