Share News

శ్వాసకు అడ్డుపడే ముక్కు సమస్యలు

ABN , Publish Date - Aug 04 , 2026 | 03:37 AM

శ్వాసకు ఉపయోగపడే ముక్కు, అందుకు అవరోధంగా మారితే? చిత్రంగా అనిపించే ఈ సమస్య మనలో చాలా మందికి ఉంటుంది. ముక్కు దూలం వంకర, అడినాయిడ్లు, కండలు..

శ్వాసకు అడ్డుపడే ముక్కు సమస్యలు

బ్రీదింగ్‌ ఇష్యూస్‌

శ్వాసకు ఉపయోగపడే ముక్కు, అందుకు అవరోధంగా మారితే? చిత్రంగా అనిపించే ఈ సమస్య మనలో చాలా మందికి ఉంటుంది. ముక్కు దూలం వంకర, అడినాయిడ్లు, కండలు... ఇవన్నీ శ్వాసకు అడ్డుపడే సమస్యలే! వీటిని సకాలంలో సరిదిద్దుకోకపోతే, దీర్ఘకాలంలో తీవ్ర సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

ప్రధానంగా పిల్లల్లో గొంతులో టాన్సిల్స్‌ మాదిరిగానే ముక్కులో అడినాయిడ్స్‌ ఉంటాయి. వీటితో ముక్కు దిబ్బెడ పడుతూ, శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది. తరచూ ఇన్‌ఫెక్షన్లు కూడా వేధిస్తూ ఉంటాయి. పెద్దల్లో సెప్టమ్‌ అనే ముక్కు ఎముక వంకర ఉన్నప్పుడు కూడా ముక్కు మూసుకుపోతూ, శ్వాస ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే కొందర్లో ముక్కు లోపల ఇరువైపులా ఉండే టర్బినేట్స్‌ అనే రెండు కండలు పెరుగుతాయి. పదే పదే అలర్జీలతో ఇబ్బంది పడే వాళ్లు, సైనసైటిస్‌ ఉన్న వాళ్లలో ఇది సర్వసాధారణం. దాంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే స్మోకర్లు, గ్యాస్ట్రిక్‌ సమస్యలున్న వాళ్లకు కూడా పిల్లల్లో మాదిరిగా ముక్క లోపలి అడినాయిడ్స్‌ పెరిగి శ్వాస సమస్యలు తలెత్తుతాయి. అలాగే తీవ్రమైన సైనస్‌ ఇనెఫెక్షన్ల వల్ల కూడా ముక్కులో పాలిప్స్‌ పెరగడం వల్ల కూడా ముక్కులో అడ్డంకులు ఏర్పడతాయి. పాలి్‌ప్సతో పాటు ముక్కు నుంచి రక్తం కారుతుంటే, క్యాన్సర్‌ కణుతులు ఉన్నట్టు అనుమానించాలి. సాధారణంగా పెద్దల్లోనే ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది.

ఈ లక్షణాల మీద కన్నేసి...

  • తరచూ ముక్కు దిబ్బెడ వేధిస్తూ ఉండడం

  • జలుబు చేసినప్పుడు ముక్కు పూర్తిగా మూసుకుపోవడం

  • రాత్రుళ్లు ఒక వైపు తిరిగి పడుకున్నప్పుడు సమస్య పెరుగుతూ ఉండడం

  • నిద్రలో ఉన్నప్పుడు ముక్కు మూసుకుపోతూ ఉండడం

  • కొందర్లో ముక్కు మూసుకుపోవడంతో పాటు గురక కూడా ఉండొచ్చు


ముక్కు సమస్యతో... అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా

ముక్కులో అవరోధాల వల్ల శ్వాస క్షీణించి, ఆక్సిజన్‌ మోతాదులు పడిపోయి, నిద్ర మెలకువ అవుతూ ఉంటుంది. చాలా మంది ఈ సమస్యకు అసలు కారణం ముక్కులో ఉందనే విషయాన్ని తెలుసుకోలేరు. కానీ నిజానికి ఎక్కువ సందర్భాల్లో స్లీప్‌ ఆప్నియాకు ముక్కులో తలెత్తే అవరోధాలే కారణమవుతూ ఉంటాయి. గురకతో నిద్ర మెలకువ అయిపోతుందని వైద్యులను కలిసే ఎక్కువ మందిలో నేసల్‌ అబ్‌స్ట్రక్షన్‌ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఆ అవరోధాలను సరిదిద్దిన వెంటనే శ్వాస సమస్య తొలగిపోయి, కంటి నిండా నిద్రపోగలుగుతారు.

నిర్లక్ష్యం చేస్తే...

ముక్కులో అవరోధం సమస్య క్రమేపీ పెరుగుతుంది. కాబట్టి చాలా మంది ఆ సమస్యకు అలవాటుపడిపోతూ ఉంటారు. ముక్కుతో గాలి పీల్చడం సమస్యగా మారడంతో నోటితో గాలి పీల్చుకోవడం మొదలుపెడతారు. దాంతో నోరు ఎండిపోతూ ఉండడం, గురక, అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా సమస్యలు వేధిస్తాయి. అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియాతో ఆక్సిజన్‌ మోతాదులు క్షీణించి, గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇవన్నీ దీర్ఘకాలంలో అధిక రక్తపోటు, గుండె సమస్యలకు దారి తీస్తాయి.

సొంత వైద్యం చేటు

చాలా మంది ముక్కు దిబ్బెడను వదిలించుకోవడం కోసం మెడికల్‌ షాపుల్లో నేసల్‌ డ్రాప్స్‌ కొని వాడుకుంటూ ఉంటారు. వీటితో తాత్కాలిక ఉపశమనం కలుగుతూ ఉండడంతో వాటికే అలవాటు పడిపోతారు. అయితే ఈ డ్రాప్స్‌ వాడుకోవడం వల్ల దీర్ఘకాలంలో ముక్కులోని కణజాలాలు శాశ్వత వాపుకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. కొందరు ముక్కు దిబ్బెడకు ఆవిరి పడుతూ ఉంటారు. దీంతో కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు.


చికిత్సలతో సరిదిద్దుకుని...

నేసల్‌ వాష్‌: సైనస్‌ ఇన్‌ఫెక్షన్లు, అలర్జీలతో ముక్కు దిబ్బెడ పడుతున్నప్పుడు ముక్కు శుభ్రత కోసం వైద్యులు ‘నేసల్‌ వాష్‌’ సూచిస్తారు. జలనేతిగా ఆయుర్వేదంలో ఆదరణ పొందిని ఈ చికిత్సా విధానాన్నే అల్లోపతి కూడా అనుసరిస్తోంది. నేసల్‌ వాష్‌ కోసం ఉద్దేశించిన కిట్‌ను ఉపయోగించి, ఉప్పు కలిపిన నీళ్లతో నేసల్‌ వాష్‌ను ప్రాక్టీస్‌ చేయాలి. దీంతో సమస్య తొలగిపోతుంది.

నేసల్‌ స్ర్పే: అలర్జీలు ఎక్కువగా ఉన్న వారికి వైద్యులు నేసల్‌ స్ర్పేలను సూచిస్తారు. ఈ స్టిరాయిడ్‌ స్ర్పేలతో అలర్జీలు తగ్గి, ముక్కు దిబ్బెడ కూడా తొలగిపోతుంది.

సర్జరీ: ఇతరత్రా ప్రత్యామ్నాయాలతో సమస్య పరిష్కారం కాని సందర్భాల్లో చిన్నపాటి సర్జరీలు అవసరమవుతాయి. ముక్కు వంకరతో శ్వాస ఇబ్బందిగా మారితే, ఎండోస్కోపీ ద్వారా ముక్కు లోపలి నుంచి వంకరను సరిదిద్దుతారు.

లేజర్‌/కరెంట్‌: ముక్కులో పెరిగిన కండలను లేజర్‌తో, కరెంటుతో కుంచించుకుపోయేలా చేస్తారు.

6-Navya.jpg

నేసల్‌ డ్రాప్స్‌తో నోస్‌ బ్లాక్‌

వారం రోజులకు పైగా తీవ్రమైన జలుబు వేధిస్తున్నప్పుడు మాత్రమే వైద్యులు నేసల్‌ డ్రాప్స్‌ సూచిస్తారు. కానీ కొందరు ముక్కు దిబ్బెడ తలెత్తిన ప్రతిసారీ ఈ డ్రాప్స్‌ స్వయంగా కొనుక్కుని వాడేస్తూ ఉంటారు. దాంతో ముక్కు లోపలి కణజాలాలు మరింత వాచిపోయి, అవరోధం మరింత పెరిగిపోతుంది. మందుల వల్ల ముక్కు మూసుకుపోయే ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘రైనైటిస్‌ మెడికమెంటోసా’ అని అంటారు.

వైద్యులను ఎప్పుడు కలవాలి?

  • ముక్కు దిబ్బెడ, రక్తస్రావం ఉన్నప్పుడు..

  • పదే పదే ముక్కు దిబ్బెడ వేధిన్నప్పుడు...

  • శ్వాస ఇబ్బందితో స్లీప్‌ ఆప్నియా తలెత్తినప్పుడు...

  • ముక్కుకు బదులు నోటితో గాలి పీల్చే పరిస్థితి తలెత్తుతున్నప్పుడు...

  • ముక్కు ఒకవైపే మూసుకుపోతున్నప్పుడు...

  • తరచూ, తీవ్రమైన ముక్కు దిబ్బెడ పిల్లల్లో అడినాయిడ్లు


ముక్కులో అడినాయిడ్స్‌ ఒక సహజసిద్ధ నిర్మాణం. నోట్లో టాన్సిల్‌ మాదిరిగా, ముక్కులో అడినాయిడ్స్‌, వ్యాధికారక సూక్ష్మక్రిముల నుంచి రక్షణ కల్పిస్తూ ఉంటాయి. పసి వయసులో పిల్లల్లో వ్యాధినిరోధకశక్తి తక్కువ కాబట్టి పీల్చుకునే గాలితో పాటు ముక్కులోకి చొరబడే అలర్జీ కారకాలు, బ్యాక్టీరియాలన్నీ అడినాయిడ్స్‌లో ఇరుక్కుపోయి, లింఫ్‌ స్రావాల ద్వారా బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. అయితే పిల్లలకు రెండేళ్ల వయసు నుంచి అడినాయుడ్స్‌ క్రమేపీ కుంచించుకుపోవడం మొదలుపెట్టాలి. కానీ పదే పదే అలర్జీ, జులుబులకు లోనయ్యే పిల్లల్లో, పోషకాహార లోపం ఉన్న పిల్లల్లో, వాటి పరిమాణం తగ్గకుండా అలాగే ఉండిపోతుంది. దాంతో ముక్కు దిబ్బెడ, శ్వాస సమస్యలు తరచూ వేధిస్తూ ఉంటాయి. దాంతో పిల్లలు ముక్కుకు బదులుగా, నోటితో గాలి పీల్చుకుంటూ ఉండడంతో పైదవడ పెరుగుదల సజావుగా సాగదు. ఫలితంగా శాశ్వత దంతాలు పెరిగినప్పుడు రెండు దవడల్లోని దంతాల మధ్య సమన్వయం కుదరకపోవచ్చు. అలాగే కొందరు పిల్లల్లో దంతాలన్నీ ఇరుకుగా పెరుగుతాయి. ముక్కు సన్నబడిపోయి, ముఖాకృతి పొడవుగా సాగుతుంది. కాబట్టి పిల్లల్లో శ్వాస సమస్యలు కనిపిస్తే, వైద్యులను సంప్రతించి అడినాయడ్స్‌ సర్జరీ తప్పక చేయించాలి.

డాక్టర్‌ మనుశ్రుత్‌

కన్సల్టెంట్‌ ఈన్‌టి స్పెషలిస్ట్‌ అండ్‌ హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జన్‌,

అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

విద్యార్థులపై కేసులు ఉండవు.. హామీపై కట్టుబడి ఉన్నాం: సుప్రీంకోర్టుకు కేంద్రం వివరణ

బరువు తగ్గడం కోసం ప్రమాదకర ప్రయత్నం.. టీలో ఆ ద్రవాన్ని కలిపి తాగితే..

Updated Date - Aug 04 , 2026 | 03:37 AM