Share News

మనం ఎక్కడా ఆగిపోకూడదు

ABN , Publish Date - Apr 08 , 2026 | 05:20 AM

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి నిరంతర అధ్యయనం తోడైతే విజయం తథ్యమనడానికి మెహరున్నిసా బేగం జీవితమే ఒక....

మనం ఎక్కడా ఆగిపోకూడదు

సంకల్పం

చెక్కుచెదరని ఆత్మవిశ్వాసానికి నిరంతర అధ్యయనం తోడైతే విజయం తథ్యమనడానికి మెహరున్నిసా బేగం జీవితమే ఒక ఉదాహరణ. ప్రతిష్టాత్మక భారత నైపుణ్యాల పోటీ-2026... లాజిస్టిక్స్‌ అండ్‌ ఫ్రైట్‌ ఫార్వాడింగ్‌ విభాగంలో బంగారు పతకాన్ని సాధించిందీ హైదరాబాద్‌ అమ్మాయి. అంతర్జాతీయ యవనికపై తన అదృష్టాన్ని పరీక్షించుకోడానికే కాదు... ప్రపంచ లాజిస్టిక్స్‌ పోటీలో భారత్‌ విజయపతాకాన్ని ఎగురవేయడానికీ సిద్ధమవుతున్న మెహరున్నిసాను ‘నవ్య’ పలుకరించింది.

‘‘ఇండియా స్కిల్‌ కాంపిటేషన్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్నందుకు ఆనందిస్తున్నాను. ఒకవేళ ఓడిపోయినా ఇంతే సంతోషంగా ఉండేదాన్ని అని మాత్రం కచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే, ఆ పోటీని ఎదుర్కొనే క్రమంలో ఎదురైన అనుభవాల నుంచి నేర్చుకున్నది తక్కువేమీ కాదు. కాంపిటేషన్‌ సాదాసీదాగా జరగలేదు. జిల్లా, రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలు దాటి జాతీయ స్థాయిలోకి వెళ్లేప్పటికి పోటీ మరింత సంక్లిష్టమైంది. బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి వెళ్లిన నేను... అవతల సింబయోసిస్‌, ఇండియన్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ, రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఏవియేషన్‌ వర్సిటీ లాంటి అతి పెద్ద విద్యా సంస్థల్లో చదివిన వారితో తలపడడం అంటే మాటలా! నోయిడాలో మూడు రోజులపాటు కొనసాగిన పోటీల్లో మొదట ప్రవేశ పరీక్షలో అర్హత పొందాలి. ఆ తర్వాత ‘లాజిస్టిక్స్‌ అండ్‌ ఫ్రైట్‌ ఫార్వాడింగ్‌’ విభాగంపై పీపీటీ ప్రజెంటేషన్‌, ఇండస్ట్రియల్‌ రోల్‌ప్లే, కేస్‌ సినారియోస్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌, లాజిస్టిక్స్‌పై లోతైన పరిశీలన, వైవా లాంటి రకరకాల పరీక్షల్లో నెగ్గుకురావాలి. ఆ స్థాయిలో పోటీని ఎదుర్కోవాలంటే సబ్జెక్టు మీద పట్టుంటేనే సరిపోదు. కమ్యూనికేషన్స్‌ స్కిల్స్‌తో పాటు ఆత్మవిశ్వాసం కావాలి. ఆ నైపుణ్యాలు నాలో మెండుగా ఉండడానికి ప్రధాన కారణం మా కళాశాల, మా ఇంటి వాతావరణమే.


వారి సలహాలు వినలేదు...

మాది హైదరాబాద్‌లోని బాలానగర్‌ ప్రాంతం. మా నాన్న మహ్మద్‌ జావెద్‌ ఓ బేకరీలో సూపర్‌వైజర్‌. అమ్మ ఖౌసర్‌ఖాన్‌ గృహిణి. నాకు మరొక ఇద్దరు చెల్లెళ్లున్నారు. ముస్లిం కుటుంబాల్లో సాధారణంగా అమ్మాయిలను ఇంటర్‌ వరకు చదివించిన తర్వాత పెళ్లి చేస్తుంటారు. మా నాన్న అలా కాదు. మమ్మల్ని బాగా చదివించాలనేది ఆయన కోరిక. అలా అని ‘ఇంజినీరింగ్‌ చదువు... మెడిసిన్‌ చేయి’లాంటి ఒత్తిళ్లు కూడా పెట్టరు. మాకిష్టమైన రంగాన్ని ఎంపిక చేసుకొని అందులో ముందుకెళ్లమని సూచిస్తుంటారు. పదో తరగతిలో పది జీపీఏతో స్కూలు ఫస్ట్‌ వచ్చాను. మారేడుపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ సీఈసీ గ్రూప్‌ 91 శాతం మార్కులతో పూర్తి చేశాను. ఇంత బాగా చదివే అమ్మాయి సీఈసీ తీసుకోవడమేంటి? అని చాలామంది అన్నారు. ఎంపీసీ లేదా బైపీసీ తీసుకోమని సలహాలిచ్చారు. కానీ నా చదువు మీద నాకంటూ ఒక స్పష్టత ఉంది కనుక అవేవీ నేను వినలేదు. బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (బీబీఏ) ఎంపిక చేసుకుందామని అనుకుంటుండగా అదే ఏడాది (2022) ‘ఈ - కామర్స్‌ అండ్‌ లాజిస్టిక్స్‌’ కోర్సు కొత్తగా ప్రవేశపెట్టారని తెలిసింది. ఆసక్తిగా అనిపించింది. ఆలోచించకుండా అందులో చేరాను.

7-Navya.jpg

అంతర్జాతీయ పోటీకి...

ఆరంభ కష్టాలు ప్రతి పనిలోనూ సహజమే! అలా నాకూ కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. ఫిక్స్‌డ్‌ సబ్జెక్టులుండేవి కావు. రెండు సంవత్సరాలు తరగతి గదిలో గడిచిన తర్వాత మూడో ఏడాది అప్రెంటీస్‌కు వెళ్లాం. ప్రతి ఆరు నెలలకు ఆన్‌లైన్‌ పరీక్షలు, అసె్‌సమెంట్‌ టెస్టులు... ఒకవైపు పరిశ్రమలో ప్రాక్టికల్‌గా నేర్చుకుంటూనే మరోవైపు అకడమిక్‌గానూ చురుగ్గా ఉండాలి. నేను కార్గొమెన్‌ లాజిస్టిక్స్‌లో ఇంటెర్న్‌షి్‌పకు చేరాను. గతేడాది ఆగస్టులో డిగ్రీ పూర్తయిన వెంటనే, అదే కంపెనీలో ఉద్యోగం వచ్చింది. నేను ప్రధానంగా ఎయిర్‌ షిప్‌మెంట్‌ వ్యవహారాల్లో కస్టమ్స్‌ క్వెర్రీస్‌, డాక్యుమెంటేషన్‌ వంటి వ్యవహారాలన్నీ చూస్తుంటాను. కనుక ప్రతిరోజూ నేర్చుకోవడమే! పీసీబీస్‌, కేబుళ్లు, ఫ్రీజర్లు, సర్క్యూట్స్‌ లాంటి ఎలకా్ట్రనిక్స్‌ పరికరాల డెవల్‌పమెంట్‌ కోసం ఆ యంత్రాల భాగాలు చైనా, జర్మనీ, అమెరికా వంటి దేశాల నుంచి ఎగుమతి, దిగుమతులు అవుతుంటాయి. ఆ లాజిస్టిక్స్‌లో ఒక యూనిట్‌ నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. కార్పొరేట్‌ కంపెనీలో అందులోనూ లాజిస్టిక్స్‌లో పని ఒత్తిడితో పాటు సవాళ్లు సర్వసాధారణమే. పశ్చిమాసియా యుద్ధం కారణంగా విమాన సేవలు రద్దుకావడం, ఫ్రెయిట్‌ ఛార్జీలు పెరగడం, సమయానికి వస్తువులు చేరకపోవడం వంటి సమస్యలు మామూలే.

రోజూ ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకు బయలుదేరితే తిరిగి ఇంటికి చేరేప్పటికి సాయంత్రం ఏడు అవుతుంది. అయినా బద్ధకించకుండా ‘ఇండియా స్కిల్‌ కాంపిటేషన్‌’ కోసం రోజుకు మూడు గంటలు ప్రిపేర్‌ అయ్యాను. సెప్టెంబరులో చైనా రాజధాని షాంఘైలో అంతర్జాతీయ పోటీకి వెళుతున్నాను. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే మరోవైపు కాంపిటేషన్‌లో గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాను.


నైపుణ్యాలకు పదును...

నా సబ్జెక్టులో నేను అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్టే... మిగతావాళ్లు కూడా ఇండియా స్కిల్‌ కాంపిటేషన్‌లోని 63 రకాల పోటీల్లో ఎవరి ఆసక్తి మేరకు వాళ్లు పాల్గొనచ్చు. అలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు వెళ్లడంవల్ల మన ఆలోచనా సరళి, పనితీరు కూడా మెరుగవుతాయి. నాకు బంగారు పతకంతో పాటు లక్ష రూపాయల నగదు కూడా బహూకరించారు. నేను లాజిస్టిక్స్‌ అండ్‌ ఫ్రైట్‌ ఫార్వాడింగ్‌లోనే మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నా. అబ్బాయిలు చదువుకోవడానికి ఆసక్తి, ఆర్థిక స్థోమత ఉంటే సరిపోతుంది. అదే అమ్మాయిలు చదువుకోవాలంటే వాటికితోడు సామాజిక, కుటుంబ పరిస్థితులు అనుకూలించాలి. అమ్మాయిలకు నేను చెప్పేది ఒక్కటే... అవరోధాలెన్ని ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అనుకున్నది సాధించాలి. విద్యావకాశాలను అందిపుచ్చుకోవాలి. కష్టనష్టాలెన్ని ఎదురైనా మనం ఎక్కడా ఆగిపోకూడదు.

సాంత్వన్‌

పుస్తక పఠనాసక్తి...

నాది దిగువ మధ్యతరగతి కుటుంబం. ప్రభుత్వ కళాశాలల్లో చదివాను. అయినా దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల్లో చదివిన వాళ్లతో పోటీపడి మరీ గెలవగలగడానికి ప్రధాన కారణాల్లో ఒకటి... నాకు చిన్నప్పటి నుంచి ఇంగ్లీషు కామిక్స్‌, నవలలు చదవడం ఇష్టం. పుస్తకాలే నా ప్రధాన కాలక్షేపం.

కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ మెరుగుపరుచుకోడానికి ఆ అభిరుచి బాగా తోడ్పడింది. బేగంపేట ప్రభుత్వ మహిళా కళాశాల అధ్యాపకులు సాంస్కృతిక కార్యక్రమాల్లో నన్ను బాగా

ప్రోత్సహించారు. కాలేజీ స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించాను. ఆ సమయంలో కళాశాల వేడుకల్లో యాంకరింగ్‌తో పాటు నాయకత్వ పాత్ర వహించాను. అవి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపాయి.

చదువులో ప్రోత్సాహం

మాది ఉమ్మడి కుటుంబం. పెద్దనాన్న, చిన్నాన్న పిల్లలు... పదిమందికిపైగా నాకు అక్కాచెల్లెళ్లున్నారు. వారిలో మా అక్కలు వారికి ఇష్టమైన కోర్సులు చదివారు. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా మా పెద్దలు మమ్మల్ని చదువులో ప్రోత్సహిస్తున్నారు. మాకు ఒత్తిడి అనేది తెలియదు.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ అరెస్ట్

ఓటములకు బౌలర్లను మాత్రమే కారణంగా చూపొద్దు: క్లాసెన్

Updated Date - Apr 08 , 2026 | 05:20 AM