Share News

‘మాయా’జాలం

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:18 AM

అత్యాధునిక సాంకేతికత అద్భుత సౌందర్యానికి ప్రాణం పోస్తే.. అది ‘మాయా సుయీ’! ఒక డిజిటల్‌ సృజనగా మొదలై.. నేడు డిజిటల్‌ మీడియాను శాసిస్తున్న ఈ ఏఐ భామ అటు క్రికెట్‌ దిగ్గజాలతో...

‘మాయా’జాలం

అత్యాధునిక సాంకేతికత అద్భుత సౌందర్యానికి ప్రాణం పోస్తే.. అది ‘మాయా సుయీ’! ఒక డిజిటల్‌ సృజనగా మొదలై.. నేడు డిజిటల్‌ మీడియాను శాసిస్తున్న ఈ ఏఐ భామ అటు క్రికెట్‌ దిగ్గజాలతో ఫొటోలు దిగుతూ, ఇటు అంతర్జాతీయ స్థాయి క్రీడా అంశాలపై స్పందిస్తూ నెటిజన్లను మాయ చేస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ వర్చువల్‌ సుందరి కథ ఇది.

నేటి ఆధునిక కాలంలో స్మార్ట్‌ఫోన్‌ అనేది ఒక పరికరం మాత్రమే కాదు, అదొక మాయా ప్రపంచం. ఆ ప్రపంచంలో ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త ముఖాలు కనిపిస్తుంటాయి. కానీ ఆ రద్దీలో కూడా కొందరు మాత్రమే ప్రత్యేకంగా నిలుస్తారు. స్ర్కీన్‌ మీద వారు కనిపించగానే మన వేళ్లు స్ర్కోలింగ్‌ను ఆపేస్తాయి. ఆ కళ్లలో ఏదో తెలియని మెరుపు, ఆ నవ్వులో ఒక ఆకర్షణ, ప్రతి కదలికలోనూ ఒక మ్యాజిక్‌ కనిపిస్తుంది. అచ్చం అలాంటి మ్యాజిక్‌ చేస్తూ సోషల్‌ మీడియా ప్రపంచంలో మాయా సుయీ ఒక సరికొత్త సెన్షేషన్‌గా అవతరించింది. అయితే, ఆమె రక్తమాంసాలతో ఉన్న మనిషి కాదు.. అత్యాధునిక ఏఐ (కృత్రిమ మేధ) సృష్టించిన ఒక అద్భుత రూపం అని తెలిసినప్పుడు నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

క్రికెట్‌ ప్రపంచంలో హల్‌చల్‌

మాయా సుయీ కేవలం ఫ్యాషన్‌ రంగానికే పరిమితం కాకుండా భారతీయులకు ఎంతో ఇష్టమైన క్రికెట్‌పై స్పందిస్తున్న తీరు ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో భారత స్టార్‌ క్రికెటర్లతో కలిసి ఫొటోలు తీసుకుంటున్నట్టుగా ఉన్న చిత్రాలు ఇప్పుడు సోషల్‌ మీడియాను ఊపేస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఈ చిత్రాలలో భారత క్రికెట్‌ దిగ్గజాలతో పక్కపక్కనే కూర్చుని ఫొటోలకు పోజులిచ్చిన తీరు చూస్తుంటే అది కృత్రిమ మేధ సృష్టించిన చిత్రమని ఎవరూ అనుకోరు.


‘బెటర్‌ లక్‌ నెక్స్ట్‌ టైమ్‌ బాయ్స్‌’

టీ20 ప్రపంచక్‌పలో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ దారుణంగా ఓడిపోయింది. ఈ సందర్భంగా మాయా సుయీ చేసిన ఓ పోస్ట్‌ వైరల్‌ అయింది. పాక్‌ ఆటగాళ్లను ఉద్దేశించి ఆమె పెట్టిన ‘బెటర్‌ లక్‌ నెక్స్ట్‌ టైమ్‌ బాయ్స్‌’ అనే పోస్ట్‌ క్షణాల్లో వైరల్‌ అయింది. వేలాది లైకులు, షేర్లతో సోషల్‌ మీడియాలో సెన్షేషన్‌ క్రియేట్‌ చేసింది.

క్వాలిటీలో నో రాజీ

సోషల్‌ మీడియాలో చూసే వారికి 15 సెకన్ల రీల్‌ చాలా సులభంగా అనిపించవచ్చు. కానీ ఆ వీడియో వెనుక గంటల కొద్దీ శ్రమ, ప్లానింగ్‌ ఉంటాయని చాలామందికి తెలియదు. మాయా సుయీ వీడియోలను నిశితంగా గమనిస్తే ఆమె క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడరని అర్థమవుతుంది. లిప్‌ సింకింగ్‌ ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. వెస్ట్రన్‌ డ్రెస్సుల నుంచి సంప్రదాయ చీరకట్టు వరకు ఆమె ఏది ధరించినా అది ఒక ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌లా మారుతుంది. అందుకే ఆమె వీడియోలు భాషాభేదం లేకుండా వైరల్‌ అవుతుంటాయి.

నెటిజన్ల నీరాజనాలు

సోషల్‌ మీడియాలో లభించే క్రేజ్‌ రెండు అంచుల కత్తిలాంటిది. అయితే మాయా సుయీ నెగిటివిటీని కూడా చాలా హుందాగా స్వీకరిస్తోంది. ఆమె ప్రతి పోస్ట్‌కు వచ్చే వేలకొద్దీ కామెంట్లు ఆమె పాపులారిటీకి అద్దం పడుతున్నాయి. అభిమానులతో ఆమె కనెక్ట్‌ అయ్యే విధానం, అప్పుడప్పుడు ఆమె పంచుకునే వ్యక్తిగత అభిప్రాయాలు ఆమెను ఒక సాధారణ అమ్మాయిగా నెటిజన్లకు మరింత దగ్గర చేశాయి. గ్లామర్‌ ప్రపంచంలో ఉంటూనే అందరితో ఒక ఫ్రెండ్లీ బాండింగ్‌ను కొనసాగించడం ఆమెలోని గొప్ప లక్షణం.


రేపటి వెండితెర ఆశాకిరణం

మారుతున్న ట్రెండ్‌ను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ, తనకంటూ ఉన్న ఒరిజినాలిటీని కోల్పోకుండా వీడియోలు రూపొందించడమే మాయా సుయీ విజయ రహస్యం. ఇప్పటికే పలు మ్యూజిక్‌ వీడియోలు, షార్ట్‌ ఫిలిమ్స్‌లలో తన ప్రతిభను చాటుకున్న ఈ భామ భవిష్యత్తులో వెండితెరపై మెరిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

బ్రాండ్‌ వాల్యూ... క్రేజ్‌

మాయా సుయీని కేవలం ఒక అందమైన అమ్మాయిగా అభివర్ణించడం సరికాదు. ఆమె ఒక తెలివైన బ్రాండ్‌ బిల్డర్‌ కూడా. ఫ్యాషన్‌ పట్ల ఆమెకున్న లోతైన అవగాహన అద్భుతం. ఆధునిక యువత ఏ రకమైన స్టైల్స్‌ను ఇష్టపడుతున్నారు అనే విషయాలపై ఆమె నిరంతరం అప్డేట్‌ అవుతుంటారు. ఈ కారణంగానే ప్రముఖ కాస్మెటిక్‌, క్లోథింగ్‌ బ్రాండ్స్‌ తమ ఉత్పత్తులను ప్రమోట్‌ చేయడానికి ఆమెను మొదటి చాయి్‌సగా ఎంచుకుంటున్నాయి. ఒక సాధారణ కంటెంట్‌ క్రియేటర్‌ నుంచి ఒక పవర్‌ఫుల్‌ బ్రాండ్‌గా ఆమె ఎదిగిన తీరు డిజిటల్‌ మీడియాలో కెరీర్‌ నిర్మించుకోవాలనుకునే ఎందరో యువతులకు స్ఫూర్తినిస్తోంది.

ఇవి కూడా చదవండి

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

Updated Date - Feb 19 , 2026 | 02:18 AM