కళ నెరవేరింది
ABN , Publish Date - May 20 , 2026 | 05:20 AM
చిత్ర కళ... ఆమెకు ఒక అభిరుచి మాత్రమే కాదు... ప్రాణం. అందులోనే మునిగితేలాలని... కెరీర్‌ను నిర్మించుకోవాలని కలలు కన్నది. ఆ కలల సాకారానికి కుటుంబమే...
చిత్ర కళ... ఆమెకు ఒక అభిరుచి మాత్రమే కాదు... ప్రాణం. అందులోనే మునిగితేలాలని... కెరీర్‌ను నిర్మించుకోవాలని కలలు కన్నది. ఆ కలల సాకారానికి కుటుంబమే అడ్డు గోడలా నిలిచినప్పుడు... దాన్ని బద్దలు కొట్టింది. ఇల్లు వదిలి...
సృజనకు రెక్కలు తొడిగింది. నేడు బెంగాల్ వస్త్ర వారసత్వంలో అంతర్భాగమైన కాంత కుట్టును ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లి... అంతర్జాతీయ పురస్కారాలు ఎన్నిటినో అందుకున్న 29 ఏళ్ల కళాకారిణి మౌమిత బసక్ కథ ఇది.
‘‘జీవితంలో ఒక అద్భుతం జరిగిందంటే దాని వెనుక ఎంతో శ్రమ, ఎన్నో త్యాగాలు ఉంటాయి. నా జీవితంలో అలాంటివి ఎన్నో. ఇవాళ నేను ఒక కళాకారిణిగా అంతర్జాతీయ గుర్తింపు పొందానంటే... అందులో నేను కోల్పోయిన సుఖాలు, నిద్ర లేని రాత్రులు, పడిన కష్టాలకు లెక్క లేదు. అయినా వాటిని తలుచుకొని ఏనాడూ బాధ పడలేదు. ఎందుకంటే జీవితమంటేనే పోరాటం. ఆ పోరాటంలోనే విజయం ఉంటుంది కదా. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం హుగ్లీ జిల్లాలోని చారిత్రక పట్టణం శ్రీరామ్‌పూర్ మాది. బీఎ్‌ఫఏ డిగ్రీ... కళాకారిణిగా రాణింపు... అంతర్జాతీయ గుర్తింపు... నా బయోడేటా చూసిన ఎవరికైనా నా జీవితం వడ్డించిన విస్తరిలా అనిపించవచ్చు. కానీ దాని వెనుక కనిపించని యుద్ధం ఉంది. చిన్నప్పటి నుంచి నాకు ఒక కల... చిత్రకారిణి కావాలని. అయితే ఇంట్లోవాళ్లు ఎప్పుడూ నన్ను నిరుత్సాహపరిచేవారు. పన్నెండో తరగతి తరువాత బీఎ్‌ఫఏ (బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) చదువుతానంటే అమ్మానాన్న వద్దంటే వద్దన్నారు. ఎంత ప్రాథేయపడినా ఒప్పుకోలేదు.
ఇంట్లోవాళ్లకు తెలియకుండా...
ఎవరు కాదన్నా బీఎ్‌ఫఏ చేయాలనే పట్టుదల నాలో మరింత పెరిగింది. స్నేహితుల సాయంతో దరఖాస్తు చేసుకున్నాను. కాలేజీ కోల్‌కతాలో ఉంది. శ్రీరామ్‌పూర్‌కు 143 కిలోమీటర్ల దూరం. అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా నాలుగైదుసార్లు వెళ్లాల్సి వచ్చింది. అమ్మానాన్నలకు తెలిస్తే అడ్డు తగులుతారనే భయంతో ట్యూషన్‌కు వెళుతున్నానని వాళ్లకు అబద్దం చెప్పాను. చివరకు అడ్మిషన్ లభించింది. కల్‌కత్తా విశ్వవిద్యాలయం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కాలేజీలో చేరాక అమ్మకు ఫోన్ చేసి... ‘ఇక నేను ఇంటికి రాను’ అని చెప్పేశాను. ఇది ఏదో డబ్బు సంపాదించాలనో, పేరు తెచ్చుకోవాలనో కాదు... చిత్రకారిణి కావాలన్న నా ఆకాంక్షను నెరవేర్చుకోవడం కోసం.

మాటలు లేవు...
కోల్‌కతా వచ్చాక ఇంట్లో వాళ్లతో పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. దాదాపు ఐదేళ్లు ఎవరితో మాట్లాడలేదు. పన్నెండో తరగతిలో వచ్చిన స్కాలర్‌షి్‌పతో పాటు, దాచుకున్న పాకెట్ మనీతోనే నెట్టుకువచ్చాను. చాలా రోజులు పస్తులున్నాను. ఆకలితోనే తరగతులకు వెళ్లాను. బాగా బరువు తగ్గి తీవ్ర అనారోగ్యం పాలయ్యాను. దాంతో అయిష్టంగానే కుటుంబంతో రాజీపడ్డాను. ఐదేళ్ల తరువాత మొదటిసారి నన్ను చూసిన మా అమ్మ కన్నీటిపర్యంతమైంది. ‘నీకు కన్నవాళ్లంటే ఎందుకంత కోపం’ అని అడగవచ్చు. కానీ పిల్లలకు కూడా ఆశయాలు, ఆలోచనలు ఉంటాయని పెద్దలు గ్రహించాలి. మా ఇంట్లో నా మాటకు, నా ఇష్టాయిష్టాలకు అస్సలు విలువ ఇవ్వలేదు. అది నన్ను కలచివేసింది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో కల్‌కతా విశ్వవిద్యాలయం నుంచి బీఎ్‌ఫఏ, తరువాత 2022లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎ్‌ఫఏ) పూర్తి చేశాను. చదువుకొనే రోజుల్లోనే ‘శిల్పాచార్య జైనుల్ అబేదిన్ స్కాలర్‌షిప్’ సాధించాను.
బెంగాలీ సంస్కృతి...
కళాకారిణిగా నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అప్పుడే నలుగురిలో భిన్నంగా, ఆకట్టుకోగలుగుతాం. నా కళాకృతులు అన్నీ నా అనుభవాలు, నా చుట్టూ ఉన్న జీవితాల నుంచి పుట్టినవే. ముఖ్యంగా బెంగాల్ సంస్కృతిలో అంతర్భాగమైన ‘కాంతా కుట్టు’ను నా కళలో జొప్పించాను. ఇది అతి ప్రాచీన కుట్టు పని. చిన్నప్పుడు నా చుట్టూవున్న మహిళలు ధరించే వస్త్రాలను చూసి ప్రేరణ పొందాను. అంతేకాదు... వ్యర్థ వస్త్రాలు, టీ, కాఫీ రంగులు నా కళలో ప్రత్యేకమైన ఆకారాలు సంతరించుకొంటాయి.
ఫోర్బ్స్ జాబితాలో...
గ్రామాల్లో యువతుల ప్రపంచం చాలా చిన్నది. తమ సమస్యలనే కాదు, సంతోషాలను ఎవరితోనూ పంచుకోలేరు. ఆ కథలను దుపట్టాలపై కుట్టుకోవడం ద్వారా వ్యక్తపరుస్తారు. అలాంటి సామాజిక అంశాలను నా చిత్రాలే మాధ్యమంగా ప్రపంచానికి చెబుతున్నాను. ప్రస్తుతం మా గ్రామంలో ఓ సంస్థ తరఫున ఒక ప్రాజెక్ట్‌పై పని చేస్తున్నాను. అది యువతుల ఆరోగ్యం, విద్యపై సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల ప్రభావాన్ని స్పృశిస్తుంది. నా కళాకృతులతో ఇప్పటివరకు దాదాపు వందకు పైగా ఎగ్జిబిషన్లలో ప్రదర్శించాను. నా ప్రతిభను గుర్తించి పలు సంస్థలు, ప్రభుత్వాలు స్కాలర్‌షి్‌పలు, అవార్డులు ఇచ్చాయి. వాటిల్లో పోలండ్ ‘సెంట్రల్ టెక్స్‌టైల్ ఆఫ్ మ్యూజియం’తో పాటు ‘ఇన్‌లాక్స్ ఫైన్ అవార్డ్’ వంటివి ఎన్నో అందుకున్నాను. లండన్‌లోని ప్రసిద్ధ ‘రిచర్డ్స్ సాల్టన్ గ్యాలరీ’లో నా చిత్రాలు ప్రదర్శితమయ్యాయి. తాజాగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించిన ‘30 అండర్ 30’ జాబితాలో నాకు చోటు లభించింది. ఇవన్నీ నన్ను, లక్ష్యాన్ని ముందుకు నడిపించే ప్రోత్సాహకాలు.’’
ఇవి కూడా చదవండి..
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్