Share News

మస్త్‌ దర్శకులు

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:32 AM

ముంబయి మురికివాడల్లోని పదిమంది శ్రామిక మహిళలు స్మార్ట్‌ఫోన్లతో సృష్టించిన అద్భుతం ‘మస్త్‌ మహిళా మండలి’. నిన్నమొన్నటివరకు కెమెరా బటన్‌ కూడా ఎక్కడుందో తెలియని...

మస్త్‌ దర్శకులు

ముంబయి మురికివాడల్లోని పదిమంది శ్రామిక మహిళలు స్మార్ట్‌ఫోన్లతో సృష్టించిన అద్భుతం ‘మస్త్‌ మహిళా మండలి’. నిన్నమొన్నటివరకు కెమెరా బటన్‌ కూడా ఎక్కడుందో తెలియని ఈ మహిళల సినిమా కలల ప్రయాణం ఇప్పుడు అంతర్జాతీయ చలనచిత్ర వేదికల వైపు దూసుకెళ్తోంది.

‘సరే.. ఫ్రేమింగ్‌ బాగుంది, లైటింగ్‌ సరిపోయింది, కెమెరా కదలకుండా పట్టుకోండి’.. ఓ డాక్యుమెంటరీ తొలి సీన్‌లో ఇన్‌స్ట్రక్టర్‌ వాయిస్‌ అది. అక్కడ కూర్చున్న మహిళలంతా ఎంతో శ్రద్ధగా వింటున్నా రు. ఇంతలో ఓ మహిళ అమాయకంగా చేయి పైకెత్తి ‘అంతా బానే ఉంది కానీ.. ఇంతకీ రికార్డింగ్‌ బటన్‌ ఎక్కడుందో చెప్పలేదు’ అంది. అంతే.. ఆ గదంతా నవ్వులతో నిండిపోయింది. అవును.. వారికి కనీసం కెమెరా ఎలా ఆన్‌ చేయాలో కూడా తెలియదు. కానీ, ఆ అనుభవలేమి వారి కలలకు అడ్డు కాలేదు.

కూల్‌ లేడీస్‌ క్లబ్‌

ముంబయిలోని ‘ఎం-ఈ్‌స్టవార్డ్‌’ మురికివాడలకు చెందిన పదిమంది శ్రామిక కొత్త అధ్యాయం లిఖించారు. ఇళ్లలో పనులు చేసేవారు, కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్లు, పబ్లిక్‌ టాయిలెట్‌ నిర్వాహకులు, హోంకేర్‌ గివర్లయిన పదిమంది మహిళలు ఇప్పుడొక అద్భుతమైన డాక్యుమెంటరీకి సహదర్శకులు. వారు రూపొందించిన ‘మస్త్‌ మహిళా మండలి’ (కూల్‌ లేడీస్‌ క్లబ్‌) చిత్రం ఇటీవల ముంబయిలోని ప్రతిష్ఠాత్మక ‘రీగల్‌ థియేటర్‌’లో ప్రీమియర్‌ ప్రదర్శన జరుపుకుంది. 1200 మంది సినీ ప్రియులు, కుటుంబ సభ్యుల చప్పట్ల మధ్య ఈ సినిమా ప్రదర్శితమవడమే కాకుండా, రాబోయే అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలకు సిద్ధమవుతోంది.


క్రేజీ ప్రయోగం

ఈ అద్భుతమైన ఆలోచన 2024లో అణగారిన మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించే ‘కోరో ఇండియా’ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సుప్రియా జాన్‌ మెదడులో పుట్టింది. మురికివాడల్లోని మహిళలకు సురక్షితమైన, ఉచిత పబ్లిక్‌ టాయిలెట్ల కోసం సాగుతున్న ‘రైట్‌ టు పీ’ ఉద్యమంపై ఒక లఘుచిత్రం తీయాలని అనుకున్నారు. దీనిని ఎవరో బయటివారు కాకుండా, అక్కడ నివసించే మహిళలతోనే తీయిస్తే బాగుంటుందని భావించారు.

ఐదు స్మార్ట్‌ ఫోన్లతో...

ముంబయిలోని ప్రతిష్ఠాత్మక ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌’ ప్రొఫెసర్‌, ప్రముఖ ఫిల్మ్‌మేకర్‌ శిల్పి గులాటిని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ సుప్రియా జాన్‌ సంప్రదించారు. మొదట్లో శిల్పి ఆశ్చర్యపోయారు. అసలు సినిమా అంటే తెలియని మహిళలు దర్శకత్వం ఎలా వహిస్తారనే సందేహం వచ్చింది. దీంతో శిల్పి వారికి వారానికి ఒక టాస్క్‌ ఇచ్చేవారు. ముంబయి వానలను షూట్‌ చేయడం, లేదా ‘గతంలో నువ్వు ఎలా ఉండేదానివి? ఇప్పుడు ఎలా మారావు?’ అని ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసుకోవడం వంటి పనులు ఇచ్చేవారు. ఇలా ఐదు నిమిషాల శానిటేషన్‌ వీడియోగా మొదలైన ఈ ప్రాజెక్ట్‌ కాస్తా వారి జీవితాల్లోని ఆంతరంగిక కోణాలను ఆవిష్కరించే 70 నిమిషాల సుదీర్ఘ డాక్యుమెంటరీగా మారింది. దీనిని పూర్తిచేయడానికి రెండేళ్లు పట్టింది.

‘మస్త్‌ మహిళా మండలి’ అంటే...

ఈ చిత్రానికి ‘మస్త్‌ మహిళా మండలి’ అనే పేరు పెట్టారు శిల్పి. ఆ పదిమంది మహిళలు చర్చించుకుని, తమ మనోభావాలకు ఇది సరిగ్గా సరిపోతుందని ఫిక్స్‌ అయ్యారు. తామేమీ మురికివాడల్లో దీనంగా బతికే అబలలం కాదని, ఎంతో ఉత్సాహంగా, సంతోషంగా జీవించగల ‘కూల్‌ లేడీస్‌’ అని నిరూపించడమే ఈ పేరు వెనుకున్న ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన 32 ఏళ్ల హోంకేర్‌ గివర్‌ రెహానా షేక్‌ మాట్లాడుతూ.. ‘‘నా దృష్టిలో ‘కూల్‌ లేడీ’ అంటే బిందా్‌సగా, ఎలాంటి భయం లేకుండా, తన మనసుకు నచ్చింది చేసే వ్యక్తి’’ అని చెప్పారు. ‘సంతోషంగా ఉండ టం అనేది సమాజంలోని అణచివేతకు వ్యతిరేకంగా చేసే ఒక విప్లవాత్మక నిరసన’’ అంటారు శిల్పి.

ఇరవైలలోకి...

ఈ సినిమా ప్రయాణం ఆ మహిళల్లో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. స్లమ్‌ శానిటేషన్‌ లీడర్‌, టాయిలెట్‌ ఆపరేటర్‌గా పనిచేసే 50 ఏళ్ల దర్శనా మాయేకర్‌ ఈ అనుభవంతో మళ్లీ యవ్వనంలోకి వెళ్లిపోయారు. ‘‘గడిచిన 20 ఏళ్లుగా కుటుంబ బాధ్యతలు, ఉద్యోగంతోనే నా జీవితం సరిపోయింది. కానీ ఈ సినిమా తీస్తున్నప్పుడు నా కోసం నేను బతికాను. నా వయసు ఇప్పుడు 50 ఏళ్లు కావొచ్చు. కానీ మానసికంగా నేను 20 ఏళ్ల పడుచు పిల్లలా ఫీలవుతున్నాను’’ అని చెప్పారు.


2-Navya.jpg

రెహానా కల తీరిన వేళ

ఈ డాక్యుమెంటరీలోనే అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం రెహానా షేక్‌ జీవితం. షూటింగ్‌ జరుగుతున్న రోజుల్లో ఆమెకు ఉద్యోగం లేదు. దాంతో ఇంట్లోనే ఉంటూ దుస్తులపై చిన్న చిన్న అద్దాలు కుడుతూ సంపాదించేది. ఒక రోజు పని మధ్యలో దొరికిన విరామంలో కమ్యూనిటీ హెల్త్‌ వర్కర్‌ శీతల్‌ నవ్లే తన ఫోన్‌ కెమెరాతో రెహానాను అనుసరించింది. రెహానా వంటగదిలోకి వెళ్లి భర్త, ముగ్గురు పిల్లల కోసం వంట చేస్తూనే ఫోన్‌లో ఒక మాస్‌ బాలీవుడ్‌ పాట పెట్టుకుని ఊగిపోతూ డ్యాన్స్‌ చేయడం ప్రారంభించింది. ఆ దృశ్యాన్ని శీతల్‌ తన ఫోన్‌ కెమెరాలో అద్భుతంగా బంధించింది. నిజానికి చిన్నప్పటి నుంచి డ్యాన్సర్‌ కావాలనేది రెహానా కల. కానీ, ఇంట్లో అనుమతించేవారు కాదు.

హక్కులు... పారితోషికం

ఈ చిత్రానికి సహ దర్శకులుగా వ్యవహరించినందుకు గాను రెహానా షేక్‌, శీతల్‌ నవ్లే, వైశాలి మానే, దర్శనా మాయేకర్‌తోపాటు కవితగా ఘుగే, రోహిణి కదమ్‌, కవితా ఖోమ్నే, గౌరీరాణె, అంజు మ్‌ షేక్‌, నాజ్నీన్‌ సిద్దిఖీ అనే పదిమంది మహిళలకు రూ.22 వేల చొప్పున పారితోషికం లభించింది. భవిష్యత్తులో ఈ చిత్రం ద్వారా వచ్చే లాభాల్లో ఈ మహిళలకు కూడా సమాన వాటా దక్కుతుంది.

ఆమె నా భార్య.. తను మా అమ్మ

రెహానా డ్యాన్స్‌ సీన్‌ సినిమాలో ఉంచాలా? వద్దా? అనే విషయంలో రెహానా చాలా భయపడింది. అప్పుడు తోటి మహిళలంతా ఆమెను ప్రోత్సహించారు. దాంతో ఆ సీన్‌ను సినిమాలో ఉంచేశారు. తీరా ‘రీగల్‌ థియేటర్‌’లో ప్రీమియర్‌ షో రోజున థియేటర్లో రెహానా డ్యాన్స్‌ స్ర్కీన్‌పై రాగానే ఆమె భర్త, ముగ్గురు పిల్లలు సీట్లలోంచి లేచి గట్టిగా అరుస్తూ, ఈలలు వేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఆ పక్కన ఉన్న ప్రేక్షకులతో ‘ఆమె నా భార్య.. తను మా అమ్మ’ అని ఎంతో గర్వంగా చెప్పుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపునకు కసరత్తు.. జూన్ 23 నుంచి సంప్రదింపులు

జులై మూడో వారంలో తల్లికి వందనం!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 17 , 2026 | 05:32 AM