రగ్బీ మహాక్
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:19 AM
కనీస వసతులు లేని ప్రాంతం నుంచి క్రీడాకారిణిగా వేసిన తొలి అడుగు నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వరకూ... మహాక్ చౌహాన్ సాగించిన ప్రయాణం ఆమె స్వయం కృషికి...
కనీస వసతులు లేని ప్రాంతం నుంచి క్రీడాకారిణిగా వేసిన తొలి అడుగు నుంచి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వరకూ... మహాక్ చౌహాన్ సాగించిన ప్రయాణం ఆమె స్వయం కృషికి నిలువుటద్దం. అప్పటివరకు పరిచయం లేని రగ్బీ క్రీడలో అసాధారణమైన ప్రతిభ చూపి... ‘భారత రగ్బీ భవిష్యత్తు’గా ప్రశంసలు అందుకుంటోంది ఇరవయ్యేళ్ళ ఈ ఉత్తరాఖండ్ అమ్మాయి.
‘‘క్రీడాకారిణిగా రాణించాలనేది నా కల. కానీ నేను అనుకున్న రూపంలో కాకుండా... మరో రూపంలో ఆ కల నెరవేరింది. జీవితంలో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగాలి.. ఇది మా నాన్న అవనేంద్ర చౌహాన్ నేర్పిన పాఠం. మాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో భద్రాసు అనే మారుమూల గ్రామం. నాన్న స్కూల్ టీచర్. క్రీడలంటే నాకు చిన్నవయసు నుంచీ ఇష్టం.రన్నింగ్, జంపింగ్, త్రోయింగ్ లాంటి ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడల్లో చురుగ్గా పాల్గొనేదాన్ని. నా ఆసక్తిని గమనించిన నాన్న... నాకు మంచి శిక్షణ ఇప్పించాలనుకున్నారు. కానీ అందుకు తగిన కనీస సౌకర్యాలు మా ప్రాంతంలో లేవు. అందుకే... ఎనిమిదో క్లాస్ పూర్తి కాగానే... నన్ను డెహ్రాడూన్‌లోని ఒక స్కూల్‌లో చేర్పించారు. అక్కడే రన్నింగ్‌లో శిక్షణ తీసుకోవడం ఆరంభించాను. అప్పుడే ఊహించని సంఘటన ఒకటి జరిగింది.
బంతి ఆకారం కూడా తెలీదు...
నాతో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక అమ్మాయి ‘‘క్రీడల్లో ట్రయల్స్ జరుగుతున్నాయట. నా పేరు, నీ పేరు కూడా ఇచ్చాను’’ అని చెప్పింది. సరే అన్నాను. రెండు రోజుల తరువాత ఇద్దరం అక్కడికి వెళ్ళాం. పరుగు పోటీలో నేను ఫస్ట్ వచ్చాను. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి అభినందించారు. ‘‘నా పేరు ఆయుష్ సైనీ. ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా రగ్బీ జట్టు కోచ్‌ని. నిన్ను ఎంపిక చేస్తున్నాం. రగ్బీని సీరియ్‌సగా తీసుకొని సాధన చేస్తావా?’’ అని అడిగారు. అప్పుడు తెలిసింది... అవి క్రీడాకారుల ఎంపిక కోసం రాష్ట్ర రగ్బీ అసోసియేషన్ నిర్వహించిన ట్రయల్స్ అని. అప్పటివరకూ రగ్బీ గురించి నేను కనీసం విననైనా లేదు. అదెలా ఆడతారో నాకు తెలీదు. ఆ క్రీడలో బంతి ఓవెల్ ఆకారంలో ఉంటుందని కూడా తెలీదు. నా దృష్టంతా ‘ట్రాక్ అండ్ ఫీల్డ్’ మీదే ఉంది. కానీ ‘స్వయంగా కోచ్ చెబుతున్నప్పుడు ప్రయత్నిస్తే నష్టం ఏముంది?’ అనిపించింది. అలాగేనని చెప్పాను. ఆ రాత్రి నాన్నతో మాట్లాడాను. ‘‘క్రీడల్లో నువ్వు గొప్పదానివి కావాలి. అది ఏ క్రీడైనా సరే! నువ్వు ఎంపికయ్యావంటే... నీకు సత్తా ఉన్నట్టే! రెండో ఆలోచన లేకుండా సాధన చెయ్యి. నిన్ను ఎంపిక చేసిన కోచ్ నీమీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకో’’ అని ప్రోత్సహించారు.

అది గొప్ప గౌరవం
అలా.... 2023లో... నిపుణుల పర్యవేక్షణలో రగ్బీ అభ్యాసం ఆరంభించాను. కోచ్, తోటి క్రీడాకారులు ఎంతో ప్రోత్సహించి, నేను నైపుణ్యం పెంచుకోవడానికి దోహదం చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని రాణించడంతో నా ఆత్మవిశ్వాసం పెరిగింది. ఏడాదికే.. ఉత్తరాఖండ్ అండర్-18 గర్ల్స్ రగ్బీ జట్టుకు కెప్టెన్ అయ్యాను. ఆ తరువాత... మలేషియాలో జరిగిన అండర్-20 పోటీల్లో మా జట్టు కాంస్య పతకం గెలిచింది. ఆ ఉత్సాహంతోనే... ‘సెంట్రల్ అండ్ సౌత్ ఆసియా (సీఎఎ్‌సఏ) రగ్బీ-7’ టోర్నమెంట్‌కు సిద్ధమయ్యాను. మధ్య, దక్షిణ ఆసియా దేశాల్లో రగ్బీ క్రీడను ప్రోత్సహించడానికి ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో ఈ టోర్నీ నిర్వహించాదు. మన దేశంతో పాటు శ్రీలంక, ఉజ్బెకిస్తాన్, మంగోలియా, కిర్గిజ్‌స్థాన్, కజకిస్తాన్ దేశాల జట్లు పాల్గొన్నాయి. ఇది నా మొట్టమొదటి సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. దీనిలో మన జట్టు నాలుగో స్థానానికి పరిమితం కావడం ఆవేదన కలిగించింది. కానీ... ఈ పోటీల్లో తొమ్మిది ‘ట్రైస్’తో అత్యుత్తమ స్కోరర్‌గా నిలిచాను. ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డు అందుకున్నాను. భారత్ తరఫున ఇటీవలి కాలంలో మహిళల రగ్బీలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శనల్లో ఒకటిగా పేర్కొంటూ, ‘భారత రగ్బీ భవిష్యత్తు’గా క్రీడా విశ్లేషకులు నన్ను ప్రశంసించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. అస్సలు పరిచయం లేని క్రీడలో అడుగుపెట్టి, అందులోనన్ను నేను నిరూపించుకున్నందుకు ఆనందంగా ఉంది. దీన్ని ప్రేరణగా తీసుకొని... భారత జట్టును అగ్రస్థానంలో నిలవడానికి, మహిళల రగ్బీలో మన జెండా సమున్నతంగా నిలపడానికి కృషి చేస్తాను.’’
ఇవి కూడా చదవండి..
కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం
కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన విజయ్ టీవీకే