Share News

నవతరం టెన్నిస్‌ రాణి

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:35 AM

ఒత్తిడిలో ప్రశాంతత... కీలక సమయాల్లో సడలని ఏకాగ్రత... ఎంతటి బలమైన ప్రత్యర్థి ఎదురైనా తలపడే సమర్థత... అన్నీ కలిపితే లిండా నోస్కోవా. 21 ఏళ్ల ఈ చెక్‌ రిపబ్లిక్‌ తార......

నవతరం టెన్నిస్‌ రాణి

ఒత్తిడిలో ప్రశాంతత... కీలక సమయాల్లో సడలని ఏకాగ్రత... ఎంతటి బలమైన ప్రత్యర్థి ఎదురైనా తలపడే సమర్థత... అన్నీ కలిపితే లిండా నోస్కోవా. 21 ఏళ్ల ఈ చెక్‌ రిపబ్లిక్‌ తార... మహామహులను మట్టి కరిపించి... వింబుల్డన్‌లో నవతరం రాణిగా అవతరించింది. కెరీర్‌లో మొట్టమొదటి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ సాధించి... మరెన్నో అద్భుత విజయాలను తన పేరున లిఖించేందుకు సన్నద్ధమవుతోంది. స్టార్‌ క్రీడాకారులను మరిపిస్తున్ననొస్కోవా జర్నీ ఇది.

‘‘టెన్నిస్‌ కోర్టులో మాత్రమే కాకుండా కోర్టు బయట కూడా నా గొంతు వినిపించి కొన్ని అంశాల్లో మార్పు తేవాలని కోరుకొంటున్నాను’’... వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించిన తరువాత లిండా నోస్కోవా మాటలివి. చెక్‌ రిపబ్లిక్‌లోని వెసిటిన్‌ జిల్లా బైస్ర్టికా గ్రామం ఆమెది. ప్రకృతితో మమేకమై సాగిన ఆమె బాల్యంలో పర్యావరణానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ‘మాది అడవిలో ఒక చిన్న గ్రామం. అక్కడే పెరిగాను. ప్రకృతితో చాలా దగ్గరి సంబంధం ఉండేది. నేను దాదాపు అడవిలోనే నివసించేదాన్ని. నిశ్చింతగా, స్వేచ్ఛగా గడిపిన అనుభూతి కలిగేది. మా ఊళ్లో ఏ చిన్న సంక్షోభం వచ్చినా నేను ముందుండేదాన్ని. నా కెరీర్‌ ముగిశాక పర్యావరణ, జంతు పరిరక్షణకు, సామాజిక సేవకు నా వంతు ప్రయత్నం చేస్తాను’ అని తన అంతరంగాన్ని ఆవిష్కరించింది నోస్కోవా.

సాధారణంగా టెన్నిస్‌ క్రీడాకారులు క్రిస్మస్‌ సమయంలో బీచ్‌ విహార యాత్రలకు వెళుతుంటారు. కానీ నోస్కోవా గత ఏడాది వాటిని వదులుకుని, టాంజానియా జాంజిబర్‌లోని ఓ పాఠశాల సందర్శనకు వెళ్లింది. అక్కడి పిల్లలకు ఆంగ్లం, భౌగోళిక శాస్త్రం బోధించింది. తనతోపాటు వచ్చిన టెన్నిస్‌ టీమ్‌ సభ్యులు మొదట తను సరదాగా పాఠాలు చెబుతుందని భావించారు. కానీ అక్కడి పేదరికం ఆమెను కదిలించిందని తరువాత అర్థం చేసుకున్నారు. ‘‘జాంజిబర్‌లో ఏడుగురు బాలికల బృందం ఒకటి నన్ను ఆకట్టుకుంది. వారు రోజూ వచ్చిన నన్ను పలుకరించేవారు. కానీ వాళ్లెవరికీ టెన్నిస్‌ అంటే ఏంటో కూడా తెలియదు. ‘ఈసారి ఇక్కడకు వచ్చేటప్పుడు టెన్నిస్‌ బంతులు, రాకెట్‌లు తీసుకువస్తా’నని వారికి చెప్పాను’’ అంటూ నాటి రోజులు గుర్తు చేసుకున్న నోస్కోవా... ‘ఆ పర్యటన నా జీవితంలో అత్యంత అర్థవంతమైన అనుభవాలలో ఒకట’ని ప్రకటించింది. తల్లి ఇవానా సుదీర్ఘ కాలం కేన్సర్‌తో పోరాడి, గత ఏడాది వింబుల్డన్‌కు కొద్ది రోజుల ముందు మరణించారు. తండ్రి డ్రాహోస్‌ నోసెక్‌. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఏడేళ్ల వయసులోనే నోస్కోవా టెన్నిస్‌ కోర్టులోకి అడుగు పెట్టింది. వారి స్ఫూర్తితోనే పర్యావరణం, సమాజం పట్ల తనకు ప్రేమ ఏర్పడిందని వింబుల్డన్‌ వేదికగా చెప్పిన ఆమె... తన తల్లికి నివాళులు అర్పించింది.


మరపురాని మజిలీ...

రాకెట్‌ పట్టిన మూడేళ్లకే టోర్నీల్లో పాల్గొన్న నోస్కోవా... మెరుపు వేగంతో దూసుకువెళ్లింది. 2019లో ప్రొఫెషనల్‌ సర్క్యూట్‌లోకి అడుగుపెట్టిన ఆమె... 2020లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బాలికల సింగిల్స్‌లో పోటీపడింది. రెండో రౌండ్‌లోనే నిష్క్రమించింది. డబుల్స్‌లోనూ నిరాశ ఎదురైంది. కానీ ఆ ఓటములకు ఆమె కుంగిపోలేదు. నోస్కోవాలో కసిని పెంచాయి. మరింతగా పుంజుకుని 2021లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ బాలికల సింగిల్స్‌ టైటిల్‌ నెగ్గింది. అదే ఏడాది ఐటీఎఫ్‌ జూనియర్‌ ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానానికి ఎగబాకింది. ఇక ఇటీవల ముగిసిన వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో తన దేశానికే చెందిన కరోలినా ముచోవాను ఓడించి, కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్టామ్‌ టైటిల్‌ను దక్కించుకుంది. హోరాహోరీగా జరిగిన అంతిమ సమరంలో నోస్కోవా శక్తిమంతమైన బేస్‌లైన్‌ గేమ్‌, పరిణతి చెందిన ఆటతీరును ప్రదర్శించింది. తొలి సెట్‌ను సునాయాసంగా గెలిచిన నోస్కోవా... రెండో సెట్‌ను కోల్పోయింది. ముచోవా నుంచి అనూహ్య పోటీ ఎదురైంది. ఆమె వరుస మ్యాచ్‌ పాయింట్లను కాపాడుకొంటూ సెట్‌ను సొంతం చేసుకుంది. గెలుపు సులువనుకున్న చోట నోస్కోవాను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. అయితే విరామ సమయం నోస్కోవాకు కలిసివచ్చింది. ఒత్తిడిని తట్టుకొని, లయన తిరిగి కనుగొని బరిలోకి దూకింది. టెన్నిస్‌ చరిత్రలో ఆల్‌టైమ్‌ గ్రేట్స్‌, స్వదేశానికే చెందిన మార్టినా నవ్రతిలోవా, పెట్రో క్విటోవాల సమక్షంలో విజేతగా నిలిచింది. వారిద్దరి తరువాత వింబుల్డన్‌ గెలిచిన చెక్‌ స్టార్‌ నోస్కోవానే.

తరువాతి లక్ష్యం...

ప్రస్తుతం నోస్కోవా ముందున్న అతిపెద్ద లక్ష్యం... ఆగస్టులో ప్రారంభంకానున్న యూఎస్‌ ఓపెన్‌ గెలవడం. డబ్ల్యూటీఏ ర్యాంకింగ్స్‌లో టాప్‌ స్థానాన్ని అందుకోవడం. అందులో కూడా ఆమె ఇదే స్థాయి ప్రదర్శన కనబరుస్తుందని, ఘనమైన చెక్‌ వారసత్వాన్ని రేపటి తరానికి తీసుకువెళ్లగలదని కోచ్‌ల నమ్మకం. ఏదిఏమైనా ఈ విజయం రాత్రికి రాత్రే జరిగిన అద్భుతం కాదు. సంవత్సరాల తరబడి ఆమె సాధించిన స్థిరమైన పురోగతికి, అచంచలమైన నమ్మకానికి దక్కిన ఫలితం.


ముక్కుపుడక మురిపెం

ఈసారి వింబుల్డన్‌లో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న అంశాల్లో నోస్కోవా ఆట మాత్రమే కాదు... మరొకటి ఉంది. అదే ఆమె ముక్కుపుడక. ఆంగ్ల పత్రిక గార్డియన్‌ ప్రకారం... ముక్కుపుడకతో వింబుల్డన్‌ గెలిచిన మొట్టమొదటి మహిళ నోస్కోవా. ‘నా ముక్కుపుడక గురించి ఎవరైనా వ్యాఖ్యలు చేస్తారేమోనని అనుకున్నాను. కానీ ఎవరూ చెడుగా మాట్లాడలేదు. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా దీన్ని పెట్టుకొంటాను. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ నా ముక్కుపుడక గురించి మాట్లాడలేదు కానీ... నా పోరాట స్ఫూర్తికి ఫిదా ఆమె అయినట్టు చెప్పారు. ఎన్నో గ్రాండ్‌స్లామ్‌ మ్యాచ్‌లను, ప్రత్యేకించి ఫైనల్స్‌ను ప్రిన్సెస్‌ చూసిన ఆమె నుంచి అభినందనలు అందుకోవడం గర్వంగా ఉంది’ అంటూ టైటిల్‌ పోరు అనంతరం నోస్కోవా తన ఆనందాన్ని పంచుకుంది.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు

రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!

Updated Date - Jul 15 , 2026 | 05:35 AM