మౌంటెన్ క్వీన్
ABN , Publish Date - May 20 , 2026 | 05:23 AM
నేపాలీ షెర్పా లక్పా 51 ఏళ్ల వయసులో మే 17న ఉదయం 9:30 గంటలకు 11వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన మహిళగా తన పేరిట ఉన్న...
నేపాలీ షెర్పా లక్పా 51 ఏళ్ల వయసులో మే 17న ఉదయం 9:30 గంటలకు 11వసారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి.. అత్యధికసార్లు ఈ ఘనత సాధించిన మహిళగా తన పేరిట ఉన్న రికార్డును తనే బద్దలుకొట్టారు. ఒక సాధారణ కూలి స్థాయి నుంచి ఎదిగి.. గృహహింసను సైతం ఎదిరించి నిలిచిన ఆమె అసాధారణ పోరాటం ఎందరికో స్ఫూర్తి పాఠం. అడ్డంకులను అధిగమించి ‘మౌంటెన్ క్వీన్’గా ఎదిగిన లక్పా పంచుకున్న విశేషాలు ఇవి...
నేపాల్‌లోని సంఖువాసభ జిల్లా, మకాలు పర్వత ప్రాంతంలోని ఒక చిన్న షెర్పా గ్రామంలో నా ప్రస్థానం మొదలైంది. నా తండ్రి పర్వతారోహకులకు మెళకువలు నేర్పించే గైడ్. ఆయనను చూస్తూ పెరిగిన నాకు పర్వతారోహణపై మక్కువ పెరిగింది. పర్వతారోహకుల సామగ్రి మోస్తానని చెప్పి చిన్న వయసులోనే నాన్నతో కలిసి వెళ్లేదాన్ని. కానీ, నేనిలా చేయడం అమ్మకు అస్సలు నచ్చేది కాదు, మగరాయుడిలా తిరగొద్దని హెచ్చరించేది. కానీ, సామాజిక కట్టుబాట్ల మధ్య నలిగిపోయి నా కలను వదులుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే అమ్మ మాటలను పక్కనపెట్టి మౌంటెనీరింగ్‌పై దృష్టిపెట్టాను. దీనికోసం నేను ఎలాంటి ప్రత్యేక శిక్షణ తీసుకోలేదు. ఇతర పర్వతారోహకులను గమనిస్తూ, నా స్వీయ అనుభవంతో అందులోని రహస్యాలను వంటబట్టించుకున్నాను. ఆ పట్టుదలే 2000వ సంవత్సరం మే 18న ‘నేపాలీ విమెన్ మిలీనియం ఎక్స్‌పెడిషన్’ ద్వారా నన్ను మొదటిసారి ఎవరెస్ట్ శిఖరంపై నిలబెట్టింది. ఎవరె్‌స్టను అధిరోహించి, సురక్షితంగా ప్రాణాలతో తిరిగి వచ్చిన తొలి నేపాలీ మహిళగా చరిత్ర సృష్టించిన ఆ క్షణం నాలో బోలెడంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఆ తర్వాత ఇక నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు.
పాతికేళ్ల ప్రస్థానం...
పర్వతాలపై ఉండే ప్రశాంతత నన్ను పదేపదే పిలుస్తున్నట్టు అనిపించేది. అందుకే 2000- 2006 మధ్య ఆరుసార్లు, ఆ తర్వాత 2016, 2017, 2018, 2022వ సంవత్సరాల్లో విజయవంతంగా ఎవరె్‌స్టను అధిరోహించాను. 2015లో భారీ భూకంపం, కొండచరియలు విరిగిపడటం వంటి ప్రకృతి విపత్తుల వల్ల మధ్యలోనే వెనుదిరగాల్సి వచ్చినా నా ధైర్యం సడలలేదు. ఎవరెస్ట్ మాత్రమే కాదు.. 2010లో విఫలమైనప్పటికీ పట్టువదలకుండా 2023 జూలైలో చైనాలోని జిన్‌జియాంగ్ సరిహద్దులోని కారంకోరం పర్వతశ్రేణిలో ఉన్న ప్రపంచంలోనే రెండో అత్యంత ప్రమాదకరమైన ‘కే2’ శిఖరాన్ని కూడా అందుకోగలిగాను. తాజాగా మే 17న ఒక క్లెయింట్‌కు గైడ్‌గా వ్యవహరిస్తూనే 11వసారి ఎవరెస్ట్ మునివేళ్లను తాకి నా పేరిట ఉన్న రికార్డును నేనే తిరగరాశాను.
గృహహింస చీకట్ల నుంచి...
పర్వతాలపై నేను సాధించిన విజయాలు ఎంత గొప్పవో.. నా వ్యక్తిగత జీవితంలో నేను చేసిన పోరాటం అంతకంటే ఉద్వేగభరితమైనది. పర్వతారోహణ సమయంలోనే ఇంగ్లండ్‌కు చెందిన ఓ తోటి మౌంటెనీర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుని అమెరికాలోని కనెక్టికట్ వెళ్లాను. కానీ, ఆ వివాహబంధం నాకు నరకాన్ని చూపించింది. భర్త నుంచి తీవ్రమైన వేధింపులు, గృహహింసను ఎదుర్కొన్నాను. ఒకానొక దశలో నా ముగ్గురు పిల్లలను తీసుకుని ఆ బంధం నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాను. ఒంటరి తల్లిగా ఆ ముగ్గురు పిల్లలను సాకడానికి ఎన్నో కష్టాలు పడ్డాను. సూపర్ మార్కెట్లు, నిత్యావసర స్టోర్లలో కూరగాయలు కడగడం, చెత్తను శుభ్రం చేయడం లాంటి పనులు చేస్తూనే పైసాపైసా కూడబెట్టాను. నా జీవితంలో ఎదురైన ఆ ప్రతికూల పరిస్థితులన్నింటినీ నేను తట్టుకోగలిగానంటే దానికి కారణం ఆ పర్వతారోహణే. ఆ సాహసమే నాలో పాజిటివిటీని, ధైర్యాన్ని నింపి నాకు ప్రశాంతతను అందించింది.

సరికొత్త లక్ష్యాలు
పర్వతారోహణే నా గుర్తింపు. అందుకే దీనిని నేను ఎప్పటికీ వదులుకోలేను. ప్రస్తుతం నేను ఎవరె్‌స్టను మాత్రమే కాకుండా, అమెరికాలోని 50 రాష్ట్రాల్లో ఉన్న ఎత్తైన శిఖరాలన్నింటినీ అధిరోహించే సరికొత్త మిషన్‌లో బిజీగా ఉన్నాను. ఇతరుల కలలను సాకారం చేయడానికి ‘క్లౌడ్‌స్పేస్ క్లైంబింగ్’ అనే సంస్థను, అలాగే, ‘హైకింగ్ విత్ లక్పా’ అనే వెబ్‌సైట్‌ను స్థాపించి ఔత్సాహిక పర్వతారోహకులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ శిక్షణ ఇస్తున్నాను. భవిష్యత్తులో నా ముగ్గురు పిల్లలను కూడా ఇదే సాహస దారిలో నడిపించాలనుకుంటున్నాను.
డాక్యుమెంటరీకి గ్రాండ్ ప్రైజ్
నా జీవిత పోరాటంపై ప్రముఖ దర్శకురాలు లూసీ వాకర్ రూపొందించిన ‘మౌంటెన్ క్వీన్’ డాక్యుమెంటరీ ప్రతిష్ఠాత్మక ‘కెండల్ మౌంటెన్ ఫెస్టివల్’లో గ్రాండ్ ప్రైజ్ గెలుచుకుంది. అలాగే గతంలో బీబీసీ వందమంది ప్రభావశీల మహిళల జాబితాలో నాకు చోటు దక్కడంతోపాటు భారత ప్రభుత్వం నుంచి ‘టెన్జింగ్ నార్గే నేషనల్ అడ్వెంచర్ అవార్డు’ అందుకోవడం నా బాధ్యతను మరింత పెంచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా తోటి మహిళలకు నేను చెప్పేది ఒక్కటే.. నీ దారిలో వచ్చే పర్వతాల లాంటి కష్టాలను చూసి భయపడకు.. వాటిని అధిరోహించి శిఖరాగ్రాన నిలబడు.
నా జీవితంలో ఎదురైన కష్టాలన్నింటినీ నేను తట్టుకోగలిగానంటే దానికి కారణం పర్వతారోహణే. నేటి తరానికి నేను చెప్పేది ఒక్కటే... మీ దారిలో వచ్చే పర్వతాల్లాంటి సవాళ్లను చూసి భయపడకండి. వాటిని అధిరోహించి శిఖరాగ్రానికి చేరుకోండి.
ఇవి కూడా చదవండి..
ప్రభాకరన్‌కు విజయ్ నివాళి.. రాజీవ్ గాంధీ హత్యను గుర్తుచేసిన బీజేపీ..
బీజేపీ బెదిరింపులతోనే పోటీ నుంచి తప్పుకున్న జహంగీర్ ఖాన్.. టీఎంసీ ఫైర్