Share News

అచంచల విశ్వాసానికి అరుదైన గౌరవం

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:35 AM

ఆర్థిక ఇబ్బందులు... సామాజిక కట్టుబాట్లు అవరోధంగా మారిన చోట అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆశయ సాధన వైపు అడుగులు వేసింది. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో...

అచంచల విశ్వాసానికి అరుదైన గౌరవం

సంకల్పం

ఆర్థిక ఇబ్బందులు... సామాజిక కట్టుబాట్లు అవరోధంగా మారిన చోట అచంచలమైన ఆత్మవిశ్వాసంతో ఆశయ సాధన వైపు అడుగులు వేసింది. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో చదువు మానేసినా... అంతర్జాతీయ క్రికెటర్‌ కావాలన్న కలను నెరవేచ్చుకుంది. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించిన ఆమె... ప్రతిష్ఠాత్మక లార్డ్స్‌ మైదానంలోని ‘టెస్ట్‌ ఆనర్స్‌ బోర్డు’పై తన పేరును లిఖించుకుంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించిన 22 ఏళ్ల క్రాంతి గౌడ్‌ కథ ఇది.

మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు అధికంగా ఉన్న బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలోని ఘవారా గ్రామం క్రాంతి గౌడ్‌ది. పేదరికం, వివక్ష... బాల్యంలోనే ఆమెకు పరిచయమయ్యాయి. ‘ఆడపిల్లకు ఆటలెందుకు’ అన్న ప్రశ్నలు తరచూ ఎదురవుతూనే ఉండేవి. కానీ ఆమె కల... క్రికెటర్‌ కావాలని. భారత్‌ తరఫున ఆడాలని. ఆ కల నెరవేర్చుకొనేందుకు ఎన్నో కష్టాలు పడింది. చుట్టుపక్కలవారి చులకన మాటలు పక్కనపెట్టింది. అనుకున్నది సాధించాలన్న ఏకైక లక్ష్యంతో అహర్నిశలూ శ్రమించింది. నేడు ఆ కష్టానికి... అన్నిటికీ ఎదురొడ్డి నిలబడిన తెగువకు... తగిన ఫలితం దక్కింది. మహిళా క్రికెట్‌ చరిత్రలో ఏ క్రీడాకారిణికీ దక్కని అరుదైన గౌరవం క్రాంతికి దక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే, క్రికెట్‌ దిగ్గజాలు కొలువైన లార్డ్స్‌ మైదానంలోని ‘టెస్టు ఆనర్స్‌ బోర్డు’లో ఆమె పేరు చేరింది.


  • ఎగతాళి చేసిన చోటే...

లార్డ్స్‌ టెస్టులో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డును సైతం అందుకుని, సొంతూరికి తిరిగివెళ్లిన క్రాంతికి అపూర్వ స్వాగతం లభించింది. ఆమె ఘనతను ఊరంతా గొప్పగా చెప్పుకుంది. ‘‘బుందేల్‌ఖండ్‌లోని ఓ మూల ఏళ్ల తరబడి నేను చేసిన పోరాటం గుర్తుకువస్తోంది. ఇక్కడ ఆటలు ఆడే అమ్మాయిలంటే చులకన. ‘ఆడపిల్లను క్రికెట్‌ ఆడటానికి ఎందుకు అనుమతిస్తున్నారు’ అని నా కుటుంబాన్ని ప్రశ్నించేవారు. నన్ను ఎగతాళి చేసేవారు. లార్డ్స్‌ బోర్డుపై నా పేరు చూసినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఆ క్షణం నాలోని భావాలను వ్యక్తం చేయడానికి మాటలు చాలవు. ఘవారా నుంచి లార్డ్స్‌ వరకు... నా ఈ ప్రయాణం అద్భుతంగా అనిపిస్తోంది. కల నిజమైన అనుభూతి మహదానందాన్ని ఇస్తోంది’’ అంటున్న క్రాంతి ఆశయానికి ఆమె కుటుంబమే బలం. ఎవరేమన్నా పట్టించుకోకుండా, తమ కూతురు కోరుకున్నది నెరవేరేందుకు తల్లిదండ్రులు అండగా నిలిచారు.

నిశ్శబ్ద విప్లవానికి నాంది...

క్రాంతి ప్రయాణం ఘవారాలో ఒక నిశ్శబ్ద విప్లవానికి నాంది పలికింది. ‘బుందేల్‌ఖండ్‌ ప్రాంతం నుంచి దాదాపు నలభై మంది అమ్మాయిలు క్రికెట్‌ ఆడుతున్నారు. మా ప్రాంతంలో ఆడపిల్లల పట్ల ఆలోచనా విధానాలు మారుతున్నాయనడానికి ఇది స్పష్టమైన సంకేతం. తమ కూతుళ్లపై నమ్మకం ఉంచి, క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొనేలా ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు నా ప్రయాణం ఒక కొత్త విశ్వాసాన్ని కలిగిస్తుండటం గర్వకారణం’ అంటుంది క్రాంతి.

3-Navya.jpg

  • చరిత్రాత్మక ప్రదర్శన...

రెండేళ్ల కిందట మధ్యప్రదేశ్‌ మహిళల జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రాంతి... ఇక అక్కడి నుంచి రాకెట్‌ స్పీడుతో దూసుకుపోయింది. కుడిచేతి వాటం మీడియమ్‌ పేసర్‌గా చక్కని ప్రదర్శనలు ఇచ్చింది. గత ఏడాది ఆమె సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. శ్రీలంకలో ట్రైసిరీ్‌సకు భారత వన్డే జట్టు నుంచి పిలుపు వచ్చింది. సిరీస్‌ ఫైనల్లో ఆడే అవకాశం దక్కించుకున్న క్రాంతి... తొలిసారి బ్లూ జెర్సీ ధరించింది. ఆ వెంటనే ఇంగ్లండ్‌లో సిరీ్‌సకు టీ20 జట్టులో చోటు లభించింది. చెస్టర్‌ లీ స్ర్టీట్‌లో జరిగిన వన్డేలో ఆరు వికెట్లు పడగొట్టింది. తద్వారా ఐదు వికెట్లు సాధించిన అతిపిన్న వయసు భారత బౌలర్‌గా ఝులన్‌ గోస్వామి పేరిట ఉన్న రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది మార్చిలో ఆస్ర్టేలియాతో మ్యాచ్‌లో టెస్టు అరంగేట్రం చేసిన క్రాంతి... 2025 ప్రపంచ కప్‌ జట్టులోనూ చోటు సంపాదించింది. ఇటీవల లార్డ్స్‌లో ముగిసిన ఏకైక టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 37 పరుగులకు 5 వికెట్లు పడగొట్టింది. ఆ మైదానంలో 5 వికెట్లు తీసిన తొలి భారత మహిళ క్రికెటర్‌గా నిలిచింది.


  • పాత డ్రెస్‌లు, బూట్లు...

స్థానిక క్రికెట్‌ అకాడమీలో శిక్షణ ప్రారంభించిన రోజుల్లో క్రాంతి ఎన్నో కష్టాలు పడింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా... పాత వస్త్రాలు, బూట్లు ధరించి సాధన చేసేది. ఆమె అంకితభావం కోచ్‌ రాజీవ్‌ బిల్తారే దృష్టిని ఆకర్షించింది. ఎంతో ప్రతిభ గల క్రీడాకారిణి అని, ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తుందని కోచ్‌ భావించారు. క్రికెట్‌ కిట్‌తో పాటు బూట్లు ఆమెకు కొనిచ్చారు. ఆటలో మెళకువలు నేర్పించి, నైపుణ్యానికి పదును పెట్టారు. కోచ్‌, కుటుంబంతో పాటు తనపై తాను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టిన క్రాంతి నేడు యువతరానికి ఆదర్శంగా నిలిచింది. అవకాశం వచ్చిన ప్రతిసారీ తనను తాను నిరూపించుకొని ఉన్నత స్థానానికి చేరుకున్న ఈ బౌలర్‌... ‘నన్ను చూసి నా కంటే నా కుటుంబమే ఎక్కువ గర్వపడుతుంది’ అంటోంది. కుటుంబమే కాదు... ఆమెను చూసి ఇప్పుడు దేశమే గర్విస్తోంది.

ఆత్మవిశ్వాసమే అండగా...

ఆరుగురు సంతానంలో ఆఖరి బిడ్డ క్రాంతి. ఆమె తండ్రి పోలీస్‌ కానిస్టేబుల్‌. ఆయన్ను ఉద్యోగం నుంచి తొలగించడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఒక్కసారిగా వారి జీవితం ఊహించని మలుపు తీసుకుంది. ఉద్యోగం పోయిన తండ్రికి కుటుంబాన్ని పోషించడమే అతిపెద్ద సవాలుగా మారడంతో, క్రాంతి చదువు మానేయాల్సివచ్చింది. ఎన్ని కష్టాలు పడినా... తమ బిడ్డ భారత జట్టులో స్థానం సంపాదించాలన్న లక్ష్యానికి అండగా నిలిచారు. ‘అమ్మాయి కోసం డబ్బు ఎందుకు వృథా చేస్తున్నారు’ అంటూ చుట్టుపక్కలవారు అడిగినా వారు పట్టించుకోలేదు.

ఇవీ చదవండి:

'మేడ్ ఇన్ ఇండియా' సీ-295.. ఆత్మనిర్భర్ భారత్‌కు ఊతం

యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం.. త్వరలో అసెంబ్లీకి!

Updated Date - Jul 20 , 2026 | 04:35 AM