Share News

పిల్లల్లో కిడ్నీ స్టోన్స్‌

ABN , Publish Date - Feb 19 , 2026 | 02:11 AM

మూత్రపిండాల సమస్య పెద్దలకే పరిమితం కాదు. ఈ సమస్య పిల్లల్లో కూడా తలెత్తుతుంది. ఈ రుగ్మత కొన్ని లక్షణాల రూపంలో బయల్పడినా, తల్లితండ్రులు వాటిని అలక్ష్యం చేస్తూ ఉంటారు.

పిల్లల్లో కిడ్నీ స్టోన్స్‌

కౌన్సెలింగ్‌

డాక్టర్‌, మా అబ్బాయికి పదేళ్లు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడ్డాయి. రెండు పూటలా పాలు తాగుతాడు కాబట్టి ఈ సమస్య, పాలలోని క్యాల్షియం వల్ల వచ్చిందని అనుకోవాలా? మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?

మూత్రపిండాల సమస్య పెద్దలకే పరిమితం కాదు. ఈ సమస్య పిల్లల్లో కూడా తలెత్తుతుంది. ఈ రుగ్మత కొన్ని లక్షణాల రూపంలో బయల్పడినా, తల్లితండ్రులు వాటిని అలక్ష్యం చేస్తూ ఉంటారు. అర్థం లేని అపోహలు, అనుమానాలతో మూత్రపిండాల్లో రాళ్ల సమస్యను మరింత జటిలం చేస్తూ ఉంటారు. కానీ నిజానికి పిల్లల్లో ఈ సమస్యను నియంత్రించుకునే వీలుంది.

హెచ్చరికల మీద కన్నేసి...

పిల్లల్లో కిడ్నీ స్టోన్‌ లక్షణాలు పెద్దల లక్షణాలనే పోలి ఉంటాయి. పదే పదే తిరగబెట్టే పొత్తికడుపు నొప్పి, వాంతులు, మూత్రవిసర్జన సమయంలో నొప్పి, తరచూ మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మూత్రంలో రక్తం.. ఈ లక్షణాలను అశ్రద్ధ చేయకూడదు.

అపోహలు - వాస్తవాలు

అపోహ: కిడ్నీస్టోన్స్‌ పెద్దలకే పరిమితం

వాస్తవం: శరీరంలో నీటి శాతం తగ్గిపోవడం, ఆహారపుటలవాట్ల మూలంగా పిల్లల్లో కూడా ఈ సమస్య తలెత్తుతుంది

అపోహ: పాలు, క్యాల్షియం వల్లే కిడ్నీస్టోన్స్‌ ఏర్పడతాయి

వాస్తవం: ఇది నిజం కాదు. నిజానికి పాలు, క్యాల్షియం పిల్లల ఎదుగుదలకు అవసరం. అదనపు ఉప్పు, నీళ్లు తక్కువ తాగడం, మెటబాలిక్‌ సమస్యలే కిడ్నీ స్టోన్స్‌కు ప్రధాన కారణాలు

అపోహ: నొప్పి తగ్గితే, సమస్య పరిషారమైనట్టే!

వాస్తవం: నొప్పి తగ్గినంత మాత్రాన రాయి పడిపోయిందని అనుకోకూడదు. రాళ్లు ఏర్పడడానికి కారణాన్ని సరిదిద్దనంతవరకూ పదే పదే రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి

అపోహ: కిడ్నీస్టోన్‌కు సర్జరీ తప్పనిసరి

వాస్తవం: పిల్లల్లో మందులతో, హైడ్రేషన్‌తో, ఆహార మార్పులతో ఈ సమస్యను సరిదిద్దవచ్చు. రాయి మూత్రానికి అవరోధంగా మారినప్పుడు, పదే పదే ఇన్‌ఫెక్షన్స్‌కు గురవుతున్నప్పుడు, పదే పదే నొప్పి తిరగబెడుతున్నప్పుడు లేదా మూత్రం ద్వారా రాయి బయటకు వెళ్లనప్పుడు మాత్రమే సర్జరీ అవసరమవుతుంది

అపోహ: చికిత్స తర్వాత సమస్య తిరగబెట్టదు

వాస్తవం: పెద్దలతో పోలిస్తే, పిల్లల్లో ఈ సమస్య తిరగబెట్టే అవకాశాలు ఎక్కువ. కాబట్టి కారణాన్ని కనిపెట్టి, పరిష్కరించుకుని, తగు జాగ్రత్తలు పాటించగలిగితే రాళ్లు తిరగబెట్టే సమస్య సమసిపోతుంది.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి

నీళ్లు ఎక్కువగా తాగేలా పిల్లలను ప్రోత్సహించాలి. మూత్రం లేత పసుపు రంగులో ఉండేలా చూసుకోవాలి. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల రాళ్ల సమస్య తీవ్రమవుతుంది. కాబట్టి పిల్లలకు అర్థమయ్యేలా ఈ విషయం వివరించాలి. ఉప్పు జోడించిన చిరుతిళ్ల అలవాటు మాన్పించాలి. చిప్స్‌, ఫ్రైస్‌, ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌, అలా్ట్ర ప్రాసెస్డ్‌ ప్యాకేజ్‌డ్‌ ఫుడ్స్‌, శీతల పానీయాలు మాన్పించాలి. పదే పదే వేధించే పొట్ట నొప్పి, వాంతులు, మూత్రంలో రక్తం, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లను అశ్రద్ధ చేయకూడదు. తల్లితండ్రుల్లో, తోబుట్టువుల్లో ఈ సమస్య ఉంటే, వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి.

డాక్టర్‌ శృతి బల్లా

కన్సల్టెంట్‌ పిడియాట్రిక్‌ నెఫ్రాలజిస్ట్‌,

రెయున్‌బో చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌, సికింద్రాబాద్‌

ఇవి కూడా చదవండి

టెక్నాలజీ కూడా కాపీ-పేస్టే... రోబో డాగ్ వివాదంపై సిద్ధరామయ్య

Updated Date - Feb 19 , 2026 | 02:12 AM