Share News

ఆకలిని గెలిచిన ‘అన్నపూర్ణ’

ABN , Publish Date - Jul 15 , 2026 | 05:32 AM

ఆకలి బాధ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించిన ఓ సాధారణ మహిళ ఆమె. వీధుల్లో ఆకలితో అలమటించే వారిని చూసి చలించిపోయి.. రోజుకు వందమంది కడుపు నింపాలని ....

ఆకలిని గెలిచిన ‘అన్నపూర్ణ’

ఆకలి బాధ ఎలా ఉంటుందో స్వయంగా అనుభవించిన ఓ సాధారణ మహిళ ఆమె. వీధుల్లో ఆకలితో అలమటించే వారిని చూసి చలించిపోయి.. రోజుకు వందమంది కడుపు నింపాలని నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయం ఆమె వైవాహిక జీవితాన్ని బలితీసుకున్నా వెనకడుగు వేయకుండా పేదల పక్షాన నిలబడ్డారు పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాజులి బిశ్వాస్‌. నేడు స్థానికుల పాలిట ‘అన్నపూర్ణ’గా మారిన ఆమె కథ ఇది.

కొంతమంది తమ జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకునేందుకు జీవితాంతం అన్వేషిస్తారు. కానీ, కాజులి బిశ్వాస్‌ జీవితంలో ఆ పరమార్థం ‘కాలే కడుపు’ రూపంలో ఎదురైంది. పశ్చిమ బెంగాల్‌లోని కట్వా వీధుల గుండా రోజూ నడుస్తున్నప్పుడు ఫుట్‌పాత్‌లు, రైల్వే ప్లాట్‌ఫాంలు, రోడ్డు మూలల్లో అన్నం కోసం ఎదురుచూసే అమాయక ముఖాలు ఆమెను కలచివేసేవి. పేదరికాన్ని ఆమె మొదటిసారి చూడటం వల్ల కాదు.. ఆ నరకాన్ని ఆమె స్వయంగా అనుభవించడం వల్లే ఆ బాధ ఆమెకు తెలిసింది. కాజులీ నిరుపేద కుటుంబంలో జన్మించారు. ఒకపూట తిండి దొరికితే, రెండోపూట ఆకలితో అలమటించిన రోజులు ఎన్నో ఉన్నాయి. మిగతా పిల్లలు పరీక్షల గురించి, ఆటల గురించి ఆలోచిస్తుంటే.. కాజులి మాత్రం ఆకలి అనే నిత్య సత్యాన్ని ఎదుర్కొంటూ పెరిగారు. బాల్యంలో అనుభవించిన ఆ చేదు జ్ఞాపకాలు ఆమెను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. అందుకే వీధిలో ఆకలితో ఉన్న వ్యక్తిని చూసినప్పుడల్లా ఆమెకు అపరిచితుడు కనిపించలేదు.. తన చిన్ననాటి రూపమే కనిపించేది.


15 ఏళ్లకే పెళ్లి.. కొనసాగిన కష్టాలు

పేదరికం ఆమె జీవితాన్ని మరో క్లిష్టమైన మలుపు తిప్పింది. 15 ఏళ్ల వయసులోనే కాజులికి వివాహమైంది. పెళ్లయ్యాకైనా తన జీవితం మారుతుందని, కష్టాలు కడతేరుతాయని భావించారు. కానీ ఆ కలలు త్వరగానే కరిగిపోయాయి. అత్తారింట్లో కూడా ఆమెకు కష్టాలు, ఆకలి తప్పలేదు. తిండి విషయంలో రోజూ గొడవలు, సూటిపోటి మాటలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను అనుభవించిన ఈ బాధే ఆమెను ఇతరుల పట్ల మరింత కరుణ చూపేలా చేసింది. రోడ్లపై ఆకలితో పడుకునే వారిని చూసినప్పుడు.. ఒక రోజు కాజులి ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఆకలితో ఉన్న వారి కడుపు నింపాలని నిశ్చయించుకున్నారు. తన చుట్టూ ఉన్న వాళ్లు ఆకలితో పడుకోకూడదనే ఒకే ఒక్క సంకల్పంతో ఆమె ముందడుగు వేశారు.

భర్త నుంచి ఛీత్కారం

అన్నార్తుల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నాక కాజులి ఈ విషయాన్ని ఇంట్లో చెప్పినప్పుడు తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘నీకు రెండే దారులు. ఒకటి నాతో సంసారం చెయ్‌.. లేదా రోడ్డుపై ఆకలి ముఖాలకు అన్నం పెట్టు’ అని భర్త తెగేసి చెప్పేశాడు. అయితే, కాజులి మాత్రం ఏమాత్రం తడబడకుండా తన నిర్ణయాన్ని చెప్పేశారు. సంసారాన్ని వదులుకుని ఆకలితో ఉన్న పేదలనే ఎంచుకున్నారు.

చెవి కమ్మలే పెట్టుబడి

భర్త ఇల్లు వదిలిపెట్టిన కాజులి.. తన మిషన్‌ను ప్రారంభించేందుకు చెవి కమ్మలను అమ్మేశారు. అవే ఆమె ఆశయానికి మొదటి పెట్టుబడిగా మారాయి. తన కొడుకును వెంటబెట్టుకుని ఒక చిన్న అద్దె ఇంట్లోకి మారిన ఆమె.. తనకు అస్సలు పరిచయం లేని అపరిచితుల కోసం వంట చేయడం ప్రారంభించారు. ఆమె విజయం సాధిస్తుందని కానీ, ఎవరైనా సాయం చేస్తారని కానీ నమ్మకం లేదు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. ప్రారంభ రోజులు తీవ్ర అభద్రతతో గడిచాయి. చేతిలో డబ్బు లేదు, వనరులు తక్కువ. ప్రతిపూట అన్నం వండేందుకు ఎంతో శ్రమ, త్యాగం అవసరమయ్యాయి. రోజూ వందమందికి అన్నం పెట్టాలంటే డబ్బు కావాలి. కానీ కాజులి దగ్గర ఏమీ లేదు. అందుకోసం ఆమె రాత్రింబవళ్లు కష్టపడి పనిచేయడం ప్రారంభించారు. అలా వచ్చిన సంపాదనను తన సొంత అవసరాల కంటే ఎక్కువగా, ఇతరులకు అన్నం పెట్టడానికే వాడారు. మెల్లమెల్లగా ఆమె నిస్వార్థసేవ సమాజానికి తెలిసింది. ఆమె ప్రచారం కోసమో, గుర్తింపు కోసమో ఇది చేయడం లేదని స్థానికులు గుర్తించారు. ఇప్పుడామెకు చాలామంది చాలా రకాలుగా మద్దతు ఇస్తున్నారు. కొందరు బియ్యం, కూరగాయలు ఇస్తుంటే, మరికొందరు ఆర్థికంగా సాయం చేస్తున్నారు. ఇంకొందరు ఆమెకు అండగా నిలబడి ప్రోత్సహిస్తున్నారు.


ఆహారమే కాదు.. అంతకుమంచి

ప్రస్తుతం కాజులి రోజూ 100 మంది నిరుపేదలకు స్వయంగా వండి, వడిస్తున్నారు. వీధుల్లో ఆకలితో వేచి ఉండేవారికి కాజులి రాక అంటే ఆ రోజు భోజనం దొరికినట్టే. మనలో చాలామంది మర్చిపోయే ఒక నిజాన్ని కాజులి బలంగా నమ్ముతారు. ‘ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చేది మాత్రమే కాదు, అది ఒక మనిషిపై చూపే ప్రేమ, శ్రద్ధకు నిదర్శనం’ అంటారు కాజులి. ఒకప్పుడు తన తదుపరి పూట తిండి కోసం ఆందోళన చెందిన మహిళ.. నేడు ఇతరులు ఆ భయం లేకుండా బతికేలా చేస్తున్నారు. ఏమీ లేని శూన్యం నుంచి ప్రారంభమైన ఆమె ప్రయాణం నిజంగా అద్భుతం. ఇంత గుర్తింపు వస్తున్నా తన పని ఇంకా పూర్తికాలేదని కాజులి నమ్ముతారు. ఆమెకు ఇప్పుడు ఒక పెద్ద కల ఉంది. భవిష్యత్తులో ఒక అనాథ శరణాలయాన్ని నిర్మించి నిరుపేదలకు, దిక్కులేని వారికి ఒక సురక్షితమైన నీడను అందించాలని ఆమె ఆకాంక్షిస్తున్నారు. ఐశ్వర్యం, హోదా, బ్యాంకు బ్యాలెన్స్‌లతో విజయాన్ని కొలిచే ఈ ప్రపంచంలో కాజులి బిశ్వాస్‌ ఒక సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఆమె సాధించిన విజయాలు అవార్డులలో లేవు.. ఆమె వడ్డించే అన్నపు ప్లేట్లలోనూ, ఆకలి తీరిన పేదల కళ్లలో కనిపించే కృతజ్ఞతలోనూ ఉన్నాయి. దయాగుణానికి సంపద అవసరం లేదు, దానికి కావాల్సిందల్లా ఒక కఠినమైన నిర్ణయం తీసుకునే ధైర్యం.. ఇతరుల ఆకలిని తనదిగా భావించే హృదయం మాత్రమేనని కాజులి జీవితం మనకు గుర్తుచేస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి

తిరుగుబాటు ఎంపీలకు శివసేన ( (UBT) లీగల్ నోటీసులు

రామ్ మందిర్ సీఈఓ రేసులో మాజీ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్!

Updated Date - Jul 15 , 2026 | 05:32 AM