Share News

వేదనను దాటి... ఆసరా అయ్యారు!

ABN , Publish Date - Mar 16 , 2026 | 12:31 AM

జాజ్‌ సేథీ... బిలియర్డ్స్‌ దిగ్గజం గీత్‌ సేథీ కుమార్తె. రంగస్థల నటి, రచయిత్రి, ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్‌. కానీ ‘‘నాకు ‘డయాబెస్టీస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు’ అని...

వేదనను దాటి... ఆసరా అయ్యారు!

జాజ్‌ సేథీ... బిలియర్డ్స్‌ దిగ్గజం గీత్‌ సేథీ కుమార్తె. రంగస్థల నటి, రచయిత్రి, ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌, కొరియోగ్రాఫర్‌. కానీ ‘‘నాకు ‘డయాబెస్టీస్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు’ అని చెప్పుకోవడమే ఇష్టం’’ అంటారామె. 13 ఏళ్ళ వయసులో ‘టైప్‌-1 డయాబెటిస్‌ (టైప్‌1డి) బారిన పడిన జాజ్‌... జీవితాంతం దాన్ని భరించక తప్పదనే వాస్తవాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు. తన ఫౌండేషన్‌ ద్వారా వేలాదిమంది రోగులకు, వారి కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న 31 ఏళ్ళ జాజ్‌ సేథీ స్ఫూర్తిమంతమైన ప్రయాణం ఇది.

‘‘చిన్నప్పుడు క్రీడలంటే నాకు ఎంతో ఇష్టం. ఫుట్‌బాల్‌ బాగా ఆడేదాన్ని. స్కూల్‌లో ఒక టోర్నమెంట్‌ కోసం సిద్ధమవుతున్నప్పుడు.. హఠాత్తుగా ఆనారోగ్యానికి గురయ్యాను. వారం రోజుల్లోనే ఏడు కిలోల బరువు తగ్గిపోయాను. దాహం విపరీతంగా ఉండేది. దాంతో అమ్మా నాన్నా కంగారు పడి మా ఫ్యామిలీ డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్ళారు. ఆయన సూచన మేరకు వైద్య పరీక్షలు చేయించారు. నాకు షుగర్‌ తీవ్ర స్థాయిలో ఉందని నిర్ధారణ అయింది. నన్ను మూడు రోజులపాటు ఐసీయూలో ఉంచి చికిత్స చేశారు. డిశ్చార్జి చేసేటప్పటికి అంతా నయం అయిపోతుందనే ఆశతో ఉన్నాను. కానీ నాకు ‘టైప్‌-1 డయాబెటిస్‌’ (టైప్‌1డి) ఉందని, అది నయం కాని సమస్య అని, జీవితాంతం ఇన్సులిన్‌ వాడుతూ ఉండాల్సిందేనని వైద్యులు చెప్పారు. అప్పటికి నా వయసు పదమూడేళ్ళు.

ఆ ప్రశ్నలు వేధించేవి...

నేను గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టాను. మా నాన్న ప్రఖ్యాత బిలియర్డ్స్‌ క్రీడాకారుడు గీత్‌ సేథీ, అమ్మ కిరణ్‌ సేథీ పేరుపొందిన విద్యావేత్త. నా ఆరోగ్య పరిస్థితి ప్రభావం మానసిక స్థితిమీద, భావోద్వేగాల మీద పడకుండా వాళ్ళు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. నా జీవితం సజావుగా సాగడానికి వీలైన ప్రతిదీ చేశారు. అయితే నా శరీరంలో గ్లూకోజ్‌ స్థాయిల హెచ్చుతగ్గులను ఎప్పటికప్పుడు పరిశీలించడానికి, నేను వినియోగించే ఇన్సులిన్‌ క్రమబద్ధీకరణ కోసం నిరంతరం పని చేసే గ్లూకోజ్‌ మానిటర్‌ (సిఎంజీ)ని, ఇన్సులిన్‌ పంప్‌ను నాకు అమర్చారు. ఎక్కడికి వెళ్ళినా అది ఒక అవయవంలా నాతోపాటే ఉండేది. దానివల్ల ఎంతో ఇబ్బంది పడ్డాను. అలాగే తరచూ ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు చేయించుకోవాల్సి వచ్చేది. అప్పుడే టైప్‌1డితో సతమతమవుతున్న పేద పిల్లల దీనావస్థను ప్రత్యక్షంగా చూశాను. నా కుటుంబానికి స్థోమత ఉంది కాబట్టి సిఎంజీ లాంటివి కొనగలదు. మరి ఆ పిల్లల సంగతేమిటి? పెద్ద చదువులు చదువుకోని వారి తల్లిదండ్రులు... తమ పిల్లల పరిస్థితి గురించి సరైన సమాచారాన్ని, అవగాహనను ఎలా పొందగలరు? ఈ ప్రశ్నలు నన్ను వేధించేవి. మరోవైపు ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు చెందిన ఎందరో పిల్లలు టైప్‌1డి కారణంగా మరణిస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? అని ఆలోచించేదాన్ని. కొన్నేళ్ళ తరువాత... 2018లో ‘డయాబెస్టీస్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటుకు అలా పునాది పడింది.


33-Navya.jpg

8 లక్షల మందితో కమ్యూనిటీ...

వైద్య వ్యవస్థలో ఉన్న ఒక లోపాన్ని నేను గమనించాను. టైప్‌ 1 డయాబిబెటిస్‌ ఉన్నవారు ఆ సమస్యను ఎదుర్కొంటూ ఎలా జీవించవచ్చో వివరించేంత సమయం చాలామంది వైద్యులకు ఉండడం లేదు. ఒక సర్వే ప్రకారం... ఒక రోగి కోసం రెండున్నర నిమిషాలు మాత్రమే వైద్యులు కేటాయిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రోగులకు ప్రాథమిక స్థాయి నుంచి అన్ని విషయాలు వివరించడానికి ... సగటున 48 నిమిషాలు ఉండే ఆన్‌లైన్‌ కార్యక్రమానికి రూపకల్పన చేశాను. అలాగే ‘పెప్పీ’ అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ఏర్పాటు చేశాను. టైప్‌ 1 డయాబెటిస్‌ ఉన్న వారందరినీ ఒక కమ్యూనిటీగా ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టాను. ఇది క్రమంగా విస్తరించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షలమంది ఈ కమ్యూనిటీలో ఉన్నారు. దేశవ్యాప్తంగా 32 ఛాప్టర్స్‌ ఉన్నాయి. అవన్నీ ఏడాదికి మూడు సార్లు ‘డయామీట్స్‌’ పేరిట సమావేశాలు నిర్వహిస్తాయి. మరోవైపు... దేశంలోని 40 నగరాల్లో 500కు పైగా ‘డయామీట్స్‌’ను నిర్వహించాం. యూట్యూబ్‌లో దాదాపు 210 పైగా వీడియోలు ఉన్నాయి. వాటికి సుమారు ఏడు లక్షలమంది వీక్షకులున్నారు. వైద్యపరంగా, ఆర్థికపరంగా సుమారు 60 వేలమందికి టైప్‌1డి బాధితులకు ప్రత్యక్షంగా సాయపడ్డాం.

బాధిత కుటుంబాలకు ఆదాయ మార్గాలు

మా ఫౌండేషన్‌లో 50 మందికి పైగా పనిచేస్తున్నారు. వారందరూ టైప్‌1డి బాధితుల తల్లిదండ్రులు లేదా జీవిత భాగస్వాములు, బంధువులు. బాధితుల కుటుంబాలకు ఎదురయ్యే దీర్ఘకాలికమైన ఆర్థిక సవాళ్ళను పరిష్కరించడం కోసం... ‘ప్రాజెక్ట్‌ కాబిల్‌’ను కూడా ప్రారంభించాం. ఇది బాధిత కుటుంబాలకు, ముఖ్యంగా తల్లులకు ఆదాయ మార్గాలను చూపించడం మీద దృష్టి పెడుతుంది, వారి పిల్లల చికిత్స కోసం ఆర్థిక స్వయం సమృద్ధిని సాధించడంలో సాయపడుతుంది. మరో ప్రాజెక్ట్‌ ‘మిస్తీ’ ద్వారా కొన్ని వేలమంది పిల్లలకు ఇన్సులిన్‌ను, అవసరమైన ఇతర వస్తువులను ఉచితంగా అందజేశాం. ప్రస్తుతం 400 మంది వీటిని అందుకుంటున్నారు. ‘బ్యాక్‌ టు బేసిక్స్‌’ పేరుతో దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం. అలాగే ‘డి-టూర్‌’ పేరిట పాఠశాలలు, కళాశాలల్లో టైప్‌1డిపై అవగాహన కలిగిస్తున్నాం. ఈ దిశగా చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది. నేను నాట్యంలో శిక్షణ పొంది పలు ప్రదర్శనలు ఇచ్చాను. నాటకాల్లో నటిస్తున్నాను. కొరియోగ్రఫీ చేస్తున్నాను. రచయిత్రిగానూ గుర్తింపు ఉంది. కానీ ‘డయాబెస్టీస్‌ ఫౌండేషన్‌’ వ్యవస్థాపకురాలినని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. ఎందుకంటే ఇందులో నాకు ఎనలేని సంతృప్తి లభిస్తోంది.’’

ఇవి కూడా చదవండి:

వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..

డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా

Updated Date - Mar 16 , 2026 | 12:31 AM