Share News

సవాళ్లను గెలిచి స్ఫూర్తిగా నిలిచి

ABN , Publish Date - Jun 24 , 2026 | 06:25 AM

పదమూడేళ్ల సుదీర్ఘ కాలం... ఆసియా సీనియర్‌ జూడోలో భారత్‌ పతకం సాధించి. కానీ ఎంతోమంది అథ్లెట్లు ప్రయత్నించి... విఫలమైనచోట ఇనుంగాన్బి తాఖెల్లామబమ్‌ అద్భుతం చేసింది...

సవాళ్లను గెలిచి స్ఫూర్తిగా నిలిచి

విజేత

పదమూడేళ్ల సుదీర్ఘ కాలం... ఆసియా సీనియర్‌ జూడోలో భారత్‌ పతకం సాధించి. కానీ ఎంతోమంది అథ్లెట్లు ప్రయత్నించి... విఫలమైనచోట ఇనుంగాన్బి తాఖెల్లామబమ్‌ అద్భుతం చేసింది. ఈమధ్య చైనాలో జరిగిన చాంపియన్‌షి్‌పలో కాంస్య పతకం గెలిచి... అంతర్జాతీయ వేదికపై మన కీర్తి పతాక ఎగురవేసింది. ‘పతకాలు గెలవడం చాలా ముఖ్యం. నా కోసమే కాదు... అందరి కోసం.

ఎందుకంటే అది ఆలోచనా దృక్పథాన్నీ

మార్చేస్తుంది. అథ్లెట్లలో తాము ఏదైనా సాధించగలమనే నమ్మకాన్ని కలిగిస్తుంది’ అంటున్న ఇనుంగాన్బి... ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది.

‘‘చైనాలోని ఓర్డోస్‌ నగరం... ఆసియా సీనియర్‌ జూడో చాంపియన్‌షి్‌ప మహిళల 70 కిలోల విభాగం... కాంస్యం కోసం సమరం. ప్రత్యర్థిని లాక్‌ చేసి పతకం గెలిచినప్పుడు భావోద్వేగానికి లోనయ్యాను. ఆ క్షణం నాకు తెలియదు... అది పదమూడేళ్లుగా భారతీయులు ఎదురుచూస్తున్న నిరీక్షణకు తెర దించిందని. మా రాష్ట్రం మణిపూర్‌కే చెందిన అంగోమ్‌ అనితా చాను (2013) తరువాత ఆ ఘనత సాధించిన భారత అథ్లెట్‌ను నేనే అని. కోచ్‌ విషయం చెప్పాక ఎలా స్పందించాలో అర్థంకాలేదు. గతంలో పతకాలు కూడా మణిపూర్‌ నుంచే వచ్చినందుకు, ఆ వారసత్వాన్ని ఇన్నేళ్ల తరువాత తిరిగి నేను కొనసాగించినందుకు గర్వంగా అనిపించింది. ప్రస్తుతం అనిత టీమ్‌ ఇండియా మెంటార్‌గా ఉన్నారు. ఆమె సమక్షంలోనే పతకం సాధించడం నిజంగా మరుపురాని అనుభూతి. తను చాలా సంతోషించారు.

మలుపు తిప్పిన మజిలీ...

మొదటి నుంచీ నాకు క్రీడలంటే మక్కువ. అయితే ఏదో సరదాకు కాకుండా ప్రొఫెషనల్‌గా ఎదగాలని కోరుకున్నాను. దాని కోసం కష్టపడ్డాను. ‘నేషనల్‌ స్పోర్ట్స్‌ అకాడమీ’కి ఎంపికయ్యాను. అప్పుడు నేను చాలా చిన్నపిల్లని. కెరీర్‌లో ఎదగాలంటే ఏమేంకావాలో, ఆటను ఎలా మెరుగుపరుచుకోవాలో తెలిసేది కాదు. ఎప్పుడూ జాతీయ క్రీడలు ఆడకపోవడంతో మణిపూర్‌ మినహా మరే ఇతర రాష్ట్రాల క్రీడాకారులను చూసే అవకాశం నాకు దక్కలేదు. ఎప్పుడైతే తొలిసారి రాష్ట్ర జట్టుకు ఎంపికయ్యానో... అప్పుడు నా క్యాంపు ‘స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా’ (సాయ్‌)కు మారింది. ఇందుకు నాకు నాలుగేళ్ల సుదీర్ఘ సమయం పట్టింది. ‘సాయ్‌’కు వచ్చాక కెరీర్‌ వేగంగా పుంజుకుంది. కానీ ట్రయల్స్‌ దాటి ముందుకు వెళ్లలేకపోయాను. అయితే అక్కడ అంతర్జాతీయ, పతకాలు గెలిచిన అథ్లెట్లను కలిసే అవకాశం లభించింది. అందరి సహకారంతో నా మొదటి లక్ష్యం నెరవేరింది. 2014లో తొలిసారి జాతీయ క్రీడలకు ఎంపికయ్యాను. ఇక అక్కడి నుంచి పాల్గొన్న ప్రతి ఈవెంట్‌లో పతకం లేకుండా తిరిగి రాలేదు.


00-Untitled-1.jpgసర్జరీ తరువాత...

నా కెరీర్‌లో అతిపెద్ద మలుపు... ‘సాయ్‌’ నుంచి ‘ఇన్‌స్పైర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సపోర్ట్‌’ (ఐఐఎ్‌స)కు రావడం. ఇక్కడకు వచ్చాక నాకు అన్నివిధాలా మద్దతు లభించింది. అన్నిటికీ మించి ఒక అథ్లెట్‌కు కావల్సిన పూర్తి స్థాయి సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. దీంతో నా ఆలోచనా విధానమే మారిపోయింది. కేవలం భారత్‌లోనే కాకుండా... భారత్‌ బయట అంటే అంతర్జాతీయ స్థాయిలో కూడా పతకాలు గెలవాలనే ఆకాంక్ష బలపడింది. జూనియర్‌ టోర్నీల్లో నేను 63 కేజీల విభాగంలో పోటీపడేదాన్ని. 2018లో లిగమెంట్‌ గాయంతో సర్జీరీ చేయించుకోవాల్సి వచ్చింది. సర్జరీ తరువాత కోలుకోవడానికి చాలా సమయం పట్టడంతో, నా బరువు పెరిగింది. దాంతో 2020 నుంచి 70 కేజీల విభాగంలో పోటీపడుతున్నాను. అయితే ఇది అంత సులువు కాదు. ఎందుకంటే నా బరువు 66 కిలోల పరిధిలో ఉండేది. ప్రత్యర్థులు 72, 73 కిలోల బరువు గలవారు పోటీల నాటికి తగ్గించుకొని 70కి వస్తారు. అంత బరువున్నవారిని నేను ఎత్తి పడేయాలంటే కష్టంగా ఉంటుంది. అందుకే నేను టెక్నిక్స్‌ మీద ఎక్కువ దృష్టి పెట్టాను. ముఖ్యంగా చోక్‌, హోల్డ్‌, కంట్రోలింగ్‌ లాంటి గ్రౌండ్‌ టెక్నిక్స్‌ను శిక్షణలో సాధన చేశాను.

కామన్వెల్త్‌ గేమ్స్‌ కోసం...

చైనాలో జరిగిన ఆసియా జూడో చాంపియన్‌షి్‌ప క్వార్టర్‌ఫైనల్‌లో పోరాడి ఓడాను. కాంస్య పతక పోరులో వ్యూహాత్మకంగా ఆడి, బలం పుంజుకున్నాను. అలినా మోల్డోకులోవాపై గెలిచి పతకం సాధించాను. కఠోర పరిశ్రమ, నైపుణ్యం నాకు ఈ విజయాన్ని అందించాయి. ప్రస్తుతం జూలైలో స్కాట్లాండ్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌, ఆ తరువాత జపాన్‌లో నిర్వహించే ఆసియా గేమ్స్‌లో భారత్‌కు పతకాలు తీసుకురావడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాను. వాటిల్లో మెరుగైన ప్రదర్శన కనబరిస్తే నా ఒలింపిక్స్‌ (2028) కల నెరవేరుతుంది.

పతకం గెలవడం ముఖ్యం...

ఒక క్రీడాకారుడు పతకాలు గెలవడం మొదలుపెట్టినప్పుడు అది అందరి ఆలోచనా విధానాన్ని మార్చేస్తుంది. ‘ఆమె గెలవగలిగినప్పుడు నేనెందుకు గెలవలేను?’ అని ఆలోచించడం ఆరంభిస్తారు. దాంతో ఈవెంట్స్‌లో భయం పోయి, ‘నేను కూడా పోటీపడగలను. నేను కూడా సాధించగలను’ అనే ఆత్మవిశ్వాసం వస్తుంది. కానీ ఎవరూ గెలవకుండా, కేవలం ఓటములే ఎదురైతే పతకాలు గెలవడం సాధ్యం కాదని ఔత్సాహికులు భావిస్తారు. తరువాతి తరం కూడా ‘ఇది చాలా కష్టమని, బహుశా సాధించలేమని నమ్మడం మొదలుపెడుతుంది. ఆ ఆలోచనా విధానం అలాగే ఉండిపోతే భవిష్యత్తులో గెలుపు అనేది అందని ద్రాక్షలా మారుతుంది. అందుకే అంతర్జాతీయ టోర్నీల్లో పోటీపడటమే కాదు... పతకం తీసుకురావడం కూడా ఎంతో ముఖ్యం. అదే నా ధ్యేయం. నేను గెలుస్తుంటే... ‘నేను కూడా చేయగలను’ అని నా తరం నమ్ముతుంది.


నా విజయం వెనుక ఆయన...

నేను ఈ స్థాయికి రాగలిగానంటే అందులో నా కోచ్‌లతో పాటు నా భర్త ఆశి్‌షకుమార్‌ చౌదరి ప్రోత్సహం, మద్దతు ఎంతో ఉంది. రెండేళ్ల కిందట మేం పెళ్లి చేసుకున్నాం. తను కూడా క్రీడాకారుడే. ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగంలో తీరిక లేకపోవడంతో తన క్రీడా జీవితానికి విరామం ఇచ్చారు. ప్రధాన ఈవెంట్స్‌లో పతకాలు గెలవాలన్న తన కలను నా ద్వారా తీర్చుకొంటున్నారు.’’

ఇవి కూడా చదవండి:

భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం

టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి

Updated Date - Jun 24 , 2026 | 06:25 AM