పంచ్‌ల వెనుక పోరాటం!
ABN , Publish Date - Aug 06 , 2026 | 03:31 AM
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకాలతో భారత్ గర్వపడేలా చేసిన మహిళా బాక్సర్లు.. కేవలం రింగులోనే కాదు.. నిజ జీవితాల్లోనూ అద్భుత విజయాలు సాధించారు. సినీ కథలకు...
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణపతకాలతో భారత్ గర్వపడేలా చేసిన మహిళా బాక్సర్లు.. కేవలం రింగులోనే కాదు.. నిజ జీవితాల్లోనూ అద్భుత విజయాలు సాధించారు. సినీ కథలకు తీసిపోని వారి పోరాట పటిమ, చిన్ననాటి ముచ్చట్లు, కుటుంబ త్యాగాలు, క్రీడా ప్రయాణం ఇది.
బాక్సింగ్ పసిడి ముత్యాలు
అరుంధతి చౌదరి- 70 కేజీలు (కోటా, రాజస్థాన్)
ప్రీతి పవార్-54 కేజీలు (భివానీ, హరియాణా)
సాక్షి చౌదరి - 51 కేజీలు (భివానీ, హరియాణా)
ప్రియా ఘంఘాస్- 60 కేజీలు (భివానీ, హరియాణా)
ప్రియా ఘంఘాస్
కుటుంబ త్యాగానికి నజరానా
హరియాణాకే చెందిన 20 ఏళ్ల ప్రియా ఘంఘాస్ ప్రయాణం.. ఒక మధ్యతరగతి కుటుంబం తమ కుమార్తె ఆశయం కోసం చేసిన మహోన్నత త్యాగం చుట్టూ తిరుగుతుంది. ప్రియకు 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు (2015లో) ఆమెలోని బాక్సింగ్ నైపుణ్యాన్ని తండ్రి మహేంద్ర ఘంఘాస్ గుర్తించారు. జాతీయ మాజీ ఛాంపియన్ రవి సాంగ్వాన్ వద్ద శిక్షణ ప్రారంభించిన ప్రియ.. మొదట్లో తన అన్నయ్య నీరజ్‌తో కలిసి ఇంట్లో, స్థానిక క్లబ్‌లలో సాధన చేసేది. ప్రియ ప్రతిభను గుర్తించిన తండ్రి ఆమెను భివానీలోని ‘స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (సాయ్) బాక్సింగ్ అకాడమీలో చేర్పించాలని కలలు కన్నారు.
2022లో ప్రియకు అకాడమీలో సీటు లభించింది. సాధారణంగా హరియాణాలోని గ్రామీణ కుటుంబాలు తమ సొంత ఇల్లు, ఊరు వదిలి వెళ్లడానికి ఇష్టపడవు. కానీ మహేంద్ర తన కుమార్తె బాక్సింగ్ కల నెరవేర్చడం కోసం ఊరిని వదిలి కుటుంబంతోపాటు భివానీ నగరానికి వలస వచ్చేశారు. కుటుంబం చేసిన ఈ త్యాగం ప్రియపై పెద్ద బాధ్యతను ఉంచింది. కోచ్ మహావీర్ నేతృత్వంలో రాత్రింబవళ్లు శ్రమించిన ప్రియ.. 20 ఏళ్ల వయసులోనే ఆసియా ఛాంపియన్‌షి్‌పలో ప్రపంచ ఛాంపియన్లను ఓడించి సంచలనం సృష్టించింది.
రింగ్‌లో పులిలా గర్జించే ప్రియ.. రింగ్ బయట మాత్రం ఎంతో సున్నితమైన పల్లెటూరి అమ్మాయి. ప్రాక్టీస్ క్యాంపుల నుంచి బ్రేక్ దొరికితే చాలు నేరుగా ఇంటికి వచ్చేస్తుంది. మూడేళ్ల క్రితం వీధిలో దొరికిన ఒక కుక్కపిల్లకు ‘రాజా’ అని పేరు పెట్టుకుని దానితో ఆడుకోవడం, బైక్‌పై లాంగ్ రైడ్స్ వెళ్లడం ఆమెకు ఎంతో ఇష్టం. అన్నింటికంటే ముఖ్యంగా అమ్మ చేతి ‘చూర్మా’ (హర్యానా ప్రత్యేక తీపి పదార్థం) తినడం అంటే ఆమెకు ప్రాణం. గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో 60 కేజీల విభాగంలో కెనడా ప్రత్యర్థి మేరీ బాతూల్ అల్ అహ్మదియేపై 4-1 తేడాతో విజయం సాధించి తన కుటుంబ త్యాగానికి స్వర్ణ పతకంతో నజరానా అందించింది.
అరుంధతి చౌదరి
గణిత మేధావి.. రింగ్ విప్లవం
రాజస్థాన్‌లోని ‘కోటా’ అనగానే అందరికీ చప్పున స్ఫురించేది ఐఐటీ కోచింగ్‌లు, ఐఐటీ కలలే గుర్తొస్తాయి. అరుంధతి చౌదరి కథ కూడా అలాగే ప్రారంభమైంది. చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా ఉండే అరుంధతికి.. ముఖ్యంగా గణితంలో అద్భుతమైన ప్రతిభ ఉండేది. కూతురి తెలివితేటలు చూసి ఆమెను ఎలాగైనా ఐఐటీలో చేర్పించి పెద్ద ఇంజనీర్‌ను చేయాలని ఆమె తండ్రి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. కానీ అరుంధతి మనసు మాత్రం పుస్తకాల మధ్య కాకుండా క్రీడా మైదానంలో ఊగిసలాడేది. మొదట్లో బాస్కెట్‌బాల్ ప్రాక్టీస్ చేసిన ఆమె.. 15 ఏళ్ల వయసులో బాక్సింగ్ రింగ్ వైపు ఆకర్షితురాలైంది.
ఐఐటీ చదవాల్సిన కూతురు బాక్సింగ్ గ్లోవ్స్ తొడగడం తండ్రికి అస్సలు నచ్చలేదు. గల్లీ నుంచి జాతీయస్థాయికి వెళ్లడం అంత సులభం కాదని ఆయన భావించారు.
కానీ అరుంధతి తన పట్టుదలను వదల్లేదు. ఒకరోజు తల్లిముందు కన్నీళ్లు పెట్టుకుని తన క్రీడా కల గురించి చెబుతూ బతిమాలింది. కుమార్తె తపనను అర్థం చేసుకున్న తల్లి.. భర్తను ఒప్పించింది. ఇక అక్కడి నుంచి అరుంధతి
వెనుదిరిగి చూసుకోలేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తూ తన పంచ్‌ల పవర్‌తో తండ్రి నమ్మకాన్ని గెలుచుకుంది.
అయితే అరుంధతి ప్రయాణం ఎప్పుడూ పూలబాట కాదు. పారిస్ ఒలింపిక్ అర్హత టోర్నీ సమయంలో ఓటమిని ఎదుర్కొన్న అరుంధతి మానసిక వేదనకు గురైంది. దాదాపు రెండు నెలలపాటు గ్లోవ్స్‌ను పక్కన పడేసి ఆటకు దూరంగా ఇంట్లోనే ఉండిపోయింది. క్రీడా జీవితం ముగిసిపోయిందనుకున్న వేళ.. మళ్లీ తనలోని పట్టుదలను నిద్రలేపి ఫీనిక్స్ పక్షిలా కోలుకుని కమ్‌బ్యాక్ ఇచ్చింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 70 కేజీల విభాగం ఫైనల్‌లో ఇంగ్లాండ్‌కు చెందిన చాంటెల్ రీడ్‌ను 5-0తో ఏకపక్షంగా ఓడించి స్వర్ణాన్ని ముద్దాడింది. ప్రస్తుతం భారత సైన్యంలో హవల్దార్‌గా పనిచేస్తున్న అరుంధతి.. చదువుల ఒత్తిడిని అధిగమించి క్రీడల్లో స్వయం ప్రతిభను చాటుకున్న ఒక రోల్ మోడల్!

ప్రీతి పవార్
అయిష్టం నుంచి అత్యున్నత శిఖరానికి
హరియాణాలోని భివానీ నగరానికి భారత బాక్సింగ్ రంగంలో ఒక ప్రత్యేకత గుర్తింపు ఉంది. దానిని ‘భారత బాక్సింగ్ నర్సరీ’ అని పిలుస్తారు. అలాంటి ఊరి నుంచి వచ్చిన 23 ఏళ్ల
ప్రీతి పవార్ కథ ఎంతో ఆసక్తికరం. ఆమె తండ్రి సోమ్‌వీర్ పవార్ హరియాణా పోలీస్ శాఖలో ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, తల్లి శమీన్‌దేవి గృహిణి. క్రీడా నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టినప్పటికీ.. ప్రీతికి చిన్నతనంలో బాక్సింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. పంచ్‌లు విసరడం, దెబ్బలు తిని రింగ్‌లో నిలబడటం అంటే భయపడేది.
అయితే మాజీ బాక్సర్ అయిన ఆమె బాబాయ్ వినోద్ పవార్.. ప్రీతిలోని శారీరక దృఢత్వం, ఫైటింగ్ స్పిరిట్‌ను గమనించారు. ఆమె తండ్రిని ఒప్పించి బలవంతంగా బాక్సింగ్ క్లబ్‌లో చేర్పించారు. ఎనిమిదేళ్ల క్రితం ప్రాక్టీస్ భరించలేక, ఆట నచ్చక బాక్సింగ్ మానేస్తానని పట్టుబట్టింది ప్రీతి. కానీ బాబాయ్ క్రమశిక్షణ, తండ్రి ప్రోత్సాహం ఆమె ఆలోచనా విధానాన్ని మార్చాయి. రోజుకు 6 నుంచి 8 గంటలు కఠోర సాధన చేస్తూ రింగ్‌ను తన సొంతం చేసుకుంది.
గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల 54 కేజీల విభాగంలో కెనడా బాక్సర్ స్కార్లెట్ డెల్గాడోపై 5-0తో తిరుగులేని విజయం సాధించి బాక్సింగ్‌లో భారత్‌కు మొదటి స్వర్ణ పతకాన్ని అందించింది. అంతేకాదు, క్రీడల్లో ఆమె సాధించిన విజయాలను గుర్తించిన భారత సైన్యం నేరుగా ‘జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్’గా నియమించింది. భారత సైన్యంలో ఈ గౌరవాన్ని పొందిన తొలి మహిళా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించిన ప్రీతి పవార్ ప్రయాణం .. కష్టపడితే అయిష్టమైన రంగంలోనూ అగ్రస్థానానికి చేరుకోవచ్చని నిరూపిస్తోంది.
సాక్షి చౌదరి
వీధి గొడవల రౌడీ
హరియాణాలోని భివానీ జిల్లా ‘ధనానా’ గ్రామానికి చెందిన 25 ఏళ్ల సాక్షి చౌదరి వ్యక్తిగత జీవితం ఒక సినిమాలా ఉంటుంది. చిన్నతనంలో సాక్షికి అమితమైన కోపం ఉండేది. బడిలో గానీ, వీధిలో గానీ ఎవరితోనైనా సరే ఇట్టే గొడవ పడేది. గొడవల్లో రోజూ ఎవరినో ఒకరిని కొట్టడం, ఊరి జనాలు ఆమెపై ఫిర్యాదు చేసేందుకు ఇంటికి రావడం సర్వసాధారమైపోయింది. కూతురిలోని ఈ అపరిమితమైన కోపాన్ని, ఆవేశాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. దీంతో తండ్రి మనోజ్ కుమార్ ఒక భిన్నమైన నిర్ణయాన్ని తీసుకున్నారు.
2008 ఒలింపిక్స్‌లో విజేందర్‌సింగ్ సాధించిన విజయాన్ని చూసి స్ఫూర్తిపొందిన ఆయన ‘‘నా కూతురి చేతుల్లో ఉన్న దుమ్మును గల్లీల్లో కాకుండా రింగులో చూపిస్తాను’’ అని నిశ్చయించుకున్నారు. 2012లో (సాక్షికి 9 ఏళ్లు ఉన్నప్పుడు) ప్రసిద్ధ కోచ్ జగదీశ్ వద్ద బాక్సింగ్‌లో శిక్షణ కోసం చేర్పించారు. తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ సాక్షి రింగ్‌లో తన ఆవేశాన్ని ప్రత్యర్థులపై పంచ్‌ల రూపంలో కురిపించడం మొదలుపెట్టింది. అయితే సీనియర్ స్థాయిలో కెరీర్ కొనసాగుతున్న సమయంలో భుజం గాయాలు ఆమెను వేధించాయి. దీంతో రెండు పెద్ద టోర్నీలను కోల్పోవడంతో కెరీర్ ముగిసిపోయిందని అనుకున్నారు.
కానీ సాక్షి వెనకడుగు వేయలేదు. ప్రస్తుతం భారత సైన్యంలో హవల్దార్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్న సాక్షి.. ఆర్మీ అందించిన కఠిన శిక్షణతో మానసికంగా మరింత దృఢంగా మారింది. ఒలింపిక్ పతక విజేత నిఖత్ జరీన్‌ను కామన్వెల్త్ ట్రయల్స్‌లో ఓడించి అర్హత సాధించిన సాక్షి.. గ్లాస్గోలో 51 కేజీల విభాగం ఫైనల్‌లో ఇంగ్లాండ్ అథ్లెట్ రూబీవైట్‌ను 5-0తో ఓడించి స్వర్ణం సొంతం చేసుకుంది. ఒకప్పుడు ‘వీధిరౌడీ’గా పేరుతెచ్చుకున్న అమ్మాయి నేడు దేశ సరిహద్దులను కాపాడే సైనికురాలిగా, దేశానికి పసిడి తెచ్చిన చాంపియన్‌గా నిలవడం విశేషం.
ఇవీ చదవండి:
'నేను ఎంకే స్టాలిన్ తనయుడిని'.. ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు బడ్జెట్: పుట్టిన బిడ్డకు గోల్డ్ రింగ్.. జెన్ జీకి రూ.2 వేల కోట్లు