Share News

కథ కంచికి వెళ్లిపోకుండా...

ABN , Publish Date - Mar 05 , 2026 | 04:34 AM

మంచిని బోధించిన ఒకప్పటి కథలు క్రమేపీ కాలగర్భంలో కలిసిపోవడం సహించలేని హైదరాబాద్‌కు చెందిన ప్రియా చౌదరి, వాటిని కొత్త మార్గాల్లో నేటి పిల్లలకు పరిచయం చేయాలని...

కథ కంచికి వెళ్లిపోకుండా...

వినూత్నం

మంచిని బోధించిన ఒకప్పటి కథలు క్రమేపీ కాలగర్భంలో కలిసిపోవడం సహించలేని హైదరాబాద్‌కు చెందిన ప్రియా చౌదరి, వాటిని కొత్త మార్గాల్లో నేటి పిల్లలకు పరిచయం చేయాలని కంకణం కట్టుకుంది. ఆ క్రమంలో ‘విను మరీ’ పేరుతో, ఆడియో పుస్తకాలు, సాధారణ పుస్తకాలు, యూట్యూబ్‌ల ద్వారా అలనాటి మేటి కథలను వినిపిస్తూ, శ్రోతల మనసులను గెలుచుకోవడం మొదలుపెట్టింది. కొవిడ్‌ కాలంలో మొదలై నేటికీ నిరాఘాటంగా సాగుతున్న ఆ కథా ప్రయాణం ఆమె మాటల్లోనే....

అమ్మ చెప్పే కథ ఎంత కమ్మగా ఉన్నా, ఒక్కోసారి పిల్లల ఏకాగ్రత చెదురుతూ ఉంటుంది. అది గ్రహించిన అమ్మ, ‘కథ చెప్పమని అడిగావు కదా, ‘విను మరీ’ అంటూ పిల్లల్లో తిరిగి ఆసక్తిని నింపుతుంది. ఈ మాట ప్రతి ఇంట్లో వినిపించేదే కాబట్టి నా కథా ప్రయాణానికి ఆ మాటనే ఎంచుకున్నాను. చిన్నప్పుడు నాన్నగారు, విజయవాడ, చెన్నై నుంచి కథల పుస్తకాలు తెప్పించేవాళ్లు. అమ్మా నాన్న ఇద్దరూ కథలు చెప్పేవాళ్లు. అలా పుస్తకాలు చదువుతూ, కథలను వింటూ ఎన్నో విలువలను నేర్చుకున్నాను. కథ మంచి అలవాట్లను నేర్పించాలి. నీతిని బోధించాలి. అన్నిటికంటే ముఖ్యంగా జీవన నైపుణ్యాలను మెరుగుపరచాలి. అలాంటి కథలు క్రమేపీ మరుగున పడిపోతున్నాయి. ఆ కథలను తిరిగి పిల్లలకు, పెద్దలకూ పరిచయం చేయాలనే ఆలోచనతో 2020 కొవిడ్‌ కాలంలో ఈ ప్రయత్నానికి పూనుకున్నాను.

ప్రముఖుల తోడ్పాటుతో...

చిన్నప్పటి నుంచీ వ్యాసాలు రాయడం అలవాటు. హిందూ దినపత్రికలో, పిల్లల కథల పుస్తకాల్లో ప్రచురితమయ్యాయి. ఈ ఆసక్తి వయసుతో పాటు పెరిగింది. దీనికి అమ్మ ప్రోత్సాహం కూడా తోడైంది. అలా ప్రారంభంలో ఆడియో స్టోరీ బుక్స్‌తో శ్రీకారం చుట్టాను. కథ వినే వారికి పదజాలం, పద ఉచ్ఛారణ మెరుగుపడాలి. అలాగే భావం తెలియాలి. కాబట్టి గాయకులు శ్రీకృష్ణ, గోపిక పూర్ణిమ, తనికెళ్ల భరణి కధలకు స్వరాలనిచ్చారు. కార్తీక్‌ సంగీత దర్శకత్వం వహించారు.తమిళంలో సైంధవి ఇవే కథలను వినిపించారు. ఈ ప్రయత్నానికి నటులు రాణా తోడ్పాటు కూడా ఎంతో ఉంది. ఇలా ప్రముఖుల ప్రమేయంతో ఆడియో బుక్స్‌ అన్నిటినీ శ్రోతలకు వీలైనంత చేరువ చేయగలిగే ప్రయత్నానికి పూనుకున్నాను. శ్రీకృష్ణ గారు.. వేమన పద్యాలు, పిట్ట కథలు, జై వీరాంజనేయ ఆడియోలకు తన గొంతును అందిస్తే, ఆయన, వాయిస్‌ ఓవర్‌ ఆర్టిస్ట్‌ శిల్ప కలిసి సాయి పారాయణం ఆడియో బుక్‌కు సహాయపడ్డారు. అలా ఆడియోబుక్స్‌, శ్రీరామ, శ్రీకృష్ణుడు పేపర్‌బ్యాక్‌ బుక్స్‌ ప్రచురించాం. ఆ తర్వాత వేమన పద్యాలతో పాటు పర్ల్స్‌ ఆఫ్‌ విజ్‌డమ్‌, ప్యారీ ఛోటీ కహానీ మొదలైన పుస్తకాలను తెలుగు, హిందీ, తమిళం, ఇంగ్లీషు భాషల్లో ప్రచురించి, దేశ వ్యాప్తంగా కొన్ని సంస్థలకు, పాఠశాలలకూ, పిల్లలకు చేరుతుందనుకున్న ప్రతి ప్రదేశంలో డొనేట్‌ చేశాం. అన్ని కుటుంబాలకూ కథల పుస్తకాలు కొనేంత స్థోమత లేకపోవచ్చు కాబట్టి కిరణ్‌ బేడీ ఇండియా విజన్‌, తమిళనాడులో అగరం ఫౌండేషన్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌కు ఆ పుస్తకాలను అందచేశాం. పర్ల్స్‌ ఆఫ్‌ విజ్‌డమ్‌ పుస్తకావిష్కరణ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగింది.


ఊహలకు రెక్కలు తొడగడం కోసమే...

తాజాగా చాణక్య నీతి ప్రాజెక్టు పనిలో ఉన్నాను. దీన్లో తనికెళ్ల భరణి గారు సంస్కృతంలో శ్లోకం చెప్తే, 11 ఏళ్ల పాప ఇంగ్లీ్‌షలో ఆ శ్లోకానికి అర్థం చెప్పి, అనుబంధంగా కథ చెప్తుంది. ఇప్పటి పిల్లలకు చాణుక్యుడి గురించి తెలియదు. ఆయన స్థాపించిన తక్షశిల విశ్వవిద్యాలయంలో బోధించిన బోధనలు మనుషులు భూమి మీదున్నంతకాలం ఉపయోగపడతాయి. వీళ్లిద్దరితో కలిపి పంచతంత్ర కథలను కూడా రూపొందిస్తున్నాం. అయితే కథలన్నిటినీ పుస్తకాలకూ ఆడియో బుక్స్‌కే పరిమితం చేయడానికి కూడా ఓ కారణం ఉంది. కథ విన్నప్పుడు ఆ కథలోని పాత్రలను ఎవరికి నచ్చినట్టు వాళ్లు ఊహించుకునే వెసులుబాటు చిక్కుతుంది. కానీ వీడియోలో మనం చూపించే పాత్రలే మనసుల్లో ముద్రించుకుపోతాయి. నాకది ఇష్టం లేదు. ప్రతి ఒక్కరి ఊహాశక్తి భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఊహలకు రెక్కలు తొడగడం కోసమే ఇలా ఆడియో బుక్స్‌కే పరిమితమయ్యాను. ఈ కథలతో ప్రధానంగా పిల్లలకెన్నో ప్రయోజనాలు దక్కుతాయి. జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయి. ఉదాహరణకు పంచతంత్ర పుస్తకాన్నే తీసుకుంటే, దాన్లో లెక్కలేనన్ని జీవననైపుణ్యాలు మనకు కనిపిస్తాయి. వేమన పద్యాలన్నీ ఆర్థిక సలహాలు, జీవన నైపుణ్యాల సమాహారాలే! ప్రస్తుతం, యాపిల్‌, ఆడిబుల్‌, స్టోరీటెల్‌, యూట్యూబ్‌ల, స్పాటిఫై ద్వారా ఆడియో బుక్స్‌ను అందిస్తున్నాను. మన దేశంతో పాటు విదేశాల్లోని అనేక మంది శ్రోతలు ఈ ఆడియోబుక్స్‌కు అభిమానులుగా మారుతూ ఉండడం సంతోషంగా ఉంది.

పిల్లలకు ఇంగ్లీషు నవలలా?

ఓసారి పార్కులో కూర్చున్నప్పుడు నాకు కొద్ది దూరంలో ఉన్న ఒక మహిళ, తొమ్మిదో తరగతి చదువుతున్న తన కూతురికున్న పుస్తక పఠనాసక్తి గురించి మరొక మహిళకు గొప్పగా వివరిస్తోంది. వాళ్ల సంభాషణను చెవులు రిక్కించి వినకపోయినా, ఆ మాటలు నా చెవిలో పడుతున్నాయి. అనుకోకుండా ఆమె నా దగ్గరకొచ్చి పలుకరించి, మాటలు కలిపింది. నేనప్పుడు ‘మీ పాప పంచతంత్ర చదివిందా?’ అని అడిగాను. ‘మా అమ్మాయి అవన్నీ చదవదు. కేవలం ఇంగ్లీష్‌ నవలలే చదువుతుంది’ అని చెప్పింది. ఆ అమ్మాయి, ఇంగ్లీష్‌ నవలా రచయిత సిడ్నీ షెల్డన్‌ పుస్తకాలు చదువుతోందని తర్వాత, ఆమె మాటల ద్వారా తెలిసింది. అసలా పుస్తకంలో ఏముంటుందో కూడా తల్లికి తెలియకపోవడం, చక్కని తెలుగు కథా పుస్తకాలను వదిలేసి, ఇంగ్లీషు నవలలు చదివే కూతురి గురించి ఆ తల్లి గొప్పగా చెప్పుకోవడం నాకెంతో బాధేసింది. పైగా ‘ఈ పుస్తకంలో ఉన్నదానికీ, నిజజీవితంలో జరుగుతున్నదానికీ సంబంధం లేదేంటి?’ అని కూతురు అడిగే ప్రశ్నకు తల్లి సమాధానం చెప్పలేకపోతున్నట్టు కూడా ఆమె మాటల ద్వారా గ్రహించాను. పిల్లలు ఇంగ్లీషు పుస్తకాలు చదవడం తప్పు కాదు. కానీ వాళ్ల వయసుకు తగ్గట్టు లియో టాల్‌స్టాయ్‌, యూసప్స్‌ ఫేబుల్స్‌, ఎనిడ్‌ బ్లైటన్‌ కథల పుస్తకాలు కూడా ఉన్నాయి. వాటికి బదులుగా పెద్దలకు ఉద్దేశించిన నవలలు చదవడం ఎంతవరకూ సమంజసం? గతంతో పోలిస్తే, నేడు పిల్లలకు సేఫ్‌ టచ్‌ గురించి బోధించేటంత దారుణమైన స్థితికి చేరుకున్నాం. కథలు వినడం, చదవడం వల్ల ఈ అంశం పట్ల అవగాహన పెరుగుతుంది. చదువు ప్రాముఖ్యం తెలిసొస్తుంది. తల్లితండ్రువులు, గురువుల పట్ల గౌరవం పెరుగుతుంది. స్నేహ ధర్మం విలువ తెలుస్తుంది.

గోగుమళ్ల కవిత


అంధుల కోసం బ్రెయిలీలో...

చిన్న జియర్‌స్వామి గారి ఆశ్రమానికి చెందిన నేత్ర విద్యాలయలో పాక్షిక అంధ బాలబాలికలున్నారు. వాళ్ల కోసం బ్రెయిలీలో పుస్తకం ప్రచురించాను. వేద పాఠశాలలో పిల్లలకు ఆడియో బుక్స్‌ అందించాను. మున్ముందు అంధ పిల్లలకూ, కథల పుస్తకాలు కొని చదివే వీల్లేని పిల్లలందరికీ ఆడియో బుక్స్‌ అందించాలని ఉంది. మరణానికి చేరువైన వ్యక్తులకు ఆశ్రయమిచ్చే హాస్పైస్‌ కేర్‌లో గ్రంథాలయానికి కూడా పుస్తకాలు అందించాను. అలాగే స్టోరీ టెల్లింగ్‌ సెషన్‌ కూడా చేశాను.

ఇవి కూడా చదవండి..

రాజీనామా దిశగా నితీశ్ కుమార్.. రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం

మాది పాలు.. తేనె సంబంధం

Updated Date - Mar 05 , 2026 | 04:34 AM