అధిక పీచుతో ఆరోగ్యం
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:00 AM
పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే పోషకంగా ఎంతోకాలంగా ప్రచారం పొందుతున్న ప్రొటీన్ స్థానాన్ని తాజాగా పీచు ఆక్రమించేసింది. మంచి బ్యాక్టీరియాను...
పోకడ
పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని అందించే పోషకంగా ఎంతోకాలంగా ప్రచారం పొందుతున్న ప్రొటీన్ స్థానాన్ని తాజాగా పీచు ఆక్రమించేసింది. మంచి బ్యాక్టీరియాను పెంచి పేగుల ఆరోగ్యానికి దోహదపడే పీచు కచ్చితంగా ఆరోగ్యకరమే! అయితే అధిక పీచు తీసుకోవడంతో పాటు అదనంగా కొన్ని జాగ్రత్తలు పాటించగలిగినప్పుడే, ఆరోగ్యం భేషుగ్గా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం!
రోజుకు 25 నుంచి 30 గ్రాముల పీచు తినే ఆహారంలో ఉండేలా చూసుకోవడం ఆరోగ్యకరం. ఎందుకంటే, వృక్షాహారాల్లో ఉండే పీచు అనే ఒక రకానికి చెందిన పిండిపదార్థాన్ని మన శరీరం జీర్ణం చేసుకోలేదు. కాబట్టి ఈ పీచు శోషణ చెందకుండా పేగుల గుండా కదులుతూ విసర్జక పదార్థంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ క్రమంలో అనేక ముఖ్యమైన జీవక్రియలకు దోహదపడుతుంది. అధిక పీచుతో గుండె జబ్బులు, టైప్2 మధుమేహం, పెద్దపేగు క్యాన్సర్ల నుంచి రక్షణ దక్కుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. అయితే పీచు గురించి ముఖ్యంగా తెలుసుకోవలసిన కొన్ని అంశాలున్నాయి. ఆహారంగా తీసుకునే పీచులో సాల్యుబుల్, ఇన్‌సాల్యుబుల్ అనే రెండు రకాలుంటాయి. ఇవి రెండూ ముఖ్యమైన పాత్రలనే పోషిస్తాయి. సాల్యుబుల్ ఫైబర్ నీళ్లలో కరిగి జెల్‌ను పోలిన పదార్థంగా మారుతుంది. ఇది జీర్ణక్రియను నెమ్మదింపచేసి, రక్తంలోని చక్కెరను స్థిరంగా ఉంచి, కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రిస్తుంది. ఉదాహరణకు ఓట్స్, బార్లీ, చియా విత్తనాలు, పప్పుధాన్యాలు, అవిసెగింజలు, యాపిల్స్ ఈ కోవకు చెందినవే! మరో వైపు నీటిలో కరగని ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ ఆహారం పేగుల్లో సులభంగా కదలడానికీ, విసర్జకం పరిమాణాన్ని పెంచి సులభ విరోచనం జరగడానికి సహాయపడుతుంది. బ్రొకొలి, క్యారట్లు, కాలిఫ్లవర్ ఈ కోవకే చెందుతాయి. సాల్యుబుల్ ఫైబర్ స్పాంజిలా కొలెస్ట్రాల్ లాంటి వాటిని పీల్చుకుంటే, ఇన్‌సాల్యుబుల్ ఫైబర్ చీపురులా పేగుల్లో పదార్థాల కదలికకకు తోడ్పడుతుంది. కాబట్టి మనకు ఈ రెండు రకాల పీచుపదార్థాలూ అవసరమే! వృక్షాహారాల్లో ఈ రెండు ఫైబర్లూ ఉంటాయి. జీర్ణక్రియ సాఫీగా జరగడానికి సహాయపడడంతో పాటు, పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను, రక్తంలోని చక్కెరనూ స్థిరంగా ఉంచి, జీవక్రియలన్నీ సజావుగా జరగడానికి ఈ రెరడు పీచులూ తోడ్పడుతూ ఉంటాయి.
అధిక పీచు వీటిలో...
ఆహారంలో పీచును పెంచాలనుకుంటే బఠాణీ, పప్పుధాన్యాలు, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ తీసుకోవాలి. వీటిని సలాడ్స్‌గా, స్నాక్స్‌గా ప్రతి రోజూ తినాలి. పాలిష్ పట్టిన గోధుమలు, బియ్యానికి బదులుగా ఓట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్ లాంటి తృణ ధాన్యాలు తీసుకోవచ్చు. యాపిల్స్, పియర్స్, బెర్రీస్, బ్రొకొలి, క్యారట్స్, ఆకుకూరలు అద్భుతమైన పీచు పదార్థాలు. వీలైనంత వరకూ పండ్లు, కూరగాయలను తొక్కుతోనే తినాలి. చియా సీడ్స్, అవిసె గింజలు, బాదం, వాల్‌నట్స్‌ను పెరుగు, స్మూదీల్లో కలుపుకుని తింటూ ఉండాలి. పండ్లు, ఓట్‌మీల్, చియా పుడ్డింగ్ లాంటి బ్రేక్‌ఫాస్ట్స్ ఎంచుకోవాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
పీచు ఆరోగ్యానికి ఉపయోగకరమే అయినా రాత్రికి రాత్రే అధిక పీచుకు మారిపోవడం ఆరోగ్యకరం కాదు. ఆహార శైలిని తక్కువ పీచు నుంచి ఒకేసారి అధిక పీచుకు మార్చడం వల్ల, కడుపుబ్బరం, గ్యాస్, జీర్ణసమస్యలు తలెత్తుతాయి. కాబట్టి పేగులకు నెమ్మదిగా అలవాటు చేయడం కోసం క్రమేపీ పీచు పరిమాణాన్ని పెంచాలి. ఇందుకోసం రెండు నుంచి మూడు వారాల సమయం తీసుకోవాలి. అలాగే పీచు పూర్తి సామర్థ్యాన్ని కనబరచాలంటే ఎక్కువ నీటిని అందించాలి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగుతూ ఉండాలి.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News