ఆమె మంత్రం.. ఆస్వాదనలో ఆరోగ్యం
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:45 AM
కాలక్షేపానికి నమిలే చూయింగ్ గమ్‌లను ఆయుర్వేద మూలికలతో సరికొత్తగా తయారుచేస్తున్నారు రజిత వీరమాచినేని. రసాయనభరితమైన ఫ్లేవర్లు, రంగులు లేకుండా ఆరోగ్యకరంగా ఆమె అందిస్తున్న....
కాలక్షేపానికి నమిలే చూయింగ్ గమ్‌లను ఆయుర్వేద మూలికలతో సరికొత్తగా తయారుచేస్తున్నారు రజిత వీరమాచినేని. రసాయనభరితమైన ఫ్లేవర్లు, రంగులు లేకుండా ఆరోగ్యకరంగా ఆమె అందిస్తున్న చక్కెర రహిత చూయింగ్ గమ్‌లు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఓ స్టార్టప్ కంపెనీని స్థాపించి హెర్బల్ చూయింగ్ గమ్‌ల తయారీలో పలు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఆ విశేషాలను ఇలా చెప్పుకొచ్చారామె.
‘‘మాది గుడివాడ దగ్గర చిన్న పల్లెటూరు. హైదరాబాద్‌లో స్థిరపడ్డాం. నేను హెచ్‌సీయూ క్యాంపస్ స్కూల్లో చదువుకున్నాను. సెయింట్ ఆన్స్ ఉమెన్స్ కాలేజీలో ఎమ్మెస్సీ(ఐటీ), యూఎ్‌సలో మాస్టర్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పూర్తిచేశాను. మావారు వంశీకృష్ణ. ఆయన ఫార్మసీలో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ బిట్స్ పిలానీలో డీన్. పీహెచ్‌డీ విద్యార్థులకు పరిశోధనాత్మక ఉపన్యాసాలిస్తుంటారు. ఆరోగ్యకరమైన నూతన ఉత్పత్తుల తయారీ కోసం ప్రయోగాలు చేస్తుంటారు. ప్రొడక్షన్ ప్రాసెస్, నాణ్యత ప్రమాణాలు, ముడిపదార్థాల వినియోగం తదితర ప్రక్రియలపై ఆయనకు మంచి పట్టుంది.
ఆలోచన ఎలా వచ్చిందంటే...
ఆయుర్వేదాన్ని జోడించి ఓ మంచి ఉత్పత్తిని తయారుచేయాలని అనుకుంటూ ఉండేవాళ్లం. దీనికి సంబంధించి ల్యాబ్‌లో ఎన్నో రకాల ప్రయోగాలు కూడా చేశాం. ఆ క్రమంలోనే చూయింగ్ గమ్‌కు శోషణ శక్తి, సామర్థ్యం ఎక్కువగా ఉంటాయనే విషయం తెలిసింది. ఏదైనా మెడిసిన్‌ను ట్యాబ్లెట్ లేదా సిరప్ రూపంలో తీసుకున్నప్పుడు మొత్తం జీర్ణక్రియ పూర్తయిన తరువాతనే అది రక్తంలోకి చేరి ఫలితాన్నిస్తుంది. దీనికి కొంత సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో ఆ మెడిసిన్ కొంతమేరకు నష్టపోవచ్చు కూడా. అదే చూయింగ్‌గమ్ రూపంలో నమిలినప్పుడు... బుగ్గలు, పెదవుల లోపలి పొర ‘బ్యూకల్ మ్యూకోసా’ ఉత్పత్తి చేసే లాలాజలంతో కలిసి నేరుగా రక్తంలోకి చేరుతుంది. దీంతో మందు త్వరగా పనిచేసి ఉపశమనం కలిగిస్తుంది. ఓ క్యాప్సూల్‌కు శోషణ శక్తి 75 శాతం ఉంటే చూయింగ్‌గమ్‌కు 85 నుంచి 90 శాతం వరకు ఉంటుంది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూయింగ్ గమ్‌ను సరికొత్తగా ఆవిష్కరించాలనుకున్నాం. ఇప్పటివరకు ఓ చాక్లెట్‌లా లేదంటే శ్వాస తాజాదనం కోసం నమిలే చూయింగ్ గమ్‌కు హెర్బల్ టచ్ ఇచ్చి ఓ కొత్త రకాన్ని తయారుచేయాలని నిర్ణయించుకున్నాం.
స్టార్టప్ కంపెనీతో...
నాలుగేళ్ల క్రితం పెద్ద మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టి లోకా ల్యాబొరేటరీస్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించాం. ఆర్ అండ్ డీ ప్రక్రియ పూర్తికావడానికి ఏడాదిన్నర సమయం పట్టింది. ల్యాబ్ స్కేల్లో ఉత్పత్తికి ప్రొడక్షన్ స్కేల్‌కి ఎంతో వైరుధ్యం వచ్చేది. ఇలా ఎన్నో ఆటంకాలను దాటుకుని గతేడాది మేలో మా కొత్తరకం చూయింగ్ గమ్‌లను అమెజాన్ వేదికగా లాంచ్ చేశాం. ప్రస్తుతం తొమ్మిది రకాల హెర్బల్ చూయింగ్ గమ్స్‌ను తయారు చేస్తున్నాం. న్యూట్రియెంట్స్, హెర్బల్స్ మేలు కలయికతో దేశంలోనే మొదటిసారిగా వీటిని ఉత్పత్తి చేస్తున్నాం. ప్రొడక్షన్ ఏరియాని ఫార్మా నిబంధనల మేరకు రూపొందించాం. క్లీన్ రూమ్‌లో హైజీన్ కండిషన్స్ మధ్య ఉత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. మా ఉత్పత్తులకు ఆయుష్ లైసెన్స్, సెంట్రల్ న్యూట్రాస్యూటికల్స్ లైసెన్స్ ఉన్నాయి.

ప్రత్యేకతలు...
శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంతోపాటు మరెన్నో ఆరోగ్యప్రయోజనాలు చేకూరుస్తాయి ఈ హెర్బల్ చూయింగ్ గమ్‌లు. ఎఫ్‌ఎ్‌సఎ్‌సఏఐ నిబంధనల ప్రకారం ఎనిమిదేళ్లు దాటిన పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వీటిని తినవచ్చు. వీటి తయారీలో ఎలాంటి రంగులు, ఫ్లేవర్లు, చక్కెరలను ఉపయోగించం. కాబట్టి మధుమేహం ఉన్నవారు కూడా నిరభ్యంతరంగా వీటిని నలమలవచ్చు. ఈ చూయింగ్ గమ్‌ల ప్యాకెట్లలో చిన్న పేపర్లను కూడా ఇస్తున్నాం. నమిలిన తరువాత గమ్‌ను ఈ పేపర్లో చుట్టి డస్ట్‌బిన్ పడేయాలని సూచిస్తున్నాం. ఎలాంటి సమస్యలు లేకుండా డిజాల్వబుల్ చూయింగ్ గమ్స్ తయారీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.
హెర్బల్ చూయింగ్ గమ్స్...
కర్కుమిన్, లవంగ నూనెలను కలిపి ‘క్లోవ్ సీ’ని, అల్లం ఫ్లేవర్‌తో ‘జింగిల్’ను తయారుచేస్తున్నాం. వామును ఉపయోగించి ‘డైజీ’, అశ్వగంధ మూలికలతో ‘అశ్వ’, హిమాలయాల్లో లభించే శిలాజిత్ జిగురుతో ‘వీటా’ చూయింగ్ గమ్‌లను ఉత్పత్తి చేస్తున్నాం. కాఫీ ఫ్లేవర్‌తో ‘వివా’, ‘వివామ్’ అనే కెఫిన్ ఎనర్జీ గమ్‌లను అందుబాటులోకి తెచ్చాం. వీటిని నములుతుంటే కాఫీ తాగిన అనుభూతి కల్గుతుంది. యాలకులు, ధనియాలు, పసుపు, లవంగాలు, జీలకర్ర, దాల్చినచెక్క, అల్లం, మిరియాలు కలిపి తయారుచేసిన ‘స్పైస్’ అనే మసాలా పంచ్ చూయింగ్ గమ్‌కు డిమాండ్ అధికంగా ఉంటోంది. దీన్ని నములుతున్నప్పుడు తీపి, ఉప్పు, పులుపు, చేదు రుచులు తెలుస్తూ వింతానుభూతి కలుగుతుంది.
ఆశే శ్వాసగా...
వ్యాపార రంగంలో నిలదొక్కుకోవాలంటే ఇన్నోవేటివ్ ఐడియాలనేవి తప్పనిసరి. ఎంత మంచి ఆలోచనతో ప్రారంభించినప్పటికీ మొదట్లో కష్టనష్టాలనేవి తప్పవు. దేనికీ నిరుత్సాహపడకుండా నిరంతర కృషితో ప్రయత్నిస్తుండాలి. ఇప్పటికీ మాకు వచ్చే ఆర్డర్లు చాలా తక్కువ. అయినా మేము వెనకడుగు వేయదలచుకోలేదు. మా ఉత్పత్తుల మీద ఉన్న నమ్మకంతో అవి సమాజానికి మంచి చేస్తాయనే సంకల్పంతో ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాం.
పి.హిమబిందు
ఎందుకు తినాలంటే...
ప్రాసెస్డ్ ఫుడ్‌కు అలవాటుపడి ప్రస్తుతం పిల్లలు, పెద్దలు నమలడాన్ని తగ్గించేశారనే చెప్పాలి. దీనివల్ల ప్రతి ఒక్కరిలో దంతాలు, చిగుళ్లకు సంబంధించి పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. చూయింగ్‌గమ్‌ను నమలడంవల్ల ఈ సమస్యలేవీ దరిచేరవు. దవడ ఎముకలు గట్టి పడతాయి. ముఖంలోని కండరాలు బలోపేతమవుతాయి. చూయింగ్ గమ్‌ను నములుతూ నోట్లో ఊరే లాలాజలాన్ని మింగడంవల్ల జీర్ణక్రియ వేగవంతమవుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఫుడ్ క్రేవింగ్స్ మాయమవుతాయి.
ఇవి కూడా చదవండి
ఎయిర్‌పోర్ట్ నాయిస్ జోన్ నిబంధనల్లో మార్పులు: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
పూర్తిగా తెరుచుకున్న హోర్ముజ్.. దిగ్బంధనం విషయంలో ట్రంప్ ట్విస్ట్..