Share News

ఎండదెబ్బకు చెక్‌

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:04 AM

ఎండాకాలంలో వేడి వాతావరణం వల్ల ఒంట్లో నీరు వేగంగా ఆవిరవుతూ ఉంటుంది. ఆ నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోలేనప్పుడే ఎండదెబ్బకు గురవుతాం! ఈ పరిస్థితి తలెత్తకుండా...

ఎండదెబ్బకు చెక్‌

సమ్మర్‌ కేర్‌

ఎండాకాలంలో వేడి వాతావరణం వల్ల ఒంట్లో నీరు వేగంగా ఆవిరవుతూ ఉంటుంది. ఆ నీటిని ఎప్పటికప్పుడు భర్తీ చేసుకోలేనప్పుడే ఎండదెబ్బకు గురవుతాం! ఈ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం!

ఒంట్లోని నీరు చమటలో పాటు శ్వాస ద్వారా కూడా ఆవిరైపోతూ ఉంటుంది. దాంతో ఎలకొ్ట్రలైట్లను నష్టపోయి ఒంటి నొప్పులు, ఒళ్లు వేడెక్కడం, తల తిరగడం లాంటి లక్షణాలు వేధిస్తాయి. ఈ దశలో జాగ్రత్త పడకపోతే, స్పృహ కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది. నిజానికి ఎండదెబ్బకు ముందే శరీరం మనల్ని హెచ్చరిస్తుంది. దాహం పెరుగుతుంది. గొంతు ఎండుకుపోతూ ఉంటుంది. ఈ స్థితిలో నీడకు చేరుకుని, సరిపడా నీళ్లు, ఎలకొ్ట్రలైట్లు తీసుకోనప్పుడు ఎండదెబ్బ తగులుతుంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

సాధారణంగా వేసవిలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ సూర్యకిరణాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయం నీడకే పరిమితం కావాలి. ఒకవేళ ఈ సమయాల్లో బయటకు వెళ్లవలసి వచ్చినా కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. అవేంటంటే...

  • బిగుతైన ప్యాంట్లు, మందపాటి దుస్తులు మానేయాలి

  • వదులుగా, గాలి చొరబడే, చమటను పీల్చే దుస్తులు వేసుకోవాలి

  • ముదురు రంగు దుస్తులు వేడిని ఆకర్షిస్తాయి కాబట్టి ఎక్కువ చమట పడుతుంది. బదులుగా లేత రంగు దుస్తులు వేసుకోవాలి

  • గంటకో గ్లాసు చొప్పున నీళ్లు తాగుతూ ఉండాలి

  • తాగే నీళ్లు మరీ చల్లగా కాకుండా, తాగగలిగేంత చల్లగా ఉండాలి

  • తరచూ చల్లనీళ్లతో ముఖం కడుగుతూ ఉండాలి


నియంత్రణ ఇలా..

  • మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగాలి

  • నీళ్లు ఎక్కువగా ఉండే పుచ్చ, తర్బూజ, ద్రాక్ష, బెరీరస్‌ తినాలి

  • కొబ్బరినీళ్లు తాగాలి

  • సలాడ్స్‌ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి

  • నిమ్మరం తాగాలి

ఎండదెబ్బకు గురైతే....

ఎండదెబ్బతో స్పృహ కోల్పోయే పరిస్థితికి చేరుకున్నా, కళ్లు తిరుగుతున్నా, దృష్టి మసకబారుతున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. ఐవి ఫ్లూయిడ్స్‌తో ఈ స్థితిని సరిదిద్దే వీలుంటుంది. 12 నుంచి 13 ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన పెద్దలు ఎండదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ కోవకు చెందినవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. గుండె జబ్బులు, మధుమేహంతో మందులు వాడుకునే 22 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కులు కూడా రెట్టింపు జాగ్రత్తగా నడుచుకోవాలి.

ఎన్ని నీళ్లు?

ఒక కిలోకు 30 మిల్లీలీటర్ల నీళ్ల చొప్పున శరీర బరువుకు సరిపడా నీళ్లను లెక్కించుకుని రోజుకు రెండు నుంచి రెండున్నర లీటర్ల నీళ్లు తాగుతూ ఉండాలి. వేసవిలో ఈ మోతాదుకు అదనంగా మరొక లీటర్‌ నీళ్లు ఎక్కువగా తాగాలి. అలాగే అలర్జీ, ఆస్తమా ఉన్న వాళ్లు ఎసి ఉష్ణోగ్రతను 22 నుంచి 24కు పరిమితం చేయాలి. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేనివాళ్లు ఎసి ఉష్ణోగ్రతను 18 నుంచి 20 మధ్య సెట్‌ చేసుకోవచ్చు.

చల్లనీళ్ల స్నానం....

మెడ దగ్గర బారో రిసెప్టార్స్‌ అనే సెన్సరీ న్యూరాన్స్‌ ఉంటాయి. ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకునే ఆకస్మిక మార్పులను పసిగట్టలేకపోయినప్పుడు, ఈ నాడులు కొద్దిసేపు స్థబ్దుగా మారిపోతాయి. ఆ సమయంలో కళ్లు తిరిగి పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి పెద్దలు, వేసవిలో ఎండలో నుంచి నీడ పట్టుకు చేరుకున్న వెంటనే చల్లనీళ్ల స్నానం చేయకూడదు. బదులుగా ఎసి, కూలర్‌ లేదా ఫ్యాన్‌ కింద పావుగంట పాటు గడిపి, శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత చల్లనీళ్ల స్నానం చేయవచ్చు.

డాక్టర్‌ వెంకటేష్‌ బల్లికంటి,

సీనియర్‌ కన్సల్టెంట్‌ ఫిజీషియన్‌,

అపోలో హాస్పిటల్స్‌,

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, హైదరాబాద్‌

Also Read:

ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత

జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం

For More Latest News

Updated Date - Apr 21 , 2026 | 03:05 AM