వృద్ధాప్యం వ్యర్థం కాకుండా...
ABN , Publish Date - Mar 24 , 2026 | 02:35 AM
వయసు పైబడితే, శరీరం పట్టు తప్పుతుంది. నడక తడబడుతుంది. చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి అటకెక్కుతుంది. ఇవన్నీ పలు అసౌకర్యాలకూ, ప్రమాదాలకూ దారి తీస్తూ ఉంటాయి...
ఓల్డ్ ఈజ్ గోల్డ్
వయసు పైబడితే, శరీరం పట్టు తప్పుతుంది. నడక తడబడుతుంది. చూపు మందగిస్తుంది, వినికిడి తగ్గుతుంది. జ్ఞాపకశక్తి అటకెక్కుతుంది. ఇవన్నీ పలు అసౌకర్యాలకూ, ప్రమాదాలకూ దారి తీస్తూ ఉంటాయి. వీటి నుంచి తప్పించుకుని నాణ్యమైన జీవనం కొనసాగించడానికి పెద్దలు ఎలా నడుచుకోవాలో, వారి పట్ల కుటుంబసభ్యులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వైద్యులు ఇలా వివరిస్తున్నారు ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి రాకూడదని పెద్దలందరూ కోరుకుంటారు. అయితే అందుకోసం అవసరమైన ఆరోగ్యపరమైన జాగ్రత్తలను పాటించడంలో అశ్రద్ధ వహిస్తూ ఉంటారు. శరీరం చురుగ్గా ఉండాలన్నా, జీవక్రియలు సమర్థంగా కొనసాగాలన్నా, అప్పటికే ఉన్న రుగ్మతలకు సక్రమంగా మందులు వాడుకుంటూ, బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ, తగినంత వ్యాయామంతో శరీరాన్ని చలాకీగా ఉంచుకోవాలి. మరీ ముఖ్యంగా పెద్ద వయసులో పొంచి ఉండే ముప్పుల పట్ల అవగాహన పెంచుకుని, తదనుగుణమైన జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి. పెద్దలకు ఎముకలు విరిగే ముప్పు ప్రధానంగా పొంచి ఉంటుంది. ఈ వయసులో గుల్లబారి, పెళుసుగా, బోలుగా మారిన ఎముకలు, చిన్న దెబ్బకే పుటుక్కున విరిగిపోతూ ఉంటాయి. ఈ వయసులో సర్జరీలు, తదనంతరం తలెత్తే ఇన్‌ఫెక్షన్లను తట్టుకునే సామర్థ్యం అందరికీ ఉండకపోవచ్చు. కాబట్టి కిందపడి ఎముకలు విరగ్గొట్టుకునే అవకాశాలకు అడ్డుకట్ట వేయాలి. అందుకోసం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటంటే...
బాత్రూమ్‌లో కాలు జారే వీల్లేని టైల్స్ ఉండేలా చూసుకోవాలి
టాయ్‌లెట్ పైన కూర్చుని, పైకి లేవడానికి ఆసరా కోసం గోడలకు హ్యాండిల్స్ బిగించుకోవాలి
కార్పెట్లు, మ్యాట్స్ కాళ్లకు అడ్డుపడకుండా చూసుకోవాలి
ఫర్నిచర్ నడకకు అడ్డొచ్చే వీలు లేకుండా చూసుకోవాలి
ఇంట్లోని ప్రతి గదిలో తగినంత వెలుతురు సోకేలా చూసుకోవాలి
చేతి కర్ర వాడుకోవడం తప్పనిసరి
ఎముకల పటుత్వాన్ని తెలిపే పరీక్షలు చేయించుకుంటూ, వైద్యులు సూచించే క్యాల్షియం, విటమిన్ డి మాత్రలు వాడుకోవాలి
పోషకాలు పుష్కలంగా...
పెద్ద వయసులో ఆకలి, ఆహారం పట్ల ఆసక్తి తగ్గడం సహజం. వాసన, రుచి కూడా తగ్గుతాయి. వీటికి తోడు దంత సమస్యలు వేధిస్తూ ఉంటాయి. దాంతో సరిపడా ఆహారం తినకపోవడం వల్ల ఒంట్లో సత్తువ తగ్గుతుంది. శరీరం రోగనిరోధకశక్తిని కోల్పోయి, సులభంగా ఇన్‌ఫెక్షన్లకు గురయ్యే ముప్పు పెరుగుతుంది. కాబట్లి పోషకాలన్నీ అందేలా బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. అందుకోసం...
బియ్యం, గోధుమలు వంటి తృణధాన్యాలతో పాటు రోజుకు కనీసం 400 గ్రాముల కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. వీటిలోని పీచు జీర్ణక్రియ, విసర్జక ప్రక్రియలు సజావుగా సాగడానికి సహాయపడుతుంది. సూక్ష్మపోషకాలు, యాంటీఆక్సిడెంట్లు బలాన్నీ, రోగనిరోధకశక్తినీ పెంచుతాయి
ఈ వయసులో ప్రొటీన్ అవసరం. కాబట్టి రోజుకు 200 నుంచి 300 మిల్లీలీటర్ల పాలు, పాల పదార్థాలూ తీసుకోవాలి. వీటితో ప్రొటీన్‌తో పాటు క్యాల్షియం కూడా దొరుకుతుంది. వేరుసెనగ, జీడిపప్పు, బాదం ప్రొటీన్ అందిస్తాయి. మాంసాహారులు చికెన్, గుడ్లు, మాంసం, చేపలు తీసుకుంటూ ఉండాలి
ఆహారం పూర్తిగా, మెత్తగా ఉండికించి తినాలి. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి
ఒంట్లో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి
సాధానాలే సర్వస్వం
పెద్ద వయసులో వినికిడి శక్తి తగ్గడం సహజం. అది దైనందిన జీవితానికి ఇబ్బందిని తెచ్చిపెడుతున్నప్పుడు తప్పనిసరిగా హియరింగ్ ఎయిడ్స్ వాడుకోవాలి. వినికిడి తగ్గినంత మాత్రాన ఆరోగ్యానికొచ్చే ముప్పేమీ లేదనుకుంటే పొరపాటు. వినికిడి లోపంతో నలుగురిలో కలవలేక, మానసిక కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. కుటుంబసభ్యులతో సాన్నిహిత్యం తగ్గుతుంది. గదికే పరిమితమై, బయటి ప్రపంచంతో కలవలేని పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి వినికిడి లోపాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అలాగే కళ్లజోడు కూడా వాడుకుంటూ ఉండాలి. లేదంటే అడుగులు తడబడి పడిపోయే ప్రమాదం ఉంటుంది.
మందుల ప్రభావాలు
వృద్ధాప్యంలో అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు లాంటి పలు రకాల ఆరోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. వీటి కోసం పలు రకాల మందులు వాడుకుంటూ ఉంటారు. దాంతో మిశ్రమ మందులతో కొన్ని దుష్ప్రభావాలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. తల తిరగడం, తికమక, బలహీనత లాంటి సమస్యలు తలెత్తవచ్చు. కాబట్టి మందుల వాడకంలో వైద్యుల సూచనలు పాటించాలి. సమయవేళలు పాటించాలి. మందుల దుష్ప్రభావాలను వైద్యుల దృష్టికి తీసుకువెళ్లి, ప్రత్యామ్నాయ మందుల కోసం అడగాలి.

నిద్రలోపం
పెద్ద వయసులో నిద్ర సమస్య సహజమే! అయినా నిద్రలేమితో ఆరోగ్యం మరింత దెబ్బతింటుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. శారీరక శ్రమ లోపించడం, ఆందోళన, కొన్ని మందుల ప్రభావం, టివి, మొబైల్ వంటివి నిద్రను దూరం చేయొచ్చు. నిద్ర మాత్రలు కొంత మేరకు సమస్యను పరిష్కరించగలిగినా, వీటికి బదులు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఆశ్రయించడం ఆరోగ్యకరం. అందుకోసం....
ప్రతి రోజూ ఓకే సమయానికి నిద్రకు ఉపక్రమించాలి
సాయంత్రం వేళ కునుకు తీయడం మానేయాలి
మధ్యాహ్నం మూడు గంటల తర్వాత కాఫీలు మానేయాలి
రాత్రి నిద్రకు రెండు నుంచి మూడు గంటల ముందే భోజనం ముగించాలి
దైనందిన జీవితంలో వ్యాయామానికి చోటు కల్పించాలి
మానసిక ఆరోగ్యం మెండుగా...
ఉద్యోగాలు, చదువుల కారణంగా పిల్లలు ఇంటికి దూరంగా ఉండడం, ఆత్మీయులను కోల్పోవడం, ఒంటరితనం వల్ల పెద్దల్లో కుంగుబాటు మొదలవుతుంది. దీన్ని దూరం చేసుకోవడం కోసం....
బంధువులు, స్నేహితులను తరచూ కలుస్తూ ఉండాలి
ఫోన్ల ద్వారా తరచూ సంభాషిస్తూ ఉండాలి
మనవళ్లు, మనవరాళ్లతో ఆటల్లో పాల్గొంటూ ఉండాలి
మెదడును చురుగ్గా ఉంచుకోవడం కోసం పజిల్స్ పూరిస్తూ ఉండాలి
చెస్, క్యారమ్స్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుతూ ఉండాలి
వ్యాయామం ఇలా...
శరీర బరువు, రక్తపోటు, మధుమేహం అదుపులో ఉండడానికీ, మనసు హుషారుగా ఉండడానికీ వ్యాయామం తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి రోజూ నడక, యోగా లాంటి తేలికపాటి వ్యాయామాలు చేయాలి. తోట పని, కుక్కను వ్యాహ్యాళికి తీసుకువెళ్లడం, పచారీ కొట్టుకు నడుచుకుంటూ వెళ్లి సరుకులు తీసుకురావడం లాంటి తేలికపాటి పనులు చేస్తూ ఉండాలి.
మెదడు మెరుగ్గా...
పెద్దల్లో జ్ఞాపకశక్తి మందగించే ప్రక్రియ నెమ్మదిగా మొదలవుతుంది. అడిగిందే మళ్లీ మళ్లీ అడగడం, సంగతులను గుర్తు చేసుకోలేకపోవడంతో మొదలయ్యే జ్ఞాపకశక్తి సమస్య క్రమేపీ పనులకు కూడా వ్యాప్తి చెందుతుంది. మునుపు సులభంగా చేయగలిగిన పనులను చేయడానికి ఎక్కువగా కష్టపడడం, వంట పనులు లేదా సపరిచితమైన పరిసరాల్లో తడబడడం, మాట్లాడేటప్పుడు పదాల కోసం వెతుక్కోవడం, అనర్గళంగా మాట్లాడలేకపోవడం లాంటి మార్పులు కూడా మొదలవుతాయి. ఇలాంటి ప్రవర్తనాపరమైన, మానసికపరమైన మార్పులను తీవ్రంగానే పరిగణించాలి. పెద్దలు ఈ లక్షణాలను లోపాలుగా పరిగణించకపోయినా కుటుంబసభ్యులు వీటిని వైద్యుల దృష్టికి తీసుకువెళ్లాలి. పెద్ద వయస్కుల్లో తలెత్తే డిమెన్షియా క్రమేపీ పెరిగే సమస్య కాబట్టి ప్రారంభంలోనే దీన్ని అదుపులోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. పెద్దల్ని వేధించే మరొక సమస్య ‘డెలీరియం’. గంటలు, రోజుల్లోనే తీవ్రవుమైపోయే ఈ వైద్యపరమైన అత్యవసర సమస్య కొన్ని లక్షణాల ద్వారా బయల్పడుతుంది. అయోమయం, ఏకాగ్రత లోపించడం, స్పృహలో లేకపోవడం ఈ సమస్య ప్రధాన లక్షణాలు. మరీ ముఖ్యంగా ఇన్‌ఫెక్షన్లు, మెటబాలిక్ సమస్యలు, మందుల విష ప్రభావాలు, లేదా అవయవ అస్తవ్యస్థ పనితీరు మొదలైన తీవ్రమైన రుగ్మతలు డిలీరియంకు ప్రధాన కారణాలు. సాధారణంగా ఎవరిలోనైనా ఎలాంటి రుగ్మత అయినా జ్వరం, ఛాతీ నొప్పి లాంటి సాధారణ లక్షణాలతోనే బయల్పడుతూ ఉంటుంది. కానీ పెద్దల్లో ప్రధానంగా అయోమయం ద్వారానే రుగ్మతలు బయల్పడుతూ ఉంటాయి. కాబట్టి డిలీరియంను ప్రారంభ దశలోనే గుర్తించి, తక్షణ చికిత్సతో మూలకారణాన్ని సరిదిద్దగలిగితే, ఈ సమస్యను పూర్తిగా సరిదిద్దుకోవచ్చు.
డాక్టర్ దర్శిత వరిగొండ
జేరియాట్రిక్ కన్సల్టెంట్,
అపోలో హాస్పిటల్,
జూబ్లీహిల్స్, హైదరాబాద్
ఇవి కూడా చదవండి..
క్షిపణిపై శాంతి సందేశం.. ఇజ్రాయెల్ పైకి ప్రయోగించిన ఇరాన్..
మీ కళ్లు షార్ప్ అయితే.. ఈ పులుల మధ్యనున్న జీబ్రాను 10 సెకెన్లలో కనిపెట్టండి..