Share News

గురక తగ్గేదెలా?

ABN , Publish Date - Feb 26 , 2026 | 02:51 AM

స్థూలకాయం, నాలుక పెద్దగా ఉండడం, కొండ నాలుక పెద్దగా ఉండడం, దవడల నిర్మాణంలో తేడాలు ఉన్నవారికి గురక సహజం. ఇవన్నీ శ్వాసనాళానికి అడ్డంకులుగా మారతాయి. అయితే గురకతో నిద్రకు ఆటంకం కలిగే...

గురక తగ్గేదెలా?

కౌన్సెలింగ్‌

డాక్టర్‌! మా వారికి 50 ఏళ్లు. ఆయన గురకతో కుటుంబ మంతా అసౌకర్యానికి గురవుతున్నాం. గురక వల్ల ఆయనకు కూడా తరచూ నిద్ర మెలకువ అయిపోతూ ఆరోగ్యం దెబ్బతింటోంది. ఈ సమస్యకు కారణమేంటి?

ఓ సోదరి, హైదరాబాద్‌

స్థూలకాయం, నాలుక పెద్దగా ఉండడం, కొండ నాలుక పెద్దగా ఉండడం, దవడల నిర్మాణంలో తేడాలు ఉన్నవారికి గురక సహజం. ఇవన్నీ శ్వాసనాళానికి అడ్డంకులుగా మారతాయి. అయితే గురకతో నిద్రకు ఆటంకం కలిగే పరిస్థితులు కూడా రెండు రకాలుగా ఉంటాయి. నిద్రలో గురక వల్ల మెలకువ అయిపోవడం, అసలు నిద్రలోకే జారిపోలేకపోవడం. ఈ రెండు ఇబ్బందులూ స్లీప్‌ ఆప్నియాను కలిగించేవే! అయితే ఎంత తరచుగా నిద్ర మెలకువ అయిపోతోంది? మెలకువ అయ్యేలోగా ఎంత ఆక్సిజన్‌ లోపం కలుగుతోంది? ఎంతసేపు ఆక్సిజన్‌ ప్రసారంలో ఆటంకం కలుగుతోంది? అనే విషయాలను కనిపెట్టే పరీక్షలు ఉన్నాయి. అవేంటంటే....

స్లీప్‌ స్టడీ:

నిద్రపోయే సమయంలో రాత్రంతా నిద్ర ప్యాటర్న్‌ను పరిశీలించే పరీక్ష ఇది. గురకతో పాటు శ్వాస ఎన్నిసార్లు, ఎంతసేపు ఆగిపోయింది? అలా ఆగడం వల్ల శరీరంలో తగ్గిన ఆక్సిజన్‌ గురించిన పూర్తి వివరాలు తెలుస్తాయి.

డైనమిక్‌ ఎమ్మారై:

నిద్రలో ఉన్న సమయంలో శ్వాసకు నాలుక, కొండ నాలుక, శ్వాసనాళం చుట్టూ ఉండే కండరాల వల్ల గురక మొదలవుతుంది. అయితే వీటిలో దేని వల్ల గురక తలెత్తి, నిద్రాభంగం కలుగుతోందో ఈ పరీక్షతో తెలుస్తుంది.

డ్రగ్‌ ఇండ్యూస్‌డ్‌ స్లీప్‌ ఎండోస్కోపీ:

మందులతో నిద్రమత్తులోకి తీసుకువెళ్లి, గొంతులోకి ట్యూబ్‌ను పంపి, గురకకు కారణమయ్యే పరిస్థితిని కనిపెట్టే పరీక్ష ఇది. దీంతో అసలు కారణం కచ్చితంగా తెలుసుకోవచ్చు.


గురకకు చికిత్స!

గురకకు కారణాలు ముక్కు నుంచి గొంతు వరకూ ఉండే మార్గంలో ఎక్కడైనా ఉండవచ్చు. కొందరికి ముక్కు దూలం వంకర ఉండి, ఆ కారణంగా గురక వస్తూ ఉండవచ్చు. ఇంకొందరికి కొండనాలుక లేదా నాలుక పెద్దవిగా ఉండి, అవి గురకకు కారణం కావచ్చు. మరికొందరికి శ్వాసనాళం చుట్టూ ఉండే మెత్తని కణజాలం ప్రకంపనలకు గురై, గురకకు దారితీస్తూ ఉండవచ్చు. దవడల నిర్మాణంలో తేడాల వల్ల కూడా గురక వస్తూ ఉండవచ్చు. ఇలా కారణాన్ని బట్టి చికిత్సలు ఆధారపడి ఉంటాయి. చికిత్సలో ప్రధానంగా సాఫ్ట్‌ టిష్యూ సర్జరీ లేదా స్కెలెటల్‌ సర్జరీలను ఎంచుకోవచ్చు. సాఫ్ట్‌ టిష్యూ సర్జరీలో భాగంగా టాన్సిల్స్‌, అడినాయిడ్‌, నాలుక, కొండనాలుక, స్వరపేటికలో లోపాలను సరిచేస్తారు. స్కెలెటల్‌ సర్జరీలో గురకకు ఆస్వారం లేకుండా దవడలను సరిచేస్తారు.

డాక్టర్‌ గౌతమ్‌ దెందుకూరి,

కన్సల్టెంట్‌ డెంటల్‌ అండ్‌

మాక్సిలోఫేసియల్‌ సర్జన్‌,

హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Feb 26 , 2026 | 02:51 AM