పిత్తాశయంతో పేచీ...
ABN , Publish Date - Nov 03 , 2026 | 03:26 AM
కడుపునొప్పి, అసిడిటీ, వాంతులను అజీర్తిగా భావిస్తాం! కానీ పిత్తాశయ రాళ్ల సమస్యలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. తప్పుదారి పట్టించే ఈ...
కడుపునొప్పి, అసిడిటీ, వాంతులను అజీర్తిగా భావిస్తాం! కానీ పిత్తాశయ రాళ్ల సమస్యలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. తప్పుదారి పట్టించే ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల, పిత్తాశయం తీవ్ర ఇన్‌ఫెక్షన్‌కు గురై, పరిస్థితి ప్రమాదకరంగా పరిణమించవచ్చని హెచ్చరిస్తున్నారు వైద్యులు.
కాలేయం నుంచి స్రవించే బైల్‌ను నిల్వ చేసుకోవడంతో పాటు, కొవ్వును జీర్ణించుకోవడానికి తగినంత బైల్‌ను విడుదల చేయడం పిత్తాశయం పని. బైల్‌లో ప్రధానంగా కొలెస్ట్రాల్, బైల్ ఆమ్లాలు, ఫాస్ఫొలిపిడ్స్, లెసిథిన్ ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు, బైల్‌లో కూడా దాని పరిమాణం పెరుగుతుంది. కొలెస్ట్రాల్ నీటిలో కరిగే స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి, ఆ ప్రక్రియ కోసం బైల్ ఆమ్లాలను కూడా సరిపడా కలిగి ఉండాలి. అప్పుడే పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, బైల్ ఆమ్లాలు తక్కువగా ఉండడం, ఫాస్ఫొలిపిడ్స్, లెసిథిన్ తక్కువగా ఉండడం అనే మూడు ప్రధాన కారణాల వల్ల పిత్తాశయంలో కొలెస్ట్రాల్ రాళ్లు ఏర్పడతాయి.
రెండు రకాల రాళ్లు
పిత్తాశయ రాళ్లలో కూడా కొలెస్ట్రాల్ రాళ్లు, పిగ్మెంటెడ్ రాళ్లు అనే రెండు రకాలుంటాయి. సాధారణంగా 80% కొలెస్ట్రాల్ రాళ్లు, 20% పిగ్మెంటెడ్ రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. ప్రధానంగా కొలెస్ట్రాల్ మోనోహైడ్రేట్, క్యాల్షియం సాల్ట్స్, ప్రొటీన్లు, బైల్ పిగ్మెంట్లు, ఫ్యాటీ ఆమ్లాలు కలిసి కొలెస్ట్రాల్ రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి. క్యాల్షియం బైలురుబినేట్‌తో పిగ్మెంటెడ్ రాళ్లు ఏర్పడతాయి.
కారణాలు ఇవే!
స్థూలకాయులు. బిఎమ్‌ఐ 25 కంటే ఎక్కువ కలిగిన వారు.
మధుమేహులు
అకస్మాత్తుగా బరువు పెరిగిన వారు, తగ్గిన వారు
గర్భిణులు
శుద్ధి చేసిన చక్కెరలు ఎక్కువగా తీసుకునేవారు
జంతు కొవ్వులు ఎక్కువగా తినేవారు
సరిపడా నీళ్లు తాగని వాళ్లు
పీచు పదార్థం తక్కువగా తీసుకునేవారు
హార్మోన్ మాత్రలు తీసుకునేవారు
కొలెస్ట్రాల్ తగ్గించే మందులు వాడుకుంటున్నవారు
మద్యపానం తీసుకునేవారు
లక్షణాల మీద కన్నేసి...
కుడివైపు, పక్కటెముకల దిగువన నొప్పి
పొట్టలోని నొప్పి వెన్నులోకి పాకుతుంది
షోల్డర్ బ్లేడ్స్ మధ్య, కుడి భుజంలో విపరీతమైన నొప్పి
కామెర్లు ఫ వాంతులు ఫ జ్వరం

ప్రాబల్యం పెరుగుతోంది
పిత్తాశయ రాళ్లకు ఎంజైమ్ లోపాల్లాంటి జన్యుపరమైన కారణాలుంటాయి. ప్రధానంగా మహిళల్లో పిత్తాశయ రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాగే పిల్లలను కలిగి ఉండి, ఊబకాయులైన 40 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ ముప్పు ఎక్కువగా ఉంటుంది. పాశ్చాత్య ఆహారపుటలవాట్లు, శుద్ధి చేసిన చక్కెరతో తయారైన పదార్థాలను ఎక్కువగా తినే వారు, ప్రాసెస్ చేసిన పదార్థాలు ఎక్కువగా తీసుకునేవారు, అధిక కొవ్వు పదార్థాలు తీసుకునేవారు, పీచు తక్కువ తీసుకునేవారు, సరిపడా నీళ్లు తాగనివారు, రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా కలిగి ఉండేవారు, ఊబకాయుల్లో పిత్తాశయ రాళ్లు ఏర్పడుతూ ఉంటాయి.
రాళ్లతో ముప్పు ఎప్పుడంటే...
పిత్తాశయ రాళ్లు సమస్యలను తెచ్చిపెడుతున్నప్పుడు, లక్షణాలు వేధిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను కలిసి చికిత్సను ఆశ్రయించాలి. సాధారణంగా పిత్తాశయ రాళ్ల లక్షణాలు అజీర్తి లక్షణాలను తలపిస్తూ పక్కదారి పట్టిస్తూ ఉంటాయి. ప్రధానంగా కొవ్వు పదార్థాలు లేదా భారీ భోజనం తిన్న తర్వాత అజీర్తి, కడుపుబ్బరం వేధిస్తాయి. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ స్కాన్‌లో పిత్తాశయ రాళ్లు బయల్పడుతూ ఉంటాయి. కొందర్లో ఈ రాళ్లు బైల్ డక్ట్‌లోకి జారి పిత్తాశయం ఇన్‌ఫెక్షన్‌కు లోనయ్యేవరకూ లక్షణాలు బయల్పడకపోవచ్చు. పిత్తాశయం దిగువన క్లోమ నాళం కలుస్తూ ఉంటుంది. ఈ కూడలిలో రాయి ఇరుక్కుపోతే క్లోమం కూడా ప్రభావితమై, ‘గాల్ స్టోన్ పాంక్రియటైటిస్’ అనే సమస్య తలెత్తుతుంది. కొన్ని సందర్భాల్లో బహుళ అవయవాలు ప్రభావితమై ప్రాణాంతక పరిస్థితి కూడా తలెత్తే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తీవ్ర లక్షణాలు వేధిస్తున్నవాళ్లు, గతంలో పిత్తాశయ రాళ్ల సమస్యలను ఎదుర్కొన్నవాళ్లు, మధుమేహులు వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలి.
పిత్తాశయాన్ని తొలగించక తప్పదు
కీహోల్ సర్జరీ ద్వారా గాల్‌బ్లాడర్‌ను తొలగించే చికిత్సను వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. అయితే మూత్రపిండాల్లో రాళ్లను తొలగించిన విధంగా పిత్తాశయంలో రాళ్లను తొలగించడం సాధ్యపడదు. అలాగని పిత్తాశయాన్ని తొలగించినంత మాత్రాన ఆరోగ్యానికి నష్టం జరుగుతుందని భయపడవలసిన అవసరం లేదు. మూత్రపిండాల్లా పిత్తాశయం అత్యవసర అవయవం కాదు. అపెండిక్స్‌లాగే ఈ అవయవం లేకపోయినా ఎలాంటి ప్రమాదం ఉండదు. పిత్తాశయాన్ని తొలగించినా బైల్ స్రావాలు నేరుగా పేగుల గోడల్లోకి చేరుకోగలుగుతాయి. పిత్తాశయం ద్వారా కాకుండా నేరుగా పేగులోకి బైల్ స్రావాలు చేరుకోవడం వల్ల సర్జరీ అనంతరం విరోచనాలు లాంటి స్వల్ప అసౌకర్యాలు కొంత కాలం పాటు కొనసాగుతాయి. వాటిని మందులతో సర్దుబాటు చేసుకోవచ్చు. ఐదు మిల్లీ మీటర్ల కంటే చిన్నవిగా ఉండే కొలెస్ట్రాల్ రాళ్లు కలిగిన వాళ్లకు వైద్యులు రాళ్లను కరిగించే నోటి మాత్రలు సూచిస్తారు. అయితే పిత్తాశయ రాళ్ల లక్షణాలు కలిగిన రోగుల్లో కేవలం పది శాతం కంటే తక్కువ మంది మాత్రమే మాత్రలకు స్పందించగలుగుతారు. పిత్తాశయాన్ని తొలగించడం కోసం, కీహోల్ సర్జరీతో పాటు రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ, లేదా ల్యాప్రోస్కోపిక్ సర్జరీలలో తగిన సర్జరీ విధానాన్ని వైద్యులు ఎంచుకుంటారు. పిత్తాశయం నుంచి రాళ్లు దిగువన ఉన్న నాళంలోకి జారినప్పుడు, ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించి, ఆ తర్వాత పిత్తాశయాన్ని తొలగించే సర్జరీ చేయవలసి వస్తుంది. కొందరికి పిత్తాశయంలో చీము చేరుకుని, పగలడం, చిట్లడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. రోగి బహుళ ఆరోగ్య సమస్యలు కలిగి ఉండి, సర్జరీ సాధ్యపడని అత్యవసర పరిస్థితుల్లో కెథెటర్ ద్వారా పిత్తాశయంలోని చీమును తొలగించి, మందులతో ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించి, ఆ తర్వాత సర్జరీతో పిత్తాశయాన్ని తొలగించాల్సి ఉంటుంది.
వీళ్లకు ముప్పు ఎక్కువ
అకస్మాత్తుగా బరువు తగ్గడం కోసం ఉపవాసాలు ఉండేవారు అప్రమత్తంగా ఉండాలి. అలాగే అధిక కొవ్వులు, నూనె పదార్థాలు తినడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ బరువు పెరిగేవారు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రెండు సందర్భాల్లో పిత్తాశయ రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్రమేపీ బరువు తగ్గే ప్రయత్నం చేయాలి.
హార్మోన్ మాత్రాలు, కొలెస్ట్రాల్ మాత్రాలు వాడుకునే వారు పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాల గురించి వైద్యులతో చర్చించి, ప్రత్యామ్నాయ మందులను వాడుకోవాలి. అలాగే ఐసియులో ఎక్కువ కాలం ఉన్న వాళ్లు, నోటికి బదులుగా ఫీడింగ్ పైప్ ద్వారా ఆహారం తీసుకునేవాళ్లకు కూడా పిత్తాశయ రాళ్ల ముప్పు ఉంటుంది. కొందర్లో పిత్తాశయంలో బైల్ కదలికలు మందగిస్తాయి. వీరికి కూడా రాళ్ల ముప్పు ఎక్కువగా ఉంటుంది.
మద్యపానం ముప్పు
మద్యానికీ పిత్తాశయ రాళ్లకు ప్రత్యక్ష సంబంధం లేకపోయినా, మద్యంతో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. తీవ్రమైన మద్యపాన వ్యసనంతో కాలేయం సిర్రోసిస్ దశకు చేరుకుని, బైల్ ఆమ్లాల స్రావాలు క్షీణించి, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. వీరిలో పిగ్మెంటెడ్ రాళ్లు ఎక్కువగా ఏర్పడతాయి.
పిత్తాశయ రాళ్లు మూత్రపిండాల రాళ్లలా ఎక్స్‌రేల్లో కనిపించవు. అలా్ట్రసౌండ్‌లో మాత్రమే వాటిని స్పష్టంగా కనిపెట్టగలుగుతాం! అలాగే కాలేయ పనితీరు, పిత్తాశయ సంబంధిత రక్త పరీక్షలు, సిటి స్కాన్, ఎమ్మారై ఆధారంగా రాళ్ల పరిమాణాన్ని, అవి ఉన్న ప్రదేశాన్ని తెలుసుకుని, లక్షణాల తీవ్రత ఆధారంగా తదుపరి చికిత్సను ఎంచుకోవాలి.
డాక్టర్ కుమార్ కృష్ణ మోహన్ కోగంటి
సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్
ల్యాప్రోస్కోపిక్ సర్జన్, రెనోవా హాస్పిటల్స్,
కొంపల్లి, సికింద్రాబాద్.
ఈ వార్తలూ చదవండి
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు
మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ