పేదరికం దాటి... ప్రాణదాతగా
ABN , Publish Date - May 02 , 2026 | 02:17 AM
పేదరికం కారణంగా కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోతుంటే.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక ఇల్లాలు అనుభవించిన ఆవేదన అది. ఆ బాధ ఆమెను సంచలన నిర్ణయం వైపు...
పేదరికం కారణంగా కళ్ల ముందే భర్త ప్రాణాలు కోల్పోతుంటే.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఒక ఇల్లాలు అనుభవించిన ఆవేదన అది. ఆ బాధ ఆమెను సంచలన నిర్ణయం వైపు నడిపించింది. కూరగాయలు అమ్మి, ఇళ్లలో పాచి పని చేసి... ఒక ఆసుపత్రినే నిర్మించారు... సుభాషిణి మిస్త్రీ. ఎన్నో ఏళ్లుగా వేలమందికి ప్రాణదానం చేసిన సుభాషిణి ఇటీవల ఓ సందర్భంలో తన అనుభవాలను పంచుకున్నారు.
అది 1971వ సంవత్సరం. నా వయసు కేవలం 23 ఏళ్లు. అప్పుడు మాది పశ్చిమ బెంగాల్‌లోని ఓ కుగ్రామం. నా భర్తకు హఠాత్తుగా అనారోగ్యం చేసింది. అది గ్యాస్ట్రో ఎంటరైటిస్ అని తర్వాత తెలిసింది. కానీ, ఆ సమయంలో మాకు తెలిసిందల్లా ఒక్కటే.. ఆయన ప్రాణాపాయంలో ఉన్నారని. దగ్గర్లో సరైన వైద్యులు లేరు. పెద్ద ఆసుపత్రికి వెళ్దామంటే మా దగ్గర చిల్లిగవ్వ లేదు. ఆసుపత్రి గడప దగ్గరికి వెళ్లినా ‘డబ్బులుంటేనే లోపలికి’ అన్న చేదు నిజం నాకు ఎదురైంది. ఆసుపత్రి కారిడార్లలో సాయం కోసం నేను చేసిన ప్రతి అభ్యర్థన తిరస్కరణకు గురైంది. సరైన వైద్యం అందకపోవడంతో నా చేతులు పట్టుకునే ఆయన ప్రాణాలు విడిచారు. నలుగురు పసిపిల్లలతో నేను అనాథనయ్యాను. ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. నా భర్త చనిపోయింది కేవలం రోగం వల్ల కాదు, పేదరికం వల్ల. శ్మశాన వాటికలో ఆయన చితి మండుతుంటే నా గుండెల్లో ఒక ప్రతిజ్ఞ పుట్టింది. డబ్బు లేని కారణంగా ఏ పేదవాడు ఆసుపత్రి బయట ప్రాణాలు వదలకూడదని ఆ రోజే అనుకున్నాను.
శ్రమే పెట్టుబడి..
భర్త పోయాక నలుగురు పిల్లలను సాకడమే గగనమైపోయింది. కానీ లక్ష్యం నా కళ్ల ముందు కదలాడుతుండేది. పొద్దున్నే లేచి ఇళ్లలో అంట్లుతోమడం, బట్టలు ఉతకడం వంటి పనులు చేసేదాన్ని. ఆ తర్వాత కూరగాయల గంప నెత్తిన పెట్టుకుని మైళ్ల దూరం నడిచేదాన్ని. ఎండకు మాడినా, వానకు తడిసినా నేను ఆగేదాన్ని కాదు. ఆ గంప బరువు కంటే నా ఆశయం బరువు ఎక్కువగా ఉండేది. రోజుకు వచ్చే ఆ కొద్దిపాటి పైసల్లో పిల్లల కోసం కొంత దాచి మిగతాది నా ‘ఆసుపత్రి కల’ కోసం ఒక చిన్న మట్టి పాత్రలో వేసేదాన్ని. ఇరవై ఏళ్లపాటు నేను చేసిన ఆ పొదుపు యజ్ఞం ఎవరికీ అర్థం కాలేదు. ‘పిచ్చిది, కూడబెట్టిన సొమ్ముతో మంచి చీర కూడా కొనుక్కోదు, ఆసుపత్రి కడతానంటుంది’ అని నవ్వుకున్నారు. కానీ నేను నా పట్టుదలను వదల్లేదు. చివరికి 1992లో నేను దాచుకున్న ఆ కొద్దిపాటి సొమ్ముతో హన్స్‌పుకూర్ గ్రామంలో ఒక ఎకరం పొలాన్ని కొన్నాను. ఆ భూమి కొన్నప్పుడు నా కళ్లలో వచ్చిన నీళ్లు ఆనందానివో, నా భర్త గుర్తుగా వచ్చినవో నాకే తెలియదు.
నా కల.. కొడుకు రూపంలో..
భూమి అయితే ఉంది కానీ, అక్కడ భవనం కట్టే స్థోమత లేదు. అందుకే ఒక చిన్న పూరిగుడిసె వేసి ‘హ్యుమానిటీ క్లినిక్’ అని పేరు పెట్టాను. అప్పుడే నా చిన్న కొడుకును డాక్టర్ చేయాలని నిశ్చయించుకున్నాను. వాడు కూడా నా కష్టాన్ని చూసి పెరిగాడు. సెలవుల్లో వాడు కూడా నాతోపాటు కూలి పనులకు వచ్చేవాడు. కష్టపడి చదివి చివరికి వాడు డాక్టర్ అయ్యాడు. నా కొడుకు డాక్టర్ కోటు వేసుకుని ఆ క్లినిక్‌లో అడుగుపెట్టిన రోజు.. నా జీవితానికి ఒక అర్థం దొరికినట్టు అయింది. ఊర్లోని మరికొందరు డాక్టర్లను బతిమాలి ఉచితంగా వైద్యం చేయమని కోరేదాన్ని. అలా మొదలైన ఆ చిన్న క్లినిక్.. 1993లో ‘హ్యూమానిటీ ట్రస్ట్’గా మారింది. ప్రజల సహకారం, నా పట్టుదల తోడై 1996లో ఒక శాశ్వత భవనంగా రూపుదిద్దుకుంది. ఆ భవనం కడుతున్నప్పుడు నేను కూడా ఒక కూలీలా ఇటుకలు మోశాను. ఆ గోడల్లో నా రక్తం, చెమట ఉన్నాయి.
పురస్కారాల వెనుక కన్నీరు
నేను ఈ పని చేసింది అవార్డుల కోసం కాదు, నా ఆసుపత్రికి వచ్చిన పేదవాడి ముఖంలో ఆనందం కనిపిస్తే నా భర్త తిరిగి వచ్చినట్టుగా భావించేదాన్ని. కానీ, నా కృషిని దేశం గుర్తించింది. 2017లో ఐక్యరాజ్య సమితి నన్ను ‘విమెన్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా’ పురస్కారంతో గౌరవించింది. 2018లో భారత ప్రభుత్వం నాకు ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి భవన్‌లో ఆ పురస్కారం అందుకుంటున్నప్పుడు నా మనసు మాత్రం నా గ్రామంలోని ఆ పూరిగుడిసె చుట్టూనే తిరిగింది. ఒకప్పుడు కూరగాయలు అమ్మిన ఈ చేతులతో ‘పద్మశ్రీ’ అందుకోవడం నా గొప్పతనం కాదు, వేలమంది నిరుపేదల ఆశీర్వాదం. పురస్కారం అందుకున్న మరుసటి రోజే నేను మళ్లీ నా ఆసుపత్రికి వెళ్లి రోగులకు సేవ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే నాకు ‘పద్మశ్రీ’ కంటే వారి ఆరోగ్యం ముఖ్యం.

ఇది ఆసుపత్రి కాదు.. ఆశయం
ఈ రోజు మా ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు జరుగుతున్నాయి. నిరుపేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతోంది. ఇప్పటికీ నేను ఆసుపత్రి వార్డుల్లో తిరుగుతూ రోగులను పలకరిస్తాను. వారి కళ్లలో కృతజ్ఞత చూసినప్పుడు నా 45 ఏళ్ల శ్రమ మర్చిపోతాను. డబ్బుల్లేక వైద్యం ఆగిపోకూడదు. పేదరికం ప్రాణాలను బలితీసుకోకూడదు. మరణం అనేది ఎవరికైనా తప్పదు, కానీ అది అసహాయత వల్ల రాకూడదు. నేడు మా హ్యూమానిటీ ఆసుపత్రి సుందర్బన్స్ వంటి మారుమూత ప్రాంతాలకు కూడా విస్తరించింది. నా ప్రయాణం ఇక్కడితో ఆగిపోకూడదు. నా చివరి శ్వాస వరకు ఈ ఆసుపత్రిలో ఏ పేదవాడు నిరాశతో వెనుదిరగకూడదనేదే నా తాపత్రయం. మీలో కూడా ఏదైనా సాధించాలన్న తపన ఉంటే పేదరికాన్ని సాకుగా చూపకండి. దానినే మీ ఆయుధంగా మార్చుకోండి. లోకం కోసం మీరు చేసే చిన్న సాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు. అదే నిజమైన మానవత్వం.
ఇవి కూడా చదవండి:
శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్