Share News

ఆరోగ్య భారతం ఆమె లక్ష్యం

ABN , Publish Date - Apr 02 , 2026 | 05:55 AM

బీటెక్‌ చదివి పానీపూరి అమ్మడమేంటని ఈసడించుకున్న వాళ్లే నేడు ఆమె సాహసానికి సెల్యూట్‌ చేస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌కు పానీపూరి బండిని...

ఆరోగ్య భారతం ఆమె లక్ష్యం

బీటెక్‌ చదివి పానీపూరి అమ్మడమేంటని ఈసడించుకున్న వాళ్లే నేడు ఆమె సాహసానికి సెల్యూట్‌ చేస్తున్నారు. ఢిల్లీ వీధుల్లో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌కు పానీపూరి బండిని తగిలించి వ్యాపారం మొదలుపెట్టిన తాప్సీ ఉపాధ్యాయ్‌... నేడు అదే బైక్‌పై దేశాన్ని చుట్టేస్తోంది. ‘ఒబేసిటీ ముక్త్‌ భారత్‌’ (ఊబకాయ రహిత భారత్‌) లక్ష్యంతో ఆమె సాగిస్తున్న 40 వేల కిలోమీటర్ల మహాయాత్ర ఇప్పుడు తెలుగు గడ్డపైకి చేరింది.

ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి బీటెక్‌ పూర్తిచేసి మంచి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదిస్తుందని ఆమె తల్లిదండ్రులు ఆశించారు. కానీ, తాప్సీ ఆలోచనలు వేరు. ఆమెకు సొంతంగా ఏదైనా చేయాలన్న తపన. ఆ తపనే ఆమెను ఢిల్లీ వీధుల్లో పానీపూరి బండి పెట్టేలా చేసింది. ‘బీటెక్‌ పానీపూరి వాలీ’గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినప్పుడు చాలామంది విమర్శించారు. ‘చదువుకున్నది ఇందుకేనా?’ అన్న ప్రశ్నలు ఎదురయ్యాయి. కానీ, ఏ పనీ చిన్నది కాదని, గౌరవంగా బతకడమే ముఖ్యమని తాప్సీ నిరూపించింది. అయితే, ఆమె పానీపూరి అమ్మడానికి మాత్రమే పరిమితం కాలేదు. తాను అమ్ముతున్న ఆహారం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనించింది. నేటి తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘ఊబకాయం’ అని గుర్తించింది. దానిపై పోరాడాలని నిర్ణయించుకుంది.

సంపూర్ణ భారత్‌ యాత్ర

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని 2025 మార్చి 9న ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ నుంచి తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌పై తాప్సీ ఒక భారీ సాహసయాత్ర ప్రారంభించింది.

ఏడాది కాలంగా యాత్ర విజయవంతంగా సాగుతోంది. ఈ యాత్ర పేరు ‘సంపూర్ణ భారత్‌ యాత్ర’. దీని ప్రధాన ఉద్దేశం ఒక్కటే.. భారతదేశాన్ని ఆరోగ్యవంతమైన దేశంగా మార్చడం.

యాత్రలోని ముఖ్యాంశాలు

దూరం: 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి మొత్తం 40 వేల కిలోమీటర్లు ప్రయాణించడం.

నినాదం: ‘ఒబేసిటీ ముక్త్‌ భారత్‌- మిషన్‌ హెల్దీ భారత్‌’.

పర్యావరణం: యాత్ర పొడవునా కోటి మొక్కలు నాటడం.

ఆరోగ్యం: జంక్‌ఫుడ్‌ వల్ల కలిగే నష్టాలను వివరిస్తూ.. మైదా, నూనె లేని ఆహారం తీసుకోవాలని అవగాహన కల్పించడం.

ఆహార తత్వశాస్త్రం

తాప్సీ తన పానీపూరి వ్యాపారంలో కూడా ఒక విప్లవం తీసుకొచ్చింది. ఆమె విక్రయించే పానీపూరిలో మైదా ఉండదు. పూరీలను నూనెలో వేయించకుండా ‘ఎయిర్‌ఫ్రై’ చేస్తుంది. నీటిలో రసాయన రంగులు వాడకుండా సహజమైన పుదీనా, జీలకర్ర, మసాలాలను ఉపయోగిస్తుంది. ‘‘మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. రుచి కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టవద్దు’’ అని ప్రతి వేదికపై నొక్కి చెబుతోంది.


సవాళ్లు.. సాధికారత

ఒక యువతి ఒంటరిగా బైక్‌పై వేల కిలోమీటర్లు ప్రయాణించడం అంటే చిన్న విషయం కాదు. వాతావరణ మార్పులు, సాంకేతిక సమస్యలు, భద్రతాపరమైన ఆందోళనలు ఎన్నో ఉంటాయి. కానీ, తాప్సీ వాటన్నింటినీ తన ఆత్మవిశ్వాసంతో అధిగమించింది. ‘‘మహిళలు తలచుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు’’ అని ఆమె నిరూపిస్తోంది.

ఆమె యాత్ర కేవలం ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, మహిళా సాధికారతకు కూడా నిలువెత్తు నిదర్శనం. భారతదేశం నేడు ప్రపంచంలోనే అత్యధిక యువత ఉన్న దేశం. వారు జంక్‌ఫుడ్‌ బారినపడి అనారోగ్యం పాలవుతుంటే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన తాప్సీ ఉపాధ్యాయ్‌ తన వంతుగా ప్రజల్లో చైతన్యం నింపుతోంది. ఒక చిన్న పారీపూరి బండి నుంచి మొదలైన ఆమె ప్రయాణం నేడు కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

66-Navya.jpg

తెలుగు రాష్ట్రాల్లో సందడి

దాదాపు ఏడాది కాలంగా దేశంలోని వివిధ రాష్ట్రాలను చుట్టేసిన తాప్సీ తెలంగాణలో యాత్రను పూర్తి చేసుకుని ఆంధ్రప్రదేశ్‌లో అడుగుపెట్టింది. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో 17 వేల కిలోమీటర్లకుపైగా ప్రయాణించింది. ఈ క్రమంలో 500కు పైగా పాఠశాలలు, కళాశాలలను సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలు బోధించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న తాప్సీ ఇటీవలే ఏపీ రాజధాని అమరావతిలో ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ను కలిసింది. ఒక యువతి ఒంటరిగా ఇంతపెద్ద సాహసయాత్ర చేయడం చూసి పవన్‌ ఆశ్చర్యపోయారు. ఆమె చేస్తున్న సామాజిక సేవను అభినందిస్తూ ఆరోగ్యవంతమైన సమాజం కోసం యువత ఇలాంటి స్ఫూర్తిదాయకమైన అడుగు వేయడం సంతోషకరమని కొనియాడారు. ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ను కూడా కలిసి తన యాత్ర అనుభవాలను, ప్రజల నుంచి వస్తున్న స్పందనను తాప్సీ వివరించింది. అలాగే తన ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ చానల్స్‌ ద్వారా తన ప్రయాణాన్ని మాత్రమే కాకుండా, ప్రతి రోజూ ‘హెల్దీ డైట్‌ టిప్స్‌’ను పంచుకుంటోంది.

ఇవి కూడా చదవండి...

అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత

మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 02 , 2026 | 05:56 AM