ఆ అనుభూతి గుర్తుండేలా
ABN , Publish Date - Apr 02 , 2026 | 05:50 AM
పదమూడేళ్ల ప్రయాణం... 650కి పైగా పెళ్లిళ్లు జరిపించిన అనుభవం... ఐఎ్‌ఫఎస్ అధికారి కావాలనుకున్న యువతి... రూటు మార్చి వెడ్డింగ్ ప్లానర్‌గా బిజీ అయిపోయింది. హార్దిక్ పాండ్యా, అల్లు శిరీష్ తదితర....
అభిరుచి
పదమూడేళ్ల ప్రయాణం... 650కి పైగా పెళ్లిళ్లు జరిపించిన అనుభవం... ఐఎ్‌ఫఎస్ అధికారి కావాలనుకున్న యువతి... రూటు మార్చి వెడ్డింగ్ ప్లానర్‌గా బిజీ అయిపోయింది. హార్దిక్ పాండ్యా, అల్లు శిరీష్ తదితర సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు... దేశంలోనే డిమాండ్ గల ఈవెంట్ మేనేజిమెంట్ కంపెనీగా ఎదిగిన ‘ష్రీమ్స్ ఈవెంట్స్’ అధినేత 33 ఏళ్ల దేవాంశీ పటేల్ కథ ఇది.
‘‘చిన్నప్పటి నుంచి ఒక కల... ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎ్‌ఫఎస్) అధికారిని అవ్వాలని. మా తాతను చూసి పొందిన స్ఫూర్తి అది. గుజరాత్‌లో కమిషనర్‌గా పని చేసే రోజుల్లో... ప్రజా సేవ పట్ల ఆయనకున్న నిబద్ధత, అంకితభావం నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కానీ అనుకున్నవన్నీ జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది! ముంబయి ‘మౌంట్ మేరీ హైస్కూల్’లో పాఠశాల విద్యాభ్యాసం తరువాత ‘ఎస్‌వీకేఎమ్స్ మోంజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్టడీ్‌స’లో బిజినెస్, కామర్స్ డిగ్రీ చేశాను. నాకు మొదటి నుంచి కళాశాలలో జరిగే ఉత్సవాల వంటి వాటికి ఏర్పాట్లు చేయడం అంటే చాలా ఆసక్తి. ఏ చిన్న కార్యక్రమం జరిగినా నేను పాల్గొనేదాన్ని. ఆ తరువాత అనుకోకుండా అదే నా వ్యాపకంగా మారింది. క్రమంగా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు నేనే అన్నీ చూసుకొనేదాన్ని. అలా కాలేజీలో చదివే రోజుల్లోనే ‘ఐఐఎ్‌ఫఏ అవార్డ్స్, గిమా అవార్డ్స్’ లాంటి భారీ గ్లోబల్ ఈవెంట్స్‌కు పని చేసే అవకాశం లభించింది. ఈ అనుభవం నాకు నైపుణ్యాన్నే కాదు, నా ఆలోచనల్ని కూడా మార్చేసింది.
అదే మొదటి పెళ్లి...
కాలేజీలో ఉన్నప్పుడే నా కెరీర్‌పై స్పష్టత వచ్చింది. చదువు అయ్యాక ఏదో ఉద్యోగం కోసం ప్రయత్నించే కంటే... ఆసక్తి ఉన్న ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లోనే కొనసాగడమే సరైన నిర్ణయం అనిపించింది. ఆ క్షణం నుంచి పూర్తిగా దీనిపైనే దృష్టి పెట్టాను. అతిథులకు స్వాగతాలు, అలంకరణ తదితర ఏర్పాట్లతో పాటు పెళ్లి తంతు జరిపించడం వరకు అన్నీ చూసుకోగల అనుభవం సంపాదించాను. అలా నా పంథొమ్మిదేళ్ల వయసులో మొట్టమొదటిసారి ఒక పెళ్లి నిర్వహణ బాధ్యతలు తీసుకున్నాను. అది ఎవరిదో కాదు... నా స్నేహితురాలి వివాహమే. సమర్థవంతమైన టీమ్‌ను నియమించుకొని, విజయవంతంగా ముగించాను. అది ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. కెరీర్‌కు బలమైన పునాది వేసింది.
కీలక మలుపు...
ఒక వివాహ వేడుక అంటే... ఆతిథ్యం, రవాణా, ఏర్పాట్లు, భావోద్వేగాల వంటి ఎన్నో అంశాలు కలిసి వస్తాయి. వాటన్నిటినీ ఒకచోట చేర్చడంవల్ల అది ఎంత అర్థవంతంగా ఉంటుందో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. ఏ స్థాయిలో పెళ్లి జరిపించినా వీటికి లోటు లేకుండా చూసుకోవడం ప్రధానమని అర్థం చేసుకున్నాను. అయితే నా కెరీర్‌ను మలుపు తిప్పింది మాత్రం జోధ్‌పూర్‌లో వైభవంగా జరిగిన పెళ్లి. అక్కడి ఉమైద్ భవన్ ప్యాలెస్, తాజ్ హరిమహల్, బల్ సమంద్ ప్యాలె్‌సలలో ఒకేసారి ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఒక్కో క్రతువుకు ఒక్కో వేదిక. పెళ్లిళ్లలోని భావోద్వేగాల లోతును నేను ఆ క్షణమే అర్థం చేసుకున్నాను. అది కేవలం ఆర్భాటానికి మాత్రమే పరిమితం కాలేదు. కుటుంబం, అనుబంధాలు, ఆనందాలు, మధుర జ్ఞాపకాలకు సంబంధించింది కూడా. ఆ తరువాత నుంచి వెడ్డింగ్ ప్లానింగ్ చేసేటప్పుడు మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నాను.

అల్లు శిరీష్... నయనికారెడ్డి...
మా సంస్థ ద్వారా నిర్వహించిన తొలి సెలబ్రిటీ పెళ్లి... భారత స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటాషా స్టాన్‌కోవిక్‌లది. ఉదయ్‌పూర్ రాఫెల్స్‌లో నిర్వహించాం. ఇన్‌ఫ్లుయన్సర్, నటుడు విరాజ్ ఘెలానీ, పారిశ్రామికవేత్త పాలక్ ఖిమావత్ వివాహానికి కూడా వెడ్డింగ్ ప్లానర్స్ మేమే. అలాగే నా కెరీర్‌లోనే మరో మైలురాయి తెలుగు హీరో అల్లు శిరీష్, నయనికారెడ్డిల పెళ్లి ప్రాజెక్ట్. ఈ వేడుకకు ప్రణాళిక సిద్ధం చేయడం నాకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. ఎన్నో పాఠాలు నేర్పింది. దక్షిణాది సంప్రదాయ వివాహ వేడుకల్లోని సౌందర్యాన్ని, ప్రేమ కురిపించే అభిమాన గణాన్ని, అనిర్వచనీయమైన అనురాగ బంధాలను నాకు పరిచయం చేసింది. దీనికి ఐదు వందల మంది వరకు అతిథులు వస్తారని ముందుగా అంచనా వేశాం. కానీ ఆ సంఖ్య రెట్టింపు అయింది. సినీ, రాజకీయ రంగ ప్రముఖుల హాజరుతో అన్ని మాధ్యమాల్లో ప్రధాన ఆకర్షణ అయింది.
వారికి స్పష్టమైన లక్ష్యం...
అయితే అల్లు శిరీష్, నయనికలకు తమ పెళ్లి ఎలా జరగాలనేదానిపై ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. కేవలం ఆర్భాటంగా, ప్రదర్శన కోసం కాకుండా ఆత్మీయంగా, సన్నిహితంగా, అర్థవంతంగా జరగాలని వారు కోరుకున్నారు. వధూవరుల సూచనలకు అనుగుణంగా అతిథులు వేడుకలోని ఆత్మీయతను, ఆచారాల్లోని పవిత్రతను మనస్ఫూర్తిగా అనుభూతి చెందగలిగే వాతావరణాన్ని సృష్టించడంపై మేం దృష్టి పెట్టాం. ఏదీ తెచ్చి పెట్టినట్టు కాకుండా... ప్రతి క్రతువూ సహజంగా, ఉల్లాసంగా సాగిపోయింది. నా హృదయాన్ని హత్తుకున్నది ఏంటంటే... శిరీష్ తన సాంస్కృతిక, ఆధ్యాత్మిక మూలాలను ప్రతిబింబిస్తూ వైష్ణవ నామాలు, శంఖుచక్రాల మెహిందీని తన చేతికి పెట్టుకోవడం. ఇక పెళ్లిలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది... రుచికరమైన భారతీయ సంప్రదాయ వంటకాలు. అలాగే ఆంధ్రా తరహా సహపంక్తి భోజనాలు. ఇలాంటి ఎన్నో కొత్త అనుభూతులను ఈ పెళ్లి నాకు అందించింది.
సవాళ్లు ఎన్నో...
చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను భుజానికెత్తుకోవడం వల్ల సవాళ్లు ఎన్నో ఎదుర్కొన్నాను. ఆరంభంలో చాలామంది నాకు ఈవెంట్ అప్పగించడానికి వెనుకాడారు. ‘చిన్నపిల్ల. జీవితంలో కీలకమైన, ఇంత పెద్ద కార్యక్రమం చేయగలుగుతుందో... లేదో’ అనే సందేహం. కస్టమర్లలో నమ్మకం కలిగించడానికి... వారి ఇంటికి వెళ్లి గంటలకు గంటలు వెచ్చించాను. ఒక ప్రాజెక్ట్ పొందడానికి లెక్కలేనంతమందిని కలిశాను. చేతికి వచ్చిన ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేశాను. మా పనితనం, అంకితభావం చూశాక వారి ఆలోచనా విధానం మారింది. క్రమంగా ఈవెంట్లు పెరిగాయి. దాంతో 2013లో అధికారికంగా ‘ష్రీమ్ ఈవెంట్స్’ను ప్రారంభించాను.
ఇవి కూడా చదవండి...
అమరావతికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు: హోం మంత్రి అనిత
మార్కాపురం బస్సు ప్రమాదం.. డ్రైవర్, ఓనర్ అరెస్ట్
Read Latest AP News And Telugu News