Share News

అభిరుచే ‘ఆభరణ’మైంది

ABN , Publish Date - Jun 25 , 2026 | 02:05 AM

ముచ్చట పడిన అభిరుచి చివరకు జీవనభృతిగా మారుతుందని ఆమె ఊహించలేదు. సరదాగా మొదలుపెట్టిన ఆభరణాల తయారీ ఆమె జీవితాన్నే మార్చేసేంతగా...

అభిరుచే ‘ఆభరణ’మైంది

ముచ్చట పడిన అభిరుచి చివరకు జీవనభృతిగా మారుతుందని ఆమె ఊహించలేదు. సరదాగా మొదలుపెట్టిన ఆభరణాల తయారీ ఆమె జీవితాన్నే మార్చేసేంతగా ఎదిగిపోయింది. రెండున్నర వేల మంది మహిళా విద్యార్థులతో పాటు భర్తకు సైతం ఆభరణాల తయారీ నేర్పించి రాణిస్తున్న ఆ విజేత...

తమిళనాడుకు చెందిన షర్మిల గోవిందన్‌. పుదుచ్చేరిలోని క్రాఫ్ట్‌ బజార్‌లో దుకాణాన్ని నడిపిస్తున్న షర్మిల ‘నవ్య’తో పంచుకున్న విశేషాలివి.

రంగురంగుల పూసలు రా రమ్మంటూ పిలిచాయి. కానీ దుకాణాల్లో విక్రయించే పూసల దండలు నన్నేమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. చిన్నప్పటి నుంచి బొమ్మలు గీసే అలవాటుంది కాబట్టి ఆకట్టుకునే రంగుల గురించిన అవగాహన ఉంది. దాంతో స్వయంగా పూసల దండలు ఎందుకు తయారుచేయకూడదు? అనే ఆలోచన వచ్చింది. అంతే! అప్పటి నుంచి నేను వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం రాలేదు. ఓ పక్క ఆభరణాలను రూపొందిస్తూనే, మరో పక్క ఆసక్తి కలిగిన విద్యార్థులకు ఇంటి దగ్గర, కాలేజీ విద్యార్ధినులకు కాలేజీలకు వెళ్లి, ఆభరణాల తయారీ నేర్పిస్తూ వచ్చాను.

ఆభరణాల తయారీ ప్రారంభంలో కేవలం గాజులు మాత్రమే తయారుచేసేదాన్ని. ఆ తర్వాత నెమ్మదిగా బ్రేస్‌లెట్స్‌, దండలు, చెవి లోలాకుల తయారీ మీద కూడా పట్టు పెంచుకున్నాను. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌లో, లోకల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ డిపార్ట్‌మెంట్‌లో క్లాసులు తీసుకున్నాను. ఆ తర్వాత టూరిజం డిపార్ట్‌మెంట్‌లో కూడా క్లాసులు తీసుకున్నాను. క్రాఫ్ట్‌ బజార్‌లో గత ఏడేళ్లుగా దుకాణాన్ని నడుపుతున్నాను. అంతకు ముందు పదిహేనేళ్ల పాటు స్వయంగా వ్యాపారం చేశాను. ప్రస్తుతం క్రాఫ్ట్‌ బజార్‌తో పాటు పుదుచ్చేరిలో, ఇంటి దగ్గర ఇలా మొత్తం మూడు దుకాణాలు నడుపుతున్నాను. ప్రస్తుతం ఎంతోమంది బాలికలకు ఆభరణాల తయారీని ఉచితంగా నేర్పిస్తున్నాను.

8-Navya.jpg


సిగ్నేచర్‌ ఆభరణాలే లక్ష్యంగా...

ఆభరణాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం చెన్నై, ఢిల్లీల నుంచి తెచ్చుకుంటూ ఉంటాను. సూరజ్‌ కుంభ్‌మేళా, ప్రగతి మైదాన్‌లకు వెళ్లి అవసరమైనవన్నీ సేకరిస్తూ ఉంటాను. అయితే నాలాంటి ఎంతో మంది ఆభరణాల తయారీదారులు ఆ ప్రాంతాలకే వచ్చి, అవే ముడిపదార్థాలను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లందరూ తయారుచేసే ఆభరణాల కంటే నేను తయారుచేసినవి భిన్నంగా ఉండాలని కోరుకుంటాను. అందుకోసం మనసులో డిజైన్‌ను ఊహించుకుని, దాంతో సరిపోలేలా సృజనాత్మకతతో ఆభరణాలను రూపొందిస్తాను. నేను తయారుచేసే ప్రతి ఆభరణం సిగ్నేచర్‌ ఆభరణమే! ఏ రెండు ఆభరణాలూ ఒకేలా ఉండవు, బయట దొరికే ఆభరణాలతో సరిపోలవు. ఈ వ్యాపారం ద్వారా ప్రతి నెలా 70 నుంచి 80 వేల రూపాయాల ఆదాయాన్ని పొందుతున్నాను.

భర్త వ్యాపారం మానుకుని...

ఈ వ్యాపారంలో మా అత్తింటివారు, మావారు గోవిందన్‌ పూర్తిగా సహకరిస్తారు. పెళ్లినాటికి మా వారు స్వీట్‌ షాపు నడుపుతూ ఉండేవారు. పెళ్లయ్యాక, నేనీ వ్యాపారంలోకి అడుగుపెట్టి వేగంగా ఎదగడం చూసి, ఆయన తన వ్యాపారం ఆపేసి, నా వ్యాపారంలోకి దిగిపోయారు. ఆయనకు కూడా ఆభరణాల తయారీ నేర్పించాను. ఇప్పుడు ఆయన కూడా నేర్పుగా ఆభరణాలు తయారుచేయగలుగుతున్నారు. పుదుచ్చేరిలో నెలకొల్పిన దుకాణాన్ని ఆయన నడిపిస్తూ ఉంటే, క్రాఫ్ట్‌ బజార్‌లో ఉన్న దుకాణాన్ని నేను నడిపిస్తూ ఉంటాను. టెర్రకోట, ిసిల్వర్‌ ఆక్సిడైజ్డ్‌, సిల్క్‌థ్రెడ్‌, స్టోన్‌బీడ్స్‌, మ్యాట్‌ ఫినిష్‌, సీడ్‌ జ్యువెలరీలను రూపొందిస్తున్నాను. ప్రస్తుతం సీడ్‌ జ్యువెలరీ ఎక్కువ ఆదరణ పొందుతోంది.

గోగుమళ్ల కవిత

మాది తమిళనాడులోని విల్లుపురం. పుదుచ్చేరికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ పురపాలక పట్టణం. గత 22 ఏళ్లుగా ఆభరణాలను తయారుచేస్తున్నాను. నాకు ఇద్దరు మగపిల్లలు. ఇప్పటివరకూ తమిళనాడు ప్రభుత్వం నుంచి 15 అవార్డులు అందుకున్నాను.

ఇవి కూడా చదవండి

సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!

టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!

Updated Date - Jun 25 , 2026 | 02:05 AM