మార్పు సారథులు
ABN , Publish Date - Nov 21 , 2026 | 05:07 AM
సవాళ్లను అధిగమించి సమాజంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన నలుగురు అసామాన్య మహిళల స్ఫూర్తిదాయక గాధలివి. గిరిజన ఆరోగ్యం, ట్రాన్స్‌జెండర్...
సవాళ్లను అధిగమించి సమాజంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టిన నలుగురు అసామాన్య మహిళల స్ఫూర్తిదాయక గాధలివి. గిరిజన ఆరోగ్యం, ట్రాన్స్‌జెండర్ హక్కులు, గ్రామీణ బాలలకు పోషకాహారం, యాసిడ్ దాడి బాధితుల హక్కులు లాంటి విభిన్న రంగాల్లో వీరు గొప్ప విజయాలు సాధించి ప్రతిష్ఠాత్మక ‘టైమ్ 100 నెక్ట్స్ ఇండియా 2026’ జాబితాలో చోటు దక్కించుకొని, నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు షహీన్ మాలిక్, విద్య పరశురామ్కర్, డాక్టర్ నేహా కాలే, అక్సా షేక్.
గూడేల ఆరోగ్య నేస్తం
మారుమూల అటవీ ప్రాంతాల్లో నివసించే గిరిజనుల చెంతకే నాణ్యమైన ఆధునిక వైద్యాన్ని తీసుకెళ్తూ ఛత్తీస్‌గఢ్ గ్రామీణ ఆరోగ్య ముఖచిత్రాన్నే మార్చేస్తున్నారు డాక్టర్ నేహా కాలే. ప్రజారోగ్య రంగంలో ఆమె చేస్తున్న విశేష కృషికి ప్రతిష్ఠాత్మక ‘టైమ్స్ 100 నెక్ట్స్ ఇండియా 2026’ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఫ్యామిలీ మెడిసిన్‌లో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన డాక్టర్ నేహా కాలే.. కార్పొరేట్ ఆసుపత్రుల వైపు కాకుండా వైద్య సదుపాయాలు అందని గ్రామీణ భారతదేశానికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. తొలుత ‘జన స్వాస్థ్య సహయోగ్’తో కలిసి పనిచేసి.. గిరిజన ప్రాంతాల్లో రవాణా, వైద్య సదుపాయాల లేమితో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా అధ్యయనం చేశారు. అనంతరం 2018-19 ప్రాంతంలో సహచర వైద్యులతో కలిసి ఛత్తీస్‌గఢ్ లోని సర్గుజా జిల్లా కేంద్రంగా ‘సంగ్వారి’ (స్థానిక భాషలో మిత్రుడు అని అర్థం) అనే లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు.
ఆరోగ్య కేంద్రాలతో మమేకమై..
ప్రభుత్వ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా కాకుండా, జిల్లా యంత్రాంగం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో మమేకమై పనిచేయడం నేహ ప్రత్యేకత. అత్యంత వెనుకబడిన పహాడీ కోర్వా వంటి గిరిజన తెగలకు సికిల్ సెల్ అనీమియా, క్షయ, మూర్ఛ, మధుమేహం, మానసిక ఆరోగ్య సమస్యలకు గ్రామ స్థాయిలోనే ఉచితంగా నిర్ధారణ పరీక్షలు, నిరంతర చికిత్స అందిస్తున్నారు. ఆశా వర్కర్లకు శిక్షణనిస్తూ క్షేత్రస్థాయి పరిశోధనల ద్వారా ప్రభుత్వ ఆరోగ్య విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె సేవలకు గాను టైమ్ మ్యాగజైన్ అంతర్జాతీయ గుర్తింపునిచ్చింది.
పోషకాల ‘విద్య’
మన ఆరోగ్యంలో పోషకాహారం పాత్ర గురించి లోతుగా తెలుసుకోవాలనే ఆసక్తి విద్య పరశురామ్కర్‌కు కలగడానికి కారణం ఆమె స్వీయానుభవమే. ఐరన్ లోపం కారణంగా రక్తహీనతతో ఆమె చాలాకాలం ఇబ్బంది పడ్డారు. ఆ సమస్యను అధిగమించే ప్రయత్నంలో... పోషకాలతో నిండిన పదార్థాలపై అవగాహన పెంచుకున్నారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది పిల్లలు కనీసమైన పోషకాహారానికి నోచుకోవడం లేదు. బడి పిల్లలకు ఉచిత భోజన పథకాన్ని అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నా... పోషకాల సమతుల్యత ఒక సవాలుగానే మిగులుతోంది. ప్రత్యేకించి ఐరన్ లోపం ఆందోళనకరమైన సమస్య. దేశంలో దాదాపు సగం మంది బడి పిల్లలు ఆ లోపం కారణంగా రక్తహీనతతో సతమతమవుతున్నారు’’ అంటున్నారు విద్య. ఆమెది మహారాష్ట్రలోని గోండియాకు చెందిన రైతు కుటుంబం. ఐఐటి ఖరగ్‌పూర్‌లో.. ఫుడ్ టెక్నాలజీలో ఎంటెక్ చేశారు.
వివిధ ధాన్యాల్లో పోషకాలపై విద్య అధ్యయనం చేశారు. ‘‘సజ్జల్లో ఐరన్ చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. భారతీయ ఆహార సంస్కృతిలో తనదైన స్థానం దానికి ఉంది. అయితే దానిలో ఉండే కొన్ని ఎంజైముల కారణంగా దాని షెల్ఫ్ లైఫ్ తక్కువ. ప్రాసెస్ చెయ్యడం పెద్ద సవాల్. ఈ సమస్యను అధిగమించడం కోసం ‘అగ్రోజీ ఆర్గానిక్స్’ స్టార్టప్ ప్రారంభించాను’’ అంటున్న ఆమె... గ్రామీణ ప్రాంతాల్లోని సజ్జ పిండి వినియోగాన్ని పెంచడానికి తన సంస్థ ద్వారా ప్రయత్నాలు చేశారు. అయితే ఆ పిండి పది రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండేది కాదు. ఆ వ్యవధిని పెంచడం కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు. చివరకు... ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా, ఐరన్ లాంటి పోషకాలు ఏమాత్రం నష్టపోకుండా... ఆరు నెలల పాటు పిండి నిల్వ ఉండే ఒక ప్రక్రియను ఆమె అభివృద్ధి చేశారు. ‘అగ్రోజీ ఆర్గానిక్స్’కి అనుబంధంగా ‘మిల్లెట్స్ నౌ’ పేరిట జొన్నల ఆహారాన్ని గ్రామీణ ప్రాంతాలకు సరఫరా చెయ్యడం ఆరంభించారు.
4 లక్షల మీల్ బాక్స్‌లు
‘మిల్లెట్ నౌ’ ద్వారా దేశంలో 4లక్షల మందికి పైగా పిల్లలకు మీల్ బాక్స్‌లు అందుతున్నాయి. ఏడు వేలమంది చిన్న కమతాల రైతులను, పలు మహిళా స్వయంసేవక సంఘాల సభ్యులను ఆమె తమ సంస్థలో భాగస్వాములుగా చేసుకున్నారు. ‘‘వారిలో అయిదు వేలమందికి పైగా గిరిజన, ఎస్టీ, ఎస్సీ, ఓబీసీ వర్గాలవారు ఉన్నారు. సేంద్రియ పద్ధతుల్లో సాగు గురించి వారికి అవగాహన కల్పించాం. దీనిద్వారా వారి నెలవారీ ఆదాయం పదిహేను వేల రూపాయలకు పెరిగింది. మరోవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా... అడవుల పునరుద్ధరణ, నిర్వహణ కార్యక్రమాలు చేపడుతున్నాం. నాలుగువేలకు పైగా మొక్కలు నాటించాం. పది లక్షల లీటర్ల నీటిని సంరక్షించగలిగాం’’ అని చెబుతున్నారు విద్య. ఫుడ్ టెక్నాలజిస్టుగా, సోషల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా తను అందిస్తున్న సేవలకు గుర్తింపుగా 2025లో ‘రోహిణి నాయర్ ప్రైజ్’ అందుకున్నారు. 24 ఏళ్ళ వయసులో... ఆ బహుమతిని అందుకున్న అతి పిన్నవయస్కురాలిగా, తొలి మహిళగా నిలిచారు. ఈ ఏడాది ‘టైమ్స్-100 నెక్ట్ ఇండియా’ జాబితాలో ఆమె పేరు చోటుచేసుకుంది.
ఈ వార్తలనూ చదవండి:
వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్‌పై సైబర్ దాడి.. కస్టమర్ల సమాచారం లీక్!
ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్.. 37 గంటల మిషన్‌లో ఏం జరిగిందంటే..