ఆమె అభిరుచికి.. వైవిధ్యమే పెట్టుబడి
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:37 AM
ఆమె అభిరుచికి.. వైవిధ్యమే పెట్టుబడి అయితే పైలట్ కావాలి... లేదంటే నటిగా మెరవాలి. చిన్ననాటి ఆ కలలు కలగానే మిగిలిపోయాయి కానీ...
విభిన్నం
ఆమె అభిరుచికి.. వైవిధ్యమే పెట్టుబడి అయితే పైలట్ కావాలి... లేదంటే నటిగా మెరవాలి. చిన్ననాటి ఆ కలలు కలగానే మిగిలిపోయాయి కానీ...
ఆమె వృత్తిగత జీవితం మాత్రం వాయుసేనతోనే ముడిపడి సాగింది. వింగ్ కమాండర్‌గా పద్నాలుగేళ్లు సేవలందించిన ఆమె... పదవీ విరమణ తరువాత తన అభిరుచికి తగిన రంగాన్ని ఎంచుకొంది. వైవిధ్యమైన ఆలోచనలతో కేఫ్‌కు కొత్త అర్థాన్నిచ్చి... వ్యాపారవేత్తగానూ రాణిస్తున్న శిఖా చౌదరి కథ ఇది.
‘‘ముంబయి మహానగరం... మనలో సత్తా ఉండాలే కానీ ఇక్కడ అవకాశాలకు కొదవలేదు. సృజనకు రెక్కలు తొడిగి... ఆలోచనలకు రూపం ఇవ్వగలిగితే... రంగం ఏదైనా రాణించవచ్చు. పట్టుదలే పెట్టుబడిగా, నిజాయితీగా కష్టపడటమే అలవాటుగా మార్చుకొంటే ఫలితం అదే వస్తుంది. ఈ అద్భుత నగరంలోనే నేను పుట్టి పెరిగాను. మొక్కగా మొదలై మహావృక్షంగా ఎదిగిన వ్యక్తుల కథలు ఇక్కడ ఎన్నో. వాటిలో నాదీ ఒక కథ. చిన్నప్పుడు ఆకాశంలో విమానాన్ని చూసినప్పుడల్లా నా మనసు ఆనందంతో ఉప్పొంగేది. ఎప్పటికైనా నేను కూడా పైలట్నయ్యి మేఘాలలో దూసుకుపోవాలని కలలు కన్నాను. హైస్కూల్‌కు వచ్చాక నటనపై ఆసక్తి కలిగింది. ఒకవేళ పైలెట్ కాలేకపోతే నటిగా ఎదగాలని కోరుకున్నాను. ఎలక్ర్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌తో ఇంజినీరింగ్ పూర్తి చేశాను. భారత వాయుసేనలో చేరాలన్నది నా ఆశయం. దాని కోసం దరఖాస్తు చేసుకున్నాను. అన్ని పరీక్షలనూ విజయవంతంగా అధిగమించాను. కానీ సరిపడా ఎత్తు లేకపోవడంవల్ల ఆఖరి అంచెలో రిజెక్ట్ అయ్యాను.
అలా కుదిరింది...
పైలట్‌గా ఎంపిక కాలేదు కానీ, నాకు బీటెక్ డిగ్రీ ఉండటంతో టెక్నికల్ బ్రాంచ్‌లో ఏరోనాటికల్ ఇంజినీర్‌గా ఉద్యోగం ఇస్తామన్నారు. ‘‘పైలట్ కావాలన్న నీ కోరిక నెరవేరకపోవచ్చు. కానీ ఈ ఉద్యోగంలో చేరితే ఎయిర్‌క్రాఫ్ట్‌ల మధ్యనే పనిచేయాల్సి ఉంటుంది. అలా నీ చిన్ననాటి కలకు దగ్గరగా జీవించవచ్చు’’ అని అధికారులు చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా ఎయిర్‌ఫోర్స్ యూనిఫామ్ వేసుకొని, దేశానికి సేవ చేసే అవకాశం ఎంతమందికి వస్తుంది! తలుచుకొంటేనే ఎంతో గర్వంగా అనిపించింది. వేరే ఆలోచన లేకుండా ఉద్యోగంలో చేరిపోయాను.
సవాళ్లు ఎన్నో...
ఏరోనాటికల్ ఇంజినీర్‌గా నా తొలి పోస్టింగ్ శ్రీనగర్‌లో. హెలికాప్టర్లలో సియాచిన్ హిమానీనదాల మీదుగా ప్రయాణించడం నా జీవితంలోనే ఒక మధురానుభూతి. ఆ మార్గం గుండా ప్రయాణించి సరిహద్దుల్లో ఉన్న భారత సైనికులకు నిత్యావసరాలు సరఫరా చేయడం మా పనిలో భాగం. దట్టమైన మంచువల్ల చాలా ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు ఉండవు. అలాగే 2014లో జమ్మూకశ్మీర్‌ను వరదలు ముంచెత్తినప్పుడు భారత వాయుసేన ‘ఆపరేషన్ మేఘ్ రాహత్’ పేరుతో పెద్దఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. వరదల్లో చిక్కుకున్నవారిని హెలికాప్టర్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కానీ ఆ ఆపరేషన్ ఎంతో క్లిష్టంగా సాగింది. క్షణక్షణం మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో హెలికాప్టర్లలో బాధితుల దగ్గరకు చేరుకోవడం అంత సులువు కాదు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా హెలికాప్టర్లో ఉన్నవారు కూడా ప్రమాదంలో పడతారు. అప్పటికి ఇంకా వాయుసేన పూర్తి స్థాయిలో తన బలగాలను పంపించలేదు. ఆ సమయంలో అక్కడ అందుబాటులో ఉన్న సిబ్బందే సహాయక చర్యలు చేపట్టాల్సివచ్చింది. నా పని ఏంటంటే... సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హెలికాప్టర్లను సిద్ధం చేయడం. నా కెరీర్లో నాకు ఎదురైన అత్యంత పెద్ద సవాళ్లలో అది ఒకటి. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో పనిచేసినప్పుడు కూడా ఇలాంటి సవాళ్లే ఎదుర్కొన్నా. గాయపడిన సైనికులను అర్ధరాత్రి తరలించాల్సివచ్చేది. రోజులో ఇరవై నాలుగు గంటలూ సిద్ధంగా ఉండాలి. ప్రతి క్షణం అక్కడ విలువైనదే.

ఎంతో నేర్పింది...
ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేయడంవల్ల ఎన్నో నేర్చుకున్నా. ముఖ్యంగా బాధ్యత, జవాబుదారీతనం అలవడ్డాయి. మన దగ్గర పని చేస్తున్నవారిలో ఏ ఒక్కరు తప్పు చేసినా అది మన తప్పు కూడా అవుతుంది. నాయకత్వం వహించినప్పుడు విజయాలకే కాదు, అపజయాలకు కూడా బాధ్యత తీసుకోవాలి. ఆ తత్వమే ఇవాళ నన్ను ఒక వ్యాపారవేత్తగా నిలబెట్టింది. వాయుసేనలో పద్నాలుగేళ్లు సేవలిందించిన నేను, పదవీ విరమణ తరువాత ఒకరి దగ్గర పని చేయదలుచుకోలేదు. నాకు నేనుగా ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవాలని అనుకున్నాను. అందులో భాగంగానే మా సోదరితో కలిసి ముంబయిలో ‘జెస్సీస్ కేఫ్’ ప్రారంభించాను.
అందరూ ఆస్వాదించేలా...
కేఫ్‌కు వచ్చినవారి కోసం కేఫ్‌లో తరచూ చిన్న చిన్న పార్టీలు, గెట్ టుగెదర్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాను. ఒకరి పుట్టినరోజు వేడుకను అందరూ ఆనందించేలా ఏర్పాట్లు చేశాను. తద్వారా అపరిచితులు కలిసి ఆహ్లాదంగా కాసేపు సమయం గడపడానికి, ఇక్కడున్నంతసేపూ అన్నీ మరిచి ఆస్వాదించడానికి, స్నేహితులుగా విడిపోవడానికి మా కేఫ్ చక్కని వేదిక. దాదాపు యాభైమంది కూర్చోగలిగే ఈ కేఫ్‌లో ఇటాలియన్, జపనీస్, ఫ్రెంచ్ తదితర మల్టీక్యుజిన్ రుచులు వడ్డిస్తున్నాం. మగవారికే కాదు, మహిళలు, పిల్లలు కూడా ఇక్కడ హాయిగా గడపవచ్చు. పిల్లలకు బోర్ కొట్టకుండా వారి కోసం కూడా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాను. ఇలా అన్నీ ఒకేచోట లభించే కేఫ్‌లు చాలా అరుదు. అందుకే ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే దీనికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది నాకు ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. ఈ వేదికను మరింత వైవిధ్యంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్దడానికి కావల్సినంత ప్రోత్సాహాన్ని ఇచ్చింది.
సొంత ఇంట్లో ఉన్న అనుభూతి
నగరంలో కెఫెటేరియాలకు కొదవేంలేదు. లెక్కకు మించి ఉన్నాయి. వాటిని తట్టుకొని నిలబడాలి. అదే సమయంలో ఇతర కేఫ్ల్లా మూస పద్ధతిలో వెళ్లడం నాకు ఇష్టం లేదు. వ్యాపారం అంటే కేవలం డబ్బు సంపాదన ఒక్కటే కాదు... ప్రత్యేకత కూడా ఉండాలనేది నా సంకల్పం. అందులో భాగంగానే వినూత్న ఆలోచనతో ‘జెస్సీస్ కేఫ్’ ప్రారంభించాను. కేఫ్‌కు వచ్చేవారు కప్పు కాఫీనో, పిజ్జానో తినేసి ఎవరిదారిన వారు వెళ్లిపోకుండా... అందరితో కలిసిపోయి, ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకొని, తమ సొంత ఇంట్లో ఉన్న అనుభూతి పొందాలి. అంతటి సౌకర్యవంతంగా దీన్ని తీర్చిదిద్దాను. దీనికి వైవిధ్యమే అసలైన పెట్టుబడి.
ఇవి కూడా చదవండి..
డబ్ల్యూబీబీఎల్: బ్రిస్బేన్ హీట్ జట్టులో భారత క్రికెటర్‌కు చోటు!
భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు