మాతృత్వం.. ఇక్కడ పరిపూర్ణం
ABN , Publish Date - Jun 24 , 2026 | 06:19 AM
భారతీయ యువకుడిని ప్రేమించి పెళ్లాడి ఐరోపా నుంచి వచ్చి మన దేశ కోడలిగా ఇక్కడ అడుగుపెట్టింది క్సేనియా కాలా. ఇక్కడి సంస్కృతిని, జీవనశైలిని పూర్తిగా సొంతం చేసుకున్న ఆమె...
భారతీయ యువకుడిని ప్రేమించి పెళ్లాడి ఐరోపా నుంచి వచ్చి మన దేశ కోడలిగా ఇక్కడ అడుగుపెట్టింది క్సేనియా కాలా. ఇక్కడి సంస్కృతిని, జీవనశైలిని పూర్తిగా సొంతం చేసుకున్న ఆమె ప్రస్తుతం నలుగురు పిల్లల తల్లి. పాశ్చాత్య దేశాల పద్ధతులకు పూర్తి భిన్నంగా ఉండే భారతీయ పెంపక సూత్రాలు తన మాతృత్వాన్ని సుసంపన్నం చేశాయంటూ ఆమె తన అనుభవాలను పంచుకున్నారు.
‘‘నలుగురు పిల్లల తల్లిగా ఇన్‌స్టాగ్రామ్‌లో నేను చాలామందికి పరిచయం. నేను ఎంతో ఇష్టపడే ఒక అందమైన కుటుంబ జీవితాన్ని ఇక్కడ నిర్మించుకుంటున్నాను. ఇటీవల నా పెంపకం అనుభవాలపై నేను పంచుకున్న ఒక చిన్న వీడియో సోషల్ మీడియాలో అంతలా వైరల్ అవుతుందని, భారతీయుల మనసులను గెలుచుకుంటుందని నేను అస్సలు ఊహించలేదు. మొదట్లో నాకు కొత్తగా, వింతగా అనిపించిన కొన్ని భారతీయ సంప్రదాయాలు.. ఇప్పుడు నా కుటుంబ జీవితంలో అత్యంత ఇష్టమైన భాగాలుగా ఎలా మారిపోయాయో చెప్పాలనేది నా ఉద్దేశం.
బంధాన్ని పెంచిన మంచం
మా పాశ్చాత్య దేశాలలో ఒక అలవాటు ఉంది. పిల్లలు పుట్టిన కొన్ని రోజులకే లేదా ఐదేళ్ల వయసు వచ్చేసరికి వారిని ప్రత్యేక గదుల్లో ఒంటరిగా పడుకోబెడతాం. పిల్లల్లో చిన్నప్పటి నుంచే స్వతంత్ర భావాలు, ఒంటరిగా ఉండే ధైర్యం రావాలని అలా చేస్తాం. కానీ నేను భారత్‌కు వచ్చాక ఇక్కడి తల్లులు పిల్లలతో కలిసి ఒకే
మంచంపై పడుకోవడం గమనించాను. మొదట్లో ఇది
నాకు వింతగా అనిపించినా, నా పిల్లల విషయంలో ఈ పద్ధతినే పాటించడం ప్రారంభించాను. ఆ మార్పు నన్ను ఆశ్చర్యపరిచింది. పిల్లలతో కలిసి పడుకోవడంవల్ల నా బిడ్డలతో నాకున్న బంధం బలపడింది. ముఖ్యంగా రాత్రివేళల్లో వారికి పాలివ్వడం, వారిని చూసుకోవడం నాకు ఎంతో సులువైంది. పిల్లల శ్వాసను అంత దగ్గరగా అనుభవిస్తూ పడుకోవడం ఒక తల్లిగా నాకు, నా ఉనికికి ఎంతో భద్రతను ఇచ్చింది.
స్పర్శతో అనురాగం
భారత్‌లో నాకు నచ్చిన మరో అద్భుతమైన ఆచారం.. పసిబిడ్డకు ఉదయాన్నే వేడినూనెతో మసాజ్ చేయడం. నా దృష్టిలో ఇది కేవలం ఒక శారీరక ప్రక్రియ కాదు.. తల్లికి, బిడ్డకు మధ్య ఉండే ఒక అందమైన స్పర్శానుభూతి. పవిత్రమైన అనుబంధం. ఈ సున్నితమైన మసాజ్ ద్వారా బిడ్డకు లభించే లాలన ఎంతో గొప్పది. అంతేకాదు, ఈ ప్రక్రియలో ఇంట్లోని నానమ్మలు, అమ్మమ్మలు భాగస్వాములు కావడం నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. పశ్చిమ దేశాలలో ప్రసవం తర్వాత తల్లి ఒంటరిగా పిల్లల బాధ్యతతో ఇబ్బంది పడుతుంటుంది. కానీ ఇక్కడ ఉమ్మడి కుటుంబాల మద్దతు, పెద్దల తోడ్పాటు కొత్తగా తల్లి అయినవారికి ఎంతో మానసిక ధైర్యాన్ని ఇస్తాయి. కుటుంబంలో అందరినీ ఒక తాటిపైకి తెచ్చే ఇలాంటి సంప్రదాయాలు నిజంగా అద్భుతం.
భారతీయ మూలాలు
పిల్లలకు పేర్లు పెట్టే విషయంలో భారతీయులు ప్రదర్శించే శ్రద్ధ నన్ను ఆలోచింపజేసింది. ఇక్కడ పేర్లు కేవలం పిలవడానికి మాత్రమే ఉపయోగించే అక్షరాలు కావు. ప్రతి పేరు వెనుకా ఇక్కడి సంస్కృతి, చరిత్ర, విలువలు, దైవత్వం దాగి ఉంటాయి. ఇక్కడ నా పిల్లలను పెంచడంలో అత్యంత సంతోషాన్నిచ్చిన విషయాల్లో ఒకటి.. వారి కోసం అర్థవంతమైన భారతీయ పేర్లను ఎంపిక చేసుకోవడం. నా నలుగురు పిల్లలకు భారతీయ పేర్లే పెట్టాను. ఈ పేర్లు వారు పెద్దయ్యాక కూడా తాము పెరిగిన ఈ దేశపు మూలాలను, ఇక్కడి సంస్కృతిని ఎప్పటికీ గౌరవించేలా చేస్తాయి.

బిడ్డ పుట్టిన రోజు.. నాకూ పండుగే
సాధారణంగా మా దేశాల్లో పుట్టినరోజు అంటే కేవలం పిల్లలు కొత్త బట్టలు వేసుకోవడం, కేక్ కట్ చేయడం, స్నేహితులతో ఆడుకోవడం మాత్రమే. కానీ భారత్‌లో ఒక విలక్షణమైన పద్ధతిని చూశాను. ఇక్కడ పిల్లల పుట్టిన రోజున తల్లులు కూడా సంప్రదాయబద్ధంగా ముస్తాబై చీరలు కడతారు. దీనివెనుక ఉన్న భావం నాకు బాగా నచ్చింది. బిడ్డ పుట్టినరోజు అనేది కేవలం ఆ బిడ్డకు మాత్రమే కాదు, ఆ బిడ్డను నవమాసాలు మోసి, లోకంలోకి తెచ్చిన తల్లికి కూడా ఎంతో ప్రత్యేకమైన రోజు. అది తల్లిగా నా రెండోజన్మను వేడుక చేసుకోవడం లాంటిది. అందుకే ఇప్పుడు నా పిల్లల పుట్టిన రోజు వేడుకల్లో నేను కూడా సంప్రదాయమైన చీరను ధరించి సందడి చేస్తున్నాను. అది నాకు ఎనలేని గర్వాన్ని ఇస్తుంది.
అపురూపమైన ప్రేమ
నేను పంచుకున్న ఈ అనుభవాలపై భారతీయ నెటిజన్ల నుంచి వస్తున్న స్పందనలు చదువుతుంటే నా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. వారు చూపిస్తున్న ఆదరణ నన్ను ఎంతగానో కదిలించింది. నా పోస్టుపై స్పందిస్తూ ఒకరు.. ‘బిడ్డ పుట్టిన రోజు అనేది నిజానికి తల్లికి పునర్జన్మ లాంటిది. ఒక జీవికి జన్మనివ్వడం అనేది ఒక అద్భుతం’ అని రాశారు. ‘భారత్‌లో ఒక మహిళ తల్లిగా మారిన తర్వాత, ఆమె జీవితంలో పిల్లల కంటే ముఖ్యమైనది మరేదీ ఉండదు’ అని మరొకరు రాశారు. ఈ కామెంట్లు చూశాక ఇక్కడి సమాజంలో తల్లికిచ్చే స్థానం ఎంత ఉన్నతమైనదో అర్థమైంది.
జీవితాంతం గౌరవిస్తా
నేను పుట్టిపెరిగిన సంస్కృతి వేరు, నేను ఇప్పుడు జీవిస్తున్న సంస్కృతి వేరు కావొచ్చు. కానీ ఒక అమ్మగా నా మనసు ప్రపంచంలోని ఏ తల్లి మనసుకన్నా భిన్నమైనదేమీ కాదు. పిల్లల పెంపకంలో ఆధునిక పద్ధతుల కంటే ప్రేమ, స్పర్శ, అనుబంధమే పరమార్థమని ఈ దేశం నాకు నేర్పింది. నాగరికత వైపు పరుగులు తీస్తూ మన పాత పద్ధతులను మర్చిపోవాల్సిన అవసరం లేదు. నాలోని మాతృత్వానికి పరిపూర్ణతను ఇచ్చిన భారతీయ సంప్రదాయాలను జీవితాంతం గౌరవిస్తూనే ఉంటాను.
ఇవి కూడా చదవండి:
భారత క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
టీ20ల్లో ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠం కైవసం చేసుకున్న శ్రీ చరణి