Share News

స్టంట్‌ మాస్టర్‌

ABN , Publish Date - Jul 09 , 2026 | 05:07 AM

‘‘నువ్వు ఆడపిల్లవి. పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చో’’ బెంగుళూరుకు చెందిన 21 ఏళ్ల ఇవాంజిలిన్‌కు, తల్లిదండ్రులు సూచించిన మార్గమిది. బదులుగా ఆమె భారీ బైక్‌నూ, ఆ బైక్‌ మీద...

స్టంట్‌ మాస్టర్‌

‘‘నువ్వు ఆడపిల్లవి. పెళ్లి చేసుకుని ఇంట్లో కూర్చో’’ బెంగుళూరుకు చెందిన 21 ఏళ్ల ఇవాంజిలిన్‌కు, తల్లిదండ్రులు సూచించిన మార్గమిది. బదులుగా ఆమె భారీ బైక్‌నూ, ఆ బైక్‌ మీద ప్రాణాంతక సాహసాలనూ ఎంచుకుంది. కాబట్టే నేడు మహిళలకు బైక్‌ స్టంట్స్‌ నేర్పించే మహిళా బైక్‌ రైడర్‌గా గుర్తింపు పొందగలిగింది. సాహసాలను సవాలుగా మలుచుకున్న ఇవాంజిలిన్‌ ప్రస్థానమిది...

ఉదయం తొమ్మిది గంటలకు యూనివర్శిటీ తరగతులకు హాజరవ్వాలి. కాబట్టి ఎవరి కంటా పడకుండా, చదువు దెబ్బతినకుండా బైక్‌ మీద స్టంట్స్‌ సాధన చేయడానికి తెల్లవారుఝామును తగిన సమయంగా ఎంచుకుంది ఇవాంజిలిన్‌. ఆ ద్వంద్వ జీవితానికి శ్రీకారం చుడుతూ ఉదయాన్నే నాలుగున్నరకు ఇంటి నుంచి బయల్దేరి ఐదున్నర నుంచి తొమ్మిది గంటల వరకూ ఊరిబయట బైక్‌ సాహసాలను సాధన చేసింది. ఆ స్టంట్స్‌తో శరీరం అలసిపోయినా, మానసిక సంకల్పం మరింత బలపడింది. మొదట్లో దాచిన ఆ స్టంట్స్‌ రహస్యం క్రమేపీ కుటుంబం కంట పడింది. తల్లితండ్రులు ఆమె అభిరుచిని ప్రోత్సహించకపోగా, ప్రమాదాలకు గురైతే భవిష్యత్తు గల్లంతవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లతో పాటు ఇరుగు పొరుగు కూడా ఆమె అభిరుచిని ఎద్దేవా చేశారు. అయినా ప్రజాభిప్రాయాలనూ, తల్లితండ్రుల భయాలనూ లెక్క చేయలేదు.

మహిళలకు స్టంట్స్‌ నేర్పిస్తూ...

దృఢ సంక్పలంతో అసాధ్యాలను సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తూ, ఇవాంజిలిన్‌, సాధారణ శిక్షణ మొదలుపెట్టిన పదిహేను రోజుల్లోనే, 2022, ఇండియన్‌ నేషనల్‌ స్టంట్‌ ఛాంపియన్‌షి్‌పలో పాల్గొనే స్థాయికి పరిణతి సాధించింది. ఆ పోటీల్లో ఆమె అనుభవజ్ఞులైన స్టంటర్లతో పోటీ పడి మూడో స్థానాన్ని పొందగలిగింది. 2024లో రెండోసారి పోటీ పడే సమయానికి, స్టంట్‌ రైడర్‌గా తన స్థానాన్ని పదిలపరుచుకోవడంతో పాటు, కర్నాటకకు చెందిన మొట్టమొదటి మహిళా బైక్‌ స్టంటర్‌గా కూడా గుర్తింపు పొందగలిగింది. అయితే పోడియంలు, ట్రోఫీలు గెలవడంతోనే ఆమె సరిపెట్టుకోలేదు. తనలాంటి సాటి ఔత్సాహిక మహిళలకు స్టంట్స్‌ నేర్పించాలని నిర్ణయించుకుంది. ఆ విధంగా ‘వియ్‌ థ్రాటిల్‌’ అనే వేదికను నెలకొల్పి, నేటి వరకూ దాదాపు 200 మంది మహిళలకు, బైక్‌ స్టంట్స్‌లో శిక్షణనిచ్చింది.


భద్రత కూడా ప్రధానమే!

స్టంట్‌ రైడింగ్‌ ప్రమాదాలతో కూడుకున్న రంగం కాబట్టి బరువైన బైక్స్‌ను నడపడంలో మెలకువలను నేర్పించడంతో పాటు, బైక్‌ను బ్యాలెన్స్‌ చేయడం, రైడింగ్‌ను తగిన దుస్తులను ఎంచుకోవడం, బైక్‌ జారిపడకుండా ఉండే ట్రిక్స్‌ను అలవరుచుకోవడం లాంటివి కూడా ఇవాంజిలిన్‌ నేర్పిస్తూ ఉంటుంది. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే ఇవాంజిలిన్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బైక్‌ రైడింగ్‌, స్టంట్స్‌ పట్ల మహిళలకు అవగాహన కల్పిస్తూ, తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

ఈ వార్తలనూ చదవండి:

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు.. ఒక్కరోజులో రూ.8.4 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరి

ఈపీఎఫ్‌ఓ చందాదారులకు గుడ్‌న్యూస్‌..!

Updated Date - Jul 09 , 2026 | 05:07 AM