Share News

పెద్దలు పట్టుతప్పి పడిపోతే?

ABN , Publish Date - Nov 03 , 2026 | 03:19 AM

వృద్ధాప్యంలో పట్టుతప్పి, జారి పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రమాదాలు పెద్దలతో పాటు మొత్తం కుటుంబాన్నే...

పెద్దలు పట్టుతప్పి పడిపోతే?

వృద్ధాప్యంలో పట్టుతప్పి, జారి పడే అవకాశాలు పెరుగుతాయి. ఈ ప్రమాదాలు పెద్దలతో పాటు మొత్తం కుటుంబాన్నే ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ ప్రమాదాలకు తావు లేని వాతావరణాన్ని కల్పించడంతో పాటు, వారి యోగక్షేమాలు చూసుకునే ఏర్పాట్లు కల్పించుకోవాలంటున్నారు వైద్యులు.

మన దేశంలో సాధారణంగా 60 ఏళ్లు దాటిన వారిని వృద్ధులుగా పరిగణిస్తారు. అమెరికాలో 65 ఏళ్లు, ఇండియాలో 55 నుంచి 60 ఏళ్ల వారిని వృద్ధులుగా పరిగణించవచ్చు. ఈ వయసు పెద్దల్లో బాడీ మాస్‌ ఇండెక్స్‌, బరువు తగ్గుతాయి. కండరాలు కూడా క్షీణిస్తాయి.

రెండు ప్రధాన కారణాలు...

పెద్దలు జారి పడే ప్రమాదాలకు గురవడానికి ప్రధానంగా రెండు కారణాలుంటాయి. అవేంటంటే...

భౌతిక కారణాలు: వయసు పెరిగేకొద్దీ కండ.రాలు క్షీణించి సంతులనాన్ని కోల్పోతారు. తగ్గిన కంటిచూపుకు తగిన కళ్లజోడును వాడుకోకుండా ఉండిపోతూ ఉంటారు. ఈ సమస్యలకు తోడు కీళ్ల అరుగుదల, మోకాళ్లు, తుంటి నొప్పులు, మధుమేహం వల్ల కాళ్లలో స్పర్శ తగ్గడం (న్యూరోపతి), అధిక రక్తపోటుకు వాడుకునే మందుల వల్ల అకస్మాత్తుగా రక్తపోటు తగ్గిపోయి, కళ్లు తిరిగి పడిపోతూ ఉంటారు. అలాగే కాగ్నిటివ్‌ డిక్లైన్‌ (జ్ఞాపకశక్తి, రిఫ్లెక్సెస్‌ తగ్గడం) వల్ల కూడా జారిపడుతూ ఉంటారు. పర్యావరణపరమైన కారణాలు: తక్కువ వెలుగు కలిగిన ప్రదేశాల్లో నడుస్తూ, పాదాలు పట్టు తప్పి, మడమ ఫ్రాక్చర్‌ అవుతూ ఉంటుంది. తడిగా ఉండే బాత్‌రూమ్‌ ఫ్లోర్స్‌, ఆసరా కోసం గ్రాబ్‌ బార్స్‌ లేకపోవడం, ఇళ్లలో పాలరాయి లేదా టైల్స్‌ తడిచి జారుడుగా మారడం, రెయిలింగ్స్‌ లేని మెట్లు, నిర్వహణ లేని ఫుట్‌పాత్స్‌ వల్ల వృద్ధులు ఎక్కువగా పడిపోతూ ఉంటారు.


మహిళల్లో ఎక్కువ

మహిళలకు ఆస్టియోపోరోసిస్‌ (ఎముకలు గుల్లబారం) ముప్పు చాలా ఎక్కువ. హార్మోన్‌ హెచ్చుతగ్గులు, విటమిన్‌ డి, క్యాల్షియం లోపం వల్ల ఎముకలు గుల్లబారతాయి. దాంతో మహిళలు ఎక్కువగా కింద పడిపోతూ, ఎముకలు విరిగే ప్రమాదానికి ఎక్కువగా గురవుతుంటారు.

పెద్దలు పడిపోతే?

కింద పడి లేదా జారిపడి తుంటి విరిగితే పెద్దలు వైకల్యానికి గురవుతారు. ఆరోగ్య ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. తుంటి విరిగిన తర్వాత చాలా కాలం మంచం మీదే ఉండాల్సి వస్తుంది, దీనివల్ల రక్తపు గడ్డలు ఏర్పడి, ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. తలకి దెబ్బలు కూడా తగులుతూ ఉంటాయి. దీనివల్ల ఆస్పత్రిలో చేర్చవలసిరావడం, చికిత్సల ఖర్చులు పెరుగుతాయి. సర్జరీ తర్వాత మళ్ళీ నడవడానికి భయపడి ఇంట్లోనే కూర్చుండిపోవడం వల్ల మరింతగా కండరాలు క్షీణిస్తాయి. మానసిక కుంగుబాటు, ఒంటరితనాలకు గురవుతారు.

జేరియాట్రిక్‌ కేర్‌ అంటే?

జేరియాట్రిక్‌ కేర్‌.. ఒక సమగ్ర ఆరోగ్య విధానం. జేరియాట్రిషియన్‌ కేవలం రోగుల ఆరోగ్య సమస్యలను మందులతో సరిదిద్దడంతో పాటు, వారి కుటుంబం, కేర్‌ గివర్‌ సపోర్ట్‌, పర్యావరణం, ఆహారం, బ్యాలెన్స్‌ టైన్రింగ్‌, యోగా, మందుల సర్దుబాటు వంటి 360 డిగ్రీల కోణంలో సమగ్రంగా పరిశీలిస్తారు. అందుకే కన్సల్టేషన్‌కు 30 నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది.

3-navya.jpg

మన సమాజాల్లో వృద్ధుల పట్ల శ్రద్ధ

సామాజిక ఆర్థిక ప్రభావం వల్ల పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో వృద్ధులకు లభించే శ్రద్ధ తక్కువనే చెప్పవచ్చు. మనం చిన్న పిల్లల పట్ల కనబరిచే శ్రద్ధను వృద్ధుల పట్ల కనబరచలేకపోతున్నాం! ఇందుకు అనేక సామాజిక కారణాలుంటాయి.

వృద్ధుల్లో మానసిక కుంగుబాటు

మన దేశంలో చిన్న కుటుంబాలు పెరిగిపోవడం, ఒంటరితనం, సమయానికి సహాయం కోరకపోవడం వల్ల పెద్దలు మానసిక కుంగుబాటుకు గురవుతున్నారు. తక్కువగా మాట్లాడడం, అందరికీ దూరంగా ఉండే ప్రయత్నం చేయడం, మందులు సరిగా వేసుకోకపోవడం, సులభంగా భావోద్వేగాలకు లోనవడం, మతిమరుపు వంటివి కుంగుబాటు లక్షణాలు. సాధారణంగా పురుషులు కుంగుబాటును వ్యక్తపరచడానికి ఇష్టపడరు. ఇది మరింత ప్రమాదకరం. జేరియాట్రిక్‌ వైద్యులు ఇలాంటి మానసిక సమస్యలకు కూడా మందులు సూచించగలుగుతారు.


కేర్‌ టేకర్స్‌ - జాగ్రత్తలు

కేర్‌ టేకర్స్‌ పని అంత సులభం కాదు. వాళ్ళు కూడా విపరీతమైన ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అల్జీమర్స్‌ వంటి వ్యాధులున్న వారి యోగక్షేమాలు చూసుకునే కేర్‌ టేకర్స్‌ తీవ్రమైన ఒత్తిడికి గురై, రోగి కంటే త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేర్‌ టేకర్స్‌కు కూడా సరైన శిక్షణ అవసరం. వాళ్లకు పెద్దల డైపర్స్‌ మార్చడం, సమయానికి మందులు ఇవ్వడమెలాగో తెలియాలి. వాళ్ళు కూడా విరామాలు తీసుకుంటూ విపరీతమైన ఒత్తిడికి లోనవకుండా చూసుకోవాలి.

డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి కోయగూర

జేరియాట్రిక్‌ మెడిసిన్‌, ఫౌండర్‌ అండ్‌

ఛైర్మన్‌ ఎవరెస్ట్‌ ట్రాన్సిషనల్‌ కేర్‌,

మాధాపూర్‌, హైదరాబాద్‌

ఈ వార్తలూ చదవండి

మురసు తుఫాన్ ఎఫెక్ట్.. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్ల రద్దు

మురసు తుఫాన్.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్‌డీఎంఏ

Updated Date - Nov 03 , 2026 | 03:19 AM