క్యాన్సర్‌పై శాంతి యుద్ధం
ABN , Publish Date - Mar 16 , 2026 | 12:35 AM
క్యాన్సర్ ముదిరిన తర్వాత లక్షలు ఖర్చు చేసి ప్రాణాలు కోల్పోవడం కంటే గ్లూకోమీటర్ లాంటి చిన్న పరికరంతో ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే ఎంతోమంది...
క్యాన్సర్ ముదిరిన తర్వాత లక్షలు ఖర్చు చేసి ప్రాణాలు కోల్పోవడం కంటే గ్లూకోమీటర్ లాంటి చిన్న పరికరంతో ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తిస్తే ఎంతోమంది ప్రాణాలు నిలబడతాయని నిరూపిస్తున్నారు విశాఖ శాస్త్రవేత్త డాక్టర్ పాండ్రంకి శాంతిలత.
క్యాన్సర్.. ఈ పేరు వింటే నేటికీ సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. సరైన సమయంలో వ్యాధిని గుర్తించకపోవడం ఒక ఎత్తైతే, నిర్ధారణ పరీక్షలకే లక్షల రూపాయలు ఖర్చు కావడంతో పేద, మధ్యతరగతి వర్గాలు చికిత్సకు ముందే మానసికంగా కుంగిపోతున్నాయి. ఈ దుస్థితిని మార్చాలని, సామాన్యుడికి కూడా క్యాన్సర్ పరీక్షలు అందుబాటులో ఉండాలని ఒక మహిళా శాస్త్రవేత్త చేసిన అసాధారణ కృషి నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆమె మరెవరో కాదు.. డాక్టర్ పాండ్రంకి శాంతిలత. ఆమె రూపొందించిన వినూత్న పరికరం ‘కాండక్ట్ డిఎక్స్’ ఇప్పుడు క్యాన్సర్ రోగుల జీవితాల్లో కొత్త ఆశలు చిగురింపజేస్తోంది.
కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం
ఏ గొప్ప ఆవిష్కరణ వెనుకైనా ఒక బలమైన స్ఫూర్తి లేదా ఒక బాధాకరమైన నేపథ్యం ఉంటుంది. డాక్టర్ శాంతిలత విషయంలోనూ అదే జరిగింది. ఆమె చిన్నతనంలో తన బంధువు ఒకరు రొమ్ము క్యాన్సర్ బారినపడ్డారు. కానీ దాని గురించి బయటకు చెబితే ఎక్కడ అవమానంగా భావిస్తారో, లేదా చికిత్స కోసం ఉన్న డబ్బంతా ఖర్చయిపోయి కుటుంబం ఎక్కడ రోడ్డున పడుతుందో అన్న భయంతో ఆమె చివరి వరకు ఎవరికీ చెప్పలేదు. ప్రాణాంతకమైన నొప్పిని భరిస్తూనే ఆమె మౌనంగా కన్నుమూశారు. ఈ ఘటన శాంతిలత మనసుపై చెరగని ముద్ర వేసింది. ‘‘సరైన సమయంలో వ్యాధి తెలిసి ఉంటే ఆమె బతికేవారు కదా’’ అన్న ప్రశ్న ఆమెను పరిశోధనలవైపు నడిపించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళలు రొమ్ము క్యాన్సర్ బారినపడి, చివరి దశలో ఆసుపత్రులకు చేరుతూ ప్రాణాలు కోల్పోవడం ఆమెను తీవ్రంగా కలచివేసింది. ఆ కన్నీటి గాధే నేడు ఒక ప్రాణప్రదాత ఆవిష్కరణకు మూలమైంది.

గ్లూకోమీటర్ లాగే సులభం
సాధారణంగా క్యాన్సర్ నిర్ధారణ కోసం బయాప్సీ, పెట్ స్కాన్ వంటి ఐదారు రకాల పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వీటన్నింటికీ కలిపి కనీసం రూ. 2 లక్షల వరకు ఖర్చవుతుంది. పైగా ఆ ఫలితాల కోసం వారం రోజులకుపైగా ఉత్కంఠగా వేచి చూడాలి. కానీ, డాక్టర్ శాంతిలత కనిపెట్టిన ఈ పరికరం ఒక విప్లవం అని చెప్పొచ్చు. గ్లూకోమీటర్ ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా చూస్తామో, ఇది కూడా దాదాపు అలాగే పనిచేస్తుంది. బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి, అందులోని కణాలను వేరు చేస్తారు. మిగిలిన సీరంను ఈ పరికరంతో పరీక్షిస్తారు. ఇందులో గంటలోపే ఫలితం తెలుస్తుంది. మరీ ముఖ్యంగా రూ. 2 లక్షలు అయ్యే పరీక్షను కేవలం రూ. 10 వేలకే పూర్తి చేయవచ్చు. ఇది కేవలం రొమ్ము క్యాన్సరే కాకుండా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, అండాశయం, నోరు, క్లోమం, ఊపిరితిత్తులు, కాలేయం, మెదడు, ప్రొస్టేట్ వంటి 9 రకాల క్యాన్సర్లను కచ్చితత్వంతో గుర్తిస్తుంది.
ప్రభుత్వం చేయూత
ఈ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించిన కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ’ వారు ‘నిధి ప్రయాస్’ పథకం కింద రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించారు. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయం పూర్తి సహకారం అందించడంతో ‘ఇమ్యునల్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఒక స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇప్పటికే 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయసున్న సుమారు 400 మందిపై జరిపిన పరీక్షల్లో ఈ పరికరం సత్ఫలితాలు ఇచ్చింది.
అరచేతిలో ప్రాణదాత
ఈ పరికరం చాలా చిన్నగా ఉండటం వల్ల ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం టాటా క్యాన్సర్ ఆసుపత్రులలో దీనిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వైద్య సదుపాయలు సరిగ్గా లేని ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల వద్దకు ఈ పరికరాన్ని తీసుకెళ్లి పరీక్షలు చేయడం వల్ల ఎంతోమేలు జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం సహకరిస్తే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దీనిని అందుబాటులోకి తెచ్చి క్యాన్సర్ మరణాలను భారీగా తగ్గించాలన్నది డాక్టర్ శాంతిలత లక్ష్యం
పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ,
భీమునిపట్నం
ఇవి కూడా చదవండి:
వామ్మో దారుణం.. ఈ ఏనుగు ఎలా దాడి చేసిందో చూడండి..
డుడుమ జలపాతం అందాలకు ఆనంద్ మహీంద్రా ఫిదా