మధుమేహంతో నాడీ నష్టం
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:10 AM
మధుమేహం వల్ల రక్తనాళాలతో పాటు నరాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. అయితే ఆ నష్టం తిరిగి సరిదిద్దలేని దశకు చేరుకోకుండా ఉండాలంటే, ప్రారంభంలోనే...
న్యూరోపతి
మధుమేహం వల్ల రక్తనాళాలతో పాటు నరాలు కూడా దెబ్బతింటూ ఉంటాయి. అయితే ఆ నష్టం తిరిగి సరిదిద్దలేని దశకు చేరుకోకుండా ఉండాలంటే, ప్రారంభంలోనే లక్షణాలను గుర్తించాలంటున్నారు వైద్యులు
మధుమేహం అదుపులో ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రుగ్మత ప్రధానంగా రక్తనాళాలను, నాడులను దెబ్బతీస్తూ ఉంటుంది. ఫలితంగా సూక్ష్మ, ప్రధాన రక్తనాళాల సమస్యలు, నాడులు దెబ్బతినే ఇబ్బందులు వేధిస్తాయి. అయితే మధుమేహంతో కళ్లకు సంబంధించి రెటినోపతి, నాడులకు సంబంధించి న్యూరోపతి, మూత్రపిండాలకు సంబంధించి నెఫ్రోపతి సమస్యలు ప్రఽధానంగా వేధిస్తాయి. అలాగే ప్రధాన రక్తనాళాలకు సంబంధించి బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ మొదలైన సమస్యలు తలెత్తుతాయి. మధుమేహం నియంత్రణ తప్పి, హెచ్చుతగ్గులకు గురైనప్పుడు, రెండు నుంచి మూడేళ్ల వ్యవధిలో నాడీ సమస్యలు తప్పవు.
తిమ్మిర్లు, మంటలతో మొదలు...
మధుమేహం నియంత్రణ తప్పినప్పుడు రక్తనాళాలు దెబ్బతిని, నాడులకు సజావుగా రక్తప్రసారం జరగని సందర్భాల్లో ఆ నాడులు దెబ్బతింటూ ఉంటాయి. ఫలితంగా పాదాల్లోని పెరిఫెరల్ నాడులు ప్రధానంగా దెబ్బతింటాయి. ఫలితంగా కాళ్లలో తిమ్మిర్లు, మంటలు మొదలవుతాయి. ఈ సమస్య తీవ్రమై, పాదాల నుంచి మోకాళ్ల వరకూ వ్యాపించిన తర్వాత, చేతుల్లో కూడా ఇవే లక్షణాలు బయల్పడతాయి. ఈ తరహా నాడీ నష్టాన్ని వైద్యపరిభాషలో... ‘గ్లోవ్ అండ్ స్టాకింగ్ ప్యాటర్న్’ అని అంటారు. నిజానికి మధుమేహం లేకపోయినా పలు కారణాల వల్ల నాడులు దెబ్బతినవచ్చు. కానీ తిమ్మిర్లు, మంటలు మోకాళ్ల వరకూ విస్తరించిన తర్వాత, చేతుల్లో కూడా అవే లక్షణాలు బయల్పడడం కేవలం మధుమేహుల్లోనే సాధ్యం. ఈ 50 శాతం మధుమేహులు, వాళ్ల జీవితకాలంలో ఈ తరహా డయాబెటిక్ న్యూరోపతీతో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యను సకాలంలో గుర్తించలేకపోవడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల నాడులు తీవ్రంగా దెబ్బతినే స్థితికి చేరుకునే వరకూ ఈ సమస్యకు మధుమేహమే కారణమనే విషయాన్ని చాలా మంది తెలుసుకోలేరు.
అవయవం ఆధారంగా లక్షణాలు
అదుపు తప్పిన మధుమేహంతో పలు అవయవాలతో అనుసంధానమై ఉండే నాడులు దెబ్బతింటాయి. దాంతో సంబంధిత లక్షణాలు బయల్పడుతూ ఉంటాయి.
పాదాలు: ప్రారంభంలో పాదాల్లో తిమ్మిర్లు, మంటలు మొదలవుతాయి. సమస్య తీవ్రమయ్యేకొద్దీ స్పర్శ క్షీణించి, స్పర్శ పూర్తిగా కోల్పోతారు. ఫలితంగా పాదాలకు తగిలే చిన్న దెబ్బలు అల్సర్లుగా మారి, గాయం మానక, కాళ్లను కోల్పోయే, ‘డయాబెటిక్ ఫుట్’ స్థితి తలెత్తుతుంది. పెరిఫెరల్ న్యూరోపతి కోవకు చెందిన సమస్య ఇది.
గుండె: ఎవరికైనా గుండె కొట్టుకునే వేగం విశ్రాంత దశలో సాధారణంగా ఉండి, పరిగెత్తినప్పుడు పెరుగుతుంది. కానీ న్యూరోపతి సమస్య ఉన్నవాళ్లలో విశ్రాంత స్థితిలో కూడా గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే కూర్చుని లేవగానే కళ్లు తిరుగుతూ ఉంటాయి.
జీర్ణ వ్యవస్థ: జీర్ణాశయం, పేగుల కదలిక తగ్గిపోతుంది. దాంతో కొద్దిపాటి ఆహారంతోనే కడుపు నిండిపోయిన భావన కలుగుతూ ఉంటుంది
మూత్రాశయం: మూత్రాశయం పనితీరు దెబ్బతిని మూత్రవిసర్జన ఇబ్బందిగా మారుతుంది
కళ్లు: ఒక కన్ను మూసుకుపోతుంది
చేతులు: అరుదుగా కొందర్లో చేతుల్లోని నాడులు దెబ్బతినడం వల్ల ‘కార్పల్ టనెల్ సిండ్రోమ్’ తలెత్తుతుంది
పరీక్షలు... క్రమం తప్పకుండా...
మధుమేహానికి మందులు వాడుకుంటున్నంత మాత్రాన నాడులు ఆరోగ్యంగా ఉన్నాయని అనుకోడానికి వీల్లేదు. మధుమేహం ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేయడం కోసం క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మధుమేహ మందులతో హెబిఎ1సి సాధారణ స్థాయిలో ఉందని నిర్థారించుకోవడం కోసం ప్రతి మూడు నెలలకోసారి ఈ పరీక్ష చేయించుకోవాలి. హెచ్‌బిఎ1సి 7 కంటే తక్కువ ఉంటే, మధుమేహ మందులు సమర్థంగా పని చేస్తున్నాయని అర్థం. విటమిన్ బి12 లోపం వల్ల కూడా నాడీ నష్టం జరుగుతుంది. కాబట్టి విటమిన్ బి12 పరీక్ష కూడా చేయించుకుంటూ ఉండాలి. అలాగే సిజిఎమ్ (కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటర్) ప్యాచ్ సహాయంతో రక్తంలో హెచ్చుతగ్గులకు గురయ్యే చక్కెరను గమనించుకుంటూ ఉండాలి. అత్యధికంగా చక్కెర హెచ్చుతగ్గులకు గురయ్యే వాళ్లకే న్యూరోపతీ ముప్పు ఎక్కువ. కాబట్టి సిజిఎమ్‌తో సమస్యను ముందుగానే కనిపెట్టే వీలు చిక్కుతుంది.
నాడీ నష్టానికి చికిత్స
నాడీ నష్టానికి కారణమైన అస్తవ్యస్థ మధుమేహాన్ని నియంత్రణలో పెట్టుకోవడం ముఖ్యం. ఇలా నియంత్రణలో పెట్టుకోవడం వల్ల నాడులకు అప్పటికే జరిగిన నష్టాన్ని సరిదిద్దే వీల్లేకపోయినా, భవిష్యత్తులో మరింత పెరగకుండా అడ్డుకట్ట వేయవచ్చు. అయితే చక్కెర మోతాదులను వేగంగా తగ్గించుకునే ప్రయత్నం చేస్తే, ఎక్కువ నాడీ నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి క్రమక్రమంగా చక్కెరను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా న్యూరోపతి లక్షణాల నుంచి విముక్తి పొందవచ్చు. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒజెంపిక్, మోంజారో ఔషథాలతో బరువు తగ్గించుకోవడం ద్వారా, నాడుల మీద ఒత్తిడిని కూడా తగ్గించుకునే వీలుంది. అలాగే కొత్త నాడులను పెంచే, స్టెమ్ సెల్ థెరపీ, నర్వ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ మొదలైన చికిత్సలు ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్నాయి.
నియంత్రణ ఇలా....
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవడం ప్రధానం. ప్రతిరోజూ పాదాలను పరీక్షించుకుంటూ ఉండాలి. పాదాలకు దెబ్బలు తగలకుండా చూసుకోవాలి. రక్తపోటు, బరువు అదుపులో ఉంచుకోవాలి. ఆహార నియమాలు పాటిస్తూ, క్రమం తప్పక వ్యాయామం చేస్తూ ఉండాలి.
సిజిఎమ్ (కంటిన్యుయస్ గ్లూకోజ్ మానిటర్) ప్యాచ్ సహాయంతో రక్తంలో హెచ్చుతగ్గులకు గురయ్యే చక్కెరను గమనించుకుంటూ ఉండాలి. అత్యధికంగా చక్కెర హెచ్చుతగ్గులకు గురయ్యే వాళ్లకే న్యూరోపతీ ముప్పు ఎక్కువ. కాబట్టి సిజిఎమ్‌తో సమస్యను ముందుగానే కనిపెట్టే వీలు చిక్కుతుంది.
డాక్టర్ సురేంద్ర ప్రసాద్,
కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్,
మెడికవర్ హాస్పిటల్స్,
హైటెక్ సిటీ, హైదరాబాద్.
Also Read:
ఏసీబీ వలలో వీఆర్వో.. లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టివేత
జగన్‌వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
For More Latest News